Sunday, November 29, 2015

శివపురాణము--18


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివ పురాణము--18

నాగేశ్వర జ్యోతిర్లింగము 
యామ్యే సదంగే నగరేతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగై 
సద్భక్తి ముక్తిప్రదమీశమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే!!

సద్భక్తిని, ముక్తిని రెండింటిని ఈయగాలిగిన నాగనాథునికి నమస్కరించుచున్నాను. ఇక్కడ నాగ నాథుడు అంటే విశేషమయిన పూజనీయుడు అని అర్థం. అటువంటి నాగనాథునికి నేను శరణాగతి చేయుచున్నాను. ఈ నాగనాథ లింగము ఎందులకు వచ్చింది? దీని ఆవిర్భావమునకు వెనకాతల ఉండే కారణం ఏమిటి? ఇక్కడ మనం ఒక విషయమును పరిశీలనం చేయాలి. శివారాధన రాక్షసులు చేస్తారు, ప్రమథగణములు చేస్తారు, మహాభక్తులు చేస్తారు, భూతప్రేతాది గణములు చేస్తాయి. శివారాధనమును జ్ఞానమును ఐశ్వర్యమును అపేక్షించేటటువంటి వారు చేస్తారు. ఆపద పోవాలనుకుంటున్న వాళ్ళు శివాభిషేకం చేస్తారు. 
దారుకుడు, దారుకి వీరిద్దరూ రాక్షస దంపతులు. వారికి బోలెడంత సంతానం ఉంది. వాళ్ళు ఒకనాడు ఒక సముద్రతీరమునకు చేరారు. వీరు చాలామందిని హింసించారు. ఒకానొకప్పుడు అందరి ప్రజలని బాధపెడుతూ భగవద్భక్తుల జోలికి కూడా వెళ్ళారు. అపుడు ఆ భక్తులు ఔర్వుడు అనే మహర్షి పాదములు పట్టుకుని ఆయనను శరణాగతి చేశారు. ఔర్వుడు గొప్ప తపశ్శక్తి కలవాడు. ‘వాళ్ళు వాళ్ళ ఉద్ధతిని మార్చుకుని మంచిగా జీవితం గడిపినట్లయితే ఫరవాలేదు. వాళ్ళ వాళ్ళ ప్రవృత్తిని మార్చుకోలేము అనుకున్నప్పుడు వాళ్ళు భూమండలం మీద ఎక్కడా ఉండకూడదు. భూమండలం మీద ఎక్కడయినా రాక్షస ప్రవృత్తి కలిగినవాడు ఉన్నట్లయితే వారు ఉత్తరక్షణం మరణిస్తాడు. ఇదే నా శాపం’ అని ఔర్వుడు అభయం ఇచ్చాడు. తపశ్శక్తి కలిగిన వాడి వాక్కు బ్రహ్మాస్త్రం అయి కూర్చుంటుంది. ఈవార్త రాక్షసులకు తెలిసింది వాళ్లకి తాము బ్రతకడం ఎలా అనే బెంగపట్టుకుంది. అపుడు దారుకి ‘నేను పార్వతీదేవి గురించి ఎప్పుడో ఒకసారి తపస్సు చేశాడు. అపుడు శాంభవి నాకు ప్రక్షమయి ఒక గొప్ప వరం ఇచ్చింది. దాని వలన నేను నా వారిని ఎక్కడయినా పెట్టి బ్రతికించగలను. ఔర్వుడు మనలను భూమి మీద కదా ఉండవద్దని శాపం ఇచ్చాడు. అందుకని మనందరం సముద్రం మీద ఉందాము. ఆవిడ ఇచ్చిన తపశ్శక్తితో మిమ్మల్నందరిని నేను రక్షిస్తాను. పదండి’ అంది. దారుకి సూచనను అనుసరించి రాక్షసులందరూ సముద్రం మీద పడ్డారు. ఆ సముద్రంలో వాళ్ళు సముద్రం మీద ఓడలలో ప్రయాణించే వారిని పట్టుకుని వారిని చెరపట్టి హింసించి బాధిస్తూ ఆనందిస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. 
అక్కడ సముద్రం మీద ఓడలో వెళుతున్న వారిలో సుప్రియుడు అనబడే ఒక వైశ్యుడు ఉన్నాడు. భక్తికి కులంతో సంబంధం లేదు. రాక్షస దంపతులు సుప్రియుడిని పట్టుకున్నారు. సుప్రియుడికి దాసదాసీజనం ఉన్నారు. గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయన ఒక్కడినీ తీసుకు వెళ్లి కారాగారంలో పెట్టారు. అపుడు ఆయన ఇవన్నీ ఉండడం, పోవడం ఈశ్వరేచ్ఛ. నాకు ఈశ్వరుడు చాలు అన్నాడు. ఆయన కారాగారంలో ఉన్న ధూళినంతా పోగేస్తే ఒక చిన్న శివలింగం అయింది. దానిమీద చుక్క నీరు పోసి పార్థివలింగం చేశాడు. ఆరాధన చేయడం ప్రారంభించాడు. అపురూ రాక్షసులు ఆరాధనకు అడ్డుపడ్డారు. నువ్వు శివారాధన చేయకూడదు, శివ అనే నామం చెప్పినా, శివున్ని ఆరాధన చేసినా, ధ్యానంలో కూర్చున్నా, భగవంతుని స్మరిస్తున్నావన్న అనుమానం ఏమాత్రం నాకు కలిగినా నీ శిరస్సు త్రుంచేస్తాను అన్నారు. అంటే ఆయన అన్నాడు – ‘నేను ఒక్కనాటికి శివారాధన మానను. నన్ను రక్షించేవాడు శంకరుడు. నా తల త్రుంచడానికి ప్రయత్నం చేస్తే నన్ను రక్షించేవాని చేతిలో నీ తల త్రుంచబడుతుంది. త్రుంచకలిగిన వాడు నా తండ్రి అని నాకు నమ్మకం ఉంది. అందుకే నేను ఆయన పాదములు పట్టుకున్నాను అన్నాడు. అపుడు వెంటనే రాక్షసుడు కత్తినొకదానిని తీసుకుని అపారమయిన ఉగ్రరూపంతో సుప్రియుడి కంఠమును నరికేయ్యబోయాడు. ఆ సమయమునకు సుప్రియుడు ఈశ్వరుని పరమ భక్తితో శరణాగతి చేస్తున్నాడు. రెండు చేతులతో పరమేశ్వరునికి నమస్కారం చేశాడు. అలా చేసేసరికి ఈయన ఆరాధన చేస్తున్న పార్థివలింగంలోంచి ఒక్కసారి పరమశివుడు ఆవిర్భవించాడు. రుద్రరూపంతో ఆవిర్భవించడం త్రిశూలం పెట్టి దారుకుడిని దెబ్బకొట్టడం వాడు పారిపోవడం ఆయన ఉగ్రమయిన దృష్టికి కొన్ని వందలమంది రాక్షసులు బూడిద కుప్పలై పడిపోవడం ఏకకాలమునందు జరిగిపోయాయి. చిత్రమేమిటంటే ఆ వచ్చిన పరమశివుని అర్థభాగమందు పార్వతీదేవి ఉంది. ఆవిడ గబుక్కున శివుని చేయి పట్టుకుని తనవారిని తాను రక్షించుకునే శక్తి ఇమ్మని దారుకి అడిగింది. ఆమెకు అటువంటి శక్తి కలిగేలా నేను ఆమెకు వరం ఇచ్చాను. ఇప్పుడు మీరు ఇలా కాల్చేస్తే నా వరం ఎమవ్వాలి? ఆవిడ నాకు భక్తురాలు. మీరు నామీద ప్రేమతో ఆమెయందు అనుగ్రహ భావాన్ని ప్రదర్శించండి’ అంది.
వెంటనే శివుడు శంకరుడు అయిపోయాడు. ఒక నవ్వు నవ్వి ‘పార్వతీ నిజమే. ఆవిడకి నీవు వరం ఇచ్చావు. కానీ వాళ్ళు రాక్షసులు. నేను ఇప్పుడు వీళ్ళని విడిచిపెడితే వీళ్ళు మరల దుర్మార్గపు పనులు చేయడం మొదలుపెడతారు. కాబట్టి వీళ్ళు మరల ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసే నిమిత్తం నేను ఇక్కడే జ్యోతిర్లింగరూపంలో కూర్చుంటాను. నీవు కూడా నీవలన బతుకున్నామని వాళ్లకి గుర్తు ఉండడానికి అమ్మవారి రూపంలో ఇక్కడే కూర్చో. నేను నాగనాథుడు అనే పేరుతో వేలుస్తున్నాను. ఈశ్వరీ, నువ్వు నాగేశ్వరీ అనే పేరుతో వెలవవలసింది’ అన్నాడు. ఆవిధంగా ఇద్దరూ ఆ తటమునందు జ్యోతిర్లిన్గమై వెలిశారు. 
ఎవరయినా వారి దర్శనం చేస్తే వారికి జన్మ జన్మలయందు పార్వతీ పరమేశ్వరుల పాదపద్మముల యందు చెక్కుచెదరని భక్తి ప్రపత్తులు కలిగేలా అనుగ్రహిస్తాను అని స్వామి శపథం చేసి చెప్పి నాగనాథుడిగా ఆ తీరమునందు వెలసి ఉన్నాడు. కాబట్టి మనం నాగ నాథ క్షేత్రమునకు తప్పకుండా వెళ్ళాలి. మనస్సును నిగ్రహించి ఈశ్వరుని వైపు పెట్టడం అలవాటు అవడం అనే భక్తి ముహూర్తములవలన రాదు. భక్తిగా ఉండడం ఈశ్వరానుగ్రహం. భక్తి అంటే ఏమిటో సరిగ్గా తెలియడం ఈశ్వరానుగ్రహం. సరిగ్గా తెలిసన భక్తియందు మనస్సు నిలబడడం ఈశ్వరానుగ్రహం. అటువంటి అనుగ్రహమును తన దర్శనమాత్రం చేత ఇచ్చేస్తానన్నాడు నాగనాథుడు. 
పూర్వం పెద్దలు మనలను తీర్థయాత్రలు చేయమని ప్రోత్సహించేవారు. తీర్థయాత్ర చేసేముందు వెడుతున్న ఆ క్షేత్రం వైశిష్ట్యం తెలియాలి. తీర్థయాత్రలు చేసినప్పుడు ఆయా క్షేత్రములకు వెళ్లినపుడు వాటిని గురించి తెలుసుకుని ఆయా క్షేత్రములలో ఏ శ్లోకమును చెప్పాలో ఆ శ్లోకమును చెప్పి ఏది మీరు భగవంతుని అడగాలో దానిని అక్కడ అడగాలి. అంతేగానీ వెళ్ళామంటే వెళ్ళాము, వచ్చామంటే వచ్చాము అనుకోవడం వలన ఉపయోగం లేదు. క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు దానికి తగిన పనిని మీరు చేసి వస్తుండాలి. ఒకవేళ అలా చేయడం తెలియకపోయినా మన అమాయకత్వం చేత ఈశ్వరుడు దానిని పరిపూర్ణం చేస్తూ ఉంటాడు. ఈశ్వరశక్తియందు అదికూడా ఉంటుంది.

No comments: