Thursday, December 29, 2011

తిరుప్పావై--15






15)ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్

Thiruppavai in English - Pasuram 15.

15)Ellay! Illam Kiliye! Innam urungudhyo!
Chill enru azhayen min Nangaimeer! Podharukinren
Vallai un katturaikal pande un vaai arithum
Valleergal neengale! Naanthan aayiduga!
ollai nee podaai, unakkenna verudayai
Ellarum pondhaaro? Pondhaar pondhu ennikkol
Vallaanai-k-konraanai, maatraarai maatrazhikka
Vallaanai Mayanai-p-paadu-el or empaavaai

Thiruppavai in Tamil-திருப்பாவை பாசுரம் 15.

15)எல்லே! இளம்கிளியே இன்னம் உறங்குதியோ?
சில்என்று அழையேன்மின் நங்கைமீர்! போதர்கின்றேன்
வல்லைஉன் கட்டுரைகள் பண்டேஉன் வாய்அறிதும்
வல்லீர்கள் நீங்களே நானே தான்ஆயிடுக
ஒல்லைநீ போதாய் உனக்கென்ன வேறுடையை
எல்லாரும் போந்தாரோ? போந்தார் போந்து
எண்ணிக்கொள்
வல்லானை கொன்றானை மாற்றாரை மாற்றழிக்க
வல்லானை மாயனைப் பாடேலோர் எம்பாவாய்.


అర్థము::
బయటి గోపికలు:: ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్ర పోతున్నావా ? అయ్యో ఇది ఏమి ?
లోని గోపిక:: పూర్ణులగు గోపికలారా ! చికాకు కలుగునట్లు జిల్లుమని పిలువకండి..నేను ఇదే చెప్పుచున్నాను.
బయటి గోపుకలు:: నీవు చాలా నేర్పు కలదానవు. నీమాటలలో నైపుణ్యము కాఠిణ్యము మాకు ముందే తెలియును.
లోని గోపిక:: మీరే నేర్పు కలవారు..పోనిండు ! నేనే కఠినురాలను.
బయటి గోపిక:: నీకీ ప్రత్యేకత ఏమి? అట్లు ఏకాంతముగా ఎందుకు వుంటావు. వేగముగా బయటకు రా !
లోని గోపిక:: అందరు గోపికలు వచ్చినారా.
బయటి గోపికలు:: వచ్చిరి..నీవు వచ్చి లెక్కించుకో .
లోని గోపిక:: సరే..నేను వచ్చి నేను ఏమి చెయ్యాలి ?
బయటి గోపికలు:: బలిష్టమగు కువయాపీడము అను ఏనుగును చంపినవాడను శతృవుల దర్పమును అణచినవాడను..మాయావి అగు శ్రీ కృష్ణుని కీర్తిని గానము చెయుటకు రమ్ము..లెమ్ము మాతో వచ్చి చేరుము అని లోపలి గోపికను లేపినారు.














ఓం గురుభ్యో నమః____/\____ 
గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వరరావుగారు చెప్పిన 

తిరుప్పావై 15వ రోజు పాశురము

ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్

మనిషికి సహనం, ఓరిమి కలగడం చాలా కష్టం. ఉద్రేకం రావడం అనేది మానవసహజం, కాని దాన్ని ఓరిమితో సహించడం మానవప్రయత్నంతోనే సంభవం. దీన్నే మనం సాధన అంటాం. ఇది భాగవత సహవాసం వల్ల ఏర్పడుతుంది. అలా ఏర్పడి ఉంటే, అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడింది. మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే. ఆచార్య సన్నిదానానికి చేరే ముందర కల్గాల్సిన దాంట్లో ఇది ముందర స్థితి . ఈ రోజు ఆండాళ్ తల్లి ఎట్లాంటి భాగవతోత్తముల సహవాసం మనకు కావాలో చెబుతుంది.

ఈరోజు పాశురం బయట గోపబాలికలకు లోపల గోపబాలిక మద్య సంభాషణలా సాగుతుంది. నిన్నటి గోపబాలికతో కల్శి వీరంతా స్వామిని పంఖజ నేత్రా, పుండరీకాక్షా అని పాడుతుంటే విన్నది. ఈవిడకి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం. తాను లేచి బయటకొస్తే వారు పాడటం ఆపేస్తారేమోనని అనుకొని తాను లోపలనుండే గొంతు కలిపి ఆనందిస్తుంది.

అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోప బాలిక మెలుకువతోనే ఉండి తమ దగ్గరకు రాలేదని కోపంతో, "ఎల్లే!" ఏమే "ఇళంకిళియే!" లేత చిలకా! "ఇన్నం ఉఱంగుదియో" ఇంకా నిద్ర పోతూనే ఉన్నావా. వీళ్ళకేమో ఈ గోపబాలిక అందమైన గొంతు కలదని, వారి వెంట ఈ గోప బాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్ళకు దొరుకుతాడు అని భావిస్తున్నారు ఆమెలోని యోగ్యతను పొగుడుతున్నారు.

కాని లోపల గోప బాలికకు నేను మిమ్మల్ని అంతా ఎడబాసి బాధతో నేనుండగా నన్ను పొగడటం సరికాదు అని, శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించి "శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్" ఏమిటా గోల మీరంతా, శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమి లేడు"నంగైమీర్!" పరిపూర్ణులు మీరే. "పోదరుగిన్ఱేన్" వస్తున్నాను అని అంది.

బయట నుండి వాళ్ళు "వల్లై" మహా సమర్దురాలివే "ఉన్ కట్టురైగళ్" నీ నోటి దురుసుతనం మాకు తెలుసులే, "పండేయున్ వాయఱిదుమ్" ఎప్పటినుండో మాకు నీ సంగతి తెలుసులే అని అన్నారు. అంతలో లోపల గోప బాలిక"వల్లీర్గళ్ నీంగళే" మీరే సమర్థులు, నన్నా సమర్థురాలు అని అంటున్నారు, అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటుచే భాదలో ఉన్నాను, మీరేమో అంతా కల్సి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు, "నానే తాన్ ఆయిడుగ" రాకపోవడం నాదే తప్పు అని ఓరిమితో అంది.

కాని బయట నుండి,"ఒల్లై నీ పోదాయ్" ఏమే రా! మరి ఇంక, "ఉనక్కెన్న వేఱుడైయై" మరి తప్పు ఒప్పుకున్నా నీకేమి వేరే అనుభవమా మరొకసారి ఎత్తిపొడిచారు లోపల గోపబాలికను పరిక్షించటానికి. ఆమె లోపలనుండి"ఎల్లారుం పోందారో" అంతా వచ్చారా అంది, బయటనుండి వీల్లు "పోందార్" అందరూ వచ్చారు, నీవు బయటికి రా నీ దర్శనం మాకు కావాలి అన్నారు.

"పోంద్-ఎణ్ణిక్కోళ్" ఏం చేద్దాం అందరం అని ఆడిగింది లోపల గోప బాలిక. "వల్లానై కొన్ఱానై" బలం కల్గిన ఏనుగు - కువలయాపీడం "మాత్తారై మాత్తరిక్కవల్లానై" దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి, శత్రువులలోని శత్రుత్వాన్ని తొలగించగల్గినవాడు "మాయనై" చిత్ర విచిత్రమైన మాయలు చేసే మాయావిని "ప్పాడ" పాడుదాం.

ఆండాళ్ తల్లి అయిదోపాటలో మాయనై అని మొదలుపెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది. శ్రీకృష్ణుడు పుట్టింది మథురలో, పెరిగింది గోకులంలో అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మళ్ళీ మథురానగరానికి తిరిగి వచ్చి కంస సంహారం చేసాడు. మథురానగరం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చేవరకు ఉంది ఆయన మాయ. పుట్టగానే రాత్రికి రాత్రికే యమునానది దాటి ఆవల గోకులానికి బయలుదేరాడు, అక్కడికి పంపిన పూతన, శకటాసురుడు, అశ్వాసురుడు, బకాసురుడిని సంహరించి తన కళ్యాణ గుణాలతో అక్కడివారిని పిచ్చెక్కించి, అక్కడినుండి తిరిగి మథురకు వచ్చి కువలయాపీడాన్ని, చారూణముష్టికులను చంపి, కంసున్ని చంపి, బందీగా ఉన్న ఉగ్రసేనున్ని రాజుగా చేసి మథురానగరానికి పట్టిన దారిద్ర్యాన్ని తొలగించాడు. ఇది భగవంతుడు చేసే చేష్ట.


ఈరోజుతో పదో గోపబాలికను లేపుతూ మనకు ఒక పది రకాల జ్ఞానులని, వారి జ్ఞాన దశలను పరిచయం చేసింది ఆండాళ్. అలాంటి యోగ్యత కల్గిన మహనీయుల్ని మనం చేరి ఉండాలని, వారిని దర్శించుకుంటూ వారు ఆదేశించిన మార్గంలో పయనిస్తూ జీవితంలో ముందుకు సాగ గలిగితే అది మనకు శ్రేయస్సు. ఇది నిలబడడానికి మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి తప్ప, లోకంలో భక్తులను దూరం చేసుకోకూడదు. తిరుప్పావై మనకు అదే నిరూపణ చేస్తుంది. పదిమంది గోపికలను లేపే ఈ పది పాటలే తిరుప్పావై అంటారు, ఇక ఈ నమ్మకం గట్టి పడటానికి మిగతా పాటలు.

No comments: