Saturday, October 20, 2012

దసరా నవరాత్రులు – దేవీ అవతారం విశిష్టత -- గాయత్రి దేవి


రెండవరోజు అవతారం గాయత్రి దేవి 



రెండవరోజు అవతారం గాయత్రి దేవి 

ఈ రోజు అవతారం గాయత్రి దేవి, ఈ అవతారం విశిష్టత

సకల వేద స్వరూపం గాయత్రి దేవి. అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ మాత. ముక్త, విదుమ్ర, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవి
ని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతః కాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది





ఓం బ్రహ్మకుండికాహస్తాం
శుద్ధజ్యోతిస్వరూపిణీం
సర్వతత్త్వమయీంక

వందే గాయత్రీం వేదమాతరమ్//

ఆశ్వయుజ శుద్ధ విదియనాడు కనకదుర్గమ్మను శ్రీగాయత్రీదేవిగా అలంకరిస్తారు. ఈ తల్లి సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొందింది. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టానదేవత. గాయత్రీమంత్ర ప్రభావం చాలా గొప్పది. ఆ మంత్రాన్ని వేయిసార్లు ధ్యానిస్తే చాలు, గాయత్రీమాత అనుగ్రహిస్తుందని, తద్వారా వాక్సుద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు. 


సకల మంత్రాలకు, అనుష్ఠానాలకు, వేదాలకు మూలదేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. సమస్త దేవతలకూ నివేదన చేయబోయే పదార్థాలన్నింటినీ ముందుగా గాయత్రీ మంత్రంతో నివేదన చేస్తారు. అంతటి మహిమాన్వితమైన గాయత్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదు ముఖాలతో, వరద అభయ హస్తాలు ధరించి కమలాసనాసీనురాలుగా దర్శనమిస్తుంది.

నేటి నైవేద్యం: స్నిగ్ధౌదనం (నేతి అన్నం)





"ముక్తావిద్రుమహేమనీలధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః 
యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే" 

తాత్పర్యము::

1)ముక్తా = ముత్యపు వర్ణము, 2) విద్రుమ = పగడపు వర్ణము, 3) హేమ = బంగారపు వర్ణము, 4) నీల = నీలవర్ణము, 5) ధవళ = తెల్లని వర్ణము గల ఐదు ముఖములు కలిగినదియు, 

ప్రతిముఖమునకు మూడు నేత్రములు కలిగినదియు, 
చంద్రకళతో కూడిన కిరీటము కలదియు, 
పరమార్థ వివరాణత్మక బీజాక్షరములు కలిగినదియు,

వరద మరియు అభయముద్రలు, అంకుశము, కొరడా, స్వచ్ఛమైన కపాలము, శంఖము, చక్రము, గద, రెండు పద్మములను తన పది హస్తములందు ధరించునదియుయైన గాయత్రీదేవి దర్శనమిస్తుంది.

సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. 
అమ్మవారు 24 తత్త్వములతో, 5 ముఖములు కలిగిన శక్తిగా ప్రభోధిస్తారు.

ఆది శంకరులు గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. 
ప్రాత: కాలంలో గాయత్రిగానూ, 
మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, 
సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. 

ముఖంలో అగ్ని, 
శిరస్సులో బ్రహ్మ, 
హృదయంలో విష్ణువు, 
శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. 

గాయత్రియే సకల దేవతలకు ఆరాధనీయం. "న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పరదైవతమ్"
భావము: తల్లిని మించిన దైవము, గాయత్రిని మించిన మంత్రము లేవు - ఆర్యోక్తి 

"గాయతాం త్రాయతే ఇతి గాయత్రి" - గానము చేయువాని రక్షించేది గాయత్రి. అనగా గొంతెత్తి బిగ్గరగా రాగ భావ శృతి లయ యుక్తంగా పాడవలెను. 

అమ్మను ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి, తద్వార బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది.

"ఓం భూర్భువస్సువః| ఓం తత్సవితుర్వరేణ్యమ్| భర్గో దేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్|"

గాయత్రీ మంత్ర పదవిభాగము:
ఓం, తత్, సవితుః, వరేణ్యమ్, భర్గః, దేవస్య ధీమహి, ధియః, యః, నః, ప్రచోదయాత్

పదక్రమము:
వరేణ్యమ్, నః, ధియః,ప్రచోదయాత్ యః తత్, ఓం సవితుః, దేవస్య, భర్గః, ధీమహి

అర్థములు:
వరేణ్యమ్ = కోరదగినదియు (అందరికీ శ్రేయస్సును కలిగించుటలో)
నః = మన
ధియః = బుద్ధులను
ప్రచోదయాత్ = ప్రేరేపించునదియు,
యః = ఎవరో
ఓం = ప్రణవ ప్రతీకమైన
తత్ = ఆ
సవితుః దేవస్య = వెలుగుల సవితృ మూర్తి యొక్క
భర్గః = స్వయం ప్రకాశ ప్రాసర గుణ సమన్వితమైన తేజస్సును
ధీమహి = ధ్యానించుదుము (గాక)

తాత్పర్యము: 
అందరికి శ్రేయస్సును కలిగించుటలో కోరదగినదియు, మన బుద్ధులను ప్రేరేపించునది ఎవరో - ప్రణవ ప్రతీకమైన ఆ వెలుగుల సవితృమూర్తియొక్క(స్వయం ప్రకాశ ప్రాసర గుణ సమన్వితమైన) తేజస్సును ధ్యానించెదము గాక!

గాయత్రీ స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేయాలి. గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేయాలి. 

లోకాస్సమస్తాః సుఖినో భవంతు | ఓం శాంతిః శాంతిః శాంతిః|

దసరా నవరాత్రులు – దేవీ అవతారం విశిష్టత -- బాలాత్రిపురసుందరి

 మొదటి రోజు :: బాలాత్రిపురసుందరీ అవతారం.



బాలాత్రిపురసుందరి:

ఆశ్వయుజ మాసం శక్తిని ఆరాధించే విశేషమాసం. శరత్కాలంలో వచ్చే రాత్రులు కావటంతో వీటిని శరన్నవరాత్రులనీ, దేవీ ఆరాధన ప్రధానమైనది కాబట్టి దేవీనవరాత్రులనీ అంటారు. అసురత్వాన్ని అంతం చేసి, దురితాలను దూరం చేసే దుర్గాదేవి దశావతారాలను, ఒక్కోరోజు ఒక్కో అవతారంలో అలంకరిస్తారు.

అరుణ కిరణజాలైరంచితా సావకాశా

విధృత జపపుటీకా పుస్తకాభీతిహస్తా
ఇతరవరకరాఢ్యా ఫుల్లకల్హారసంస్థా
నివసతు హృది బాలా నిత్యకళ్యాణశీలా॥


మొదటిరోజు అమ్మవారు శ్రీబాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపుర త్రయంలో ఈ దేవి మొదటిది. బాలాదేవి మహిమాన్వితమైనది. శ్రీబాలామంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకి గొప్పది. అతి ముఖ్యమైనది కూడా. అందుకే శ్రీవిద్యోపాసకులను మొట్టమొదట ఈ బాలా మంత్రాన్నే ఉపదేశిస్తారు. పవిత్ర శ్రీచక్రంలో మొదటి అమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. అందుకే ముందుగా ఆ దేవిని అర్చిస్తేనే మహాత్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. బాలా త్రిపురసుందరీదేవిని ధ్యానిస్తేనే దుర్గాదేవి సంతోషిస్తుంది. కాబట్టి బాలాదేవి స్వరూపం ఎలా ఉంటుందో భక్తులకు తెలియచేయటం కోసమే ఈ అలంకరణ. 

నైవేద్యం - పాయసాన్నం
అలంకరణ - బాలాత్రిపురసుందరి..

Wednesday, October 17, 2012

దసరా నవరాత్రులు ___/\___






మహా శక్తిస్వరూపిణి అయిన దుర్గా మాతని మనం అనేక రూపాలాలో కొలుచుకుంటాము. ఐతే వాటిలో ముఖ్యమైనవి 9 అవతారాలు. వారినే మనం నవదుర్గలని అంటుంటాం.

దుర్గా మాత ముఖ్యమైన అవతారాలు మూడు. మాహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. వీరు శ్రీమహావిష్ణువు, పరబ్రహ్మ, పరమశివుని అర్ధాంగినులుగా మనకు తెలుసు. వీరిలో ఒక్కొక్కరూ తిరిగి 3 అవతారాలు పొందారు. ఆ విధంగా నవదుర్గలుగా ప్రసిద్ధి చెందారు.

1. శైలపుత్రి

నవదుర్గలలో ప్రధమమైన శైలపుత్రి హిమవంతుని పుత్రిక. ఈమెయే వెనుకజన్మలో దక్షప్రజాపతి కుమార్తె సతి. హిమవంతుడు పర్వతరాజు కనుక ఈమెకు శైలపుత్రి అనే పేరు కలిగింది. ఈమె వాహనం నంది. ఒక చేతిలో త్రిశూలం రెండో చేతిలో కలువ, నుదుటిన చంద్ర వంక ధరించిన ఈమె మహిమలు అపారం. నవరాత్రి సంధర్భంగా మొదటిరోజున ఈమె పూజ జరుగుతుంది.

2. బ్రహ్మచారిణి

దుర్గామాత అవతారాలలో రెండవది అయిన బ్రహ్మచారిణి, తపస్సుకు ప్రతీక. ఇక్కడ బ్రహ్మ అనే పదానికి తపస్సు అని అర్థం. వేదము, తత్వము, తపము అనే పదాలు బ్రహ్మ అనే పదానికి పర్యాయ పదాలుగా వాడుతారు. ఒక చేతిలో కమండలము, మరొక చేతిలో తులసి మాల ధరించే ఈమెను సకల సౌభాగ్యదాయనిగా పూజిస్తారు.

3. చంద్రఘంట

దుర్గామాత మూడవ అవతారమైన చంద్రఘంట మాత శిరసున అర్ధచంద్రుడిని గంటరూపంలో ధరించింది. అందువలననే ఆమెకి ఈ నామధేయం కలిగింది. సింహవాహిని ఐన ఈమె బంగారు దేహఛాయ కలిగి, పది హస్తాలతో ఉంటుంది. ఈమె పది హస్తాలలో శంఖ, ఖడ్గ, గద, కమండలము, విల్లు, కమలం మొదలైనవి కలిగి చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటుంది.

4. కూష్మాండ

సూర్యలోక నివాసిని అయిన కూష్మాండదేవి, సూర్యకాంతిని పోలిన దేహఛాయతో ఉంటుంది. ఈమె దేహఛ్ఛయతో దశ దిశంతాలు వెలుగు పొందుతాయి. సింహవాహిని ఐన ఈ దేవికి ఎనిమిది హస్తములలో కమండలము, విల్లు, అమ్ము, కమలము, అమృతభాండము, చక్రము, త్రిశులము, జపమాల ఉంటాయి.

5. స్కందమాత

కుమారస్వామి లేక స్కందుని తల్లి అయిన స్కందమాత మహాదుర్గ ఐదవ అవతారం. చతుర్భుజి ఐన ఈ మాత రెండు చేతులలో కమలములనూ కుడి హస్తమందు స్కందుని ధరించి అభయ హస్తి అయి దర్శనమిస్తుంది. ఈమె పద్మములో కూర్చొని ఉండటం చేత పద్మాసన అనే నామధేయం కూడా ఉంది.

6. కాత్యాయని

దుర్గామాత ఆరవ అవతారమైన కాత్యాయనిమాతను సకల వరప్రదాయనిగా పూజిస్తారు. శ్రీకృష్ణుని భర్తగా పొందటానికి గోపికలు ఈమెనే ఆరాధించారు. బంగారు మేనిఛాయతో, అత్యంత ప్రకాశవంతమైన ఈమెకు నాలుగు హస్తములు. ఒక చేత కత్తి, రెండవ చేత కమలం, మిగిలిన రెండుచేతులలో అభయప్రదాన ముద్రలో ఉంటుంది. ఈమె వాహనం సింహం.

7. కాళరాత్రి

దుర్గమాత ఏడవ అవతారం కాళరాత్రి. ఈమె శరీరఛాయ చిమ్మచీకటిలా నల్లగా ఉంటుంది. చెదరిన జుట్టుతో, మెడలో వాసుకొనిన మాల మెరుపులు చిందిస్తూ ఉంటుంది. ఈమెకు మూడు కళ్ళు. ఈమె ఉచ్వాస నిశ్వాసలు అగ్నిని విరజిమ్ముతుంటాయి. ఈమెకు నాలుగు హస్తములు. కుడి రెండు హస్తములలో ఒకటి అభయాన్ని, రెండవది భాయాలని పారదోలేవిగా ఉంటాయి. ఎడమచేతిలో ఒక చిన్న కత్తి, ఇనుముతోచేసిన రంపంలాంటి అయుధం ఉంటుంది. ఈమె వాహనం గాడిద. ఈమె రూపం ఉగ్రమే ఐనా ఈమెని పూజించిన వారికి అన్ని శుభములని కూరుస్తుంది కనుక ఈమెనే శుభంకరి అని కూడా పిలుస్తారు.

8. మహాగౌరి

దుర్గామాత అష్టమ అవతారం మహాగౌరి. ఈమె చంద్రునిపోలిన మేనిఛాయతో ఉంటుంది. ఈమె పార్వతి రూపంలో ఉన్నప్పుడు, శివునికోసం మహాతపస్సు చేసింది. అప్పుడు ఆమె శరీరఛ్ఛాయ నల్లగా మారిపోయింది. అది గమనించిన మహాశివుడు స్వయంగా ఆమెను పవిత్ర గంగాజలాలతో కడగగా ఆమెకు ఆ మేనిఛ్ఛాయ కలిగిందని ఒక కథ. సర్వకాల సర్వావస్తలలో ఈమెను ఎనిమిది ఏళ్ళ బాలికగానే పూజిస్తారు.
అత్యంత ప్రశాంతమైన స్వరూపం కలిగిన ఈమెకు నాలుగు చేతులు. రెండు చేతులలో త్రిశులం, దమరుకము ధరించి మిగిలన రెండుచేతులతో వర, అభయ ముద్రలతో దర్శనమిస్తుంది. ఈమె వాహనం నంది.

9. సిద్ధిదాత్రి

దుర్గాదేవి ఆఖరి అవతారమైన ఈమె భక్తులకు అష్టసిద్దులను (అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఇసిత్వ, మరియు వాసిత్వ అనేవి అష్టసిద్ధులు) ప్రసాదించగలిగే దేవత. ఈమె ద్వారానే పరమశివుడు ఈ సిద్ధులని సంపాదించాడని, అర్ధనారీశ్వరుడిగా పేరుపొందాడని దేవీపురాణంలో చెప్పబడింది. కమలంలో కూర్చునే ఈ దేవత వాహనం సింహం. నాలుగు హస్తాలలో శంఖ, చక్ర, గదా, పద్మాలతో విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తుంది.


ఈ నవదుర్గ ఆరాధనకు యోగపరంగా కూడా అర్థం చెప్పబడింది. అది ఇంకెప్పుడైనా చర్చించుకుందాము.
యాదేవీ సర్వభూతేషు శ్రీరూపేణ సంస్థితా
నమస్తస్యె నమస్తస్యె నమెస్తస్యె నమొ నమః

Tuesday, September 18, 2012

వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ--2012



వినాయక స్తోత్రం

మూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలమ్బితసూత్ర
వామనరూప మహేశ్వరపుత్ర విఘ్నవినాయక పాద నమస్తే

దేవదేవసుతం దేవం జగద్విఘ్నవినాయకమ్
హస్తిరూపం మహాకాయం సూర్యకోటిసమప్రభమ్


వామనం జటిలం కాన్తం హ్రస్వగ్రీవం మహోదరమ్
ధూమ్రసిన్దూరయుద్గణ్డం వికటం ప్రకటోత్కటమ్


దన్తపాణిం చ వరదం బ్రహ్మణ్యం బ్రహ్మచారిణమ్
పుణ్యం గణపతిం దివ్యం విఘ్నరాజం నమామ్యహమ్

దేవం గణపతిం నాథం విశ్వస్యాగ్రే తు గామినమ్
దేవానామధికం శ్రేష్ఠం నాయకం సువినాయకమ్

నమామి భగవం దేవం అద్భుతం గణనాయకమ్
వక్రతుణ్డ ప్రచణ్డాయ ఉగ్రతుణ్డాయ తే నమః

చణ్డాయ గురుచణ్డాయ చణ్డచణ్డాయ తే నమః
మత్తోన్మత్తప్రమత్తాయ నిత్యమత్తాయ తే నమః

ఉమాసుతం నమస్యామి గఙ్గాపుత్రాయ తే నమః
ఓఙ్కారాయ వషట్కార స్వాహాకారాయ తే నమః

మన్త్రమూర్తే మహాయోగిన్ జాతవేదే నమో నమః
పరశుపాశకహస్తాయ గజహస్తాయ తే నమః

మేఘాయ మేఘవర్ణాయ మేఘేశ్వర నమో నమః
ఘోరాయ ఘోరరూపాయ ఘోరఘోరాయ తే నమః

పురాణపూర్వపూజ్యాయ పురుషాయ నమో నమః
మదోత్కట నమస్తేఽస్తు నమస్తే చణ్డవిక్రమ

వినాయక నమస్తేఽస్తు నమస్తే భక్తవత్సల
భక్తప్రియాయ శాన్తాయ మహాతేజస్వినే నమః

యజ్ఞాయ యజ్ఞహోత్రే చ యజ్ఞేశాయ నమో నమః
నమస్తే శుక్లభస్మాఙ్గ శుక్లమాలాధరాయ చ

మదక్లిన్నకపోలాయ గణాధిపతయే నమః
రక్తపుష్ప ప్రియాయ చ రక్తచన్దన భూషిత

అగ్నిహోత్రాయ శాన్తాయ అపరాజయ్య తే నమః
ఆఖువాహన దేవేశ ఏకదన్తాయ తే నమః

శూర్పకర్ణాయ శూరాయ దీర్ఘదన్తాయ తే నమః
విఘ్నం హరతుదేవేశ శివపుత్రో వినాయకః

ఫలశ్రుతి

జపాదస్యైవ హోమాచ్చ సన్ధ్యోపాసనసస్తథా
విప్రో భవతి వేదాఢ్యః క్షత్రియో విజయీ భవేత్

వైశ్యో ధనసమృద్ధః స్యాత్ శూద్రః పాపైః ప్రముచ్యతే
గర్భిణీ జనయేత్పుత్రం కన్యా భర్తారమాప్నుయాత్

ప్రవాసీ లభతే స్థానం బద్ధో బన్ధాత్ ప్రముచ్యతే
ఇష్టసిద్ధిమవాప్నోతి పునాత్యాసత్తమం కులం

సర్వమఙ్గలమాఙ్గల్యం సర్వపాపప్రణాశనమ్
సర్వకామప్రదం పుంసాం పఠతాం శ్రుణుతామపి

ఇతి శ్రీబ్రహ్మాణ్డపురాణే స్కన్దప్రోక్త వినాయకస్తోత్రం సమ్పూర్ణమ్


Monday, September 10, 2012

బృహస్పతి వైభవం


బృహస్పతిగ్రహ అనుగ్రహానికి బృహస్పతి వైభవం చదవండి!

బృహస్పతి ఆవిర్భావం::
బృహస్పతి ప్రజాపతి పుత్రుడు…ప్రజాపతి ఎనమండుగురు….అని పురాణాల ద్వారా మనకు తెలుసుస్తోంది.
దక్షప్రజాపతి… త్వష్ట ప్రజాపతి…. కశ్యప ప్రజాపతి ఈ వరుస క్రమం లో… మరీచి… అనే మహాముని కుడా ప్రజాపతి పదవి లభించింది.ఈ ప్రజాపతులు తమ తమ ప్రాతినిధ్యం నిలుపుకొనుటకు అసంఖ్యాకంగా జనగణాలను సృష్టించ సాగారు.దక్షప్రజాపతికి స్త్రీ సంతానం అధికం ఒక కుమార్తె సతీదేవి ఈమే పరమేశ్వర పత్ని…ఒక కుమార్తె దితి ఆమె కశ్యపుని పత్ని…27 మందిని చంద్రునికి ఇచ్చి వివాహం చేసినాడు దక్షప్రజాపతి.
ఇంకొక ప్రజాపతి.. త్వష్ట… తన కుమార్తె …. సంజ్ఞ….సంజ్ఞను సూర్యునుకి ఇచ్చి వివాహం చేసినాడు త్వష్ట.ప్రజాపతి..
ఇదే విధంగా మరీచి ప్రజాపతి…తన పుత్రిక సురూపను ఆంగిరస మహర్షి ఇచ్చి వివాహం చేసినాడు మరీచి ప్రజాపతి. ఆంగిరస మహర్షి దంపతులకు….ఆంగిరస నామ సంవత్సర వైశాక సుద్ధ ఏకాదశి తిది యందు ఉత్తరపల్గుని నక్సత్రం లో బృహస్పతి జన్మించాడు.
బృహస్పతి రూప వివరణ :
ఒక చేతిలో అక్షమాల..మరొక చేతిలో కమండలం…ధరించి దేవతలకు గురువైనాడు బృహస్పతి…
మరో ప్రజాపతి పుత్రిక …తారను వివాహం చేసుకున్నాడు బృహస్పతి.
గురు గ్రహ అనుగ్రహానికి మార్గాలు

1.గురువారం నాడు శెనగలు దానం చేయుట.
2. బంగారం లో కనకపుష్యరాగాన్ని కుడిచేతి చూపుడు వ్రేలికి ధరించుట.
3.గురుధ్యాన శ్లోకం రోజుకి 160 సార్లు జపించుట.
4.గుంటూరు జిల్లా చేబ్రోలు లో గల బ్రహ్మ దేవాలయం దర్శించుట.
5.తమిళనాడు రాష్ట్రం లోని అల్లంగుడి ఆలయాన్ని దర్శించుట.
6.ప్రతి గురువారం సూర్యోదయానికి పూర్వమే 160 ప్రదక్షిణలు చేయుట.
7.గురువారం రోజున గోవుకు గ్రాసం పెట్టుట.
8.నవగ్రహాలలో గురువుగ్రహం వద్ద గురువారం రోజున 16 పసుపురంగు వత్తులతో దీపారాధన పసుపు వస్త్ర దానం చేయుట.
9.16 గురువారాలు 160 ప్రదక్షిణలు నవగ్రహాలకు చేసి కేజిం పావు బరువుకలిగిన శెనగలు పసుపు వస్త్రం లో దానం ఇచ్చుట.
10.16 గురువారాలు ఉపవాసం చేసి ఆఖరి గురువారం దక్షిణామూర్తి కి బృహస్పతికి అర్చన చేయించుట.
ఇలా చేయుట వలన గురుగ్రహానికి పాత్రులు అవుతారు.

Wednesday, September 5, 2012

త్రిశక్తులు..త్రిమూర్తులు
























త్రిమూర్తులు

ఈ జగత్తంతా మాయకు అధీనమై ఉంటుంది. అందువల్లనే సంసారం సాగరమని తెలిసినా అందులోనే పడి కొట్టుకుంటూ మోక్షం కోసం ఎవరూ ప్రయత్నించరు. ఈ విషయంలో త్రిమూర్తులు కూడా అతీతులు కారు అని అంటుంది దేవీ భాగవతం ఆరోస్కంధం. అయితే కొద్దిగా మనసుపెట్టి ఆలోచిస్తే, మరికొంత కృషి చేస్తే మాయకు లోబడకుండా ఉండే ఉపాయం వివరిస్తోంది. మాయశక్తి మహిమ సామాన్యమైంది కాదు. ఎలాంటి వారైనా దానికి లొంగి పోవాల్సిందే. హిందూమతము సంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారము, పురాణాలలో చెప్పిన ప్రకారము త్రిమూర్తులు, అనగా ముగ్గురు దేవుళ్ళు ప్రధాన ఆరాధ్యదైవాలు. వారు

* బ్రహ్మ - సృష్టికర్త
* విష్ణువు - సృష్టి పాలకుదు
* మహేశ్వరుడు - సృష్టి లయ కారకుడు

ఇది స్థూలంగా చెప్పబడే విషయం. ఇక వివరాలకొస్తే వివిధ సంప్రదాయాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కధలు, నమ్మకాలు, ఆరాధనామార్గాలు మారుతుంటాయి. కాని ప్రధానమైన నమ్మకాలుగా క్రిందివాటిని చెప్పవచ్చును.


* బ్రహ్మ: సృష్టి కర్త. బ్రహ్మ ఉండేది సత్యలోకం. ఆసనం పద్మం. బ్రహ్మ నాలుగు ముఖాలనుండి నాలుగు వేదాలు ఉద్భవించాయి. బ్రహ్మకు పత్ని సరస్వతి చదువుల దేవత. విష్ణువు నాభి లోని పద్మంనుండి బ్రహ్మ జనించాడు గనుక బ్రహ్మకు విష్ణువు జనకుడు.



* విష్ణువు: సృష్టి పాలకుడు. అంటే సృష్టిని నడిపించేవాడు. నివాసం వైకుంఠం. శయనించేది పాలకడలిలో ఆదిశేషునిపైన. పయనించేది గరుత్మంతునిపైన. సంపదల దేవతయైన లక్ష్మీదేవి విష్ణువునకు భార్య. ఆయన ఆయుధములు అయిదు. నారాయణుడు, వాసుదేవుడు వంటి ఎన్నో నామములు. వీటిలో వేయి ప్రధాన నామములు విష్ణు సహస్రనామ స్తోత్రముగా ప్రసిద్ధము. విష్ణువు యుగయుగాన అవతారాలెత్తి లోకంలో ధర్మం నిలుపుతాడు. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వేంకటేశ్వరస్వామి ఇవి ప్రజలు ఎక్కువగా ఆరాధించే అవతారాలు.


* శివుడు: కాలాంతములో సృష్టిని అంతము చేస్తాడు (పునఃసృష్టికి అనుకూలంగా). ఉండేది కైలాసం. వాహనం నంది. త్రినేత్రుడు. తలపై గంగ. మెడలో సర్పము. చర్మాంబరధారి. భక్తసులభుడు. శివుని ఇల్లాలు పార్వతి జగజ్జనని. ఈశ్వరుడు, శంకరుడు, మహాదేవుడు, గంగాధరుడు, నీలకంఠుడు ఇవి ఈయన కొన్ని పేర్లు. వీరంతా ఒకే పరబ్రహ్మముయొక్క వివిధ స్వరూపములనికూడా పలుచోట్ల ప్రస్తావింపబడింది.

విశేషాలు

* ఒక పురాణ కధ ప్రకారం బ్రహ్మకు ఒక శాపం కలిగింది. కనుక బ్రహ్మను పూజించడం అరుదు. కాని త్రిమూర్తులను కలిపి పూజిస్తే దోషం లేదంటారు.
* ఇలా చేసే పూజలలో త్రిమూర్తి వ్రతం ముఖ్యమైనది.





త్రిశక్తులు

త్రిమూతుల భార్యలుగా ప్రసిద్ధి చెందిన వారే ఈ త్రిశక్తులు . 1.సరస్వతి , 2.లక్ష్మి , 3.పార్వతి .

దైవము అనగా శుద్ద చైతన్య స్వరూపమైన మహా వెలుగు. అది అనంతమైనది. అవధులు లేనిది. ఆ శుద్ద చైతన్యము నుండి జీవుల కోరిక మేరకు సృష్టి సంకల్పం బయలుదేరుతుంది. అసలు మూలతత్వానికి సంకల్పంలేదు. అందున్న జీవుల కోరిక వల్ల ఒక సంకల్పం బయటకు వస్తుంది. పరిపూర్ణత పొందటమే ఆ జీవుల కోరిక. అపరిపూర్ణతచేత మరల మరల జన్మిస్తూ వుంటాం. పరిపూర్ణత పొందినవారు, అపరిపూర్ణులకు సహాయమందించుటకు భగవంతుని ప్రతినిధులుగా వారు కూడా దిగివస్తారు. వారే గురుపరంపర. వీరు పరిపూర్ణత కొరకు ప్రయత్నించే వారికి సహాయ సహకారములు అందిస్తారు. వీరు అన్ని లోకములలో పనిచేస్తూ వుంటారు. అలాంటి పరిపూర్ణుల గురించి భగవద్గీతలో విభూది యోగంలో భగవంతునిచే తెలియపరచ బడినది. వారే సనకస నందనాదులు, సప్త ఋషులు, ప్రజాపతులు మొదలగు వారు. కాబట్టి అసలు సంకల్పము జీవులది. ఆ జీవుల సంకల్పము ప్రకారం వారికి పరిపూర్ణులుగా చేయుటకు భగవంతుడు తనను తాను సృష్టించుకొని ఒక మహా చైతన్య స్వరూపుడై వెలుగై నిలుస్తాడు.

ఆ మహా చైతన్యమే అన్నిటికి ఆథారము. దాన్నే అదితి అని, గాయత్రి అని, సావిత్రి అని, సరస్వతి అని అంటారు. దాన్నే త్రిగుణములకు అవతల వున్న అమ్మవారుగా, జగన్మాతగా కొలుస్తాము. ఆ శుద్ద చైతన్య స్వరూపులమే మనమంతా కూడా. కాని మనం త్రిగుణముల నుండి దిగి వచ్చిన కారణంగా త్రిగుణములలో బంధింపబడి వుంటాము.

Tuesday, September 4, 2012

గంగా చరితం - 1

















గంగా చరితం - 1
శోణా నదీ తీరం ప్రకృతి సోయగానికే మారుపేరులా ఉంది. నదీ తరంగాలతో పాటు వీస్తున్న శీతల పవనాలు వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తున్నాయి.
పెద్దగా లోతు లేని ఒండ్రు, ఇసుకతో కూడిన ఆ శుభ జల వాహినిని ఎలా దాటితే శ్రేయస్కరమనే విషయాన్ని సెలవీయవలసినదిగా విశ్వామిత్రుడ్ని అడిగాడు రాముడు.
నాయనా మహర్షులు నడిచే ఒక మార్గం నాకు తెలుసు. ఆ దారిన నడిస్తే మనం శీఘ్రంగా, శుభప్రదంగా ఈ నదిని దాటగలం. రండి చూపిస్తాను.. అంటూ దారి తీశాడు విశ్వామిత్రుడు. వెంట నడిచారు దాశరధులు, మునులూ.
పరమ సుందరమైన ఉద్యాన వనాలను, సైకత మైదానాల శోభలను తిలకిస్తూ ముని సమూహం ముందుకు సాగింది. వారంతా గంగా తీరానికి చేరుకునేసరికి మధ్యాహ్నమైనది. గంగా తీరం సౌందర్యానికి మంత్రముగ్దులయ్యారు వారంతా. అక్కడి శీతల పవనాల స్పర్శ వారి ప్రయాణ బడలికను లిప్త పాటులో హరించింది. మహర్షి సేవితమగు గంగా తీరాన్ని చేరి, యోగులకు ఆలవాలమైన దివ్య తీర్థాన్ని గాంచి మునులు, రాకుమారులు పులకిత గాత్రులయ్యారు.
శ్రేష్టమైన పుణ్య జలంతో కూడిన ఆ అపార జలనిధిలో హంసలనేకం స్వేచ్చగా సంచరిస్తున్నాయి. ఆ అద్భుత దృశ్యం చూపరులకు కమనీయమై ఒప్పింది. ఇక రామ లక్ష్మణుల సంగతి వేరే చెప్పాలా... ఆ మనోహర తీరాన్ని, అచటి పవిత్రతను కనుగొన్న ఆ సోదరులు నిజవాసం చేరినంతగా సంతోషించారు. మునుల ఆనందానికి ఇక అంతే లేదు. ఏలనంటే వారి నిజవాసమే అది గనుక.
పావన గంగా తీరాన మునులందరూ తాత్కాలిక ఆవాసాలను ఏర్పాటు చేశారు. శాస్త్ర విహితానుసారం స్నాన సంధ్యార్చనలు ముగిసాయి. అగ్నిహోత్రాలను వెలయించారు. వాటిలో హవిస్సులను అర్పించి పితృ దేవతలను, దేవతలను సంతృప్తి పరిచారు. ఆ తదుపరి హోమాన్నాన్ని తృప్తిగా అమృతం వలె సంభావించి భుజించారు ఆ రుషి సంఘమంతా.
ఇలా అన్ని కార్యక్రమాలూ ముగిసిన తర్వాత మునిజనమంతా విశ్వామిత్ర మహర్షి చుట్టూ చేరారు. రుషిజన పరివేష్టితుడైన విశ్వామిత్రుడు ప్రమధగణ పరివేష్టితుడైన పరమశివుని వలె గోచరిస్తున్నాడు.
మునిజనమంతా మహర్షిని అడిగి తమ ధర్మసందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. అందరి ప్రశ్నలకూ సమాధానాలు చెబుతున్న మహర్షి వాత్సల్య పూరితంగా రాముని పరికించాడు.
అప్పుడు రాముడు అడిగాడు వినయంగా... "మహర్షీ ! గంగానదిని త్రిపథగ అంటారు గదా.. ఈ దివ్య జలవాహిని ఎలా ఆవిర్భవించినది ? ఎలా ముల్లోకాలనూ ఆక్రమించినది... మరెలా సముద్రుని చేరుకున్నది... ఇవన్నీ తెలిపి మమ్మల్ని అనుగ్రహించండి"
రాముని ప్రశ్నకు సమాధానంగా కౌశికుడు గంగా చరితాన్ని చెప్పడం ప్రారంభించాడు... (తరువాయి రెండో భాగం )
శ్రీమద్రామాయణం నుంచి... శైలి : దీక్షితుల సుబ్రహ్మణ్యం