Tuesday, September 4, 2012

గంగా చరితం - 1

















గంగా చరితం - 1
శోణా నదీ తీరం ప్రకృతి సోయగానికే మారుపేరులా ఉంది. నదీ తరంగాలతో పాటు వీస్తున్న శీతల పవనాలు వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తున్నాయి.
పెద్దగా లోతు లేని ఒండ్రు, ఇసుకతో కూడిన ఆ శుభ జల వాహినిని ఎలా దాటితే శ్రేయస్కరమనే విషయాన్ని సెలవీయవలసినదిగా విశ్వామిత్రుడ్ని అడిగాడు రాముడు.
నాయనా మహర్షులు నడిచే ఒక మార్గం నాకు తెలుసు. ఆ దారిన నడిస్తే మనం శీఘ్రంగా, శుభప్రదంగా ఈ నదిని దాటగలం. రండి చూపిస్తాను.. అంటూ దారి తీశాడు విశ్వామిత్రుడు. వెంట నడిచారు దాశరధులు, మునులూ.
పరమ సుందరమైన ఉద్యాన వనాలను, సైకత మైదానాల శోభలను తిలకిస్తూ ముని సమూహం ముందుకు సాగింది. వారంతా గంగా తీరానికి చేరుకునేసరికి మధ్యాహ్నమైనది. గంగా తీరం సౌందర్యానికి మంత్రముగ్దులయ్యారు వారంతా. అక్కడి శీతల పవనాల స్పర్శ వారి ప్రయాణ బడలికను లిప్త పాటులో హరించింది. మహర్షి సేవితమగు గంగా తీరాన్ని చేరి, యోగులకు ఆలవాలమైన దివ్య తీర్థాన్ని గాంచి మునులు, రాకుమారులు పులకిత గాత్రులయ్యారు.
శ్రేష్టమైన పుణ్య జలంతో కూడిన ఆ అపార జలనిధిలో హంసలనేకం స్వేచ్చగా సంచరిస్తున్నాయి. ఆ అద్భుత దృశ్యం చూపరులకు కమనీయమై ఒప్పింది. ఇక రామ లక్ష్మణుల సంగతి వేరే చెప్పాలా... ఆ మనోహర తీరాన్ని, అచటి పవిత్రతను కనుగొన్న ఆ సోదరులు నిజవాసం చేరినంతగా సంతోషించారు. మునుల ఆనందానికి ఇక అంతే లేదు. ఏలనంటే వారి నిజవాసమే అది గనుక.
పావన గంగా తీరాన మునులందరూ తాత్కాలిక ఆవాసాలను ఏర్పాటు చేశారు. శాస్త్ర విహితానుసారం స్నాన సంధ్యార్చనలు ముగిసాయి. అగ్నిహోత్రాలను వెలయించారు. వాటిలో హవిస్సులను అర్పించి పితృ దేవతలను, దేవతలను సంతృప్తి పరిచారు. ఆ తదుపరి హోమాన్నాన్ని తృప్తిగా అమృతం వలె సంభావించి భుజించారు ఆ రుషి సంఘమంతా.
ఇలా అన్ని కార్యక్రమాలూ ముగిసిన తర్వాత మునిజనమంతా విశ్వామిత్ర మహర్షి చుట్టూ చేరారు. రుషిజన పరివేష్టితుడైన విశ్వామిత్రుడు ప్రమధగణ పరివేష్టితుడైన పరమశివుని వలె గోచరిస్తున్నాడు.
మునిజనమంతా మహర్షిని అడిగి తమ ధర్మసందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. అందరి ప్రశ్నలకూ సమాధానాలు చెబుతున్న మహర్షి వాత్సల్య పూరితంగా రాముని పరికించాడు.
అప్పుడు రాముడు అడిగాడు వినయంగా... "మహర్షీ ! గంగానదిని త్రిపథగ అంటారు గదా.. ఈ దివ్య జలవాహిని ఎలా ఆవిర్భవించినది ? ఎలా ముల్లోకాలనూ ఆక్రమించినది... మరెలా సముద్రుని చేరుకున్నది... ఇవన్నీ తెలిపి మమ్మల్ని అనుగ్రహించండి"
రాముని ప్రశ్నకు సమాధానంగా కౌశికుడు గంగా చరితాన్ని చెప్పడం ప్రారంభించాడు... (తరువాయి రెండో భాగం )
శ్రీమద్రామాయణం నుంచి... శైలి : దీక్షితుల సుబ్రహ్మణ్యం

No comments: