Saturday, November 29, 2014

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ



శ్లో..శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే!

ఆచమనం: ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః అనుచూ నీళ్ళను క్రిందకు వదల వలెను.

(తదుపరి నమస్కారము చేయుచు ఈ క్రింది మంత్రములను పఠించవలెను)

ఓం గోవిందాయనమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయనమః, ఓం వాసుదేవాయనమః , ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్ధాయనమః, ఓం పురుషోత్తమాయనమః, ఓం అధోక్షజాయనమః, ఓం నారసింహాయనమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్దనాయనమః, ఓం ఉపేంద్రాయనమః, ఓం హరయేనమః, ఓం శ్రీకృష్ణాయనమః

సంకల్పమ్: మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాఙ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్విదీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్ధక్షిణ దిగ్భాగే శ్రీశైలశ్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి యోర్మద్యదేశే భగవత్ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన.. సంవత్సరే.. ఆయనే.. మాసే.. పక్షే.. తిథౌ.. వాసరే.. శుభనక్షత్రే,శుభయోగే, శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్.. గోత్రః.. నామధేయః.. ధర్మపత్నిసమేతః శ్రీమతః.. గోత్రస్య.. నామధేయస్య ధర్మపత్నీసమేతస్య మమ సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్ధం ధర్మార్ధకామమోక్ష చతుర్వధ పురుషఫలావ్యాప్త్యర్ధం, చింతితమనోరథ సిద్ధ్యర్ధం, శ్రీసత్యనారాయణముద్దిశ్య శ్రీసత్యనారాయణప్రీత్యర్ధం అనయాధ్యానావాహనాది షోడశోపచారపూజాంకరిష్యే, ఆదౌనిర్విఘ్నపరిసమాప్త్యర్థం శ్రీమహాగణపతి పూజాం కరిష్యే, తదంగకల శారాధానం కరిష్యే. 

కలశారాధన: (కలశమునకు గంధము, కుంకుమబొట్లు పెట్టి,ఒక పుష్పం, కొద్దిగా అక్షతలువేసి, కుడిచేతితో కలశమును మూసి ఈ క్రింది మంత్రమును చెప్పవలెను). 

శ్లో.. కలశస్యముఖేవిష్ణుః కంఠేరుద్ర సమాశిత్రాః మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మృతాః
కుక్షౌతు సాగరాసర్వే సప్తద్వీపోవసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః
అంగైశ్చ సహితాసర్వే కలశౌంబుసమాశ్రితాః ఆయాంతు శ్రీవరలక్ష్మీ పూజార్ధం దురితక్షయ కారకాః


శ్లో.. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి 
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఏవం కలశపూజాః

అని పఠించి ఆ నీటిని దేవునిపై, పూజాద్రవ్యములపై, తమపై అంతటాచల్లవలెను.

సత్యనారాయణస్వామి ప్రతిమను తమలపాకు పై ఉంచి ఈ క్రింది విధముగా పంచామృములతో శుద్ధి చేయవలెను.

పాలు: ఆప్యాయస్వసమేతుతే విశ్వతస్సోమ వృష్ణియం, భవా వాజస్య సంగథే.

పెరుగు: దధిక్రావుణ్ణో అకారిషం, జిష్ణోరశ్వస్యవాజినః సురభినో
ముఖాకరత్ర్పణ ఆయూగం తారిషత్.

నెయ్యి: శుక్రమసి జ్యోతిరసి తేజోషి దేవోవస్సవితోత్పునా
త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యస్య రశ్మిభిః.

తేనె: మధువాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః, మాధ్వీ ర్నస్సంత్వోషధీః
మధుసక్తముతోసి మధుమత్సార్థివగం రజః,
మధుద్యౌరసునః పితా, మధుమాన్నో వనస్పతి
ర్మధుమాగం అస్తుసూర్యః, మాధ్వీర్గావో భవంతునః.

శుద్దోదకం: స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే
స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే,
స్వాదుర్మిత్రాయ వరుణాయవాయవే
బృహస్పతయే మధుమాంగం అదాభ్యః.


శుద్ధోదకస్నానం 
ఆపోహిష్ఠా మయోభువ స్తాన ఊర్జేదధాతన, మహేరణాయ చక్షసే,
యోవశ్శివతమోరసస్తస్య భాజయతేహనః,
ఉశతీరివమాతరః, తస్మా అరంగమామవో
యస్యక్షయాయ జిస్వథ, ఆపోజనయథాచనః.

ప్రాణాప్రతిష్ఠాపనమ్ 

ఓం అస్య శ్రీ ప్రాణప్రతిష్ఠాపన మహామంత్రస్య బ్రహ్మ విష్ణుమహేశ్వరా ఋషయ, ఋగ్యజుస్సామాధర్వణాని ఛందాంసి, ప్రాణశ్శక్తిః, పరాదేవతా హ్రాం బీజం, హ్రీం శక్తిః, క్రోం కీలకం శ్రీ సత్యనారాయణ ప్రాణప్రతిష్ఠాజపే వినియోగః, 

కరన్యాసమ్ 

హ్రాం అంగుష్ఠాభ్యాంనమః,
హ్రీం తర్జనీభ్యాంనమః,
హ్రూం మధ్యమాభ్యాంనమః,
హ్రౌం కనిష్ఠికాభ్యాంనమః,
హ్రః కరతలకర పృష్ఠాభ్యాంనమః,
హ్రైం అనామికాభ్యాంనమః.

అంగన్యాసమ్: 

హ్రాం హృదయాయనమః,
హ్రీం శిరసేస్వాహా,
హ్రూం శిఖాయైవషట్,
హ్రైం కవచాయహుం,
హ్రౌం నేత్రత్రయాయ వౌషట్
హ్రః ఆస్తృయఫట్
భూర్భువస్సువరోమితి దిగ్భంధః


ధ్యానం

శ్లో: ధ్యాయోత్సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం,
లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం
పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సపదభూషితం
గోవిందం గోకులానందం బ్రహ్మాద్యైరభిపూజితం
శ్రీసత్యనారాయణ స్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి.

ఆవాహనమ్ 

మం: ఓం సహస్రశీర్షాపురుషః, సహస్రాక్షస్సహస్రపాత్
సభూమిం విశ్వతో వృత్వా, అత్యతిష్ఠ ద్డశాంగులమ్
శ్లో: జ్యోతి శ్శాంతం సర్వలోకాంతరస్థ మోంకారాఖ్యం యోగిహృద్ధ్యానగమ్యం
సాంగం శక్తిం సాయుధం భక్తిసేవ్యం సర్వాకారం విష్ణుమావాహయామి. 

ఆసనమ్ 

మం: ఓం పురుష ఏ వేదగం సర్వం, యద్భూతం యచ్ఛభవ్యం
ఉతామృతత్వస్యేశానః యదన్నేనాతి రోహతి
శ్లో: కల్పద్రుమూలే మణిమేదిమధ్యే సింహాసన్మ్ స్వర్ణమయం విచిత్రం
విచిత్రవస్త్రావృతమచ్యుత ప్రభో గృహాణ లక్ష్మీధరణీ సమన్విత,
శ్రీ సత్యనారాయణస్వామినే నమః నవరత్న ఖచితసింహాసనం సమర్పయామి.

పాద్యమ్ 

మం: ఏతావానస్య మహిమాఅతోజ్యాయాగ్శ్చపూరుషః
పాదోస్య విశ్వభూతాని, త్రిపాదస్యామృతందివి.
నారాయణ నమస్తేస్తు నరకార్ణవతారక
పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధయ
శ్రీ సత్యనారాయణ స్వామినే నమః పాదయో పాద్యం సమర్పయామి.

ఆర్ఘ్యమ్ 

మం: త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః, పాదోస్యేహాభవాత్పునః
తతోవిష్పజ్వ్యక్రామత్ సాశనానశనే అభి
వ్యక్తావ్యక్త స్వరూపాయ హృషీకపతయే నమః 
మయా నివేదితో భక్త్యా హ్యర్ఘ్యోయం ప్రతిగృహ్యతాం
శ్రీ సత్యనారాయణస్వామినే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి.

ఆచమనీయమ్ 

మం: తస్మాద్విరాడజాయత, విరాజో అధి పూరుషః
స జాతోత్యరిచ్యత, పశ్ఛాద్భూమి మధోపురః
మందాకిన్యాస్తుయద్వారి సర్వపాపహరం శుభం
తదిదం కల్పితం దేవసమ్యగాచమ్యతాం విభో
శ్రీ సత్యనారాయణస్వామినే నమః శుద్ఢఃఆచమనీయం సమర్పయామి.

స్నానమ్ 

మం: యత్పురుషేణ హవిషా, దేవా యఙ్ఞ మతస్వత,
వసంతో అస్యాసీ దాజ్యం, గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః.
శ్లో: తీర్ధోదకై: కాంచనకుంభసం స్థై
స్సువాసితై ర్దేవ కృపారసార్ద్రైః,
మయార్పితం స్నానవిధిం గృహాణ
పాదాబ్జ నిష్ఠ్యూత నదీప్రవాహ
శ్రీ సత్యనారాయణస్వామినే నమః స్నపయామి.

పంచామృతస్నానమ్ 

(పాలు) ఆప్యాయస్వ సమేతు తే విశ్వత స్సోమ వృష్ణియం. భవా వాజస్య సంగధే: (పెరుగు) దధిక్రాపుణ్ణో అకారిషం, జిష్ణోరశ్వస్య వాజినః, సురభినో ముఖాకరత్పృణ ఆయూగంషి తారిషత్: (నెయ్యి) శుక్రమసి జ్యోతిరసితేజోసి దేవో వస్సవితోత్పునా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః (తేనె) మధువాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః, మాధ్నీర్నస్సంత్వోషధీః, మధుసక్తముతోషి మధుమత్పార్ధివగం రజః, మధు ద్యౌరస్తు నః పితా, మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః, మాధ్వీర్గావో భవంతునః, (శుద్ధోదకం) స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే, స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే, మధుమాగం అదాభ్యః. 
శ్లో: స్నానం పంచామృతైర్దేవ గృహాణ పురుషోత్తమ
అనాధనాధ సర్వఙ్ఞ గీర్వాణ ప్రణతిప్రియ.
శ్రీ సత్యనారాయణస్వామినే నమః పంచామృతస్నానం సమర్పయామి. 

శుద్ధోదకస్నానం 

ఆపోహిష్ఠా మయోభువ స్తాన ఊర్జేదధాతన, మహేరణాయ చక్షసే,
యోవశ్శివతమోరసస్తస్య భాజయతేహనః,
ఉశతీరివమాతరః, తస్మా అరంగమామవో
యస్యక్షయాయ జిస్వథ, ఆపోజనయథాచనః.
శ్లో: నదీనాం చైవ సర్వాసా మానీతం నిర్మలోదకం
స్నానం స్వీకురు దేవేశ మయాదత్తం సురేశ్వర
శ్రీ సత్యనారాయణస్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి.

వస్త్రమ్ 

మం: సప్తాస్యాసన్పరిధయః, త్రిస్సప్త సమిధః కృతాః
దేవాయద్యఙ్ఞం తన్వానాః, అబధ్నన్పురుషం పశుం

శ్లో: వేదసూక్త సమాయుక్తే యఙ్ఞసామ సమన్వితే
సర్వవర్ణ ప్రదే దేవ వాససీ తే వినిర్మితే
శ్రీ సత్యనారాయణస్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

యఙ్ఞోపవీతమ్ 

మం: తం యఙ్ఞం బర్హిషి ప్రౌక్షన్ పురుషం జాతమగ్రతః
తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చయే

శ్లో: బ్రహ్మ విష్ణు మహేశానం నిర్మితం బ్రహ్మసూత్రకం
గృహాణ భగవాన్ విష్ఠోసర్వేష్టపలదో భవ
శ్రీ సత్యనారాయణస్వామినే నమః యఙ్ఞోపవితం సమర్పయామి.

గంధమ్ 

మం: తస్మా ద్యఙ్ఞా త్సర్వ హుతః సంభృతం వృషదాజ్యం
పశూగ్ స్తాగ్ శ్చక్రే వాయవ్యాన్ అరణ్యాన్ గ్రామ్యాశ్చయే

శ్లో: శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం 
శ్రీ సత్యనారాయణస్వామినే నమః దివ్యశ్రీచందనం సమర్పయామి.

ఆభరణమ్ 

మం: తస్మాద్యఙ్ఞా త్సర్వ హుతః ఋచస్సామానిజజ్ఞిరే
చందాగ్ సి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత

శ్లో: హిరణ్య హార కేయూర గ్రైవేయ మణికంకణైః
సుహారం భూషణైర్యుక్తం గృహాణ పురుషోత్తమ
శ్రీ సత్యనారాయణస్వామినే నమః ఆభరణం సమర్పయామి.

పుష్పమ్ 

మం: తస్మాద్శ్వా అజాయంత, యేకే చోభయా దత: 
గావోహ జజ్ఞిరే తస్మాత్, తస్మా ఙ్ఞాతా అజావయః

శ్లో: మల్లికాది సుగంధీని మాలత్యాదీని వై ప్రభో
మయాహృతాని పూజార్ధం పుష్పాణి ప్రతిగృహ్యతాం
శ్రీ సత్యనారాయణస్వామినే నమః, పుష్పాణి సమర్పయామి.


అథాంగపూజా

ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి
గోవిందాయ నమః గుల్ఫౌ పూజయామి
ఇందిరాపతయే నమః జంఘే పూజయామి
అనఘాయ నమః జానునీ పూజయామి
జనార్ధనాయ నమః ఊరూ పూజయామి
విష్టరశ్రవసే నమః కటిం పూజయామి
కుక్షిస్థాఖిలభువనాయ నమః ఉదరం పూజయామి
శంఖ్చక్రగదాశార్జ్గపాణయేనమః నమః బాహూన్ పూజయామి
కంబుకంఠాయ నమః కంఠం పూజయామి
పూర్ణేందు నిభవక్త్రాయ నమః వక్తృం పూజయామి
కుందకుట్మలదంతాయ నమః దంతాన్ పూజయామి
నాసాగ్రమౌక్తికాయ నమః నాసికాం పూజయామి
సూర్యచంద్రాగ్ని ధారిణే నమః నేత్రే పూజయామి
సహస్రశిరసే నమః శిరః పూజయామి
శ్రీ సత్యనారాయణస్వామినే సర్వాణ్యంగాని పూజయామి

శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామపూజ

ఓం నారాయణాయ నమః    ఓం నరాయ నమః    ఓం శౌరయే నమః    ఓం చోంఅక్రపాణయే నమః    ఓం జనార్ధనాయ నమః    ఓం వాసుదేవాయ నమః    ఓం జగద్యోనయే నమః    ఓం వామనాయ నమః    ఓం ఙ్ఞానపంజరాయ నమః    ఓం శ్రీవల్లభాయ నమః    ఓం జగన్నాథాయ నమః    ఓం చతుర్మూర్తయే నమః    ఓం వ్యోమకేశాయ నమః    ఓం హృషీకేశాయ నమః    ఓం శంకరాయ నమః    ఓం గరుడధ్వజాయ నమః    ఓం పరంజ్యోతిషే నమః    ఓం ఆత్మజ్యోతిషే నమః    ఓం శ్రీ వత్సాంకాయ నమః    ఓం అఖిలాధారాయ నమః    ఓం సర్వలోకపతిప్రభవే నమః    ఓం త్రివిక్రమాయ నమః    ఓం త్రికాలఙ్ఞానాయ నమః    ఓం త్రిధామ్నే నమః    ఓం కరుణాకరాయ నమః    ఓం సర్వఙ్ఞాయ నమః    ఓం సర్వగాయ నమః    ఓం సర్వస్మై నమః    ఓం సర్వేశాయ నమః    ఓం సర్వసాక్షికాయ నమః    ఓం హరిణే నమః    ఓం శార్జినే నమః    ఓం హరయే నమః    ఓం శేషాయ నమః    ఓం హలాయుధాయ నమః    ఓం సహస్రభాహవే నమః    ఓం అవ్యక్తాయ నమః    ఓం సహస్రాక్షాయ నమః    ఓం అక్షరాయ నమః    ఓం క్షరాయ నమః    ఓం గజారిఘ్నాయ నమః    ఓం కేశవాయ నమః    ఓం నారసింహాయ నమః    ఓం మహాదేవాయ నమః    ఓం స్వయంభువే నమః     ఓం భువనేశ్వరాయ నమః    ఓం శ్రీధరాయ నమః    ఓం దేవకీపుత్రాయ నమః    ఓం అచ్యుతాయ నమః    ఓం పార్థసారథయే నమః    ఓం ఆచంచలాయ నమః    ఓం శంఖపాణయే నమః    ఓం కేశిమర్ధనాయ నమః    ఓం కైటభారయే నమః    ఓం అవిద్యారయే నమః    ఓం కామదాయ నమః    ఓం కమలేక్షణాయ నమః    ఓం హంసశత్రవే నమః    ఓం ఆధర్మశత్రవే నమః    ఓం కాకుత్థ్సాయ నమః    ఓం ఖగవాహనాయ నమః    ఓం నీలాంబుదధ్యుతయే నమః    ఓం నిత్యాయ నమః    ఓం నిత్యతృప్తాయ నమః    ఓం నిత్యానందదాయ నమః    ఓం సురాధ్యక్షాయ నమః    ఓం నిర్వకల్పాయ నమః    ఓం నిరంజనాయ నమః    ఓం బ్రహ్మణ్యాయ నమః    ఓం పృథివీనాథాయ నమః    ఓం పీతవాససే నమః    ఓం గుహాశ్రయాయ నమః    ఓం వేదగర్భాయ నమః    ఓం విభవే నమః    ఓం విష్ణవే నమః    ఓం శ్రీమతే నమః    ఓం త్రైలోక్యభూషణాయ నమః    ఓం యఙ్ఞమూర్తయే నమః    ఓం అమేయాత్మనే నమః    ఓం వరదాయ నమః    ఓం వాసవానుజాయ నమః    ఓం జితేంద్రియాయ నమః    ఓం జితక్రోధాయ నమః    ఓం సమదృష్టయే నమః    ఓం సనాతనాయ నమః    ఓం భక్తప్రియాయ నమః    ఓం జగత్పూజ్యాయ నమః    ఓం పరమాత్మనే నమః    ఓం అసురాంతకాయ నమః    ఓం సర్వలోకానామంతకాయ నమః    ఓం అనంతాయ నమః    ఓం అనంతవిక్రమాయ నమః    ఓం మాయాధారాయ నమః    ఓం నిరాధారాయ నమః    ఓం సర్వాధారాయ నమః    ఓం ధరధరాయ నమః    ఓం నిష్కళంకాయ నమః    ఓం నిరాభాసాయ నమః    ఓం నిష్ప్రపంచాయ నమః    ఓం నిరామయాయ నమః    ఓం భక్తవశ్యాయ నమః    ఓం మహోదరాయ నమః    ఓం పుణ్యకీర్తయే నమః    ఓం పురాతనాయ నమః    ఓం త్రికాలఙ్ఞాయ నమః    ఓం విష్టరశ్రవసే నమః    ఓం చతుర్భుజాయ నమః    శ్రీ సత్యనారాయణస్వామియే నమః   
శ్రీ సత్యనారాయణస్వామియేనమః నానావిధ పరిమళ,పత్ర,పుష్ప పూజాం సమర్పయామి.

ధూపమ్ 

మం: యత్పురుషం వ్యదధుః కతిధావ్యకల్పయన్
ముఖం కిమస్య కౌ బాహూ కాపూరూ పాదావచ్యేతే

శ్లో: దశాంగం గుగ్గూలూపేతం సుగంధంసమనోహరం
ధూపం గృహాణ దేవేశ సర్వదేవనమస్కృత
శ్రీ సత్యనారాయణస్వామినే నమః ధూపమాఘ్రపయామి.

దీపమ్ 

మం: బ్రాహ్మణోస్యముఖమూసిత్ బాహూరాజన్యః కృతః
ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత

శ్లో: ఘృతాక్తవర్తిసంయుక్తం వహ్నిన యోజితం ప్రియం
దీపం గృహాణ దేవేశ త్రైలోక్యమితిమిరాపహమ్
శ్రీ సత్యనారాయణ స్వామినే నమః దీపం దర్శయామి.

నైవేద్యమ్ 

మం: చంద్రమా మనసోజాతః చక్షస్సూర్యో అజాయత
ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయు రజాయత

శ్లో: సౌవర్ణస్థాలిమధ్యేమణిగణఖచితే గోఘృతాక్తాన్ సుపక్వాన్
భక్ష్యాన్ భోజ్యాంశ్చ లేహ్యానపరిమితరసాన్ చోష్యంమన్నం నిధాయ
నానాశాకైరూపేతం దధిమధు సగుడక్షీర పానీయయుక్తం
తాంబూలం చాపి విష్ణోః ప్రతిదివసమహం మానసే కల్పయామి
రాజాన్నం సూపసంయుక్తం శాకచోష్య సమన్వితం
ఘృతభక్ష్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతామ్.
ఓం భూర్భువస్సువః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య దీమహి ధియోయోనః ప్రచోదయాత్.
సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతోపస్తరణమసి,
ఓం ప్రాణాయాస్వాహా - ఓం ఆపానాయస్వాహా - ఓం వ్యానాయస్వాహా - ఓం ఉదానాయ స్వాహా - ఓం సమానాయ స్వాహా - ఓం బ్రహ్మణేస్వాహా
శ్రీ సత్యనారాయణస్వామినే నమః, మహానైవేద్యం సమర్పయామి
అమృతాపిధానమసి, ఉత్తరపోశనంసమర్పయామి.
హస్తౌప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి.

తాంబూలమ్ 

మం: నాభ్యా ఆసీదతరిక్షంశీర్ ష్ణోద్యౌస్సమ వర్తత
పధ్భ్యాం భూమిర్ధిశశ్శ్రోత్రాన్ తథాలోకాగం అకల్పయన్

శ్లో: పూగీఫలై స్సకర్పూరైర్నాగవల్లీ దళైర్యుతం
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
శ్రీ సత్యనారాయణస్వామినే నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనమ్ 

శ్లో: నీరాజనం గృహాణేదేవం పంచవర్తి సమన్వితం
తేజో రాశిమయం దత్తం గృహాణత్వం సురేస్వర.
శ్రీ సత్యనారాయణస్వామినే నమః కర్పూర నీరాజనం సమర్ప


మంత్రపుష్పమ్ 

శ్లో: ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వైవ్రవణాయ కుర్మహే
సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణోదదాతు
కుభేరాయ వై శ్రవనాయ మహారాజాయ నమః
ఓం తద్భ్రహ్మాం ఓం తద్వాయః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం 
ఓం తద్గురోర్ణమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యఙ్ఞస్త్వం వషట్కార స్త్వమింద్ర స్త్వగం రుద్రస్తం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదావ ఆపోజ్యోతీ రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరామ్. నారాయణాయ విద్మహే 
వాసుదేవాయ ధీమహి తన్నోవిష్ణుః ప్రచోదయాత్.
శ్రీ సత్యనారాయణస్వామినే నమః సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి.

ప్రదక్షిణ నమస్కారమ్

శ్లో: యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ 
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః
త్రిహిమాం కృపయాదేవ శరణాగతవత్సల
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ 
తస్మా త్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్ధన
ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం
సంసారసాగరాన్మాం త్వంముద్దరస్వ మహాప్రభో
శ్రీ సత్యనారాయణస్వామినే నమః, ప్రదక్షిణ నమస్కారమ్ సమర్పయామి.

సర్వోపచారమ్

ఛత్రం సమర్పయామి. చామరం సమర్పయామి. గీతంశ్రావయామి,నృత్యం దర్శయామి. నాట్యం సమర్పయామి. సమస్త రాజోపచారాన్ సమర్పయామి.

ప్రార్ధన

శ్లో: అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం
హృషీకేశం జగన్నాథం వాగీశం వరదాయకమ్
సగుణం చ గుణాతీతం గోవిందం గరుడఢ్వజం
జనార్ధనం జనానందం జానకీవల్లభం హరిమ్
ప్రణామామి సదా భక్త్యా నారాయణ మజం పరం
దుర్గమే విషమే ఘోరే శత్రుణాపరిపీడితే
విస్తారయతు సర్వేషు తథానిష్ట భయేషు చ
నామాన్యేతాని సంకీర్త్య ఫలమీప్సిత మాప్నుయాత్
సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం
లీలాయా వితతం విశ్వం యేన తస్మై నమోనమః
శ్రీ సత్యనారాయణస్వామినే నమః ప్రార్ధనా నమస్కారమ్ సమర్పయామి.

ఫలం

శ్లో: ఇదం ఫలం మయాదేవ స్థాపితం పురతస్తవ
తేన మే సఫలావాప్తిర్భవే జ్జన్మని జన్మని
శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ఫలం సమర్పయామి.

శ్లో: యస్య స్మృత్యా చ నమోక్త్యా తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం.

శ్లో: మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్ధన
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానవాహనాది షోడశోపచారపూజయా చ భగవాన్సర్వాత్మకః

శ్రీ సత్యనారాయణ స్సుప్రీతోవరదో భవతుః
శ్రీ సత్యనారాయణ ప్రసాదం శిరసా గృహ్ణామి.



శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ 

ప్రథమోధ్యాయః 

పూర్వము ఒకనాడు శ్రీకరంబైన నైమిశారణ్యమునందు పురాణాలను చెప్పుటలో విశేషప్రఙ్ఞకలవాడైన శ్రీసూతమహర్షిని, శౌనకాది మహామునులు కొందరు చేరి ఇట్లడిగిరి. 

ఓ పౌరాణిక బ్రహ్మా! సూతమహర్షి! మానవులు ఏవ్రతము చేసిన కోరిన కోరికలు ఫలించి ఇహ, పరలోకసిద్దిని పొందెదరో, ఏ తపస్సు చేసిన లబ్దిపొందెదరో మాకు సవివరముగా అంతయు విన్నవించండి. అని అడిగారు. 

అదివిన్న సూతుడు ఓ మునిశ్రేష్టులారా! పూర్వమొకప్పుడు దేవర్షియైన నారదుడు శ్రీ మహావిష్ణువును మీరడిగినట్లె అడిగాడు. భగవానుడగు శ్రీ మహావిష్ణువు స్వయంగా నారదమహర్షికి చెప్పినదానినె మీకు చెప్పెదను శ్రద్దగా వినండి" అన్నాడు. 

పూర్వమొకప్పుడు, లోకసంచారప్రియుడైన నారదుడు సర్వలోకాలను దిరుగుచూ సర్వలోకానుగ్రహకాంక్షితుడై భూలోకానికి వచ్చాడు.భూలోకములో పూర్వజన్మకర్మఫలములచే పలుజన్మలనెత్తుతూ పలుకష్టములనుభవించుచున్న మానవులను జూచి, జాలిపడి వీరి కష్టములను కడతేర్చు ఉపాయమేదియని విచారించుచూ విష్ణులోకమునకు వెళ్ళాడు. దేవర్షియైన నారదమహర్షి, విష్ణులోకంలో చతుర్భుజుడును, తెల్లని శరీరంగలవాడును, శంఖ, చక్ర గదా పద్మవనమాల విభూషితుడును, అగు భగవంతుడైన నారాయణుని చూచి స్తుతించసాగాడు. 

మనస్సుకుగాని మాటలకుగాని ఊహించిచెప్పుటకు అలవికాని అతీతమైన రూపముకలవాడును, ఆదిమధ్యాంతరహితుడు నిర్గుణుడు, సుగునాత్మకుడైన ఆదిపురుషా! భక్తుల బాధలను తొలగించు భగవంతుడా! శ్రీమన్నారాయణా! నీకు నమస్కారము. ఆ స్తోత్రాన్ని విన్న శ్రీమహావిష్ణువు సంతసించి నారదునితో ఇట్లన్నాడు. ఓ నారదమహర్షీ! నీరాకకు కారణమేమి? నీ కోరిక ఏమిటి? చెప్పు తీరుస్తాను అన్నాడు. 

ఓ లక్ష్మీవల్లభా! శ్రీమన్నారాయణా! జగద్రక్షకా! భూలోకమందలి జనులందరూ బహుజన్మలతో పాపకర్మములనుభవించుచున్నారు. వారికష్టములను కడతేర్చు ఉపాయమేదైనా చెప్పి దయతో అనుగ్రహింపుము అని ప్రార్ధించాడు. 

శ్రీమహావిష్ణువు ఇట్లు చెప్పుతున్నాడు " ఓ నారదా! లోకానుగ్రహకాంక్షతో మంచి విషయాన్నడిగావు! చాలా బాగున్నది. మానవులు దేనిచే సంసార భ్రాంతిని వదలి సుఖసంతోషాలనొందెదరో అట్టి సులభోపాయములను చెబుతాను, వినమన్నాడు. భూలోకమందును, స్వర్గలోకమందునుకూడా దుర్లభమైన మహాపుణ్యప్రదమైన వ్రతమొకటి కలదు. నీయందలి వాత్సల్యముచే దానిని చెప్పుచున్నానువిను. అదే సత్యన్నారాయణ వ్రతము. దానిని విధివిధానమున భక్తి శ్రద్ధలతో ఆచరించినవారు ఇహలోకమున సర్వసుఖములను అనుభవించి పరలోకమున మోక్షమును పొందెదరు. నారదుడడుగుచున్నాడు! ఓ మహాప్రభూ! ఆ వ్రతాన్నాచరించుట వలన మనకేమి ఫలితం వస్తుంది? ఆ వ్రతాన్నాచరించుటెట్లు? ఇంతకు పూర్వము ఈ వ్రతాన్నిచేసి ఫలితం పొందినవారెవరైనకలరా? ఈ వ్రతాన్నెపుడు ఆచరించాలి అంతయు నాకు సవిస్తరంగా తెలుపవలసిందని కోరాడు. 

భగవంతుడు చెప్పుచున్నాడు! ఈ వ్రతము ప్రజల కష్టనష్టాలను విచారాన్ని పోగొడుతుంది. ధనధాన్యములను వృద్దినొందించును. సౌభాగ్యకరమైన సంతానాన్ని, సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది. మాఘ, వైశాఖ, కార్తీక మాసములందుగాని, ఏదైనా శుభదినమందుగాని ఆచరించవలెను. యుద్ద ప్రారంభమందును, కష్టములొచ్చినపుడును, దారిద్ర్యము సంభవించినపుడును, అవి తొలగిపోవుటకు ఈ వ్రతమాచరించాలి.దీనిని శక్తిగలవారు ప్రతినెలా ఆచరింపవచ్చును. లేదా శక్తిని బట్టి సంవత్సరములో ఒక్కసారైనను జరుపుకోవచ్చును. 

ఏకాదశి రోజునగాని , పౌర్ణమి రోజునగాని ,సూర్యసంక్రమణం రోజునగాని, ఈ సత్యనారాయణ వ్రతమును చేయవచ్చును. ఉదయాన్నే సూర్యోదయా పూర్వమే లేచి దంతధావనాది స్నానాది నిత్యకృత్యములను నిర్వర్తించి శుచిర్భూతుడై భగవోతునికి నమస్కరించి "స్వామి సత్యన్నారాయణ! నీ అనుగ్రహప్రాప్తికై భక్తిశ్రద్దలతో నేనీవ్రతము ఆచరించుచున్నాను , నాపై దయ చూపుము" అంటూ నిశ్చలభక్తితో భగవంతుని ధ్యానించాలి. 

అట్లు సంకల్పించి మధ్యాహ్నసమయమునందు కూడా సంధ్యావందనాదులను నెరవేర్చుకొని సాయంకాలం మరల స్నానమాచరించి, ప్రదోషకాలము[అసుర సంధ్యవేళ] దాటిన పిమ్మట వ్రతపూజ ఆరంభించాలి. పూజాప్రదేశాన్ని స్థలశుద్ది చేయాలి. మట్టిఇండ్లు కలవారు గోమయంతో అలికి చక్కనిముగ్గులు పెట్టాలి. వరిపిండితో సహా అయిదు రంగుల పొడులతో అందమైన, శుభకరమైన ముగ్గులు పెట్టి, ఆ ముగ్గులపై అంచులున్న కొత్త వస్త్రమును పరచాలి. ఆ బట్టపై బియ్యముపోసి మధ్యలో శక్తినిబట్టి వెండిగాని రాగిగాని, ఇత్తడితోగాని చేసిన కలశాన్నుంచాలి. మరీ బాగా పేదవారైనచో మట్టి కలశాన్నైననూ ఉంచవచ్చును. శక్తిఉండి లోభత్వము చూపరాదు. శక్తికొలది సకలము ఆచరించాలి. కలశముపై మరల కొత్తవస్త్రాన్ని పరచాలి. 

ఆ నూతనవస్త్రముపై సత్యన్నారాయణ స్వామి ప్రతిమనుంచి పూజించాలి. ఎనబై గురిగింజలయెత్తు బంగారముతోగాని దానిలో సగముగాని, లేక ఇరవైగురిగింజలయెత్తు బంగారంతోగాని చేసిన సత్యనారాయణస్వామి ప్రతిమను ఉంచాలి. ఆ ప్రతిమను పంచామృతాలతో(పాలు,పెరుగు,నెయ్యి,తేనె,నీరు) శుద్ది చేసి మండపములో ఉంచవలెను. ప్రధమంగా విఘ్నేశ్వరుని, తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని , శివుడుపార్వతిని, ఆదిత్యాది నవగ్రహాలను ,ఇంద్రాదిఅష్టదిక్పాలకులను, ఆదిదేవతలను, ప్రత్యధిదేవతలను పూజించాలి. కావున వారిని ముందుగా ఆవాహనము చేయాలి. ఓం ప్రధమంగా మొదట కలశమునున్న వరుణదేవుని ఆవాహనము చేసి విడిగా పూజించాలి. పిమ్మట విఘ్నేశ్వరుడు మున్నగు ఐదుగురు దేవతలను కలశంకు ఉత్తరదిశయందు., మంత్రములతో ఉదకసమాప్తిగా ఆవాహనము చేసి పూజించాలి. సూర్యాదిగ్రహములను, దిక్పాలకులను ఆయా స్థానములందు ఆవాహన చేసి పూజించాలి.అటు పిమ్మట సత్యనారాయణస్వామి కలశమందు ప్రతిష్టించి పూజించాలి. అనగా అష్టదిక్పాలకులను తూర్పు మొదలగు ఎనిమిది దిశలందు ప్రతిష్టించి పూజించాలి పిమ్మట సత్యదేవుని(సత్యనారయణ స్వామి) కలశమీద పూజచేయాలి. 

నాలుగు వర్ణాలవారు అనగా బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్రులు,ఆడవారు కూడా ఈ పూజ చేయవచ్చును. బ్రాహ్మణులు మున్నగువారు కల్పోక్త ప్రకారముగా వైధికపురాణ మంత్రములతోను, బాహ్మణులు కాని వారు కేవలము పౌరాణిక మంత్రములతోను పూజించవలెను. మనుషులైనవారు భక్తిశ్రద్దలతో ఏ రోజునైనను ఈ వ్రతమును చేసికొనవచ్చును. కాని పగలు ఉపవాసముఉండి సాయంసమయమందే సత్యనారాయణస్వామిని పూజించాలి.ఈ వ్రతమును బ్రాహ్మణులు బంధువులతో కలసిచేసుకోవాలి.అరటిపండ్లు,ఆవుపాలు,ఆవునేయి,శేరుంబావు,గోధుమనూకగాన, వరినూకతోగాని వాటికి పంచదార కలిపి ప్రసాదం చేసి స్వామికి నివేదించాలి. చక్కెరలేనిచో బెల్లముగూడా ఇవి అవిఅన్నియు 1 1/4కేజి చొప్పున చేర్చి ప్రసాదముచేసి స్వామికి నివేదనచేయాలి. 

ఇట్లు స్వామికి నివేదించిన నైవేద్యమును అందరకు పంచి ఆరగించి బ్రాహ్మణులను శక్తికొలది దక్షిణతాంబులాదులతో సత్కరించి, దీవెనలందుకొని, బ్రాహ్మణులతో సహా అందరూ షడ్రసోపేత భోజనమారగించాలి. సత్యనారాయణస్వామిని నృత్యగీతాది మహారాజోపచారములతో సంతుష్టుని చేయాలి. కలియుగంలో భూలోకమందు,మానవులు తమ కామితార్దములను తీర్చుకొనుటకు సులభమైన వ్రతమార్గమిదియే. మానవులు తమ కోర్కెలను తీర్చుకొనుటకు ఇంతకంటే సులభవ్రతమార్గం ఇంకొకటిలేదు.అని శ్రీమన్నారాయణుడు నారదునికి ఉపదేశించెనని, సూతమహర్షి శౌనకాదిమునులకు విన్నవించాడు. 

ద్వితీయాధ్యాయః 

ఓ మునులారా! పూర్వము ఈ వ్రతమాచరించిన వారిని గురించి చెప్పెదను వినండి. పూర్వము కాశీనగరములో కటికదరిద్రుడైన ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండెవాడు.అతడు దరిద్రబాధననుభవిస్తూ అన్నవస్త్రములు లేక నిత్యము ఆకలిదప్పులతో అలమటిస్తుండేవాడు. పడరానిపాట్లుపడుతూ తిరుగుచుండేవాడు. బ్రాహ్మణప్రియుడగు భగవంతుడు బాధపడుచున్న బ్రాహ్మణుని జూచి దయతలచి,వృద్దబ్రాహ్మణ రూపమును ధరించి అతని ఎదుట నిలచి "ఓయి! విప్రోత్తమా! నీవెందుకు దుఃఖిస్తూ తిరుగుచున్నావు? నీ వృత్తాంతమంతయు చెప్పుమన్నాడు". 

అంతట బ్రాహ్మణుడు"ఓ మహాత్మ! నేనొక విప్రుడను! మిక్కిలి దరిద్రుడనై బిక్షాటనముతో జీవించుచున్నాను. పడరానిపాట్లుపడుచూ ఇంటింటికి తిరుగుతున్నాను.నా దరిద్ర్యము పోయే మార్గమేదైన ఉన్నచో చెప్పి చేయూతనివ్వండి స్వామి" అని వేడుకున్నాడు. అంతట వృద్దబ్రాహ్మణుడు "ఓ ద్విజోత్తమా! శ్రీసత్యనారాయణ స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమే గదా! ఆ సత్యనారాయణస్వామిని పూజించు. నీ కష్టములన్నీ తొలగిపోతాయి.సత్యనారాయణవ్రతమును ఆచరించుము. అని చెప్పి,వ్రతవిధివిధానమును విన్నవించి ఆ వృద్దబ్రాహ్మణుడు అచ్చోటనే అదృశ్యుడాయెను. అదివిన్న బ్రాహ్మణుడు సంతోషించి ఆ వృద్దబ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణస్వామి వ్రతమును రేపుచేసుకొనెదనని సంకల్పించుకొని దానినే తలంచుకొనుచు నిద్రగూడరాక ఎట్లో మరునాడు ప్రొద్దున్నే లేచి "ఈ రోజు తప్పక సత్యనారాయణవ్రతము చేసుకొందునని" మరల అనుకొన్నవాడై యధావిధిగా భిక్షాటనకు బయలుదేరాడు. స్వామి దయవలన ఆ రోజున బ్రాహ్మణునకు చాలా ద్రవ్యము లభించింది. దానితో అతడు బ్రాహ్మణులను,బంధువులను పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తిశ్రద్దలతో ఆచరించాడు. 

ఆ వ్రత మహిమవలన ఆ బ్రాహ్మణుడు దారిద్ర్యవిముక్తుడై సర్వదుఃఖములను తొలగించుకొన్నవాడై సకలసంపదలతో విలసిల్లినాడు. అదిమొదలు ఆ బ్రహ్మణుడు నెలనెలా విడువక సత్యనారాయణస్వామి వ్రతమును భక్తిశ్రద్దలతో ఆచరించసాగాడు.ఆవిధంగా నెలనెలా సత్యనారాయణ వ్రతం చేయటంవలన బ్రాహ్మణుడు మహదైశ్వర్యవంతుడై సర్వపాపములనుండి విముక్తిపొందినవాడై, మరణాంతరమున మోక్షమును పొందాడు. భూలోకమందెవరైన ఆ బ్రాహ్మణుడు చేసినట్లు సత్యనారాయణ వ్రతమును చేసినచో వారి సర్వదుఃఖములు తొలగి సుఖసంతోషాలతో ఉండగలరు.ఓ మునులారా!ఈ విధముగా శ్రీమన్నారాయణుడు నారదమహర్షికి చెప్పినవ్రతమును మీకు విన్నవించాను అని సూతమహర్షి చెప్పాడు. 

అంతట ఋషులు మరల సూతమహర్షినిట్లడిగారు "ఓ మహర్షీ! ఆ బ్రహ్మణునివలన విన్నవారెవరైననూ ఈవ్రతమును ఆచరించారా! చెప్పండి మాకు వినాలనియుంది" అని అడిగారు. సూతమహర్షి చెబుతున్నాడు "మునులారా! ఆ బ్రాహ్మణుడొకనాడు తన విభవముకొలది బ్రాహ్మణులను, బంధువులను బిలిచికొని వ్రతము చేయనారంభించాడు. అంతలో ఒక కట్టెలమ్ముకొనువాడు అచ్చటకు వచ్చి కట్టెలమోపును బయటకు దింపుకొని, లోపలికివచ్చి వ్రతమును చూడసాగాడు. అతడు మిక్కిలి దప్పిక గలవాడైనను, బ్రాహ్మణుడుచేయుచున్న వ్రతమునంతయు ఓపికతో చూసి దేవునికి, బ్రాహ్మణునికి నమస్కారము చేసి "ఓ బ్రాహ్మణోత్తమా! మీరిప్పుడు చేసిన పూజపేరేమి? దానివలన కలిగే ఫలితమేమిటి? వివరంగా చెప్పమని" అర్ధించాడు. విప్రుడిట్లు చెప్పెను . ఓయీ! ఇది సత్యన్నారాయణవ్రతము ఈ వ్రతమునుచేసినచో సర్వకార్యసిద్ది కలుగును. కోరినకోరికలు ఫలించును.సకలైశ్వర్యవంతులుకావచ్చును.ఆ బ్రాహ్మణుడు చెప్పినదానిని శ్రద్దగావిన్న ఆ కట్టెలమ్మువాడు మిగుల సంతోషించి తనదాహం తీర్చుకొని, స్వామివారి ప్రసాదమును స్వీకరించి తనయూరికి పోయెను. 

అతడు సత్యన్నారాయణ స్వామినే మనసులో ధ్యానించుచు వ్రతముచేయ సంకల్పించుకున్నవాడై, ఈ కట్టెల మోపును అమ్మగా వచ్చిన ధనముతో సత్యన్నారాయణవ్రతము చేయుదునని తలచాడు. అతడు కట్టెలనమ్ముటకు మరుసటి దినమున నగరములో ధనవంతులున్న ఇండ్లవైపు పోయెను. స్వామి అనుగ్రహముచే అతనికానాడు రెట్టింపులాభం వచ్చింది. దానికతడు మిక్కిలి సంతోషించి అరటిపండ్లు, పంచదార,ఆవు నెయ్యి, ఆవు పాలు,శేరుంబావు గోధుమనూక, పూజాసామాగ్రినంతటిని తీసుకొని ఇంటికి పోయాడు. అతడు బంధువులందరిని పిలిచి విధివిధానమున సత్యన్నారాయణవ్రతమును చేసాడు. ఆ వ్రత మహిమ చేత అతడు ధనధాన్యములతోను, పుత్రపౌత్రాదులతోను సర్వసంపత్కరుడై, సకల సౌఖ్యములనుభవించి అంత్యకాలమున సత్యలోకమునకేగాడు. 

తృతీయోధ్యాయః 

సూతుడు మరల చెప్పుచున్నాడు."ఓ మునులారా! మీకు మరొక కథను చెప్పెదను వినండి. పూర్వం ఉల్కాముఖుడనే రాజుండేవాడు. అతడు ఇంద్రియములను జయించినవాడై,సత్యవంతుడై ప్రతిదినము దేవాలయమునకు బోయి అచట బ్రాహ్మణులకు ధనమునిచ్చి వారిని సంతృప్తిపరచి,దైవదర్శనం చేసుకొని పోయెవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి,సుగుణవతి ఆరాజొకనాడు ధర్మపత్ని సమేతుడై భద్రశీలా నదీతీరమున సత్యనారాయణవ్రతము చేయసాగాడు. ఇంతలో సాధువనే ఒక వర్తకుడు అపారమైన ధనరాశులతోను,వస్తువులతోను ఉన్న తన నావను తీరమున నిలిపి వ్రతము చేస్తున్న రాజుదగ్గరకు వచ్చి వినయముతో నిట్లడిగాడు. 

సాధువు, ఓ రాజా! భక్తిశ్రద్దలతో మీరు చేస్తున్న ఈ వ్రతమేమిటి? దయచేసి నాకు వివరించండి. తెలుసుకోవాలనుంది" అని అడిగాడు. అంతట రాజు, ఓ సాధు! పుత్రసంతానప్రాప్తికై మేము ఈ సత్యనారాయణవ్రతము చేయుచున్నాము అని చెప్పాడు. మహారాజు చెప్పిన మాటలు విన్న సాధువు " ఓ రాజా! నాకు గూడా సంతానంలేదు. ఈ సత్యనారాయణవ్రతమును చేసినచో సంతానము కలుగుచున్నచో నేనుగూడా ఈ వ్రతమాచరించెదనన్నాడు. తరువాత సాధువు తన వ్యాపారమును ముగించుకొని ఇంటికివచ్చి భార్యయైన లీలావతితో సత్యనారాయణ వ్రతమును గూర్చి విన్నవించాడు. సంతానము కలిగినచో తప్పక ఈ వ్రతమును ఆచరించెదనన్నాడు. 

ఒకనాడు లీలావతి ధర్మపరాయణురాలై, భర్తతో సుఖించింది. తత్ఫలితముగా గర్భవతియై పదవమాసమున పండంటి భాలికను ప్రసవించింది.ఆ బాలిక శుక్లపక్ష చంద్రునివలె దినదినప్రవర్ధమానమవుతొంది. తల్లిదండ్రులామెకు "కళావతి" అనే పేరు పెట్టారు. అప్పుడు లీలావతి,భర్తతో "నాధా! మనకు సంతానము కలిగినచో సత్యనారాయణవ్రతమును చేసెదనంటిరి గదా! మనకు పుత్రిక ఉదయించినదిగదా! కనుక వ్రతంచేయండి అంది. దానికావర్తకుడు, "లీలావతి మన అమ్మాయి వివాహసమయంలో తప్పక వ్రతంచేద్దామని భార్యను సమాధానపరచి వ్యాపారంపనిమీద నగరానికి పోయాడు.ఇట్లు కళావతి కన్నతండ్రి ఇంట పెరుగుతూ యుక్త వయస్సుకు చేరుకున్నది. అది గమనించి సాధువు తన సహచరులతోనాలోచించి వరుని వెదుకుటకు దూతను పంపాడు. సాధువట్లు ఆఙ్ఞాపించగా దూత కాంచననగరానికి బోయి అక్కడొక చక్కని యోగ్యుడైనా వర్తకుని కుమారునిజూచి, వెంట తోడ్కొనివచ్చాడు. అందగాడైన ఆ వైశాల్యబాలకుని జూచిన సాధువు తన కుమార్తెనిచ్చి విధివిధానమున పెండ్లిచేసాడు. పుత్రికావివాహానందములో పడిన ఆ సాధువు పెండ్లివేడుకలలోబడి సత్యనారాయణవ్రతమును మరిచాడు. అందుకు స్వామికి ఆగ్రహం వచ్చింది. తరువాత కొంతకాలానికి, వ్యాపారదక్షతగల సాధువు వ్యాపార నిమిత్తమై తన అల్లునితోసహా బయలుదేరి, సముద్రతీరమునవున్న రత్నసానుపురమనే నగరానికి బయలుదేరాడు. 

ఆ పురమును చంద్రకేతుడనే మహారాజు పాలించుతుండేవాడు. కోపించిన సత్యనారాయణస్వామి వ్రతప్రతిఙ్ఞను మరచిపోయిన సాధువును శపించబూనుకొన్నాడు. వ్రతము చేస్తానని మరచిన సాధువును, "అత్యంత దారుణము,కాఠిన్యతగల దుఃఖమతనికి కలుగుగాక! యని శపించాడు. శాప ప్రభావంవలన ఆ నాడే రాజుగారి ధనాగారములోనికి కొందరు దొంగలు ప్రవేశించి,ధనమును అపహరించి రాజ భటులు వెంట తరుముతుండగా, సాధువు వర్తకులు ఉన్నవైపుకు పరుగెత్తారు. రాజుభటులను చూచిన దొంగలు భయపడి ఆ ధనమును సాధువు ,వర్తకులు ఉన్నచోట పడవైచి పారిపోయారు. రాజభటులు వచ్చి, వర్తకుల వద్దనున్న రాజధనమును జూచి ఆ వర్తకులే దొంగలనుకొని నిశ్చయించుకొన్నవారై సాధువును, అల్లుడిని బంధించి రాజువద్దకు తీసుకొనిపోయారు. ఆ రాజభటులు,మహారాజా! దనముతోకూడా దొంగలను పట్టి తీసుకొనివచ్చాము.విచారించి శిక్షించండి. అని సంతోషముతో చెప్పారు. అంతట రాజు, విచారణవసరము లేదనుకొనుచు "వీరిని చెరసాలలో బంధించండి" అన్నాడు.భటులా ఇద్దరు వర్తకులను కారాగారమున బంధించారు.వర్తకులెంత మొత్తుకున్నా, సత్యదేవుని మాయచేత వారినెవ్వరు పట్టించుకొనలేదు. ఇంకను చంద్రకేతుమహారాజు వారి పడవలయందున్న ధనమంతటిని తన ధనాగారమునకు చేర్పించెను. సత్యదేవునిశాపముచే ఇంటియందున్న సాధువు భార్యకూడా కష్టాలపాలయ్యింది. వారియింటనున్న ధనధాన్యములంతటిని దొంగలుపడి అపహరించుకొనిపోయారు. వర్తకునిభార్య తీవ్ర మనోవేధనతో రోగగ్రస్తురాలాయెను. తినటానికి తిండిలేక, ఇంటింటికి తిరిగిభిక్షమెత్తుకొని బ్రతుక సాగింది. కుమార్తె కళావతికూడా ఆకలికి అలమటిస్తూ భిక్షమెత్తుకొన సాగింది. అలాతిరుగుతూ ఒకనాడొక బ్రాహ్మణుని ఇంటికి చేరుకుంది. అక్కడాబ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతం చేయుచుండగా చూచింది. కధ అంతయు విని, కరుణించి కాపాడమని స్వామిని మనఃస్ఫూర్తిగా వేడుకొన్నది. ప్రసాదాన్ని గూడా స్వీకరించి బాగా ప్రొద్దుపోయిన తర్వాత ఇల్లుచేరుకున్నది. ఆలస్యంగావచ్చిన కళావతిని జూచి లీలావతి ప్రేమతో ఇట్లన్నది. 

అమ్మాయి! ఇంతరాత్రివరకు ఎక్కడున్నావు? నీ మనస్సులో ఏమున్నది? చెప్పుమన్నది. వెంటనే కళావతి "అమ్మా! నేనొక బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణవ్రతం జరుగుచుండగా చూస్తూ ఉండిపోయాను. అమ్మా! ఆ వ్రతం కోరినకోరికలు తీర్చునటగదా!" అన్నది. అంతట లీలావతి పుత్రిక మాటలు విని వ్రతంచేయసంకల్పించింది. వర్తకునిభార్యయైన లీలావతి బంధుమిత్రులతో కలిసి,మిక్కిలి భక్తిశ్రద్దలతో సత్యనారాయణవ్రతం చేసి "స్వామీ! మా అపరాధము మన్నించండి. మమ్మల్ని క్షమించి నా భర్తయు,అల్లుడు సుఖముగా ఇల్లు చేరునట్లు దీవించండి. అని ప్రార్ధించింది. లీలావతి చేసిన వ్రతమునకు సత్యదేవుడు సంతోషించి ఆరాత్రి చంద్రకేతుమహారాజు కలలో కనిపించి "రాజా! నీవు బంధించినవారిద్దరూ దొంగలుకారు. వారు వర్తకులు, రేపు ఉదయాన్నే వారిద్దరిని విడిపించి, వారిధనం వారికిచ్చి పంపివేయుము లేనిచో నీవు సర్వనాశనమగునట్లు చేసెదనని చెప్పాడు. మరునాడు ఉదయాన్నే రాజు సభలో తనకొచ్చిన స్వప్నాన్ని వివరించి ఆ వర్తకులను విడిపించి తీసుకురండని భటులనాఙ్ఞాపించాడు. వారట్లే చేసి, వర్తకులిద్దరినీ రాజువద్దకు తెచ్చి రాజా వర్తకులను తెచ్చినామని చెప్పారు. ఆ వర్తకులిద్దరూ రాజుకు నమస్కరించి గతసంగతులు తలంచుకొనుచు తమకిచ్చిన కష్టానికి చింతించుచూ భయభ్రాంతులై నిశ్చేష్టులై నిలుచున్నారు. అపుడారాజు వర్తకులను జూచి "వర్తక శ్రేష్టులారా! మీకీ ఆపద దైవవశమున సంభవించినది. భయపడకండి". అని ఓదార్చి వారిని బంధవిముక్తులను చేసి, వారికి పురుషులకు అలంకారమైన క్షురకర్మాదులను చేయించి నూతన వస్త్రములతో సత్కరించి, వారిద్దరిని సంతోషపరచాడు. రాజు ఇంకను వారిని అనేక విధముల గౌరవించి స్వాధీనంచేసుకొన్న ధనమునకు రెట్టింపుఇచ్చి వారిద్దరిని సంబరపరిచాడు. చంద్రకేతుమహారాజు వారిద్దరిని సకలమర్యాదలతో సత్కరించి మీరింక సుఖముగా మీఇంటికి పోవచ్చును అనిచెప్పాడు. వర్తకులు పరమానందభరితులై రాజును అనేకవిధాల కొనియాడి సెలవుతీసుకొని తమ నివాసములకేగిరి. 

చతుర్ధోధ్యాయః 

సూతమహర్షి చెబుతున్నాడు. అటుపిమ్మట వైశ్యులిద్దరు, విప్రులకు దానధర్మములొసంగి తీర్ధయాత్రలు చేయుచు స్వనగరమునకు బయలుదేరాడు. సముద్రమునందు వారావిధముగా కొంతదూరము ప్రయాణము చేసిరి సత్యదేవునికి మరల వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. వెంటనే సన్యాసి రూపమును ధరించి "నాయనలారా! మీ పడవలో ఏమున్నది" అని అడిగాడు. ధనమదాంతులైన ఆ వైశ్యులు, సన్యాసిని జూచి పరిహసిస్తూ మా పడవలో ఏమున్నదో నీకెందుకు? మా ధనమును అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు,అలములు తప్ప మరెమియు లేవు. వెళ్ళమని బదులు చెప్పారు. అంతట సన్యాసి చిరునవ్వునవ్వి "అట్లే అగుగాక" అన్నాడు. 

అట్లు పలికిన ఆ సన్యాసి నదీతీరమునందే కొంతదూరములో నిలబడి చోద్యము చూడసాగాడు. సన్యాసి అలావెళ్ళగానే సాధువర్తకుడు కాలకృత్యములు తీర్చుకునివచ్చి, పడవలోనికిజూచి,ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు. దుఃఖముతో మూర్చిల్లాడు, తెలివివచ్చిన తరువాత తమ ధనధాన్య సంపదలన్నీ ఏమైపోయినవోనని విలపించసాగాడు. అంతట అల్లుడు మామనుజూచి "మామయ్యా! ఏడ్వటంవలన ప్రయోజనమేమి? సాధుగుణాత్ముడైన సన్యాసిని పరిహసించినందువలననే మనకీ దుస్థితి వాటిల్లింది. సన్యాసి కోపంవల్లనే సర్వస్వం కోల్పోయాము. కనుక ఆయననే వేడుకొందాం. ఆయననే శరణు కోరుదాం. మనల్ని తప్పక కరుణిస్తాడు. మన కోరికలు నెరవేరగలవు" అన్నాడు. అల్లుని మాటలనాలకించిన సాధువు పరుగుపరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి మనసారా నమస్కరించి వినయముతో "స్వామి! ఙ్ఞానశూన్యుడనై మిమ్ములను పరిహసించాను. నా తప్పును మన్నించండి. క్షమించి నాపై దయ చూపండి" అని పరిపరివిధాలుగా ప్రార్ధించాడు. భోరున విలపించాడు. అంతట ఆ సన్యాసి "ఓయీ! నా వ్రతము చేసెదనని చెప్పి మరిచిపోవుట భావ్యమ! దుష్టబుద్దితో ఉన్న నీకు కనువిప్పు కలిగించాలనే నేను శాపము ఇచ్చాను. నా శాపంవల్లనే నీకీ దుస్థితి సంభవించింది. యిప్పటికైనా తెలుసుకొంటివా! అన్నాడు. 

అంతట సాధువు "స్వామీ! పుండరీకాక్షా! లోకమంతయు నీ మాయమోహమున పడి కొట్టుమిట్టాడుచున్నది. బ్రహ్మాదిదేవతలే నీ మాయనుగానలేకున్నారు.నిన్ను తెలుసుకొనలేకున్నారు. మానవమాత్రుడను, నేనెంతవాడను తండ్రీ! నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ అఙ్ఞానిని. నీ అనుగ్రహమునకు దూరమై తపించుచున్న అభాగ్యుడను నిన్ను తెలుసుకొనుట నా తరమ స్వామీ! నా అపరాధమును మన్నింపుము. ఇకమీదట నిన్నెపుడు మరువక పూజించెదను. శరణన్నవారిని రక్షించు కరుణాసముద్రుడవు, నన్ను అనుగ్రహించు నా విత్తమును నాకిప్పించమని" పరిపరివిధాలుగా ప్రార్ధించాడు. సాధుయొక్క ప్రార్ధనను మన్నించిన స్వామి ఆతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యెను. అటుపిమ్మట సాధువు తన నావవద్దకు వచ్చిచూడగా అది అంతయు ధనరాశులతో నిండియుండుటను గమనించి సంతుష్ఠాంతరంగుడై ఆ సత్యదేవుని దయవల్లనే తనకోరిక తీరినదనుకొని తన పరివారంతో సహా స్వామిని పూజించి స్వగృహమునకు ప్రయాణము సాగించెను. కొంతసేపటికి తన సంపదను సంరక్షిస్తున్న అల్లునితో "అల్లుడా! మనం మన రత్నపురమునకు చేరాము" అంటూ తమ రాకను తెలుపుటకై ఒక దూతను ఇంటికి పంపెను.ఆ దూత నగరానికిపోయి లీలావతితో అమ్మా! నమస్కారము, మన అయ్యగారు, అల్లుడుగారు వచ్చారు. బంధుమిత్రాదులందరితో కలిసి వేంచేసారు. ఇప్పుడే పడవవచ్చింది. అని వార్తను చెప్పాడు.  అంతట లీలావతి, దూతమాటలు విని ,సంబరపడి, అమ్మాయీ కళావతీ! సత్యనారాయణవ్రతం త్వరగా ముగించిరామ్మా! నేను నావ వద్దకు పోవుచున్నాను, నీ తండ్రిని, భర్తను చూచుటకు త్వరగా రా! అని చెప్పింది. తల్లి మాటలు విన్న కళావతి హడావిడిగా వ్రతము ముగించి ప్రసాదాన్ని భుజించటం మరచి పరుగుపరుగున తన పతిని జూచుటకు పోయింది. ప్రసాదాన్ని ఆరగించనందుకు సత్యదేవుడు కోపించి ధనమును సంరక్షిస్తున్న అల్లునితోసహా పడవ నీటిలో మునిగిపోయేటట్లు చేసాడు. అదిచూసి ఒడ్డునున్నవారు హాహాకారాలు చేసారు. లీలావతి, కళావతి మిక్కిలి దుఃఖించసాగారు.హఠాత్తుగా పడవ మునిగిపోవుటను జూచిన తల్లి నెత్తినోరూ బాదుకుంటూ, విలపిస్తూ, భర్తతోఇట్లన్నది. "ఏమండి! అల్లుడు అంత హఠాత్తుగా పడవతోసహా ఎట్లా మునిగిపోయాడు? ఇదంతా దేవుని మాయగాక మరేమిటి? అంటూ దుఃఖపడసాగింది. కళావతి భర్త మునిగిపోయినందుకు పడిపడి ఏడ్వసాగింది. తన భర్త తనకళ్ళెదుట మునిగిపోవుటను జూచిన కళావతి అతని పాదుకలను తీసుకొని, వాటితో సహా సహగమనము చేయటానికి సిద్దపడింది. సాధువు ఇదంతయుజూచి, మిగులదుఃఖించుచు, ఆలోచించి, "ఇదంతా స్వామి మహిమే అయివుంటుందని" ఊహించి శక్తికొలది స్వామిని పూజించెదనని తలంచి అందరితోబాటు స్వామిని వేడికొనసాగాడు. అంతట స్వామి సాధువును కరుణించి అదృశ్యరూపములో ఉండి అతనితో ఓయీ! నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరలో నాప్రసాదమును ఆరగించుట మరచినది. ఆమె మరల ఇంటికిపోయి ప్రసాదమును భుజించివచ్చినచో అంతయు శుభమే జరుగునని చెప్పాడు. ఆకాశవాణి పలుకులువిన్న కళావతి, వెంటనే ఇంటికివెళ్ళి ప్రసాదాన్ని పుచ్చుకొని తప్పును మన్నించమని వేడుకొని తిరిగి సముద్రతీరమునకు వచ్చెను. ఆశ్చర్యముగా తనభర్త నావతోసహా నీటిపై తేలియుండుటజూచి సంతోషపడింది. అందరు ఆనందించారు. అంతట కళావతి తండ్రితో "తండ్రీ! ఇక ఆలస్యమెందుకు? ఇంటికి పోవుదమురమ్ము" అనెను అంతట సాధువు అక్కడే అందరితో కలిసి సత్యనారాయణ వ్రతము చేసికొని ఇంటికి పోయాడు. అటుపిమ్మట ఆ వైశ్యుడు తన జీవితాంతకాలమువరకు ప్రతి పౌర్ణమి తిధియందును, రవిసంక్రమణ సమయమందును, సత్యనారాయణస్వామి వ్రతము చేస్తూ సర్వసౌఖ్యములనంది అంత్యమున అమరలోకానికేగాడు. 

పంచమోధ్యాయః 

సూతమహర్షి చెబుతున్నాడు, ఓ మునిశ్రేష్టులరా! మీకు మరొక కథను విన్నవించెదను. శ్రద్దగావినండి పూర్వము తుంగధ్వజుడనే రాజు మిగుల ధర్మపరాయణుడై ప్రజలను కన్నబిడ్డలవలేజూచుచు రాజ్యపాలన చేస్తున్నాడు.ఆ మహారాజు ఒకనాడు వేటకై అడవికిబోయి తిరిగివచ్చుచు మార్గ మంధ్యంలో విశ్రాంతి తీసుకొంటూనొక మారేడుచెట్టు క్రింద కొంతమంది గొల్లలు తమ బంధుమిత్రులతోసహా వ్రతముచేసుకొనుచుండగా చూచియు స్వామికి నమస్కారమైనను చేయక నిర్లక్ష్యముచేసాడు. వ్రతము పూర్తయినతరువాత గోపాలురు ప్రసాదాన్ని రాజుగారికిచ్చి స్వీకరించమన్నారు. గొపాలురందరూ ప్రసాదాన్ని తిన్నారు. కాని రాజుగారికి అహంకారంఅడ్డొచ్చి మీరుపెడితే నేను తినటమేమిటనుకొని, ప్రసాదాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంతట స్వామి కోపించి రాజుపై ఆగ్రహించాడు.తత్ఫలితంగా రాజుయొక్క వందమంది కుమారులు చనిపోయారు.సర్వసంపదలు సర్వనాశనమైనాయి.క్రమంగా దారిద్ర్యం సంభవించింది. అష్టకష్టాలపాలయ్యాడు. ఇదంతయు చూచిన రాజు ఆలోచించి, ఇట్లు తలపోసాడు "ఆహా! నాడు గొల్లలుఇచ్చిన స్వామివారి ప్రసాదాన్ని నేను తినటమేమిటని తిరస్కరించినందువల్లనే స్వామి నాపై ఆగ్రహముచెంది నాకిట్లు శాస్తి గావించాడు". అనుకొని వెంటనే గొల్లలుచెంతకు పోయి నియమనిష్టలతో, భక్తిశ్రద్దలతో సత్యదేవుని వ్రతము ఆచరించాడు. అంతట స్వామి దయతలచి మరల ధనధాన్యాదిక సంపదలను, 100 మంది పుత్రులను, రాజ్యసుఖములనిచ్చి అనుగ్రహించాడు. రాజు సర్వసుఖములను అనుభవించుచు క్రమంతప్పక స్వామివారి వ్రతమును చేస్తూ అంత్యకాలమున సత్యలోకమునకేగాడు. 

మహోన్నతమైన ఈ వ్రతరాజమును భక్తిశ్రద్దలతో చేసినవారును, వ్రతమునుచూచినవారును, కథవిన్నవారును సత్యనారాయణస్వామి అనుగ్రహమునకు పాత్రులయ్యెదరు. ఆయన కృపచే ధనధాన్యసంపత్తులను, పుత్రపౌత్రాదిసంతతిని పొందగలరు ఇహపరలోకాల్లో సర్వసౌఖ్యములనుభవించుచు మోక్షమునొందగలరు. ఈ వ్రతమును భక్తితో చేసినచో దరిద్ర్యులు ధనవంతులు కాగలరు. బంధవిముక్తినొందగలరు. భయముతోలగును. అట్టి భక్తులు నిశ్చయంగా సకలాభిష్టిసిద్దినొంది అంత్యమున స్వర్గలోకమునకేగుదురు. కావున ఓ మునులారా! మానవులను సర్వదుఃఖములనుండి విముక్తి చేయు మహిమగల శ్రీసత్యనారాయణవ్రతవిధానమును, దానిఫలితములను ఆచరించి ముక్తినొందినవారి కథలను, విన్నవించాను. విశేషించి కలియుగములో సత్యనారాయణవ్రతమును మించినదిలేదు. ఇది ప్రత్యక్ష ఫలప్రదమైనది. ఈ కలియుగమున సత్యనారాయణస్వామిని కొందరు సత్యదేవుడని, సత్యనారాయణయని, సర్వేశ్వరుడని పిల్చుకొంటారు. ఎవ్వరేపేరుతో పిలిచిన కోర్కెలుతీర్చే స్వామి సత్యనారాయణస్వామియే. 

మహోన్నతమైన ఈ వ్రతరాజమును భక్తిశ్రద్దలతో చేసినవారును, వ్రతమునుచూచినవారును, కథవిన్నవారును సత్యనారాయణస్వామి అనుగ్రహమునకు పాత్రులయ్యెదరు. ఆయన కృపచే ధనధాన్యసంపత్తులను, పుత్రపౌత్రాదిసంతతిని పొందగలరు ఇహపరలోకాల్లో సర్వసౌఖ్యములనుభవించుచు మోక్షమునొందగలరు. ఈ వ్రతమును భక్తితో చేసినచో దరిద్ర్యులు ధనవంతులు కాగలరు. బంధవిముక్తినొందగలరు. భయముతోలగును. అట్టి భక్తులు నిశ్చయంగా సకలాభిష్టిసిద్దినొంది అంత్యమున స్వర్గలోకమునకేగుదురు. కావున ఓ మునులారా! మానవులను సర్వదుఃఖములనుండి విముక్తి చేయు మహిమగల శ్రీసత్యనారాయణవ్రతవిధానమును, దానిఫలితములను ఆచరించి ముక్తినొందినవారి కథలను, విన్నవించాను. 

విశేషించి కలియుగములో సత్యనారాయణవ్రతమును మించినదిలేదు. ఇది ప్రత్యక్ష ఫలప్రదమైనది. ఈ కలియుగమున సత్యనారాయణస్వామిని కొందరు సత్యదేవుడని, సత్యనారాయణయని, సర్వేశ్వరుడని పిల్చుకొంటారు. ఎవ్వరేపేరుతో పిలిచిన కోర్కెలుతీర్చే స్వామి సత్యనారాయణస్వామియే.