Wednesday, March 21, 2007

ముకున్ద మాల
ముకున్ద మాల స్తోత్రమాలికను అందంగా గుదిగుచ్చిన మహానుభావులు మలయాళ దేశాధీశ్వరుడైన కులశేఖర మహారాజు. ఈ వైష్ణవ భక్తాగ్రేసరుని భక్తి సుధాప్రవాహమే ముకుందమాలగా రూపుదిద్దుకుంది.ముకున్దః అనే భగవన్నామాన్ని అనుసంధించి ముకుందుని విషయంగా రచించిన పద్యాలనే పుష్పాలహారంగా ముకున్దునికి సమర్పింపబడి ముకున్ద మాలగా పేరుగాంచింది.

కులశేఖరులు శ్రీవైష్ణవ ఆళ్వారులలో ఐదవవారు. చంద్రవంశపు రాజైన దృఢవ్రతుడు వీరి తండ్రి. కేరళలోని కొల్లి పట్టణం వీరి జన్మస్థలం. కులశేఖరాళ్వారును, శ్రీవైష్ణవులు మహావిష్ణువు యొక్క కౌస్తుభమణి అవతారంగా భావిస్తారు.వీరికి భగవంతుని గాథలన్నా, భక్తులన్నా చాలా ఇష్టం.నిరంతరం శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం చూడటానికి తాను శ్రీవారి ముంగిట గడుపుతూ స్వామివారిణి తనివితీరా చూసే భాగ్యం కలుగుతుందని పరితపించాడు. అందుకే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి గర్భాలయానికి ఉన్న గడపకు కులశేఖర పడి (గడప) అనే పేరు వచ్చింది.

ఈ ముకున్దమాలను నిత్యపారాయణం చేసే భక్తులకు ఎంతో శ్రేయస్సు కలుగుతుంది.ముకున్దుని కృపాకటాక్షం లభిస్తుంది. మరింకెందుకాలస్యం కానివ్వండి మరి.

ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినేదినే!
తమహం శిరసా వందే రాజానం కులశేఖరమ్!!

శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి
భక్తప్రియేతి భవలుణ్ఠన కోవిదేతి!
నాథేతి నాగాశయనేతి జగన్నివాసే
త్యాలాపనం ప్రతిపదం కురు మే ముకున్ద!! 1

ఓ శ్రీ కృష్ణా! శ్రీ వల్లభా!వరదా!దయాపరా!భక్తప్రియా!భవబంధాలను త్రెంపివైచే కోవిదుడా!నాథా!నాగశయనా!జగన్నివాసా!ఎల్లప్పుడూ నీ నామాలను ఆలపించేటట్లుగా చేయి స్వామీ!

జయతు జయతు దేవో దేవకీనందనో2యం
జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీప:!
జయతు జయతు మేఘశ్యామల: కోమలాంగో
జయతు జయతు పృథ్వీభారనాశో ముకున్ద:!! 2

దేవకీ కుమారుడైన దేవదేవునికి జయము జయము! వృష్ణివంశ ప్రదీపుడైన శ్రీ కృష్ణునికి జయము కలుగుగాక! మేఘశ్యామలుడు,కోమలాంగుడూ అయిన కృష్ణ భగవానునికి జయము జయము! భూమాత భారాన్ని తగ్గించడానికి అవతరించిన ముకుందునికి జయము జయము!

ముకున్ద మూర్ధ్నా ప్రణిపత్య యాచే
భవంతమేకాంతమియంతమర్దమ్!
అవిస్మృతి స్త్వ చ్చరణారవిన్దే
భవేభవే మే2స్తు భవత్ ప్రసాదాత్!! 3

ఓ ముకుందా! నీకు శిరసు వంచి నమస్కరిస్తూ యాచిస్తున్నాను.నా మీద దయవుంచి నా ఈ చిన్న విన్నపాన్ని అలకించు.నేను ఎన్ని జన్మలనెత్తినా నీ పాదారవిందాలపై నా మనస్సు నిలిచి ఉండేటట్లు నన్ను అనుగ్రహించు.

నాహం వందే తవ చరణయో:ద్వన్ద్వహేతో:
కుమ్భీపాకం గురుమపి హరే! నారకం నాపనేతుమ్!
రమ్యా రామా మృదుతనులతా నన్దనే నాపి రన్తుం
భావే భావే హృదయభవనే భావయేయం భవన్తమ్!! 4

స్వామీ! నిన్ను ఆశ్రయించిన వారి పాపాలను హరించే దయాళుడవు.అందువల్ల నేను నీకు నమస్కరించి యాచించేదేమంటే నాకే జన్మ లభించినా నీపై తలంపు కలిగేటట్లుగా అనుగ్రహించు. అలాంటి నీ భావన చేత ఎలాగైనా ఈ సంసార బంధాన్ని తప్పించుకోగలుగుతాను. నీపై తలంపు లేకపోతే ద్వంద్వ దుఃఖాలు తీరినా,కుంభీపాకాది నరకాలు తప్పినా,స్వర్గాది భోగాలు కలిగినా అవి ఆత్మకు శ్రేయోదాయకాలు కావు.

నాస్ధా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే
యద్య ద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపమ్!
ఏతత్ ప్రార్ధ్యం మమ బహుమతం జన్మజన్మాన్తరే2పి
త్వత్పాదామ్భోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు!! 5

ధర్మార్థకామాలపై నాకు కోరిక లేదు ,కామాలను భోగించాలనే అపేక్ష లేదు,ధనం కూడబెట్టాలనే ఆశ లేదు.నేను చేసుకున్న పూర్వ కర్మలననుసరించి ఎంత లభిస్తే అంతే చాలు. నేను నిన్ను అనేక విధాల స్తుతించి పొందగోరేదేమంటే ఎన్నెన్ని ఏయే జన్మలెత్తినా నీ పాదారవిందాలపై భక్తి స్థిరంగా నిలిచి ఉండటమే నా చాలా ఇష్టం.

దివి వా భువి వా మమాస్తు వాసో
నరకే వా నరకాన్తక! ప్రకామమ్!
అవధీరిత శారదారవిన్దౌ
చరణౌ తే మరణేపి చిన్తయాని!! 6

ఓ కృష్ణా! నా పూర్వ జన్మ కర్మ ఫలానుసారంగా నాకు స్వర్గలోక ప్రాప్తి కలిగినా,నరకలోక ప్రాప్తి కలిగినా లేదా భూమి మీద జన్మించినా,సుఖదుఃఖాలు ఎలా కలగాలో అవి అలాగే కలుగుతూ ఉండనీ.వాటిని గురించి నేను ఆలోచించడంలేదు.నా మరణ సమయంలో నీ పాదారవిందాలపై తలంపు కలిగి ఉండడమే నాకు పరమానందం. ఆ ఆనందాన్ని నాకు ప్రసాదించు.

కృష్ణ! త్వదీయ పదపంజ్ఞ్కజ పంజరాంతం
అద్వ్యైవ మే విశతు మానస రాజహంస: !
ప్రాణప్రయాణ సమయే కఫవాతపిత్తై:
కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే!! 7

స్వామీ! ఈ క్షణం నుంచి నా మనస్సనే రాజహంస నీ పాదాలనే పద్మాలలో లయించి ఉండేటట్లు దయచూడు. ఈ శరీరం నుండి ప్రాణాలు వెళ్ళిపోయే సమయంలో కఫవాతపిత్తాలతో కంఠము పూడుకుపోయినప్పుడు నీ నామ స్మరణకు ఎలా వీలవుతుంది? కాబట్టి ఇప్పటినుంఛే నీ స్మరణ కలుగజేయి.

చిన్తయామి హరిమేవ సన్తతం
మన్దమన్ద హసితాననామ్బుజమ్!
నందగోప తనయం పరాత్పరం
నారదాది మునిబృంద వందితమ్!! 8

చిరుమందహాస వదనారవిందుడు,నందగోపుని కుమారుడు,పరాత్పరుడు,నారదుడు మొదలైన మునిబృందాల ద్వారా సేవింపబడేవాడు అయిన శ్రీ హరిని స్మరిస్తున్నాను.

కరచరణ సరోజే కాంతిమన్నేత్రమీనే
శ్రమముషి భుజవీచివ్యాకులే2గాధమార్గే !
హరిసరసి విగాహ్యాపీయ తేజోజలౌఘం
భవమరుపరిఖిన్న: ఖేదమద్యత్యజామి!! 9

శ్రీహరి అనే సరస్సులో నేను మునకలేస్తున్నాను.తామరలు లాంటి ఆయన కరచరణాలు,మీనాలలాంటి కాంతి నిండిన నేత్రాలు,పెద్ద అలలులాంటి ఆయన భుజాలతో ఈ సరస్సు లోతు తెలియకుండా ఉంది.ఎప్పటినుంచో సంసారమనే మరుభూమిని జొచ్చి అన్ని దుఃఖాలను అనుభవిస్తున్న నాకు ఇప్పుడు శ్రీహరి అనే సరస్సు కనపడింది. అందులో మునగడంవల్ల నా తాపాలన్నీ తీరిపోయాయి.

సరసిజనయనే సశంఖచక్రే
మురభిధి మా విరమ స్వచిత్త! రన్తుమ్ !
సుఖతర మపరం న జాతు జానే
హరిచరణ స్మరణామృతేన తుల్యమ్!! 10

ఓ మనస్సా! శ్వేత తామరలలాంటి నయనాలు కలిగి శంఖ చక్రాలను ధరించి దివ్య మంగళ స్వరూపుడైన శ్రీ కృష్ణ భగవానుని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండు. ఎప్పటికీ ఆయన స్మరణ మానవద్దు. శ్రీహరి పాదపద్మాలను స్మరించడం అనే అమృతానికి సమానమైన సుఖం మరొకటి లేదు కదా!

మాభీర్మన్దమనో! విచిన్త్య బహుధా యామీశ్చిరం యాతనా:
నామీ న: ప్రభవన్తి పాపరిపవస్స్సామీ నను శ్రీధర:!
ఆలస్యం వ్యపనీయ భక్తిసులభం ధ్యాయస్య నారాయణం
లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమ: !! 11

మనసా! పాపాలను చేసానే ఇంక నేను నరకానికి పోయి నానా యాతనలూ అనుభవించాల్సిందే అంటూ నరక బాధలను గూర్చి ఎందుకు భయపడతావు? ఈ పాపాలన్నీ మనలను ఏమీ చేయలేవు.ఆలస్యం చేయక భక్త సులభుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చెయ్యి.సర్వలోక రక్షకుడైన ఆ శ్రీహరి మనలను తప్పకుండా రక్షిస్తాడు.ఆయనను ఎరుగనంత కాలం పాపాలు చేశాము.ఇక శ్రీహరిని ఆశ్రయించాము కాబట్టి మన పాపాలన్నీ నశించిపోతాయి.

భవజలధిగతానాం ద్వన్ద్వ వాతాహతానాం
సుత దుహితృ కళత్ర త్రాణభారార్ధితానామ్!
విషమవిషయతోయే మజ్జతామప్లవానాం
భవతు శరణమేకో విష్ణుపోతో నరాణామ్!! 12

సంసారమనే సముద్రంలో చిక్కి విరుద్ధ ధర్మములనే గాలిచే కొట్టబడి,భార్యాబిడ్డలు మున్నగువారిని పోషించడమనే బరువును మోస్తూ,విషయసుఖాలనే నీళ్ళలో మునిగి లేస్తూ,నావ లేకుండా నానా యాతనలకు గురి అవుతున్న నరులకు శ్రీమన్నారాయణుడనే నావ ఒక్కటే శరణ్యము.

భవజలధి మగాధం దుస్తరం నిస్తరేయం
కధ మహ మితి చేతో! మాస్మగా: కాతరత్వమ్!
సరసిజదృశి దేవే తావకీ భక్తిరేకా
నరకభిది నిషణ్ణా తారయిష్య త్యవశ్యమ్!! 13

దాటటానికి దుస్సాధ్యమై అగాధమైన ఈ సంసార సాగరాన్ని ఎలా దాటాలని కంగారుపడకు. శ్రీహరి పాదపద్మాలమీద స్థిరమైన భక్తిని అలవరచుకుంటే ఆ భక్తి ఒక్కటే నరక యాతనలనుంచి,సంసార సాగరం నుంచి రక్షిస్తుంది.

తృష్ణాతోయే మదనపవనోద్ధూత మోహోర్మిమాలే
దారా2వర్తే తనయ సహజగ్రాహ సంఘాకులే చ!
సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం నస్త్రిధామన్
పాదామ్భోజే వరద భవతో భక్తినావం ప్రయచ్చ !! 14

ఆశ్రయించినవారికి వరాలను ప్రసాదించే వరదరాజా! స్వర్గ,మర్త్య,పాతాళమనే ముల్లోకాలను వ్యాపించి ఉండే స్వామీ! ఆశ అనే జలము,కామమనే వాయువు,మోహమనే చిత్త బ్రంశము పొంగే అలలుగా ఉంటూ,భార్య అనే సుడిగుండము,పుత్రులు సోదరులనే మొసళ్ళ సమూహము కలవరపరచే సంసారమనే సముద్రంలో మునిగి ఉండేవారికి మీ పాదపద్మములపై భక్తియే ఓడయై తరింపజేస్తుందే కాని వేరొక మార్గం కానరాదు.

మాద్రాక్షం క్షీణపుణ్యాన్,క్షణమపి భవతో భక్తిహీనాన్ పదాబ్జే
మాశ్రౌషం శ్రావ్యబన్ధం తవ చరిత మపాస్యాన్యదాఖ్యాన జాతమ్!
మాస్మార్షం మాధవ!త్వామపి భువనపతే! చేతసా2పహ్నువానాన్
మాభూవం త్వత్ సపర్యా వ్యతికర రహితో జన్మజన్మాన్తరే2పి!! 15

ఓ మాధవా! నేను ఎన్ని జన్మలెత్తినా క్షీణపుణ్యులై నీ పాదపద్మాలపై భక్తిలేనివారిని చూడకుండేటట్లును,వినడానికి ఎంత సొంపుగా ఉన్నా నీ గుణగణాల వివరణలేని ఇతర కథలను వినకుండా ఉండేటట్లును,నిన్ను మనసులో ఎరుగని వారిని గురించి ఆలోచింపనట్లును,నీ పూజ చేయని వారిని చూడకుండేటట్లును అనుగ్రహించు.

జిహ్వే! కీర్తయ కేశవం మురరిపుం చేతో! భజ, శ్రీధరం
పాణిద్వన్ద్వ! సమర్చయా2చ్యుత కధా: శ్రోత్రద్వయ౧ త్వం శృణు!
కృష్ణం లోకయ లోచనద్వయ! హరేర్గచ్చాంఘ్రియుగ్మాలయం
జిఘ్ర ఘ్రాణ! ముకుందపాదతులసీం, మూర్ధన్! నమాధోక్షజమ్!! 16

ఓ నాలుకా! కేశవుని గుణగణాలనే కీర్తించు,మనసా భగవంతుని నిరంతరం స్మరణ చేయి,హస్తద్వయమా! శ్రీధరుని పూజించు,కర్ణ ద్వయమా అచ్యుతుని కథలను విను,నయనములారా శ్రీ కృష్ణుని దివ్య మంగళ రూపాన్ని చూడండి,పాదద్వయమా శ్రీహరి ఆలయానికి వెళ్లండి,ఓ నాసికా ముకుందుని పాదపద్మాలను అలంకరించి ఉన్న తులసిని ఆఘ్రాణించు,శిరసా శ్రీమన్నారాయణునికి నమస్కరించు.

హే లోకా శ్శృణుత ప్రసూతి మరణవ్యాధే శ్చికిత్సామిమాం
యోగజ్ఞా స్సముదాహరన్తి మునయో యాం యాజ్ఞవల్క్యదయ:!
అన్తర్జ్యోతి రమేయ మేక మమృతం కృష్ణాఖ్య మాపీయతాం
తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణ మాత్యన్తికమ్!! 17

మానవులారా! జనన మరణాలనే వ్యాధులు మిమ్ము బాధిస్తున్నాయి కదా!యాజ్ఞవల్క్యుడు మొదలైన ఋషులు తమ యోగ దృష్టితో పూర్వమే దీనికి చికిత్సను తెలుసుకున్నారు.ఆ చికిత్స ఏమిటో చెబుతాను వినండి. హృదయ కమలంలో స్వయంప్రకాశమై అప్రమేయమై విరాజిల్లుతున్న భగవంతుని సేవించండి. ఆ భగవంతుని నామామృతాన్ని పానం చేయండి.ఈ పరమౌషధాన్ని సేవిస్తే వ్యాధులన్నీ నశించి అపరిమితమైన ఆనందం చేకూరుతుంది.

హే మర్త్యా:! పరమం హిత శృణుత వో వక్ష్యామి సంక్షేపత:
సంసారార్ణవ మాపదూర్మిబహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితా:!
నానాజ్ఞాన మపాస్య చేతసి నమో నారాయణాయే త్యముం
మన్త్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయధ్వం ముహు: !! 18

ఓ మానవుల్లారా! ఆపదలనే అలలతో కూడిన సంసారసాగరాన్ని దాటడం దుర్లభం. అందువల్ల మీకు సర్వోత్తమమైన హితకర వాక్యాన్ని సంగ్రహంగా చెబుతాను. నానా విధాలైన అజ్ఞానాన్ని వదలి హృదయంలో ‘ఓం నమో నారాయణ’ అనే మంత్రాన్ని పలుమార్లు ఉచ్చరించండి. అదే మిమ్మల్ని సంసారసాగరం నుంచి తరింపజేస్తుంది.

పృధ్వీ రేణు,రణు: పయాంసి కణికా: ఫల్గు స్ఫులింగోనల:
తేజో, నిశ్వసనం మరుత్ తనుతరం రన్ద్రం సుసూక్ష్మం నభ:!
క్షుద్రా రుద్ర పితామహప్రభృతయ: కీటా స్సమస్తా స్సురా:
దృష్టే యత్ర స తావకో విజయతే భూమా2వధూతావధి:!! 19

హే భగవాన్! నీ వైభవం సమక్షంలో భూమి నలుసైన దుమ్ము,సముద్ర జలమంతా చిన్న బిందువు,తేజస్సంతా మిణుగురు,వాయువు నిశ్వాసము,ఆకాశము సూక్ష్మరంధ్రము,రుద్రుడు,బ్రహ్మ మొదలైన దేవతలు ఎంతో స్వల్పులుగా అగుపిస్తారు.నీ వైభవము అవాజ్ఞ్మనస గోచరము.

బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రై స్సరోమోద్గమై:
కంఠేన స్వరగద్గదేన నయనే నోద్గీర్ణ బాష్పాంబునా!
నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతా స్వాదినాం
అస్మాకం సరసీరుహాక్ష సతతం సమ్పద్యతాం జీవితమ్!! 20

ఓ పుండరీకాక్షా! మేము ఎల్లప్పుడూ మనస్సుతో నీ పాదారవిందాలను ధ్యానిస్తూ,ఆనందం అనుభవిస్తూ,చేతులు జోడించి,శిరస్సు వంచి నమస్కారం చేసేటట్లును,కంఠం గద్గదమయ్యేటట్లును,శరీరం పులకాంకితమై ఉండేటట్లును,కన్నులు ఆనందభాష్పాలతో నిండేటట్లును,మేము జీవించి ఉన్నంతకాలం ఎడతెగక ఇలానే జరిగేటట్లుగా అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను.

హే గోపాలక! హే కృపాజలనిధే౧ హే సింధుకన్యాపతే!
హే కంసాన్తక! హే గజేన్ద్ర కరుణాపారీణ! హే మాధవ! !
హే రామానుజ! హే జగత్త్రయగురో! హే పుండరీకాక్ష! మాం
హే గోపీజననాథ! పాలయ పరం జానామి న త్వాం వినా!! 21

ఓ గోపాలా! దయాసాగరా! లక్ష్మీపతే! కంసుని హతమార్చిన స్వామీ,గజేంద్రుని సంరక్షించిన మహాప్రభో,మాధవా,రామానుజా,త్రిలోకపూజిత గురువరేణ్యా,పద్మనేత్రుడా,గోపీజన వల్లభా! నన్ను రక్షించు.నిన్ను వినా నేను మరెవ్వరినీ ఎరుగను.

భక్తాపాయభుజంగగారుడమణి: త్త్రైలోక్యరక్షామణి:
గోపీలోచన చాతకామ్బుద మణి స్సౌందర్యముద్రామణి:!
య: కాన్తామణి రుక్మిణీఘనకుచ ద్వన్ద్వైకభూషామణి:
రేయో దేవ శిఖామణి ర్దిశతు నో గోపాలచూడామణి: !! 22

భక్తులను పాములలాంటి అపాయాలనుంచి రక్షించడంలో గరుడుని వంటివాడు,ముల్లోకాలను కాపాడునట్టివాడు,చాతక పక్షులలంటి గోపికల కన్నులను కారుమేఘం లాంటివాడు,సౌందర్యానికి ప్రతిరూపము,స్త్రీరత్నమైన రుక్మిణీదేవి కుచద్వయ మణిభూషణమైన ఏకైక మణి,దేవశిఖామణి,గోపాల చూడామణి మాకు శ్రేయస్సును ప్రసాదించి కాపాడుగాక!

శత్రుచ్చేదైకమన్త్రం సకలముపనిషద్వాక్య సమ్పూజ్య మన్త్రం
సంసారోత్తారమన్త్రం సముపచిత తమస్సంఘ నిర్యాణమన్త్రమ్!
సర్వైశ్వర్యైకమన్త్రం వ్యసనభుజగ సన్దష్ట సంన్త్రాణమన్త్రం
జిహ్వే! శ్రీకృష్ణమన్త్రం జపజప సతతం జన్మసాఫల్యమన్త్రమ్!! 23

శత్రువులను నాశనం చేసే ఏకైక మంత్రం,సకల ఉపనిషద్ వాక్యములచే పూజింపబడే మంత్రము,సంసారం నుంచి తరింపజేసే మంత్రము,అజ్ఞానమనే తమస్సును నశింపజేసే మంత్రము,సకల ఐశ్వర్యాలను ప్రసాదించే మంత్రము,దుర్వ్యసనములను నశింపజేసే మంత్రము,జన్మ సాఫల్యమును కలిగించే మంత్రము అయిన శ్రీ కృష్ణనామమనే మంత్రాన్ని ఓ నాలుకా! నీవు సదా జపించు.

వ్యామోహప్రశమౌషధం మునిమనోవృత్తి ప్రవృత్త్యౌషధం
దైత్యేన్ద్రార్తికరౌషధం త్రిజగతాం సంజీవనై కౌషధమ్!
భక్తాత్యన్త హితౌషధం భవభయ ప్రధ్వంసనైకౌషధం
శ్రేయ: ప్రాప్తికరౌషధం పిబ మన:శ్రీకృష్ణదివ్యౌషధమ్ 24

వ్యామోహాన్ని శమింపజేసే ఔషధము,మనోవృత్తులను నశింపచేసి స్థిమితాన్ని చేకూర్చే ఔషధము,రాక్షసులనే ఘోరవ్యాధులను తెగటార్చే ఔషధము,సంజీవిని అనే ఔషధంలా ముల్లోకాలను ఉజ్జీవింపచేసే ఔషధము,భక్తులకు అత్యంత హితాన్ని చేకూర్చే ఔషధము,సంసారమనే భయమును ధ్వంసం చేసే ఔషధము,శ్రేయస్సును ప్రసాదించే ఔషధము అయిన ‘శ్రీకృష్ణనామ’మనే దివ్యౌషధాన్ని ఓ మనసా!నీవు పానం చేయి.

ఆమ్నాయాభ్యసనా న్యరణ్యరుదితం వేదవ్రతా న్యన్వహం
మేద శ్చేద ఫలాని పూర్తవిధయ స్సర్వే హంతం భస్మని!
తీర్థానా మవగాహనాని చ గజస్నానం వినా యత్పద
ద్వన్ద్వామ్భోరుహ సంస్మృతీ ర్విజయతే దేవ స్సనారాయణ:!! 25

భగవంతుడైన శ్రీమన్నారాయణుని పాదపద్మాలపై స్మరణ లేకపోతే ఎన్ని వేదాలు చదివినా ప్రయోజనం లేదు.ఆ వేదాల్లో చెప్పబడిన కర్మలు ఎన్ని చేసినా ఫలం లభించదు.చెరువులు,బావులు త్రవ్వించడం,సత్రాలు కట్టించడంలాంతి పుణ్యకర్మలు చేసినా ఫలితముండదు,పుణ్యతీర్థాలలో స్నానం చేయడం బూడిదలో పోసిన హోమానికి సమమవుతుంది.ఏనుగు స్నానానంతరం తన దేహం మీద మట్టిని పోసుకున్నట్లు దైవచింతనలేని పుణ్యకర్మలన్నీ వ్యర్థమే అవుతాయి.

శ్రీమన్ నామ ప్రోచ్య నారాయణాఖ్యం
కే న ప్రాపుర్వాంచితం పాపినో2పి!
హా న: పూర్వం వాక్ ప్రవృత్తా న తస్మిన్
తేన ప్రాప్తం గర్భవాసాది దు:ఖమ్!! 26

ఎంత పాపం చేసిన వారైనప్పటికీ‘నారాయణ’అనే పవిత్రనామాన్ని స్మరిస్తే సకల శుభాలు పొందుతారు.కానీ నేను పూర్వం నా నోట ఆ నారాయణ మంత్రాన్ని ఉచ్చారణ చేయలేకపోయినందువల్లే నాకీ గర్భవాస దుఃఖం ప్రాప్తించింది.

మజ్జన్మన: ఫలమిదం మధుకైటభారే
మత్ ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ!
త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య
భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ!! 27

హే మధుకైటభ మర్దనా! నేను ఎలాంటి యోగ్యతా లేనివాణ్ణి కాబట్టి నీ పాదసేవ చేయటానికి అనర్హుడనయ్యాను.కానీ నీ సేవకవర్గంలో నన్ను కట్టకడపటివానిగానైనా నియమించు.ఈ మాత్రం దయ చూపించు. ఈ జన్మ ఎత్తినందుకు ఇదే సాఫల్యం.

నాథే న: పురుషోత్తమే,త్రిజగతా మేకాధిపే చేతసా
సేవ్యే స్వస్య పదస్య దాతారి సురే నారాయణే తిష్ఠతి!
యం కంచిత్ పురుషాధమం కతిపయ గ్రామేశ మల్పార్థదం
సేవాయై మృగయామహే నరమహో! మూకా వరాకా వయమ్!! 28

ముల్లోకాలకు అధిపతియైన పురుషోత్తముని మనస్సులో ధ్యానించినంతనే స్వస్థానాన్నే ఇవ్వటానికి సంసిద్ధంగా ఉంటున్న సర్వాంతర్యామియైన శ్రీమన్నారాయణుని భజింపక మందబుద్ధులు అవివేకులై అల్పుడైన దొరను వెతుక్కుంటూ వెళ్ళి అతని మెప్పును సంపాదించి అతడిచ్చే అల్ప ధనానికి ఆశపడి తమ జీవితాలను వ్యర్థం చేసుకుంటారు.

మదన! పరిహర స్థితిం మదీయే
మనసి ముకున్ద పదారవిన్ద ధామ్ని!
హరనయన కృశానునా కృశో2సి
స్మరసి న చక్రపరాక్రమం మురారే: !! 29

మన్మథుడా!భగవంతుని పాదారవిందాలను ధ్యానించు నా మనస్సులో మోహం కలిగించకు.హరుని కంటి మంటలకన్నా తీక్షణమైన నారాయణుని సుదర్శన చక్రం యొక్క శక్తిని నీ వెరుగకున్నావేమో!


తత్త్వం బ్రువాణాని పరం పరస్మాత్
మధు క్షరన్తీవ సతాం ఫలాని!
ప్రావర్తయ ప్రాంజలిరస్మి జిహ్వే!
నామాని నారాయణ గోచరాణి!! 30

ఓ నాలుకా! నీకు చేతులు జోడించి సర్వోత్తమమైన సత్యార్థాన్ని చెబుతాను విను.పుణ్యపురుషులకు జన్మ సాఫల్యాన్ని ప్రసాదించే మధురమైన భగవన్నామాన్ని ఎల్లప్పుడూ స్మరిస్త్తూ ఉండు.

ఇదం శరీరం పరిణామపేశలం
పత త్యవశ్యం శ్లథసంధి జర్ఘరమ్!
కిమౌషధై: క్లిశ్యసి మూఢ దుర్మతే
నిరామయం కృష్ణరసాయనం పిబ !! 31

ఓ మూఢుడా!దుర్మతీ! ఈ శరీరము అనేక సంధులు కలిగి స్వాభావికంగా దుర్భలమైంది.వయస్సు మళ్ళినప్పుడు మరింత దుర్భలమవుతుంది.వృద్ధావస్థలో కీళ్ళనొప్పుల లాంటి ఎన్నో రోగాలతో కృశించి నశించక తప్పదు.దీని చికిత్స కోసం ఎన్ని ఔషధాలు సేవించినా రోగమరణాలు లేకపోతాయా? అందువల్ల ఇలాంటి ఉపద్రవాలు లేకుండటానికి ‘శ్రీకృష్ణనామ’మనే ఉత్తమ ఔషధాన్ని పానం చేయి.

దారా వారాకరవరసుతా తే తనూజో విరించి:
స్తోతా వేదస్తవ సురగణో భృత్యవర్గ: ప్రసాద:!
ముక్తి,ర్మాయా జగదవికలం, తావకీ దేవకీ తే
మాతా,మిత్రం బలరిపుసుత, స్త్వయ్యతో2న్యం న జానే !! 32

స్వామీ!నీ భార్య లక్ష్మి అని,నీ పుత్రుడు బ్రహ్మ అని,నిన్ను స్తోత్రం చేసేవాడు వేదపురుషుడని,నీ సేవకులు దేవతలని,నీ అనుగ్రహం మోక్శమని,నీ మాయ సకల ప్రపంచమని,నీ తల్లి దేవకీదేవి అని,నీ మిత్రుడు అర్జునుడనీ ఇంతవరకే నాకు తెలుసు.

కృష్ణో రక్షతు నో జగత్త్రయగురు: కృష్ణం నమస్యామ్యహం
కృష్ణే నామర శత్రవో వినిహతా: కృష్ణాయ తస్మై నమ:!
కృష్ణా దేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసో2స్మ్యహం
కృష్ణే తిష్ఠతి సర్వ మేత దఖిలం హే కృష్ణ!సంరక్ష మామ్!! 33

ముల్లోకాలకు గురువైన శ్రీకృష్ణుడు మమ్ము రక్షించుగాక! నేను శ్రీకృష్ణపరమాత్మకు నమస్కరిస్తున్నాను.శ్రీకృష్ణుని వల్ల రాక్షసులు హతమార్చబడ్డారు.ఆ కృష్ణమూర్తికి నమస్కారము.శ్రీకృష్ణునివల్లే ఈ ముల్లోకాలూ రక్షింపబడుతున్నవి.నేను శ్రీకృష్ణదాసుడను.సర్వమూ శ్రీకృష్ణునిలోనే ఇమిడి ఉంది.హే కృష్ణా!నన్ను రక్షించు.

తత్త్వం ప్రసీద భగవన్! కురు మయ్యనాథే
విష్ణో! కృపాం పరమకారుణిక: కిల త్వమ్!
సంసార సాగరనిమగ్న మనన్త దీనం
ఉద్ధర్తు మర్హసి హరే! పురుషోత్తమో2సి!! 34

స్వామీ!అనంతమైన సంసారసాగరంలో మునిగి బాధపడుతున్న ఈ దీనుని కటాక్షించుము.పరమ కారుణ్యమూర్తివైన నీవు తప్ప నన్ను మరెవ్వరూ రక్షింపలేరని నిన్నే నమ్మి ఉన్నాను.పురుషోత్తముడివైన నీవే నన్ను ఆదుకోవాలి.

నమామి నారాయణ పాదపంకజం
కరోమి నారాయణ పూజనం సదా!
వదామి నారాయణ నామ నిర్మలం
స్మరామి నారాయణ తత్త్వ మవ్యయమ్ !! 35

నారాయణుని పాదపద్మాలకు వందనాలు సమర్పిస్తున్నాను.నారాయణుని చేతులారా పూజిస్తున్నాను.నిర్మలమైన నారాయణ నామమును చెబుతున్నాను.తరగని నారాయణ తత్వమును మనసులో ధ్యానిస్తున్నాను.

శ్రీనాథ! నారాయణ! వాసుదేవ!
శ్రీకృష్ణ! భక్తప్రియ! చక్రపాణే! !
శ్రీపద్మనాభా2చ్యుత! కైటభారే!
శ్రీరామ! పద్మాక్ష!హరే! మురారే! 36

శ్రీనాథా!నారాయణా!వాసుదేవా!శ్రీకృష్ణా!భక్తప్రియా!చక్రపాణీ!శ్రీపద్మనాభా!అచ్యుతా!కైటభారీ!శ్రీరామా!పద్మాక్షా!హరి!మురారి!

అనన్త! వైకుణ్ఠ!ముకుంద!కృష్ణ!
గోవిన్ద! దామోదర! మాధవేతి!
వక్తుం సమర్థో2పి న వక్తి కశ్చిత్
అహో జనానాం వ్యసనాభిముఖ్యమ్!! 37

అనంత వైకుంఠ ముకుంద కృష్ణ!గోవిందా!దామోదరా!మాధవా!ఇలా భగవంతుని పవిత్ర నామాలను ఉచ్చరించటానికి మానవులకు సామర్థ్యమున్నా మానవులెవ్వరూ అలా ఉచ్చరించలేకుండా పోవటం ఎంత దురదృష్టకరం.కేవలం స్మరణ మాత్రమున అభీష్టఫలాలు ప్రసాదించే భగవన్నామాన్ని విస్మరించి జనులు క్లేశకరములైన కార్యాలలో ఆసక్తులై,జూదం మొదలగు వ్యసనాలతో కాలం గడుపుతూ ఉండటం ఎంతో శోచనీయం.

ధ్యాయన్తి యే విష్ణు మనన్త మవ్యయం
హృత్పద్మమధ్యే సతతం వ్యవస్థితమ్!
సమాహితానాం సతతాభయప్రదం
తే యాన్తి సిద్ధిం పరమాంచ వైష్ణవీమ్!! 38

అనంతుడు,అవ్యయుడు,హృదయ పద్మములో సదా వెలసి ఉండేవాడు,స్థిరచిత్తులై ఉండేవారికి ఎల్లప్పుడూ అభయమిచ్చేవాడు అయిన శ్రీ మహావిష్ణువుని ఎవరు సదా ధ్యానం చేస్తారో వారికి ఆ భగవదనుగ్రహం వల్ల సకలాభీష్టసిద్ధి కలుగుతుంది.


క్షీరసాగరతరంగ శీకరాసార తారకిత చారుమూర్తయే!
భోగిభోగ శయనీయశాయినే మాధవాయ మధువిద్విషే నమ:!! 39

భగవంతుడు క్షీరసాగర మధ్యంలో ఆదిశేషుని మీద లక్ష్మీ సమేతుడై శయనించి ఉండగా క్షీరబిందువులు ఆ నల్లని దేహం మీద బడి ఆకాశంలో నక్షత్రాలలాగ ప్రకాశిస్తున్నాయి.

యస్య ప్రియౌ శ్రుతిధరౌ కవిలోకవీరౌ
మిత్రే ద్విజన్మవరపద్మ శరావభూతామ్!
తేనామ్భుజాక్ష చరణామ్బుజ షట్పదేన
రాజ్ఞా కృతా కృతిరియం కులశేఖరేణ!! 40

పూర్వం మలయాళ దేశంలో అనంతశయనమనే చోట కులశేఖరుడనే మహారాజు ఉండేవాడు.ఆయన చాలా భగవద్భక్తి సంపన్నుడు.ఆయన మిత్రులు ద్విజన్మవర,పద్మశరుడనే వారు సమస్త వేదాలను తెలిసినవారు.మహాకవులలో ఉత్తములు.అట్టి కులశేఖర మహారాజు ఈ ముకుందమాలా స్తోత్రం రచించారు.