Thursday, September 1, 2011

మిత్రులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు (ఆకాశంలో వినాయక నక్షత్రాలు)

ప్రణమ్య శిరసాదేవం గౌరిపుత్రం వినాయకమ్
భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్ధ సిద్దయేత్ !!



















అంబరంలో వినాయక నక్షత్రాలు

భాద్రపద శుద్ధ చవితినాడు మనం వినాయక చవితి వేడుకలను జరుపుకుంటాం. అయితే, అసలు చవితినాడు పండుగ ఎందుకు చేసుకుంటాం? ఆ రోజు వినాయకుడు గణాలకు నాధుడిగా నియమించబడ్డాడు. కనుక ఆ రోజు హిందూవులకు అతి పవిత్రమైన రోజు. విఘ్నేశ్వరుని పూజించి సేవిస్తారు. దీనికి ఇంకో కారణం కూడా ఉంది...! సూర్యోదయానికి ముందు తూర్పున ఏ నక్షత్రాలు ఉదయిస్తాయో ఆ నక్షత్రాలకు సంబంధించిన దేవుడి పండుగ జరుపుకోవాలనేది రుగ్వేదంలోని నియమం. కనుక భాద్రపద శుద్ధ చవితినాడు సూర్యోదయానికి ముందు తూర్పున వినాయక నక్షత్రాలు ఉదయిస్తాయి. కాబట్టి ఆ రోజు వినాయక చవితిగా భారత దేశంలోని హిందూవులు వేడుకలు జరుపుకుంటారు. అలాగే, గ్రహాల్లోకెల్లా ముఖ్యమైన గ్రహం శనిగ్రహం. శనీశ్వరుడి ప్రభావం మనకు తెలిసిందే. సకల దేవతలూ భయపడే శనీశ్వరుడు స్వయం రక్షణ కోసం వినాయక కవచాన్ని ధరిస్తాడట. వినాయకుని మహత్యం ఇంతా అంతా మరి..

పార్వతీ పరమేశ్వరుల కుమారులు విఘ్నేశ్వరుడు, కుమారస్వామి పెరిగి పెద్దవారయ్యారు. తన తర్వాత గణాలకు అధిపతిని నియమించే సమయం ఆసన్నమైందని ఈశ్వరుడు తలిచాడు. ఆ సమయంలో నేనే పెద్ద! అంటూ కుమారస్వామి అన్నగారిని తక్కువ చేసి మాట్లాడాడు. ఏనుగు తొండం ఉన్నవాడు అధిపతి ఎలా అవుతాడని ప్రశ్నించాడు. దీంతో కైలాసనాథుడు ఇద్దరు కుమారుల మధ్య ఓ పోటీ పెట్టాడు. భూలోకంలోని సమస్త పుణ్యతీర్థాలలో ముందుగా స్నానమాచరించి ఎవరు కైలాసానికి చేరుకుంటారో వారికే పట్టం కడతానని మహేశుడు చెప్పాడు. దీంతో వాయువేగంతో నెమలి వాహనంపై కుమారస్వామి బయలుదేరి వెళ్లాడు. తన మూషిక వాహనంపై వెళ్లి ఎలా విజయం సాధించగలనని విఘ్నేశ్వరుడు చింతాక్రాంతుడయ్యాడు. తల్లిదండ్రులే దైవమని భావించి వారి చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేయసాగాడు. అచట స్నానానికి వెళ్లిన కుమారస్వామికి అన్నయ్య స్నానం పూర్తి చేసుకుని ఎదురు రావడం కనిపించింది. దీనితో అన్నగారి మహత్యం తెలుసుకున్న కుమారస్వామి వినాయకుడే పట్టానికి అర్హుడని భక్తితో తండ్రికి తెలిపాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు శివుడు గణాలకు నాయకుడిగా విఘ్నేశ్వరుని నియమించాడు. అప్పటినుంచీ ఆయనకు గణనాధుడు, గణేశుడు అని పేర్లు వచ్చాయి.

వినాయక చవితి నాడు చేసే పూజలో కీలకమైనది 21 ప్రతాలతో చేసే పూజ. ఈ పూజ చేయడం ద్వారా కష్టాలు తొలగిపోయి అషై్టశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ పూజలో ముఖ్యమైనది గరిక. గరిక అంటే స్వామి వారికి ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. దీనిని దూర్వా పత్రమని అంటారు. ఇందులో తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలు ఉంటాయి. తర్వాతది మాచీపత్రం అంటే చేమంతి జాతికి చెందిన ఆకులు. ఈ ఆకులు సువాసన భరితంగా ఉంటాయి. తర్వాతి పత్రం అపామార్గ పత్రాలు. ఇవి గుండ్రంగా ఉంటాయి. దీనినే తెలుగులో ఉత్తరేణి అని అంటారు. వీటితో పాటు బృహతీ పత్రం, దీన్నే ములక అని అంటారు. వీటిలో చిన్న ములక, పెద్ద ములకలు అని రెండు రకాలు ఉన్నాయి. దుత్తూర పత్రం, అంటే ఉమ్మెత్త ఆకులు. వంకాయ జాతికి చెందిన చెట్లు ఇవి. తులసీ పత్రం, ఈ పత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పేదీ ఏమీ లేదు. దేవతార్చనలో వాడే ఈ పత్రాలు మంగళదాయకమైనవి. శమీపత్రం, జమ్మిచెట్టు ఆకులను శమీపత్రాలు అంటారు. దసరా సమయంలో ఈ చెట్టుకు భక్తులు విశిష్ట పూజలు నిర్వహిస్తారు. మరువక పత్రం, వీటినే ధవనం, మరువం అని కూడా అంటారు. పూల మాలల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. కరవీర పత్రం, ఈ పత్రాలను గన్నేరు పత్రాలని కూడా అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు ఇలా వివిధ రంగుల్లో ఈ పూలు ఉంటాయి. బిల్వ పత్రం, ఈ పత్రాలను మారెడు దళాలని అంటారు. మూడు ఆకులు కలిసి ఉండే దీనిని దళం అంటారు. వీటితో శివుడిని పూజిస్తే చాలా మంచిది. చూత పత్రం, ఇవే మామిడి ఆకులు.
దరీ పత్రం, బదరీ అంటే రేగాకులు. రేగి కాయ చెట్టుకు ఉండే ఆకులు ఇవి. వీటిలో రేగు, జిట్రేగు, గంగిరేగు అని మూడు రకాలు ఉంటాయి. గుండ్రంగా ఉండే ఆకులను పూజకు ఉపయోగించాలి. విష్ణుక్రాంత పత్రం, తెలుపు, నీలం రంగు పులుండే చెట్లు ఇవి. నీలం రంగు పులు ఉండే చెట్టును విష్ణుక్రాంత చెట్టుగా పిలుస్తారు. సింధువార పత్రం, దీన్నే వావిలి అని కూడా పిలుస్తుంటారు. అశ్వత్థ పత్రం, ఇవే రావి ఆకులు. దాడిమీ పత్రం దాడిమీ అంటే దానిమ్మ. దానిమ్మ ఆకులతో విఘ్నేశ్వరుని పూజిస్తారు. జాజి పత్రం, ఇవి మల్లి జాతికి చెందిన ఓ రకమైన మొక్కలు. అర్క పత్రం, ఇవే జిల్లేడు ఆకులు. వీటిలో రెండు రకాలు ఉంటాయి. తెల్ల జిల్లేడు, పచ్చ జిల్లేడు. వీటిలో ఏవైనా పూజకు శ్రేష్టమైనవే. అర్జున పత్రం, మద్దిచెట్టు ఆకులను అర్జున పత్రం అంటారు. మర్రి ఆకుల వలె ఇవి ఉంటాయి. దేవదారు పత్రం, దేవతలకు ఈ పత్రం అంటే చాలా ఇష్టం. ఇవి సన్నగా గడ్డిలా ఉంటాయి. గండలీ పత్రం, దీనినే లతాదూర్వా అని కూడా అంటారు. భూమిపైన తీగలాగా ఆ చెట్టు పెరుగుతుంది


Ganesh Ji Graphic

!!! మా బొజ్జా గణపయ్యా!!!

మా బొజ్జా గణపయ్యా
మా ఇంటికి రావయ్యా
ఉండ్రాళ్ళూ..లడ్డూలూ
చేసామూ తినవయ్యా
రా..వయ్యా..

పిల్లలమూ పెద్దలమూ నిన్నే పూజించేమయ్యా
నీవె మా దిక్కంటూ గుంజీళ్ళూ తీసేమయ్యా
మూషికా వాహనా మరువకుండ..రా..వయ్యా..

మా బొజ్జా గణపయ్యా
మా ఇంటికి రావయ్యా
ఉండ్రాళ్ళూ..లడ్డూలూ
చేసామూ తినవయ్యా
రా..వయ్యా..

మా శక్తి కొద్ది మేమంతా నిన్నే మొక్కేమయ్యా
విఘ్నాలు లేని బ్రతుకు మాకు ఇయ్యవయ్యా
విఘ్నరాజా నువ్వూ వెంటనే..రా..వయ్యా..

మా బొజ్జా గణపయ్యా
మా ఇంటికి రావయ్యా
ఉండ్రాళ్ళూ..లడ్డూలూ
చేసామూ తినవయ్యా
రా..వయ్యా..

!!! ఓం నమో శివ పుత్రాయ !!!

ఓం నమో శివ పుత్రాయ
ఓం నమో గజ ముఖాయ
ఓం నమో గుణ నాగాభరణాయ
ప్రదమాయ..బుద్ది సిద్ది ఇత్యాది వరప్రసాదాయ
ఓం నమో గజకర్ణాయ
ఓం నమో సుందరాంగాయ
ఓం నమో పార్వతి నందనాయ
శివప్రియాయ..దేవ..మానవ ఇత్యాది పూజితాయ
వినాయకాయ నమోస్తుతే.