Wednesday, December 16, 2015

శివపురాణము--35


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము 

నందీశ్వరుడు

మనం శివాలయమునకు వెళ్ళినప్పుడు ఎదురుగుండా ముందు దర్శనం ఇచ్చే భగవన్మూర్తి నందికేశ్వరుడు. నందీశ్వర దర్శనం చేసి శివాలయంలోకి ప్రవేశించాలని శైవాగమం చెప్తోంది. శివాలయం ద్వారపాలకులు దిండి, మొండి. విష్ణ్వాలయం ద్వారపాలకులు జయవిజయులు. విష్ణ్వాలయంలో అయితే గరుడాళ్వారు ఉంటారు. శివాలయంలో శివలింగం ఎంత ముఖ్యమో నందీశ్వరుడు అంత ముఖ్యం. ఇక్కడ వృషభ రూపమై ఒక పశువు శివుడి ముందు కూర్చునే అధికారం ఎలా పొందింది? దీనిని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మనం శివాలయపు మెట్లు దాటి లోపలికి వెళ్ళగానే మనకి ముందుగా ధ్వజ స్తంభం కనపడుతుంది. దాని తర్వాత నందీశ్వరుడు కనపడతాడు. ఆ నందీశ్వరుడు అసలు అలా ఎందుకు ఉంటాడు అనే విషయం మీకు అర్థం అయితే జీవితంలో మీరు నూరు మెట్లు ఒక్కరోజు ఎక్కేసినట్లు. 
పూర్వం శిలాదుడు అనే మహర్షికి చిత్రమయిన కోరిక కలిగింది. ఆయన ఇంద్రుని గురించి గొప్ప తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షం అయి నీకు ఏమి కావాలి? అని అడిగాడు. అపుడు శిలాదుడు ‘నాకు అయోని సంభవుడు, చిరంజీవి, పరమ భక్తుడయిన కుమారుడు కావాలి’ అన్నాడు. అపుడు దేవేంద్రుడు ‘నాకే శాశ్వతత్వము లేదు. నాకే చిరంజీవిత్వం లేదు. అటువంటప్పుడు ఎదుటివాళ్ళకు నేను ఎలా ఇవ్వగలను? ఇవ్వలేను. పరమశివుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి నువ్వు ఆ శంకరుడి గురించి తపించు’ అన్నాడు. అపుడు శిలాదుడు శివుని గురించి తపస్సు మొదలుపెట్టాడు. కొద్దికాలం గడిచేసరికి శిలాదుని రూపం అక్కడలేదు. ఆస్థిపంజరం ఒక్కటే ఉంది. శంకరుడు ప్రమథగణములతో, పార్వతీ సహితుడై, సుబ్రహ్మణ్య, గణపతులతో కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అయినా శిలాదుడు బహిర్ముఖుడు కాలేదు. అపుడు శంకరుడు తన కుడికాలు పైకెత్తి కుడికాలి బొటనవ్రేలితో ఆయన మూడవకన్ను అనగా జ్ఞాన నేత్రం ఉండే ఆజ్ఞాచక్రం దగ్గరపెట్టి ఆపాడు. అప్పుడు శిలాడుడు బహిర్ముఖుడు అయ్యాడు. శంకరుడు ‘శిలాదా, నీవు దేనిని గురించి తపస్సు చేశావు? అని అడిగాడు. అపుడు శిలాదుడు ‘నీలాంటి కొడుకు, అయోనిజుడు, పరమభక్తుడు నాకు కొడుకుగా కావాలి అన్నాడు. ఈమాట అనేసరికి శంకరుడు నవ్వి నాలాంటి కొడుకు వేరొకడు లేదు. నీ భక్తికి లొంగిపోయాను. కనుక నేనే నీకొడుకుగా వస్తాను’ అని చెప్పి వెళ్ళిపోయాడు. 
కొంతకాలం గడిచిపోయింది. ఒకనాడు శిలాదుడు పరమశివ సంబంధమయిన ఒక యజ్ఞకార్యమును నిర్వహించడం కోసం భూమిని దున్ని యజ్ఞశాలా నిర్మాణం చేసి అగ్నిహోత్రములను వ్రేల్చడం కోసమని కొన్ని గుండములను ఏర్పాటు చేసి ఆ యజ్ఞ నిర్వహణ చేస్తున్నాడు. అప్పుడు ఆ యజ్ఞ వాటికలో ఉన్న అగ్నిగుండంలోంచి ఒక మూర్తి ఆవిర్భవించాడు. ఆ వచ్చినవాడు చంద్రరేఖవంటి కిరీటం ధరించి ఉన్నాడు. ఏ విధమైన మలినము లేకుండా ప్రకాశించి పోతున్న తెల్లని శరీరం మీద అలదిన భస్మంతో కూడిన శరీరం కలిగి ఉన్నాడు. నాలుగు భుజములు కలిగి ఉన్నాడు. పరమశివుని అంశ చేత బాలశివుడా అన్నట్లుగా ఆవిర్భవించాడు. ఆ పిల్లవాడిని చూడగానే శిలాదుడు పొంగిపోయాడు. ఆ పిల్లవాడిని చూడగానే ఎక్కడలేని ఆనందం పొంగి పొరలింది కాబట్టి నందీ అని పిలిచాడు. ప్రజలందరూ చూసి పొంగిపోతుండగా ఆ పిల్లవాడు దినదినప్రవర్ధమానం అవుతున్నాడు. 
శిలాదుడు శివుడిని నీలాంటి కొడుకు కావాలని అడిగినప్పుడు పరమశివుడు వెంటనే ‘ఆదివృషభము’ను పిలిచాడు. దానికి ధర్మము అని పేరు. నీవు ధర్మ స్వరూపంగా నా స్వరూపంగా నందీశ్వరుడుగా శిలాదుడికి అయోనిజుడిగా జన్మించు అని శాసనం చేశాడు. అందుకని ఆయన ముందు బాలశివుడిగా దర్శనం ఇచ్చాడు. శివునికి తనకి అభేదం చెప్పడానికి అలా దర్శనం ఇచ్చాడు. బాలశివుడయి ఉన్నాడు. కొంతకాలం అయిన పిమ్మట ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. కొంతమంది దేవతలు వచ్చి శిలాడుడితో అన్నారు ‘అయ్యో శిలాదుడా నువ్వు ఎటువంటి స్వరూపమును కోరావో అటువంటి స్వరూపమును నీ పిల్లవానికి ఇచ్చారు. కానీ పిల్లవాడిది అల్పాయుర్దాయం. ఆయన జ్ఞానము చేత చిరంజీవి అవుతాడు కానీ శరీరం చేత చిరంజీవి కాడు. ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపొయింది’ అని చెప్పారు. ఈ మాటలకు శిలాదుడు బాధపడి శోకిస్తున్నాడు. అపుడు పిల్లవాడయిన నందీశ్వరుడు ‘నాన్నగారూ, ఎందుకంత బాధపడతారు? నేను శంకరుని గూర్చి తపస్సు చేస్తాను’ అని చెప్పి మార్కండేయుడు ఎలా తపస్సు చేశాడో అలాగే ఈయన కూడా తపస్సు ప్రారంభించాడు. ఈయన చేసిన తపస్సు చేత ప్రీతిచెందిన శంకరుడు ప్రత్యక్షమయి నీవు ఎప్పటికీ చిరంజీవివే. నామీద నీకు ఎంత పూనిక ఉన్నదో చూడడం కోసమని ఈ పరీక్ష చేశాను. నీ పూజకు నీ తపస్సుకు నేను పరవశించాను అని చెప్పి తన మెడలో ఉన్న బంగారు పద్మములతో కూడిన హారమునొకదానిని ఎదురుగుండా వున్నా పిల్లవాడి మెడలో వేశాడు. ఆ మాలను మెడలో వేయగానే పిల్లవాడికి కూడా మూడవకన్ను వచ్చింది. శివునికి అయిదు ముఖములు ఎలా ఉంటాయో అలా అయిదు ముఖములు వచ్చాయి. పది భుజములు వచ్చాయి. ఈవిధంగా వచ్చి పిల్లవాడు శివునితో సమానంగా అలరారుతూ శివుని ఎదుట నిలబడ్డాడు. అపుడు అమ్మవారి పుత్రప్రేమతో పరవశించిపోతూ ఆ నందీశ్వరుడిని కొడుకుగా అక్కున చేర్చుకుంది. శివుడు తన జటాజూటంలో వున్నా నీళ్ళు తీసి ఆ పిల్లవాడి మీద చల్లాడు. అవి నందీశ్వరుడినుండి జాలువారి ‘త్రిశ్రోట, జటోదక, స్వర్ణోదక, జంబూనది, వృషధ్వని’ అను పేర్లు గల అయిదు నదులుగా ప్రవహించాయి. ఈ అయిదు నదులు ప్రవహిస్తున్న మధ్యప్రదేశంలో పరమేశ్వరుడు ప్రతిష్ఠచేసిన శివలింగం ఒకటి ఉంది. ఆ అయిదు నదులలో స్నానం చేసి అక్కడి శివలింగమును ఎవరు అర్చిస్తారో వారికి మోక్షం ఇవ్వబడుతుంది అని శాస్త్రం చెప్పింది. పార్వతీదేవి ఆ పిల్లవాడిని ప్రమథగణములకు నాయకునిగా చేయవలసినదని శివుని అభ్యర్థించింది. వెంటనే శివుడు ఆ పిల్లవానిని కూర్చోబెట్టి ప్రమథగణములన్నింటికి నాయకునిగా అభిషిక్తం చేశారు. 
ఈవిధంగా అభిషిక్తం చేయబడిన వానికి తగిన కాంతను చూసి వివాహం చేద్దామని పార్వతి శివునకు చెప్పింది. ఆయనకు తగిన భార్యగా మరుత్తుల కుమార్తె ‘సుయశ’ను నిర్ణయించి వివాహం చేశారు. పిమ్మట శివుడు నందీశ్వరునితో ‘నీవల్ల నీతండ్రి తరించాలి కదా. నీ తండ్రిని, తాతని కూడా సమున్నతమయిన అధికారం కలిగినటువంటి ప్రమథగణముల స్థితిలోకి తీసుకువస్తున్నాను. వారు కూడా నన్ను సేవించుకుంటారు’ అన్నాడు. ఇప్పుడు శిలాదుడు ప్రమథగణములలో ఒకడిగా చేరిపోయాడు. ప్రమథగణములకు నాయకుడు తన కొడుకు నందీశ్వరుడు. ఇదీ వాళ్ళ గొప్పతనం. ఇది నందికేశ్వరుడి చరిత్ర. శివుడు నందీశ్వరునికి మరొక వరం ఇచ్చాడు. ‘నీవు ఎప్పుడయినా ఎక్కడికయినా వెళ్ళి ఉంటే నేను కూడా అక్కడికి వచ్చేసి ఉంటాను. నేను ఎక్కడయినా ఉంటే నీవు కూడా అక్కడ ఉంటావు. శివాలయములలో నా ఎదురుగుండా నీవు ఉండాలి’ అని చెప్పాడు. కాబట్టి నందీశ్వరుడు ఎక్కడ ఉంటే అక్కడ శివుడు ఉంటాడు. శివుడు ఎక్కడ ఉంటాడో అక్కడ నందీశ్వరుడు కూడా ఉంటాడు. ఎవరయినా నందికేశ్వర చరిత్రను చదివినా చేతులొగ్గి నమస్కరిస్తూ వినినా నందికేశ్వరుని వైభవమును మనసులో తలంచుకొని మురిసిపోయినా వారికి భగవంతుడు ఇహమునందు సమస్త సుఖములను యిచ్చి అంతమునందు ఇదివిని పరవశించి పోయిన వారిని ఈశ్వరుడు తన ప్రమథగణములలో ఒకరిగా చేర్చుకుంటాడు అని అభయం ఇవ్వబడింది. 
నందీశ్వరుడు ఆదివృషభం కాబట్టి ఆయన వృషభ రూపంలో ఉంటాడు. శివాలయంలో శివలింగ దర్శనం చేసేటప్పుడు నందీశ్వరుడి ప్రక్కనుంచి వెళ్ళడం కానీ, నందికి శివుడికి మధ్యలో వెళ్ళడం కానీ చేయరాదు. తోక పక్కకు పడేసి వృషణములు కనపడేటట్లుగా నందీశ్వరుని మూర్తి పడుకుని ఉంటుంది. ఎడమచేతి బొటనవ్రేలిని ఎడమచేతి చూపుడు వ్రేలిని నంది కొమ్ముల మీద వేసి కుడిచేతితో ఆయన వృషణములను పట్టుకుని రెండు వేళ్ళ మధ్యలోంచి శివలింగమును చూస్తూ ‘హరహర మహాదేవ శంభోశంకర’ అని అనాలి. ఇలా ఎవడు అన్నాడో వాడు కైలాసమునందు శంకరుడిని దర్శనము చేసిన పుణ్యమును వాడి ఖాతాలో వేస్తారు. కాబట్టి నందీశ్వరుడి శృంగముల మధ్య నుంచి తప్ప శివలింగ దర్శనం చేయరాదు. నందీశ్వరుడు జీవుడికి సంకేతం. శివుడు బ్రహ్మమునకు సంకేతం. జీవ బ్రహ్మల మధ్య భేదము చెప్పడం కానీ మధ్యలోకి వెళ్ళడం కానీ చేయరాదు. కాబట్టి ఎప్పుడూ అలా దర్శనం మాత్రం చేయకూడదు. దానికి ఒకే ఒక్క మినహాయింపు వున్నది. శివలింగమునకు సాయంకాలం కవచం పెడతారు. అలా కవచం తొడిగి ఉంటే మాత్రం శివలింగమును శృంగములలోంచి చూడనక్కరలేదు. మీరు తిన్నగా శివ దర్శనం చేయవచ్చు. 
అరటిపండు ముక్కలు పట్టుకు వెళ్ళి నందీశ్వరుడి మూతికి రాయడం, కార్తిక దీపముల పేరు చెప్పి నందీశ్వరుడి తోకకింద పెట్టేయడం వంటి పనులు మిక్కిలి పాపభూయిష్టములు. మనం పుణ్యం పేరుతో హద్దులేని పాపములు చేస్తుంటాము. అలా చెయ్యకూడదు. నందీశ్వరుడి శృంగములలోంచి శివలింగ దర్శనం చేసిన తర్వాత ఆగి నందీశ్వరునికి నమస్కరించి 
“నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక!
మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి!!
అని అడగాలి. నందీశ్వరుడు నాలుగు పాదములతో చక్కగా పడుకుని ఉంటాడు. బసవయ్య ధర్మమునకు మారుపేరు. ఆ ధర్మము మీదనే శివుడు అధిరోహించి ఉంటాడు. నందీశ్వరుడు మీకొక పాఠమును నేర్పుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడూ శివుడినే చూస్తూ ఉంటాడు. అలాగే మీకు లోకమునందు ఎప్పుడూ ఈశ్వరుడినే చూడడం అలవాటు కావాలి. 
ఆంద్రదేశంలో నందిమండలం’ అనే ప్రాంతంలో నవనందులుగా తపస్సు చేశాడు. అవే ప్రథమనంది, నాగనంది, శివనంది, కృష్ణ(విష్ణు)నంది, మహానంది, గరుడనంది, గణేశనంది, సోమనంది, భానునంది అనునవి. నంది తపస్సు చేసిన ప్రతి చోట ఒక శివలింగం ఉంటుంది. ఆయనకి ‘నందివిద్య’ అని పేరు. అయ్యగారి అనుగ్రహమును ఎంత పొందాడో అమ్మవారి అనుగ్రహమును కూడా అంతే పొందాడు. అమ్మవారు తన విద్యా రహస్యమునంతటిని నందికి చెప్పింది. అమ్మవారి శ్రీవిద్య నందీశ్వరుడి ద్వారా వచ్చింది. అందుకే లలితా సహస్రనామంలో ‘నందివిద్యానటేశ్వరీ’ అని ఒకమాట ఉంది.
నందీశ్వరుని ప్రజ్ఞ చాలా గొప్పది. ఇప్పటికీ మనకి ‘చరనంది’ అని ఒకటి ఉంటుంది. ‘స్థిరనంది’ అంటే కదలని నంది. చరనంది కదులుతుంది. పూర్వం శివాలయములలో రెండు నందులు పెట్టేవారు. ఒకటి స్థిరనంది, రెండవది చరనంది. పూర్వం అంత తొందరగా వెళ్ళడానికి వైద్యులు దొరికేవారు కారు. శివుడే మొదటి వైద్యుడు. ఆ చుట్టుపక్కల ఎవరికయినా ప్రసవం అవక బిడ్డ అడ్డం తిరిగితే వాళ్ళని తీసుకువెళ్ళడం కుదరకపోతే తల్లీ బిడ్డా బతకాలంటే వైద్యుడి దృష్టిపడాలి. అంతరాలయంలోంచి అది కుదరదు కనుక చరనందికి శివుడికి అభేదం కనుక గబగబా ఆవిడను ముఖమండపం వద్దకు తీసుకువచ్చి తలుపులు తీయించి ఆవిడ బాధపడుతున్నవైపుకి చరనందిని తిప్పేవారు. చరనందిని ప్రసవమునకు బాధపడుతున్న ఆవిడ వైపు తిప్పగానే ఆవిడ చాలా సులువుగా ప్రసవం అయ్యేది. అందుకే పూర్వం శివాలయములలో చరనంది ఉండేది. నందీశ్వరుడు అంతటి మహానుభావుడై ఈ లోకమును రక్షించాడు.

No comments: