Tuesday, November 17, 2015

శివపురాణము--6


శివపురాణం::–6
రచన::చాగంటి కోటీశ్వర రావు గారు 
చాగంటి గురువుగారి ఆశీస్సులతో 

శశిశేఖరుడు – జ్యోతిర్లింగములు 
‘శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః’ – ఆయనను శశిశేఖరః’ అని పిలుస్తారు. శశము అనగా కుందేలు. దూకే స్వభావం ఉన్నది. దూకేస్వభావం ఉన్నది కాలము. సుఖము చేత కాలము దూకేస్తుంది. దుఃఖములో వుంటే కాలము గడుస్తున్నట్లు అనిపించదు. దాంట్లో అర్థం చేసుకోవలసిన రహస్యం ఒకటి ఉన్నది. మీరు దానిని పట్టుకుంటే ‘శశిశేఖరః’ అన్నమాటకున్న తాత్త్వికమయిన అర్థం అర్థం అవుతుంది. కాలంలో సుఖదుఃఖములు రెండూ ఉంటాయి. దూకేసినట్లు కనపడిన కాలమును, దూకనట్లు కనపడిన కాలమును వైదిక సమన్వయము చేస్తే మీరు రోజూ చెప్పేటప్పుడు కాలమును ఎలా చెప్పుతారు? శ్రీవిరోధి నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే పంచంయాం భూమవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథే శ్రీమాన్ శ్రీమతః’ అని చెప్తాము. ఎవడు ఆయన పాదములు పట్టుకున్నాడో అటువంటి వాడికి జ్ఞానమును ఇచ్చి కాలాతీతుడిని చేసి, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని కలిగించగలడు. కాలము ఆభరణముగా కలిగిన వాడని చెప్పడానికే చంద్రరేఖను పొంది ఉంటాడు. మోక్షం ఇవ్వగలవాడని చెప్పడం కోసమే చంద్రరేఖను ధరించి ఉండడం. ఇదే శశిశేఖర అన్నమాటకు అసలు తాత్త్వికమయిన రహస్యం.
కానీ మనం సోమనాథ లింగము అన్నమాటను ప్రస్తావన చేస్తాము. శాస్త్ర సంబంధం అయిన మాటలలో కొన్ని ఆశ్చర్యకరమయిన మాటలు ఉంటాయి. మీరు కంచిలో ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లి దానిని జ్యోతిర్లింగం అంటే శాస్త్రం అంగీకరించదు. దానిని అష్టమూర్తులయందు ఒక లింగము – పృథివీలింగము అని పిలుస్తారు. పంచ భూతలింగములలో ఒకటి.
కాళహస్తిలోని లింగము వాయులింగము. అది జ్యోతిర్లింగం కాదు. జంబుకేశ్వరంలోని శివలింగం జలలింగం. అది జ్యోతిర్లింగం కాదు. కానీ కొన్ని శివలింగములను జ్యోతిర్లింగములు అని పిలుస్తారు. 
“సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం” అని మనం ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రం చదువుతుంటాం. ఈ పన్నెండింటినీ మనం జ్యోతిర్లింగములని పిలుస్తున్నాము. 
సోమనాథుడు – సోమనాథ్ – గుజరాత్; మల్లికార్జున స్వామి – శ్రీశైలం - ఆంధ్రప్రదేశ్; మహాకాలేశ్వరుడు - ఉజ్జయిని – మధ్యప్రదేశ్; అమలేశ్వరుడు – ఓంకారేశ్వరం – మధ్యప్రదేశ్; వైద్యనాథుడు – పర్లి – మహారాష్ట్ర; భీమశంకరుడు – పూణే – మహారాష్ట్ర; రామలింగేశ్వరుడు – రామేశ్వరం – తమిళనాడు; నాగేశ్వరుడు – ఔండా – గుజరాత్; విశ్వనాథుడు – వారణాసి – ఉత్తరప్రదేశ్; త్ర్యంబకేశ్వరుడు – నాసిక్ – మహారాష్ట్ర; కేదారేశ్వరుడు – కేదారనాథ్ – హిమాచల్ ప్రదేశ్; ఘ్రుష్ణేశ్వరుడు – వెరుల్ – మహారాష్ట్ర. 
జ్యోతిర్లింగములని మనం వాటిని పిలిచినప్పుడు ఈ పన్నెండు చోట్ల జ్యోతి ఉండాలి. కానీ మనం ఆయా క్షేత్రములకు వెళ్ళి చూసినట్లయితే అక్కడ మనకు శివలింగమే కనపడుతుంది. కానీ జ్యోతి కనపడదు. అయితే ఈ పన్నెండింటిలోనే జ్యోతిర్లింగములని ఎందుకు అంటారు? దీనికి సమాధానం “ఆపాతాళనభఃస్థలా” అని రుద్రమునకు ఉన్న ప్రార్థనా గద్యయందు చెప్పారు. మీరు ఆ లింగం దగ్గరకు వెళ్ళి అడిగినప్పుడు ఇహమునందు కావలసిన సౌఖ్యమునుండి మోక్షము వరకు ఏదయినా ఇవ్వగలిగిన పరబ్రహ్మ స్వరూపంగా ఆ శివలింగం ఉన్నది.ఈ లోకమునందు జ్ఞానము పొందాలన్నా కోరికలు తీరవలెనన్నా శివుడిని అర్చించాలి. కోర్కె తీర్చడం దగ్గర నుంచి మోక్షం ఇవ్వడం వరకు చేయగలిగిన శివలింగములు ఏవి ఉన్నాయో అవి జ్యోతిర్లింగములు. అటువంటి జ్యోతిర్లింగములు స్వయంభు – ఒకరు ప్రతిష్ఠించినవి కావు. ఈశ్వరుడు చిత్రవిచిత్రమయిన పరిస్థితులలో అలా వచ్చాడు. అలా ఎందుకు వచ్చాడు అని తెలుసుకోవడానికి మనం స్థల పురాణములను పరిశీలించాలి. ఆయా కథలను తెలుసుకుని స్మరించడం చేత స్వయంభువు అయిన ఈశ్వరుడు ప్రసన్నుడై ఎన్నో శుభఫలితములను ఇస్తాడు. ఆయా కథలను వింటున్నప్పుడు మీకు తెలియకుండానే మీ మనస్సు ఆయా క్షేత్రముల వద్దకు వెళ్ళిపోతుంది. 
‘శశిశేఖరః’ అన్న నామము వ్యాఖ్యానం చేస్తూ అంటారు – దక్ష ప్రజాపతికి 27మంది కుమార్తెలు. ఈ 27మంది కుమార్తెలే అశ్వని భరణి మున్నగు పేర్లు కలవాళ్ళు. వారిని చంద్రునికిచ్చి వివాహం చేశాడు. పూర్వం దక్షిణనాయకత్వం అని ఒకటి ఉండేది. విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన రామరాయల వారికి అనేక భార్యలు ఉండేవారు. దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలు ఉండేవారు. పూర్వం అలా దక్షిణ నాయకత్వం ఉండేదో. తన భార్యలతో చంద్రుడు సంతోషంగా ఉండాలి. కానీ చంద్రుని చరిత్రయందు ఒకదోషం ఉంది. ఆయన కొంచెం తొందరపడిపోవడం యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏ స్త్రీపట్ల అలా ప్రవర్తించడం మహాపాతకమని శాస్త్రం చెప్పిందో అలాంటి వాళ్ళతో రమించడం కూడా చంద్రుని చరిత్రలో ఒకచోట ఉన్నది. ఈ అలవాటు ఫలితం ఎక్కడో రావాలి. అందుకుగాను శివుడు తన ధనుస్సులోంచి చంద్రునకి పాపఫలితం ఒకదానిని ఇస్తున్నాడు. చంద్రుడు తన భార్యలలో రోహిణి మీద అధిక ప్రేమను కనపరచాడు. ఇది సహజంగా మిగిలిన 26మందికి బాధ కలిగించింది. వాళ్ళు తండ్రిగారి వద్దకు వెళ్లి ఈ విషయమును చాలా బాధపతుతూ చెప్పారు. విన్న తండ్రి మనస్సు ఎంతగానో క్రున్గింది. ఆయనకు చంద్రుడి మీద చాలా కోపం వచ్చింది. వెంటనే దక్ష ప్రజాపతి చంద్రలోకం వెళ్ళాడు. అల్లుడయిన చంద్రుడు ఆయనకు ఎదురు వచ్చి తీసుకు వచ్చి కూర్చోపెట్టాడు. అపుడు దక్షుడు చంద్రునితో ‘నీకు నేను నా 27మంది కుమార్తెలను యిచ్చి వివాహం చేసినప్పుడు అందరినీ జాగ్రత్తగా సమానంగా చూసుకుంటాను అని మాట ఇచ్చావు. కానీ నీవు ఒక్క రోహిణితో మాత్రమే ఉంటున్నావని తెలిసింది. అందరినీ సమానంగా చూసుకో” అని చెప్పాడు. తప్పకుండా ఆయన మాట ప్రకారం నడుచుకుంటాను అని బదులిచ్చాడు. కొంతకాలం గడిచింది. కానీ అల్లుడి ప్రవర్తనలో ఏమీ మార్పులేదని, రోహిణి తప్ప మిగిలిన కుమార్తెలందరూ పూర్వంలాగే బాధపడుతున్నారని దక్షప్రజాపతికి తెలిసింది. దక్షునికి కోపం వచ్చి నీ విశ్రుంఖలత్వమునకు అడ్డుకట్ట వేస్తాను. నీవు క్షయవ్యాధి పీడితుడవు అవుదువు గాక’ అని శపించాడు. దీనివలన పూర్వం సంతోషపడిన రోహిణి కూడా చంద్రుడిని దగ్గరకు రానీయదని ఆయన ఉద్దేశ్యం. ఫలితంగా చంద్రునికి క్షయవ్యాధి వచ్చింది. దాని ఫలితంగా దేవతలందరూ నీరసపడి పోయారు.
చంద్రుడు బాగా ప్రకాశిస్తే ఆయన అనుగ్రహం చేత ఓషధులు ప్రకాశిస్తాయి. ఓషధులు బాగా ప్రకాశిస్తే ఓషధులతో కూడిన ద్రవ్యంతో యజ్ఞం చేయాలి. ఆ హవిస్సులను దేవతలు తీసుకుంటారు. అపుడు దేవతల ఆకలి తీరినట్లయితే వారు మనకు మంగళములను ఇస్తారు. చంద్రునికి క్షయ వ్యాధి సోకడం చేత దేవతలకు హవిస్సులు లేవు. ప్రజలకు మంగళములు లేవు. అటు దేవతలు, ప్రజలు మాడిపోయారు. ఇప్పుడు ఇది అన్ని లోకముల సమస్య అయి కూర్చుంది. ఇపుడు వీళ్ళందరూ తమలో తాము చర్చించుకుని అత్రి మహర్షిని పిలిచి అందరూ కలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. అప్పుడు బ్రహ్మగారు –
“నేను లోక్ష సంక్షేమం గురించి చెప్తున్నాను. ఇపుడు చంద్రుడు ప్రభాస క్షేత్రమునకు వెళ్ళాలి. ప్రభాస క్షేత్రం సముద్రపు ఒడ్డున ఉంది. ఆ క్షేత్రంలో ఒక గుంత త్రవ్వి అందులో ఒక పార్థివలింగమును పెట్టుకుని పంచాక్షరి మహా మంత్రం జపమును, మృత్యుంజయమంత్రంతో కలిపి అనుష్ఠానం చేయాలి. ఎంత శాపం ఉన్నా ఇటు బ్రాహ్మణ వాక్కునూ, అటు చంద్రుడినీ చచ్చిపోకుండా కాపాడాలంటే పరబ్రహ్మమునకు తప్ప వేరోకనికి సాధ్యం కాదు. కాబట్టి శంకరుడు మాత్రమే ఈ పనిని చేయాలి. అందుకని అక్కడికి వెళ్లి పార్థివలింగమునకు అర్చన చేయమనండి” అని చెప్పాడు. 
వెంటనే చంద్రుడు ప్రభాస క్షేత్రమునకు వెళ్లి పంచాక్షరీ మంత్రమును, మృత్యుంజయ మహా మంత్రముతో అనుసంధానం చేశాడు. ఇపుడు ఎవడు వ్యాధిని ఇచ్చాడో వాడే – ‘శివా శరవ్యాయా తవ త యా నో రుద్రా మృడయ’ – రక్షించాలి. కొన్ని కోట్ల జపం అయిపోయిన తర్వాత భగవానుడు శంకరుడు, పార్వతీ సహితుడై ప్రత్యక్షమై ‘ఏమిటి నాయనా నీ అభీష్టము’ అని అడిగాడు. అపుడు చంద్రుడు తనకి క్షయవ్యాధి తగ్గిపోయేలా చేయమని పరమేశ్వరుని ప్రార్థించాడు. ఇపుడు నీ క్షయవ్యాధి పోతుంది అని పరమాత్మ అనగలరు. కానీ అలా అనినట్లయితే దక్ష ప్రజాపతి మాటకు విలువ లేనట్లవుతుంది. ఆయన మాట నిలబడాలి, తప్పు చేసిన వాడయినా తన పాదములు పట్టుకున్నాడు కాబట్టి అతని బుద్ధిని కూడా సంస్కరించాలి. అందుకే తరువాత చంద్రుడు తన 27మంది భార్యలతో సమానంగా లేదు అని చెప్పడానికి ఉదాహరణమే చాద్రమానంలో దీనిని చెప్తున్న తిథులు. పరమేశ్వరుడు బుద్ధిని ధర్మం వైపు మారుస్తాడు కాబట్టే ఆయనకు మనం రుద్రశబ్దమును ఉపయోగించాము. చంద్రునితో ‘నీకు క్షయ ఉంటుంది. కానీ నీవు పదిహేను రోజులు క్షీణిస్తావు, పదిహేను రోజులు వృద్ధి పొందుతుంటావు. క్షయ పూర్తిగా లేదు కాబట్టి నశించిపోవు. ఎప్పుడూ హాయిగా ఉంటావు. ఇపుడు నీ చరిత్ర మారిపోయింది. నీవు పూర్తిగా గొప్పవాడివయ్యావు. నీవు నా చేత అనుగ్రహింప బడినవాడివని తెలుసుకోవడానికి నాతొ కలిపి నీ దర్శనం చేయించడానికి నాపేరే నీతో కలుపుకుంటాను. చంద్రశేఖర అని పిలిపించుకుంటాను’ అని ఆ చంద్రుణ్ణి తీసి నెత్తిన పెట్టుకున్నాడు. ఇదీ ఆయన కారుణ్యం అంటే. 
అందుకని తప్పులు జరిగిన వాటికి వేళ్ళు విరవకండి. ఇంత కారుణ్య మూర్తి అయిన శంకరుని పాదములు పట్టుకున్న వాడికి ఒక్కసారి పట్టుకుంటానని పూనికతో నిలబడితే మిమ్మల్ని కూడా నెత్తిమీద పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అందుకనే శంకరుని ‘శశిశేఖరః’ అని పిలువవలసి వచ్చింది. చంద్రుని క్షయ వ్యాధి పోయింది. చాంద్రమానం వచ్చింది. ఇప్పుడు ఈ చంద్రుడు పార్వతీ దేవికి గొప్ప భక్తుడు అయ్యాడు. అందుకే మనుః చంద్రః కుబేరశ్చ లోపాముద్రా చ మన్మథః 
అగస్తి రగ్ని సూర్యశ్చ ఇంద్రః స్కందశ్శివస్తదా 
క్రోధభట్టారకో దేవ్యాః ద్వాదశామీ ఉపాసకా!! (సౌభాగ్య భాస్కర భాష్యం)
సూర్యుడు, స్కందుడు – అని పన్నెండుమంది అమ్మవారి మహాభక్తులలో ఈయన కూడా ఒకడయ్యాడు.

No comments: