!!! వరలక్ష్మీ వ్రతకల్పము !!!
!!! వరలక్ష్మి పూజ విధానం !!!
శ్రీ మహాగణాధిపతయే నమః
అమ్మలగన్న అమ్మ మాయమ్మను ఏ నామముతో
పిలిచినా ఏ విధంగా తలచినా వేంటనే దర్శనమిచ్చే
దయాస్వరూపిణి.
ఆ తల్లి వరాలు ఇచ్చే వరలక్ష్మీ దేవి.
ఆ చల్లని తల్లి దీవెనలతో
చిరకాలం ముత్తైదువుగా వుండాలని
ఆ జగజ్జననిని కొలిచి
ఆ శక్తిస్వరూపిణి దయకు పాత్రులమై
చిరకాలం ఆనందంగా వుండాలనేదే మన అందరి కోరిక.
కొలిచేకొద్దీ రక్తినీ,శక్తినీ,భక్తినీ మోక్షన్నీ ప్రసాదించే ఆ తల్లి
అనురాగకల్పవల్లి .
దండిగా,నిండుగా విద్యా,ఉద్యోగ వౄత్తి వ్యాపార,పదవీలను
సుఖ శాంతి సంతోషాలను సమస్త సంపదలను కురిపించే చల్లని తల్లి.
ఈ వరలక్ష్మీ పూజని భక్తి శ్రద్ధలతో మనమందరం కొలిచి ముక్తిని పొంది
సౌభాగ్యవతులుగా వుండాలని ఆ పరమేశ్వరిని వేడుకొందాం.
ఆ తల్లిని కొలిచే నేను ఈనాడు సంతోషముతో
ఆనందంగా ఏదానికి కొదవలేకుండగా వున్నాను
మీరూ అమ్మను నమ్మి భక్తి శ్రధలతో పూజచేసి
ఆ తల్లి దీవెనలు అందుకొని సంతోషంగా వుండండీ అని నా ప్రాథన!__/\__
ముందు పూజకు ఏమేమి చేసుకోవాలో చూద్దామా :)
ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుబ్రం చేసి అలికి బియ్యంపిండితో గాని ముగ్గుపిండితో గాని ముగ్గులుపెట్టి,దైవస్తాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి.పీట మరీ ఎత్తుగా గాని,మరీ పల్లముగా గాని వుండకూడదు. పిదప ఆపీటనుకూడ చక్కగా పసుపురాసి,కుంకుమబొట్టు పెట్టి పసుపుతో గాని,బియ్యంపిండితో గాని ముగ్గువేయాలి.
కమలాలు వచ్చేటట్లు ముగ్గుపెడితే మరీ మంచిది.పూజ చేసే వారు తూర్పుముఖంగా కూర్చోవాలి. ఏదైవాన్ని పూజించబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమగాని,విగ్రహము గాని చిత్రపఠము గాని ఆ పీటపై పెట్టాలి.
ముందు పసుపుతో గణపతిని తయారుచేసి(పసుపును సుమారు అంగుళంసైజులో త్రికోణ ఆకౄతిలో ముద్దగాచేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి పిదప ఒక పళ్ళెములో గాని,కొత్త తుండుగుడ్డపై గాని బియ్యం పోసి దానిపై ఒక తమలపాకునుంచి, అందు పసుపు గణపతిని వుంచి అగరవత్తులు వెలిగించీగరవత్తులు వెలిగించాలి.(ఏదేవుణ్ణి కొలిచినగాని ముందు గణపతిని పూజించి ఆ పిమ్మట మనము అనుకొన్న దేవిగాని,దేవుడుగాని పూజించవలెను.)
!! పూజకు కావలసిన వస్తువులు !!
దీపారాధన చేయుటకు కుంది,(ప్రమిద)వెండిదిగాని,ఇత్తడిగాని,మట్టిదిగాని,వాడవచ్చును.
కుందిలో 3అడ్డవత్తులు,1కుంభవత్తి(మధ్యలో)వేసి
నూనెతో తడపవలెను.
ఇంకొక అడ్డవత్తి నూనెలో తడిపి ఏక హారతిలో వేసి ముందుగా ఏకహారతిలో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి,వెలిగించిన వత్తితో కుందిలోని 1అడ్డవత్తి,1కుంభవత్తి వెలిగించాలి.
తర్వాత చేయ్యి కడుక్కొని నూనె కుంది నిండుగా వేసి పిదప ఆ కుందికి మూడుచోట్ల కుంకుమపెట్టి, అక్షంతలువేసి,దీపారాధనను లక్ష్మీస్వరూపంగా భావించి నమస్కారము చేయవలెను.
కుందిలోని మిగిలిన 2 అడ్డవత్తులు పూజాసమయంలో ధూపము చూపిన తరువాత,దీపము చూపించుటకు వాడవలెను.
నువ్వులనూనెగాని,ఆవునెయ్యిగాని,కొబ్బరనూనెగాని
వాడవచ్చును.
మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోని నీళ్ళు దేవునుపూజకు వాదరాదు.
పూజకు విడిగా ఒకగ్లాసుగాని,చెంబుగాని,చిన్న పంచపాత్రగాని తీసుకొని దానిలో శుధజలము పోసి,ఆ చెంబునకు కలశరాధనచేసి ఆ నీళ్ళు మాత్రమే దేవునిపూజకు ఉపయోగించవలెను.
శక్త్యనుసారంగా వెండిగాని,బంగారుగాని,ఇత్తడిగాని చిత్రపటము, వరలక్ష్మిని కొందరు కొబ్బరకాయకు పసుపుపూసి బొట్టుపెట్టి కలశంపైపెట్టి పూజిస్తారు.
మరికొందరు ఈ విధంగాచేసి పూజిస్తారు.
కొబ్బరకాయకు పీచుతీసి కాయనుబాగా పీచులెకుండగా గీకి,నున్నగాచేసి తొడిమనుపైకి వచ్చెలా వుంచుకొని,
పసుపురాసి,గోధుమ,మైదా,లేదా పసుపుముద్దతో చేసిన ముక్కు,చెవులు,అమర్చి,కాటుకను కళ్ళుకనుబొమ్మలను గీసి,
కళ్ళలోపల నానబెట్టినసుద్దముక్కతో తెలుపురంగు గీసి,మరల కనుపాపకుకాటుకనుమధ్యలో గుండ్రంగాపెట్టి,నోరు తిలకముతోగాని,లిప్ష్టిక్,తోగాని పెట్టి
ఈ బొమ్మను పెద్ద చెంబుపై గాని,బిందెపై గాని,అమర్చుతారు.
కొత్తజాకెట్ గుడ్డను త్రిభుజాకారంలో మడచి పైన తొడిమకు తొడుగుతారు.
కొత్త చీరనుకట్టి,ఆభరణాలతో అలంకరించి ఆ ప్రతిమను
వరలక్ష్మిదేవిగా భావిస్తారు.
!! పూజకు కావలసిన వస్తువులు !!
1)ధూపమునకు సాంబ్రాణీ
2)దీపారాధనకు అగరుబత్తి
3)కుందులు,అగ్గిపెట్టె,ఆవునెయ్యి
4)పత్తితో చేసిన వత్తులు
5)అక్షతలు(పసుపుతోకలిపినవి కొద్దిగా)
6)పసుపు,కుంకుమ,పువ్వులు,గంధం,హారతి కర్పూరము.
7)పళ్ళు,కొబ్బరికాయలు
8)తోరములు(దారమును 9 వరసలుగాతీసి పసుపురాసి
తొమ్మిది చోట్ల పువ్వులతో 9 ముడులువేసి సిధముగా వుంచుకొనవలెను.)
9)నివేదనకు,స్త్రీదేవతా రాధనకు ప్రత్యేకంగా చలిమిడి
(బియ్యంపిండి,బెల్లం తో చేస్తారు
)
10)పానకం,(శుధమైన నీటిలో బెల్లంపొడి,ఏలక్కాయపొడి,మిరియాలపొడి కొద్దిగా కలుపుతారు)
11)మహా నైవేద్యం కొరకు,మంచి భక్ష్యములతో కూడిన భోజనము, 9 రకాల పిండివంటలను తయారుచేసి,నైవెద్యం పెట్టిన తరువాత అన్నీ రకాల పిండివంటలను 9 చొప్పున
పళ్ళెములో వుంచి,దానిపై తోరమును,తాంబూలము,తమలపాకులు,వక్క,పండ్లు,పువ్వులు,పెట్టి
ముత్తైదువునకు వాయనము ఇవ్వవలెను.శక్తి వున్నవారు చీరకూడ పెట్టవచ్చును.వ్రతము పూర్తి అయిన తరువాత
ఆరోజు సాయంత్రము మీ వీలునుబట్టి 4 ముత్తైదువులను పిలిచి
తాంబూలము ఇస్తారు. ఇవన్నియు అమర్చుకొనిన తరువాత పూజకు
సిద్ధముచేసుకొనిన పిమ్మట యజమానులు(పూజ చేసే వారు)
ఈ క్రింద కేశవనామాలను స్మరిస్తూ ఆచమనం చెయ్యాలి.
ఈ నామములు మొత్తం 24 కలవు.
!! పూజ ప్రారంభం !!
1)ఓం కేశవాయస్వహా'..అని చెప్పుకొని చేతిలో నీరు తీసుకొని
లోనికి తీసుకోవాలి.
2)ఓం నారాయణస్వాహా...'అనుకొని రెండోసారి
3)ఓం మాధవాయస్వాహా'...అనుకొని మూడోసారి జలమును తీసుకోవలెను.
4)ఓం గోవిందాయ నమః'...అని చేతులు కడుక్కోవాలి.
5)విష్ణవే నమః'...అనుకొంటూ నీళ్ళుతాగి,మధ్యవ్రేలు,బొటనవ్రేళ్ళతో కళ్ళు తుడుచుకొనవలెను.
6)ఓం మధుసూదనాయ నమః'...అని పై పెదవిని కుడినుంచి,
ఎడమకి నిమురుకోవాలి.
7)ఓం త్రివిక్రమాయ నమః'...క్రింది పెదవిని కుడినుండి,ఎడమకి
నిమురుకోవాలి.
8)ఓం వామనాయ నమః, ..
9)ఓం శ్రీధరాయ నమః ... ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచం నీళ్ళు చల్లుకోవాలి.
10)ఓం హౄషికేశాయ నమః ...ఎడమచేతిలో నీళ్ళు చల్లాలి.
11)ఓం పద్మనాభాయ నమః ... పాదాలపై ఒక్కొక్క చుక్కజలము చల్లుకోవాలి.
12) ఓం దామోదరాయ నమః ... శిరస్సుపైజలమును ప్రోక్షించుకోవాలి.
13)ఓం సంకర్షణాయ నమః ... చేతి వ్రేళ్ళు గిన్నెలా వుంచి
గడ్డము తుడుచుకోవాలి.
14)ఓం వాసుదేవాయ నమః ... వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకోవలెను.
15)ఓం ప్రద్యుమ్నాయ నమః ...
16)ఓం అనిరుద్దాయ నమః ... నేత్రాలు తాకవలెను.
17)ఓం పురుషోత్తమాయ నమః.
18)ఓం అధోక్షజాయ నమః ... రెండు చెవులూ తాకవలెను.
19)నారసింహాయ నమః...
20)ఓం అచ్యుతాయ నమః ... బొడ్డును స్పౄశించ వలెను.
21)జనార్ధనాయ నమః ... చేతి వ్రేళ్ళతో వక్షస్థలం,(హౄదయం)తాకవలెను.
22)ఓం ఉపేంద్రాయ నమః ...చేతి కొనతో శిరస్సు తాకవలెను.
23)ఓం హరయే నమః ..
24)ఓం శ్రీకృష్ణాయ నమః ...కుడిమూపురమును ఎడమచేతితోనూ,
ఎడమ మూపురము కుడి చేతి
ఆచమనము చేసిన తరువాత వేంటనే సంకల్పము చెప్పుకోవలెను.
ఆచమనము అయిన తరువాత, కొంచం నీరు చేతిలో పోసుకొని
నేలపై చిలకరించుతూ ఈ శ్లోకము పఠించవలెను.
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమికారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే !!
ప్రాణాయామమ్యః ::- ఓంభూః - ఓం భువః - ఓం సువః - ఓం మహః - ఓం జనః - ఓం తపః
ఓగ్ ఒ సత్యం - ఓం తత్ నవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ ధీయోయోనః ప్రచోదయాత్ -ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువ స్సువరోం -- అని సంకల్పము చెప్పుకొనచలెను.
సంకల్పము::-మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
శుభే శోభనముహుర్తే ఆద్య బ్రహ్మణః (ఇక్కడ ఏదేవుడినైతే పూజిస్తామూ ఆదేవుని పేరు,దేవీ పేరు చెప్పుకొనవలెను)
ద్వితీయపరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో ర్దక్షణదిగ్భాంగే శ్రీశైలస్య ఈశాన్య
ప్రదేశే కృఇష్ణా గోదావరి మధ్యప్రదేశే,శోభనగౄహే(అద్దె ఇల్లు అయినచో ,వసతి గ్రుహే అనియు,సొంత ఇల్లైనచో స్వగౄహే అనియు చెప్పుకొనవలెను )సమస్తదేవతాభ్రాహ్మణ హరిహర సన్నిదౌ అస్మిన్ వర్తమానే వ్యవహారిక చాంద్ర మానేన......సంవత్సరే,(ఇక్కడ తెలుగు సంవత్సరము అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగుచున్నదో ఆ సంవత్సరము యొక్క పేరును చెప్పుకోవలిను), ......ఆయనే,(సంవత్సరమునకు 2 ఆయనములు - ఉత్తరాయణం,దక్షణాయనము.జనవరి 15 మకర సంక్రమణం మొదలు జులై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణం , జులై 15 కర్కాటక సంక్రమణం నుండి మరల జనవరి 14 పెద్దపండుగ అనగా మకర సంక్రమణం వరకు దక్షణాయణం, పూజ చేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను.) .....ఋతుః,(వసంత,గీస్మ,వర్ష మొదలగు ఋతువులలో పూజసమయంలో జరుగుచున్న ఋతువుపేరు.)....మాసే,(చైత్ర,వైశాఖ మొదలు 12 మాసములలో
పూజసమయములో జరుగుచున్న మాసంపేరు.)....పక్షే,(నెలకురెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్లపక్షము, అమవాస్యకుముందు
కృష్ణపక్షములు,వీటిలో పూజ జరుగుతున్న సమయమున
గల పక్షము పేరు)....తిథౌ,(ఆ రోజు తిథి)...వాసరే,(ఆరోజు ఏవారమైనదీ చెప్పుకొని)
శుభ నక్షత్రే, శుభయోగే,శుభ కరణే,ఏవంగుణ
విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమౌపాత్త సమస్త
దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య,శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం 'పురుషులైనచూ శ్రీమాన్....గోత్రస్య....నామధేయః,శ్రీమత్యః,గోత్రస్య,నామధేయస్య అనియు,
స్త్రీలైనచో శ్రీమతి,గోత్రవతి,నామధేయవతి,శ్రీమత్యాః,గోత్రవత్యాః,నామధేయవత్యాః,
అనియు(పూజ చేయువారి గోత్రము,నామము చెప్పి)నామధేయస్యః ధర్మపత్నీ సమేతస్య(పురుషులైనచో)మమ సహకుటుంబస్య,క్షేమ,స్థైర్య ,వీర్య,విజయ,అభయ,ఆయురారోగ్య,ఐశ్వర్యాభివౄధ్యార్థం,పుత్రపౌత్రాభివౄధ్యార్థం,మమధర్మార్థ,కామమోక్ష,చతుర్విధ,ఫలపురుషార్థం,సర్వ్వాభీష్ట సిధార్థం,అని(స్త్రీలు మాత్రము పూజ చేసుకొనునప్పుడు)అఖండితసర్వవిధసుఖసౌభాగ్య,సంతతి ఆయుఃఆరోగ్య,ఐశ్వార్యాఃఅభి వౄధ్యార్థం,అని(దంపతులు కూర్చోని చేసుకొన్నప్పుడు)శ్రీవరలక్ష్మీ దేవతా ముద్దస్య వరలక్ష్మీ దేవతా ప్రీతార్థం(ఏ దేవుని పూజించు చున్నామో ఆ దేవుని పేరు చెప్పుకొని)కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి(నాకు తోచిన రీతిలో,నాకు తోచిన నియమముతో,నాకు తోచిన విధముగా శక్తానుసారముగా,భక్తి,శ్రధలతో,సమర్పించుకొంటున్న పూజ)ధ్యానావాహనాది షోడోపచార పూజాం కరిష్యే .తద్ధంగ కలశపూజాం కరిష్యే.
పిదప కలశారాధనను చేయవలెను.
కలశ పూజ:::-
వెండి,రాగి,లేక కంచు గ్లాసులు లేదా పంచపాత్ర,రెండింటిలో శుధ జలము తీసుకొని ఒక దానియందు ఉద్దారిణి,రెండవదానియందు అక్షంతలు,తమలపాకు,పువ్వు,ఉంచుకొనవలెను.రెండవ పాత్రకు బయట 3 వైపులా గంధం పూసి కుంకుమను పెట్టవలెను.(ఇలా గంధం పూసేటప్పుడు గ్లాసును గుండ్రంగా తిప్పరాదు,గంధమును ఉంగరపు వేలితో పూయవలెను.కుంకుమ,అక్షంతలు,వగైరా,బొటన,మధ్య,ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించవలెను.)యజమానులు(ఒకరైతే ఒకరు,దంపతులైతె ఇద్దరూను.)ఆ కలశాన్ని కుడిచేతితో మూసివుంచి,ఇలా అనుకోవాలి.ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదువవలెను.
మం::--కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్శ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మౄతాః
ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
శ్లో::--గంగైచ యమునేచైవ గోదావరి,సరస్వతీ,నర్మదా,సింధు,కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు
ఈ శ్లోకాన్ని చదువుకొని ఈ క్రిందవిధగా పూజించాలి.
ఏవం కలశ పూజాం కుర్యాత్ పూజార్థం మమ దురితక్షయకారకాః
కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య(కలశమందలి నీళ్ళు దేవునిపై చల్లాలి.)ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆనీటిని మన తలపై చల్లుకోవాలి.)ఓం పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య్(పూజాద్రవ్యములపైకూడాచల్లాలి)కలశ మందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతోగాని,ఆకుతోగాని చల్లాలి.
శ్లో::--ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగ తో పివా
యస్స్మరేత్పుండరీకాక్షం సభాహ్యాభ్యంతరశ్శుచిః
అని పిదప కొద్దిగ అక్షంతలు,కుంకుమ,పసుపు వరలక్ష్మీదేవిపైవేసి,ఆమెను తాకి నమస్కరించాలి.
ప్రార్థన::శ్లో::- పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే
నారాయణప్రియే దేవి సుప్రితాభవసర్వదా
(శ్రీవరలక్ష్మీదేవతాయైనమః ప్రాథనా నమస్కారం సమర్పయామి)
ధ్యానం::శ్లో::-- క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే
సుస్థిరాభవమేగేహే సురాసుర నమస్కౄతే
(శ్రీవరలక్ష్మీదేవతాయైనమ@ధ్యానం సమర్పయామి)
అని ఆదేవిని మనస్పూర్తిగా ధ్యానించాలి.
ఆవాహనం::శ్లో::-- సర్వమంగళ మాంగల్యే విష్ణువక్షఃస్థలాలయే
ఆవాహయామిదేవి త్వాం సుప్రీతాభవసర్వదా
(శ్రీవరలక్ష్మీదేవతాయైనమః ఆవాహయామి అని దేవిని మనసారా స్వాగతం పలుకుతున్నట్లుగా తలచి ఆహ్వానించాలి,నమస్కరించాలి.)
ఆసనం::శ్లో::-- సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్నవిభుషితే
సింహాసనమిదం దేవీ స్వీయతాం సురపూజితే
(శ్రీవరలక్ష్మీదేవతాయైనమః ఆసనం సమర్పయామి,కుర్చోమన్నట్లు ఆసనం చూపి పసుపు,కుంకుమ,పూలు,అక్షంతలు దేవిపై చల్లావలెను)
పాద్యం::శ్లో::-- సువాసిత జలం రమ్య సర్వతీర్థం సముద్భవం,
పాద్యం గృహాణదేవీ త్వం సర్వదేవ నమస్కృతే
(శ్రీవరలక్ష్మీదేవతాం పాద్యం సమర్పయామి అని కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళు ఇస్తున్నట్లు భావించిఉద్దరిణితో పంచపారలోని జలమును వరలక్మీదేవిపై చల్లి,రెండు చుక్కల జలము వేరొక పార్తలోనికి వదలవలెను)
అర్ఘ్యం::శ్లో::- శుద్ధోదకంచ పాత్ర స్థంగంధ పుష్పాది మిశ్రితం,
అర్ఘ్యం దాస్యామి తే దేవీ గృహాణ సురపూజితే
(శ్రీవరలక్ష్మీ దేవతాం అర్ఘ్యం సమర్పయామి.అని చేతులు కడుగుకొనుటకుకూడా నీరు ఇచ్చు చున్నట్లు భావిస్తూ పంచపాత్ర లోని జలమును పువ్వుతో వరలక్ష్మీదేవిపై చల్లి,అర్ఘ్యంపాత్రలో రెండుచుక్కలు వదలవలెను)
ఆచమనీయం::శ్లో::- సువర్ణ కలశానీతం చందనాగరు సమ్యుతం,
గృహాణచమనందేవిమయాదత్తం శుభప్రదే
(వరలక్ష్నీదేవతాం ఆచమనీయం సమర్పయామి.అని దేవిముఖమునుశుబ్రము చేసుకొనుటకు నీరు ఇచ్చునట్లు భావిస్తూ జలమును వేరొక పాత్రలోనికి వదలవలెను.)
పంచామృత స్నానం::శ్లో::- పయోదధీఘృతోపేతం శర్కరా మధుసంయుతం,
పంచామృతస్నాన మిదం గృహాణ కమలాలయే
(శ్రీవరలక్ష్మీదేవతాం పంచామృతస్నానం సమర్పయామి. అని స్నానమునకు పంచామౄతములతో కూడిన నీరు ఇచ్చినట్లు భావించి,ఆవునెయ్యి,ఆవుపాలు,ఆవుపెరుగు,తేనె,పంచదార కలిపిన పంచామౄతమును దేవిపై ఉద్దరిణితో చల్లవలెను.)
శుద్ధోదకస్నానం:శ్లో::- గంగాజలం మయానీతం మహాదేవ శిరఃస్థితం,
శుద్దోదకమిదంస్నానం గృహాణవిధుసోదరీ
(శ్రీ వరలక్ష్మీదేవతాం శుద్ధోదకస్నానం సమర్పయామి.అని పంచపాత్రలోని శుద్ధమైన నీటినిపువ్వుతో దేవిపై చల్లవలెను.)
వస్త్ర యుగ్మం:శ్లో::-సురార్చితాం ఘ్రియుగళే దుకూలవసనప్రియే,
వస్త్ర్యుగ్మం ప్రదాస్యామి గృహాణ హరి వల్లభే
(శ్రీ వరలక్ష్మీదేవతాం వస్త్రయుగ్మం సమర్పయామి.
పట్టులేదాశక్తికి తగిన వస్త్రమును దేవికీస్తున్నట్లుగాతలచి పత్తితో చేసుకొన్న వస్త్రయుగ్మమును (ప్రత్తిని గుండ్రని బిళ్ళగాచేసి తడిచేత్తో పసుపు,కుంకుమ,తీసుకొనిరెండువైపులాద్ది రెండు తయారుచేసుకోవాలి.)శ్రీవరలక్ష్మీదేవికి కలశంపై ఎడమవైపువేయవలెను.
ఆభరణము:శ్లో::- కేయూరకంకణా దేవీ హారనూపుర మేఖలాః
విభూషణా న్య మూల్యాని గృహాణ ఋషిపూజితే
(శ్రీవరలక్ష్మీదేవతాం ఆభరణం సమర్పయామి.బంగారముకాని,వెండికాని,మీషక్తానుసారం దేవికి సమర్పించుకోవాలి(లేకున్నచో అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి.)
ఉపవీతం:శ్లో::- తప్త హేమకృతం దేవీ మాంగల్యం మంగళప్రదం,
మయాసమర్పితం దేవీ గృహాణ త్వం శుభప్రదే
(శ్రీవరలక్ష్మీదేవతాం ఉపవీతం సమర్పయామి.అని పత్తిని 3లేదా 4 అంగుళములు పొడవుగా మధ్య మధ్యలో పసుపుతో అద్దుతూ నలిపిన యగ్నోపవీతమునుదేవికి సమర్పించుకోవాలి
గంధం:శ్లో::- అక్షతాన్ దవళాన్ దివ్యాన్ శాలీయాన్ స్తండులాన్ శుభాన్,
హరిద్రా కుంకుమో పేతాన్ గృహ్యతా మబ్ది పుత్రికే
((శ్రీవరలక్ష్మీదేవతాం అక్షతాన్ సమర్పయామి.అని అక్షంతలు (పసుపుకలిపిన బియ్యమును)దేవిపై చల్లవలెను.
పుష్పపూజ:శ్లో::- మల్లికాజాజికుసుమైశ్చంపకైర్వకుళైస్తధా,
నీలోత్పలైఃశ్చలళారైఃపూజయామి హరిప్రియే
(శ్రీవరలక్ష్మీదేవతాం పుష్పైః పూజయామి.అని అన్నిరకములపూవులతో దేవిని పూజించవలెను.)
ఈ శోడశోపచార పూర్తి అయినతరువాత అధాంగ పూజ చేయవలెను.
అధాంగపూజ::- కుడిచేతిలోనికి అక్షంతలు తీసుకొనిక్రిందనామములను చదువుతూ అక్షతలను దేవిపైచల్లవలెను.
పసుపు,లేదా కుంకుమతోనైనను పూజించవచ్చును.
చంచలాయై నమః --- పాదౌ పూజయామి
చపలాయై నమః --- జానునీ పూజయామి
పీతాంబరాయై నమః --- ఊరూం పూజయామి
కమలవాసిన్యైనమః --- కటిం పూజయామి
పద్మాలయాయైనమః --- నాభిం పూజయామి
మదనమాత్రే నమః --- స్తనౌ పూజయామి
కంబుకంఠ్యై నమః --- కంఠం పూజయామి
సుముఖాయై నమః --- ముఖం పూజయామి
లలితాయైనమః --- భుజద్వయం పూజయామి
శ్రియైనమః ---ఓస్ఠౌ పూజయామి
సునాసికాయైనమః --- నాసికాః పూజయామి
సునేత్రాయై నమః --- నేత్రౌ పూజయామి
రమాయైనమః --- కర్ణౌ పూజయామి
కమలాయైనమః --- శిరః పూజయామి
శ్రీవరలక్ష్మై నమః --- సర్వాణ్యంగాని పూజయామి
!! శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః !!
(ప్రతినామమునకు ముందు ఓం అని,చివరకు నమః అని చేర్చుకొని చెప్పవలెను)
ఓం ప్రకృత్యై నమః , ఓం వికృతై నమః , ఓం విద్యాయై నమః , ఓం సర్వభూత హిత ప్రదాయై నమః , ఓం శ్రద్ధాయై నమః , ఓం విభూత్యై నమః , ఓం సురభ్యై నమః , ఓం పరమాత్మికాయై నమః , ఓం వాచ్యై నమః , ఓం పద్మాలయాయై నమః , ఓం పద్మాయై నమః , ఓం శుచయే నమః , ఓం స్వాహాయై నమః , ఓం స్వధాయై నమః , ఓం సుధాయై నమః , ఓం ధన్యాయై నమః , ఓం హిరణ్మయ్యై నమః , ఓం లక్ష్మీ నమః , ఓం నిత్యపొష్టాయై నమః , ఓం విభావర్యై నమః , ఓం ఆదిత్యై నమః , ఓం దిత్యై నమః , ఓందీప్తాయై నమః , ఓం రమాయై నమః , ఓం వసుధాయై నమః , ఓం వసుధారిణై నమః , ఓం కమలాయ నమః , ఓం కాంతాయ నమః , ఓం కామాక్షె నమః , ఓం క్రోధ సంభవాయ నమః , ఓం నృపవేశగతానందాయై నమః , ఓంవరలక్ష్మె నమః , ఓం వసుప్రదాయై నమః , ఓం శుభాయై నమః , ఓం హిరణ్యప్రాకారయై నమః , ఓం సముద్రతనయాయై నమః , ఓం అనుగ్రహప్రదాయై నమః , ఓం బుద్ధ్యె నమః , ఓం అనఘాయ నమః , ఓంహరివల్లభాయ నమః , ఓం అశోకాయ నమః , ఓం అమృతాయ నమః , ఓం దీపాయై నమః , ఓం తుష్టయే నమః , ఓం విష్ణుపత్నే నమః , ఓం లోకశోకవినశిన్యై నమః , ఓం ధర్మనిలయాయై నమః , ఓం కరుణాయై నమః , ఓం లోకమాత్రే నమః , ఓం పద్మప్రియాయై నమః , ఓం పద్మహస్తాయై నమః , ఓం పద్మాక్ష్యె నమః , ఓం పద్మసుందర్యై నమః , ఓంపద్మోద్భవాయై నమః , ఓం పద్మముఖీయై నమః , ఓం పద్మనాభప్రియాయై నమః , ఓం రమాయై నమః , ఓం పద్మమాలధరాయై నమః , ఓం దేవ్యై నమః , ఓం పద్మిన్యై నమః , ఓం పద్మ గంధిన్యై నమః , ఓం పుణ్యగంధాయై నమః , ఓం సుప్రసన్నాయై నమః , ఓం ప్రసాదాభిముఖీయై నమః , ఓం ప్రభాయై నమః , ఓం చంద్రవదనాయై నమః , ఓం జయాయై నమః , ఓం మంగళాదేవ్యై నమః , ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః , ఓం ప్రసన్నాక్షై నమః , ఓం నారాయణ సమాశ్రితాయై నమః , ఓం దారిద్ర్యద్వంసిన్యై నమః , ఓం చంద్రాయై నమః , ఓం చంద్రసహూదర్యై నమః , ఓం చతుర్భుజాయై నమః , ఓంచంద్ర రూపాయై నమః , ఓం ఇందిరాయై నమః , ఓం ఇందుశీతలాయై నమః , ఓం ఆహ్లాదజనన్యై నమః , ఓం పుష్ట్యై నమః , ఓం శివాయై నమః , ఓం శివకర్యై నమః , ఓం సత్యై నమః , ఓం విమలాయై నమః , ఓం విశ్వజనన్యై నమః , ఓం దారిద్ర నాశిన్యై నమః , ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః , ఓం శాంత్యై నమః , ఓం శుక్లమాలాంబరాయై నమః , ఓం శ్రియ్యై నమః , ఓం భాస్కర్యై నమః , ఓం బిల్వ నిలయాయై నమః , ఓం వరారోహాయై నమః , ఓం యశస్విన్యై నమః , ఓం వసుంధరాయై నమః , ఓం ఉదారాంగాయై నమః , ఓం హరిణ్యై నమః , ఓం ధనాధాన్యకర్యై నమః , ఓం సిద్ద్యై నమః , ఓం తైణ్ సౌమ్యాయై నమః , ఓం శుభప్రదాయై నమః , ఓం సర్వోపద్రవవారిణ్యై నమః , ఓం మహాకాళ్యై నమః , ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయైనమః , ఓం త్రికాలఙ్ఞానసంపన్నాయై నమః , ఓం నవదుర్గాయై నమః , ఓం భువనేశ్వర్యై నమః ,
ఓం వరలక్ష్మీ దేవతాయైనమః
(అష్టోత్తర శతనామపూజాం సమర్పయామి,అని పూలు పాదాలముందు వుంచి నమస్కారంచేసుకోవాలి.)
ధూపం:శ్లో::- దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం
ధూపం దాస్యామి దేవేశే గృహాణ కమలప్రియే
(శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధూపమాఘ్రాపయామి.అని రెండు అగరువత్తులను తీసుకొని వెలిగించి ధూపమును దేవికి చూపించవలెను)
దీపం:శ్లో::- ఘృతావర్తి సంయుక్తం అంధకార వినాశకం
దీపం దాస్యామితే దేవీ గృహాణ ముదితా భవ
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః దీపం సమర్పయామి(దర్శయామి)
అని వెలుగుతున్న దీపమును(రెండు అడ్డవత్తులు,ఒక కుంభవత్తివున్న రెండవ కుందిలో నూనె వేసి కర్పూరహారతి పళ్ళెములో వెలుగుచున్నదీపమును వెలిగించి ఆ దీపమును దేవికి చూపవలెను.)
ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి)
నైవేద్యం:శ్లో::- నైవేద్యం షడ్రషోపేతం దధిమధ్వాజ్య సంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరి వల్లభే
(శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి
అని దేవికి ప్రత్యేకంగా చేసిన రకరకాల పిండివంటలు,పాయసం,పానకం,(శుధమైన నీటిలో బెల్లం,ఏలక్కాయపొడి,మిరియాలపొడి,కలుపవలెను.)వడపప్పు,నీటిలో నానబెట్టిన పెదరపప్పును విడిగా తీసి నీళ్ళులేకుండగా అమ్మకు సమర్పించవలెను)మరియు మహా నైవేద్యం కొరకు చేసిన అన్నం,పప్పు,నెయ్యి,కూరలు,మొదలైనవి అమ్మవద్దపెట్టి నైవేద్యం చేయాలి.)
నైవేద్యం పై పువ్వుతో నీళ్ళు చల్లుతూ ఎడమచేత్తో,గంటవాయిస్తూ, 'ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా , ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా , ఓం స్రీవరలక్ష్మీదేవతాయైనమః నైవేద్యం సమర్పయామీ అంటూ ఆరుమార్లు చేతిలో(చేతిలోని ఉద్దరిణితో) దేవికి నివేదనం చూపించాలి.పిదప నైవేద్యానంతరం 'హస్తౌ ప్రక్షాళయామీఅని ఉద్దరిణెతో అర్ఘ్యం వదలాలి. తరువాత పాదౌ పేక్షాళయామీ అని మరో సారి నీరు అర్ఘ్యం పాత్రలో ఉద్దరిణెతో నీరు వదలాలి.పునః శుద్దాచమనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి.
పానీయం:శ్లో::- ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం
పానీయం గృహ్యాతాం దేవి శీతలం సుమనోహరం
(శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి.అని భోజనానంతరం నీళ్ళు ఇచ్చినట్లు భావించి కుడిచేత్తో నీటిని చూపుతూ ఎడమచేత్తో గంటవాయించవలెను.)
తాంబూలం:శ్లో::- పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
(శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి.అని తమలపాకు,వక్క,సున్నం సుగంధాలతో తాంబూలం ఇవ్వడం
ఆ తరువాత శుధ ఆచమనీయం సమర్పయామి అంటు ఉద్దరిణితో నీరు అర్ఘ్యపాత్రలో వదలాలి.)
పిమ్మట కర్పూరం వెలిగించి.
నీరాజనం:శ్లో::- నీరాజనం సమానీతం కర్పూరెణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యతాం విష్ణువల్లభే
శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః నీరాజనం సమర్పయామి.అంటూ కర్పూరము వెలిగించి దేవికి హారతి ఇవ్వవలెను.తరువాత కర్పూర హారతి ఒక పక్కన పెట్టి ఒక చుక్క పంచపాత్రలోని నీరు హారతి పల్లెంలో వేయవలెను.)
మంత్రపుష్పం:శ్లో::- పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణే ప్రియే దేవీ సుప్రీతో భవసర్వదా
శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః మంత్రపుష్పం సమర్పయామి.అని కిన్ని పూవులు,అక్షంతలు,తీసుకొని లేచి నిలబడి నమస్కరించి ఈ పూవులు,అక్షంతలు దేవిపై వేసి కూర్చోవలెను.)
ప్రదక్షణ:శ్లో::- యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపసంభవః
త్రాహి మాం కృపయాదేవి శరణాగతవత్సలే
అన్యధా శరణంనాస్తి త్వమేవ శరణంమమ
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష జగధారిణి
(శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః ప్రదక్షిణం సమర్పయామి.అని మోకాళ్ళపై పడుకొని కుడికాలు ఎడమకాలుపైవేసి)తరువాత దేవిపైచేతిలోనున్న అక్షంతలు,పువ్వులు చల్లవలెను.)
నమస్కారం:శ్లో::- నమస్తే లోక్యజననీ నమస్తే విష్ణువల్లభే
పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః
(శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః నమస్కారాన్ సమర్పయామి.అని మనస్పూర్తిగా దేవికి నమస్కరించవలెను.పిమ్మట చేసిఉంచుకొన్న తోరములను ఒక పళ్ళెములో పెట్టి పసుపు,కుంకుమ,అక్షంఅతలతో పూజించవలెను.9 వరసలు 9 ముడులు కలిగిన తోరమును 9 (నవమగ్రంధిం)నామములతో పూజిస్తారు.
తోరపూజ:శ్లో::- తోరమును అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ క్రింద విధముగా పూజించవలెను.
ఓం కమలాయైనమః ప్రథమగ్రంథిం పూజయామి
ఓం రమాయైనమః ద్వితీయగ్రంథిం పూజయామి
ఓం లోకమాత్రే నమః తృతీయగ్రంథిం పూజయామి
ఓం విశ్వజనన్యైనమః చతుర్థగ్రంథిం పూజయామి
ఓం మహాలక్ష్మీనమః పంచమగ్రంథిం పూజయామి
ఓం క్షీరాబ్ధితనయాయైనమః షష్టమగ్రంథిం పూజయామి
ఓం విశ్వసాక్షిణ్యైనమః సప్తమగ్రంథిం పూజయామి
ఓం చంద్రసోదర్యైనమః అష్టమగ్రంథిం పూజయామి
ఓం శ్రీవరలక్ష్మీయైనమః నవమగ్రంథిం పూజయామి
ఈ క్రింది శ్లోకములు చదువుతూ తోరము కట్టుకొనవలెను.
బధ్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే
(తోరమును కట్టుకొంటూ ఈ శ్లోకమును చదివి కుడిచేతికి తోరణమును కట్టి తోరమునకు పసుపు,కుంకుమ అద్దవలెను)
వాయనమిచ్చునపుడు,ఈ క్రింది శ్లోకమును చదువుచు ఇవ్వవలెను.
శ్లో::- ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః
దాతవ్యం ద్వాదహాపూపం వాయనం హిద్విజాతయే
శ్లో::- ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతిచ
ఇందిరా తారకోబాభ్యాం ఇందిరాయై నమోనమః
(శ్రీవరలక్ష్మీదేవతాయైనమః వాయనదానం సమర్పయామి. అనుకొని శనగలు(నానబెట్టినవి),తాంబూలం ,ఆకులు,వక్కలు,అరటిపండు,రవికగుడ్డ,పువ్వులు,మరియుతయారు చేసిన పిండివంటలను ఒకపళ్ళెములోనికి 9 రకములు రకమునకు 9 వంతునగాని(లేదా ఎవరి శక్తానుసారముగా వారు)తీసుకొని మరొక్కపళ్ళెముతో మూసి పైన కొంగును కప్పి ముత్తైదువకు బొట్టుపెట్టి ఆమెను వరలక్ష్మీదేవిగా భావించి ఈ వాయినమును అందిస్తూ ఇచ్చువారు ఇస్తినమ్మ వాయనము అని,పుచ్చుకొనేవారు అనాలి,పుచ్చుకొంటినమ్మ వాయనం అనాలి, ఇలా మూడుసార్లు చెప్పి,ఇచ్చెవారు అనాలి,నావాయనం అందుకొన్నదెవరు అని ఇచ్చేవారు, నేనేనమ్మావరలక్ష్మీదేవిని అని పుచ్చుకొనేవారు అనాలి.
ఇచ్చేవారు 'అడిగితివరం అని,పుచ్చుకొనేవారు ఇస్తివరం అని 3 సార్లు అనాలి.ఈ విధంగా దేవికి వాయనము సమర్పించి నమస్కరించాలి.)
పునః పూజ:శ్లో::- ఓం శ్రీవరలక్ష్మీ దేవ్యైనమః పునఃపూజాంచ కరిష్యే అని చెప్పుకొని పంచపాత్రలోని నీటిని చేతితో తాకి,అక్షంతలు దేవిపై చల్లుతూ ఈ క్రింద మంత్రమును చదువుకొనవలెను.
ఛత్రం ఆఛ్చాదయామి, చామరం వీజయామి,నృత్యం దర్శయామి,గీతంశ్రావయామి,సమస్తరాజోపచార, శక్యోపచార,భక్త్యోపచార,పూజాంసమర్పయామి.అనుకొని నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదవవలెను.
ఏతత్ఫలం శ్రీవరలక్ష్మీ మాతార్పణమస్తు,అంటు అక్షంతలు నీటితోపాటు అరవేణంలో వదలవలెను.పిమ్మటాశ్రీవరలక్ష్మీదేవతా ప్రసాదం శిరసా గృహ్ణామీ అనుకొని దేవివద్ద అక్షంతలు తీసుకొని తమతమ తలలపై వేసుకొనవలెను.ఆ పిదప పసుపుగణపతి వున్న పళ్ళెమునొకసారి పైకి ఎత్తి తిరిగి క్రిందవుంచి,పళ్ళెములో వున్న పసుపు గణపతిని తీసి దేవునిపీటముపై నుంచవలెను దీనిని ఉద్వాసనం చెప్పటం అంటారు.
శ్లో::- యస్య స్మృత్యాచ నోమోక్త్యాత పః పూజాక్రియాది ఘున్యూనం సంపూర్ణం తాం యాతి సద్యో వందే తమచ్యుతం మంత్ర హీనం,క్రియాహీనం,భక్తిహీనం,జనార్ధన,యత్పూజితం మయాదేవీ పరిపూర్ణం తదస్తుతే,అనయాధ్యాన ఆవాహనాదిశోడోపచార పూజయాచ భగవాన్సర్వాత్మకః శ్రీవరలక్ష్మీ దేవతా స్సుప్రీతోవరదో భవతు,
శ్రీవరలక్ష్మీదేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి.
శ్రీ వరలక్ష్మీ దేవి పూజావిధానము సంపూర్ణం !!
!! శ్రీ వరలక్ష్మీ వ్రత కధా ప్రారంభం !!
శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదానిని శివుడు పార్వతికి తెలియచెప్పెను. లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను. శ్రద్ధగావినవలసిందన్నాడు.
పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు, నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుడ్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటుకు తగిన వ్రతమునొకదానిని ఆనతీయవలసినదని అడిగినది. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై దేవీ! నీవు కోరిన విదముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతమొకటున్నది, అది వరలక్ష్మీ వ్రతం, దాని విధివిధానం వివరిస్తాను విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందువచ్చు శుక్రవారంనాడు ఈ వ్రతమును చేయవలెనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పెను. పార్వతీదేవి దేవా! ఈ వరలక్ష్మీవ్రతమునకు ఆది దేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియచెప్పమని పార్వతి అడిగినది.
కాత్యాయనీ! ఈ వరలక్ష్మీవ్రతమును వివరంగా చెబుతాను భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణమొకటుండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణములో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగుల సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది. వరలక్ష్మీవ్రతానికి ఆది దేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి! నీ యందు అనుగ్రహము కలిగినదానను, ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చు శుక్రవారము నాడు నన్ను పూజించుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చెదనని చెప్పి అంతర్ధానమయ్యెను.
చారుమతి అత్యంత ఆనందమును పొంది హే జననీ! నీ కృపాకటాక్షములు కలిగినవారు ధన్యులు, వారు సంపన్నులుగా, విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావనీ! నా పూర్వజన్మసుకృతమువలన నీ పాద దర్శనం నాకు కలిగినది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించినది. చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియచెప్పింది. వారు మిక్కిలి ఆనందించినవారై చారుమతిని వరలక్ష్మీవ్రతమును చేసుకోవలసిందని చెప్పారు.
ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి, గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరు చారుమతి గృహానికి చేరుకొన్నారు.
ఆమె గృహంలో మండపం ఏర్పరచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటుచేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో "సర్వమంగలమాంగళ్యేశివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే" అని ఆహ్వానించి ప్రతిష్టించుకున్నారు. {సాద్యమైనవారు స్వర్ణ, రజిత, తామ్ర, మృణ్మయ మూర్తులను ప్రతిష్టించుకోవచ్చు}. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య,భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేసారు.
మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళకు అందియలు ఘల్లు ఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచిత కంకణాలు దగద్ధగాయమానమయ్యాయి. మూడవ ప్రదక్షిణచేయగా అందరూ సర్వాభరణభూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మివ్రతం ఫలితంగా ఇతర స్త్రీలయొక్క ఇళ్ళు ధన, కనక, వస్తు వాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ళనుండి గజతురగ రధ వాహనములు వచ్చి వారిని ఇళ్ళకు తీసుకువెళ్ళాయి. వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీవ్రతంతో తామందరిని మహద్భాగ్యవంతులను చేసినదని పొగిడిరి. వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకలసౌభాగ్యములతో సిరిసంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు.
మునులారా! మహర్షులారా! మముక్షువులారా! శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మీవ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించానన్నాడు సూతమహర్షి.
ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు,సిరిసంపదలు, ఆయురారోగ్యైశ్వర్యాలు సిద్ధిస్తాయి
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
వరలక్ష్మీ వ్రత కల్పము:
పూజా సామగ్రి:
శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః
1. పసుపు
2. కుంకుమ
3. పండ్లు
4. పూలు
5. తమలపాకులు
6. అగరవత్తులు
7. వక్కలు
8. కర్పూరం
9. గంధం
10. అక్షింతలు
11. కొబ్బరి కాయలు
12. కలశము
13. కలశ వస్త్రము
1. అమ్మవారి ప్రతిమ లేక విగ్రహము
2. పంచామృతము అనగా : ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, అన్నీ కలిపినది.
3. దీపములు , తైలం, నెయ్యి.
4. వస్త్రములు: పత్తితో చేయవచ్చు. లేదా కొత్తచీర, రవిక ( జాకెట్టు గుడ్డ ) ఉన్నచో అమ్మవారికి పూజా సమయంలో సమర్పించి తర్వాత కట్టుకోవచ్చు.
5. ఆభరణములు : కొత్తవి చేయిస్తే అవి అమ్మవారికి పెట్టిన తరువాత వేసుకోవచ్చు.
6. మహా నైవేద్యం : నేతితో చేసిన 12 రకముల పిండివంటలు. వీలు కాకపోతే వారి వారి శక్తి కొలదీ రకరకాల పిండివంటలు చేయవచ్చు.
7. తోరము : తొమ్మిది ముడులు వేసిన తోరము. పసుపు దారములో ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. (తొమ్మిది తోరాలు కావాలి. ఒకటి అమ్మవారికి, మరొకటి మీకు, మిగతావి ముత్తయిదువులకు)
8. పసుపు ముద్దతో వినాయకుడిని చేయవలెను. ఒక పీటమీద కొద్దిగా బియ్యము పరచి, పూర్ణకుంభంలో ( వెండి/ఇత్తడి/రాగి/కంచు చెంబులో ) కొత్త బియ్యము వేసి, మర్రియిగుళ్ళు గాని, మామిడి ఆకులు గాని, అవి దొరకక పోతే తమల పాకులు గాని వేసి, ఆ కుంభం మీద కొత్త రవికెల గుడ్డ చుట్టిన కొబ్బరికాయ ఉంచి దానిని పీట మీద మధ్యగా ఉంచి, పూజకు సిద్ధం చేయాలి.
9. మంచి నీటితో గ్లాసు, ఉద్దరిణా ఉంచుకోవాలి.
శ్రీ వరలక్ష్మీదేవి వ్రత కథ:
అక్షింతలు చేతిలో వేసుకుని, కథ భక్తి,శ్రద్దలతో చదవండి /వినండి.
సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులని చూసి యిలా అన్నాడు. 'ఓ మునీశ్వరు లారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి'.
ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా, పార్వతీదేవి ఆయనని సమీపించి, 'దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను, పుత్రపౌత్రాదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి' అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు. 'ఓ దేవీ! స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము రోజు చేయవలెను'.
పార్వతీదేవి ' నాథా! ఆ వరలక్ష్మీ వ్రతము ఎలా చేయాలి , ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనినెవరైనా యింతకు ముందు చేసారా? ఆ వివరములన్నీ చెప్పండి' అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి, తెల్లవారు ఝామునే లేచి, స్నానం చేసి, పతిదేవుని పూవులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి, యింటి పనులన్నీ ఓర్పుతో, నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా, మితంగా మాట్లాడుతుండేది. గయ్యాళిగా కాకుండా , ఇంత అణకువగా నున్న ఆ మహా పతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది.
ఒకరోజు ఆ మాహాయిల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. 'ఓ చారుమతీ! నేను వరలక్ష్మీ దేవిని. నీ నడవడిక చూసి, నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణమాసంలో శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను' అలా ప్రత్యక్షమైన అమ్మ వారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీ దేవి కలలోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ , నమస్కారములు చేసి ;
నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్య మూర్తయే
శరణ్యే త్రిజగ ద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే
అని అనేక విధములు స్తోత్రం చేసింది.
'ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు. విద్వాంసులవుతారు. సకల సంపన్నులవుతారు. నేను పూర్వ జన్మలలో చేసిన పూజఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది'. అనగా వరలక్ష్మీ దేవి సంతోషము చెందింది.
ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీ దేవి కనబడ లేదు. అప్పుడామెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తనీ, అత్తమామలని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. 'ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి' అన్నారు. చారుమతి తన యిరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు , చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు.
వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారము రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీ దేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకుపక్రమించారు. ప్రాతః కాలమే లేచి తలారా స్నానం చేసి, పట్టు బట్టలను కట్టుకున్నారు. చారుమతి యింట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేసారు. ఆసనం పైన కొత్త బియ్యము పోసి , మర్రిచిగుళ్ళు, మామిడాకుల అలంకారలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీ దేవిని అవాహనము చేసారు.
చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసారు.
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవసర్వదా
అను ఈ శ్లోకంతో ధ్యానావాహనాది షోడశోపచార పూజ చేసారు. తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీ దేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు.
దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ ఘల్లుఘల్లు మని శబ్ధం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీ దేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసి పోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగ లాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంక వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది? మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే అ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల యిళ్ళన్నీస్వర్ణమయాలయ్యాయి. వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి.
చారుమతి యింటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి యిళ్ళ నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు, చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి , దక్షిణ తాంబూలములిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీ దేవికి నైవేద్యం గా పెట్టిన పిండివంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలోవారి యిండ్లకు బయలు దేరారు.
వారు దోవలో చారిమతి భాగ్యమును, తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమవట మంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తను ఒక్కతే పూజించకూండా, తమ అందరికీ చెప్పి, తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురుసిపోయారు.
అప్పటి నుంచీ చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపౌత్రాభి వృద్ధి కలిగి, ధన కనక వస్తు వాహనములు కలిగి, సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున 'ఓ పార్వతీ! ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వసౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములూ సిద్ధించును' అన్నాడు పరమశివుడు.
సూత మహాముని శౌనకుడు మొదలగు వారితో 'మునులారా! విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో! ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు యింకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది' అన్నారు.
వరలక్ష్మీ వ్రత కల్పము సమాప్తము.
కథాక్షతలు అమ్మవారి మీద వేసి, మీ మీద వేసుకుని, మిగతా వారి మీద వెయండి.