Thursday, April 12, 2012

పద్మ పాదుడు


పద్మ పాదుడు

పద్మ పాదాచార్యుల వారు ఆది శంకరాచార్యుల వారి నలుగురు ప్రధాన శిష్యులలో ఒకరు. వీరి జీవిత చరిత్రకు సంబంధించి అనేక ఆశ్చర్య కరమైన సంఘటనలు, ఆది శంకరాచార్యులవారి జీవితంతో ముడి వేసుకుని వున్నవి, ప్రసిద్ధమైనవి వున్నాయి! ఆది శంకరాచార్యుల వారు తమ తల్లికి ఒక మాయా మయమైన మొసలి తనను పూర్ణా నదీ స్నానానికి వెళ్ళినప్పుడు పట్టుకున్నట్లు భ్రమ కల్పించి, ఇక తను బయట పడడం అసంభవం అని, తనకు సన్యాసం తీసుకొనడానికి అనుమతి ఇవ్వమని అభ్యర్ధించి, తల్లి అనుమతితో జందెమును తీసివైచి సన్యాసం స్వీకరించిన తర్వాత, ఆ మాయ మొసలి మాయమైపోయి, ఆది శంకరుడు వొడ్డుకు వచ్చి, తల్లికి నమస్కరించి, ఉత్తర భారతానికి వెళ్లి, గోవింద భగవత్పాదా చార్యుల వారి శిష్యరికం చేసి, అక్కడినుండి కాశి కి వెళ్ళినప్పుడు, ఎక్కడో దక్షిణా పథాన చివర వున్న కేరళ నుండి విష్ణు శర్మ అనే నంబూద్రి బ్రాహ్మణ యువకుడు ఆది శంకరుడిని వెదుక్కుంటూ కాశీ కి చేరుకున్నాడు. ఆది శంకరాచార్యులవారు అతనిని శిష్యునిగా చేసుకుని, సన్యాసం ఇచ్చి, 'సనందనుడు' అనే సన్యాసాశ్రమ నామధేయాన్ని ఇచ్చారు. ఆది శంకరాచార్యులవారు ప్రధమంగా దీక్షను ఇచ్చింది ఈయనకే! ఈయన ఒక నాటి సాయంత్రం నదికి అవతలి వొడ్డున గురువు గారు అప్పజెప్పిన పనిలో వుంటే..సాయం సమయ బోధకు సమయం దాటి పోతున్నదని మిగిలిన శిష్యులు త్వర పడుతుంటే, పెడుతుంటే, ఆది శంకరాచార్యులవారు నది ఇవతలి వొడ్డు నుండి సనందనుల వారికి రమ్మని చేతితో సంజ్ఞ చేస్తే, గురువు గారు రమ్మన్నారనే ఆత్రుతతో ఈయన నదిలో కాలు వేసిన ప్రతి చోట..ఒక పెద్ద పద్మం మొలచి..ఈయన నీటిలో మునిగి పోకుండా కాపాడుతుంటే, అలా గంగా నదిలో పద్మముల మీద నడుస్తూ ఇవతలి వొడ్డుకు వచ్చి, గురువు గారి పదములకు వందనం చేశారు ఆనంద బాష్పాలతో! ఆనాటినుండి పద్మ పాదాచార్యులవారు గా ప్రసిద్ది పొందారు. ఇదంతా కూడా సనందన చార్యులవారి మీద దయతో, ఆయన పట్ల అసూయను పెంచుకున్న మిగిలిన శిష్యులకు ఆయనకు వున్న గురుభక్తిని నిరూపణ చేసే ఉద్దేశంతో ఆది శంకరులు కల్పించిన ఒక అద్భుతమైన మాయ మాత్రమే!

ఆది శంకరులను ఆశ్రయించక మునుపు ఆయన విష్ణు శర్మగా వ్యవహరింపబడే రోజుల్లో తీవ్ర నృసింహ ఉపాసకులు. తిరుమల కొండ శిరస్సుగా, శ్రీ శైలం తోకగా వ్యాపించివున్న పర్వత శిఖరములను ఆది శేషుని అంశ అని మహానుభావులైన వైష్ణవ ఆళ్వారులు స్తుతించారు. ఆ పర్వత శ్రేణులలో వెలసిన ఒక దివ్య నృసింహ క్షేత్రం అహోబిలం! అహోబిలం సమీపాన అడవులలో విష్ణు శర్మ నృసింహ సాక్షాత్కారం కోసం తీవ్రంగా పరితపిస్తూ, తపిస్తూ, నృసింహ దివ్య నామాన్ని జపిస్తూ, దర్శనం కొరకు విలపిస్తూ ఆ అరణ్యాలను గాలిస్తూ తపస్సు చేస్తుంటే, ఒకనాడు ఒక గిరిజనుడు తపస్సులో వున్న ఈయనను చూశాడు. ఎప్పటినుండో ఈయనను ఆ నిర్జన అరణ్యాలలో చూస్తున్న కారణంగా..ఉండ బట్టలేక ఒక నాడు ఈయనను అడిగాడు..సామీ ఎవరి కోసం ఇక్కడ తిరుగుతున్నారు? అని..విష్ణు శర్మ నవ్వి..నీకు చెప్పినా అర్థం కాదులేరా..అంటే వాడు చెప్పమని పట్టుబట్టి, బ్రతిమిలాడుతుంటే..విరక్తిగా..సగం సింహం సగం మనిషి రూపం తో వున్న ఒక దివ్యమైన మూర్తి కోసం వెదుకుతున్నా..అని చెప్పాడు. ఆ గిరిజనుడు ఒక పిచ్చివాడిని చూసినట్లుగా ఈయనను చూసి నవ్వి..ఈ అడవులలో పుట్టినప్పటినుండీ తిరుగుతున్నా.. మీరు చెప్పినటువంటి ఆకారం వున్న జంతువు ఎన్నడూ కనపడ లేదు..అసలు అలాంటిది ఉండదు అని వాదించాడు. విష్ణు శర్మ వారు వాడికి నృసింహ రూప వర్ణన చేసి..నమ్మబలికాడు..ఎందరో మహానుభావులు ఆ దివ్య రూపాన్ని చూశారు అని నిశ్చయంగా చెప్తే..వాడు..సరే! ఈ అడవులన్నీ గాలించి అయినా సరే..అలాంటిది ఒకటి అంటూ వుంటే కట్టేసి మీ దగ్గరికి తెస్తా సామీ ! అని వెళ్ళిపోయాడు. తదేక ధ్యానంతో, పట్టుదలతో, విష్ణు శర్మ వారి పలుకుల మీది నమ్మకంతో... వాడు రాత్రనకా, పగలనకా వెదుకుతుంటే వాడికి నృసింహుడు దర్శనమిచ్చాడు.ఆ అమాయక గిరిజనుడు 'తస్సాదియ్యా..ఎన్నాళ్ళకు దొరికావే...బాపనయన నిజమే చెప్పాడు!' అని ఆ నృసింహ మూర్తిని లతలతో కట్టేసి, లాక్కుంటూ విష్ణు శర్మ వారు తపస్సు చేసుకుంటున్న స్థలానికి తీసుకు వచ్చాడు! అల్లంత దూరం నుండే భీకరమైన ధ్వనులు, సింహ గర్జనలు, ఆటవికుడి అదలింపులు వింటున్న విష్ణు శర్మ వారికి..వాడు వుట్టి లతలను లాక్కుంటూ వచ్చినట్లు కనిపించింది కానీ..నృసింహ మూర్తి దర్శనం ఇవ్వలేదు. ఆ గర్జనలు, భీకరమైన ధ్వనులు మాత్రం వినిపిస్తూనే వున్నాయి! ''ఇదిగోండి సామీ..దీని తస్సా దియ్యా..నానా యాతన పెట్ట్టింది..ఇక దీన్ని తీసుకొని ఇంటికెళ్ళి పొండి..ఈ అడవులలో తిరక్కుండా..'' అని వాడు అంటుంటే..ఆవేదనతో, ఆర్తి తో..రోదిస్తూ 'స్వామీ ఈ గిరిజనుడికి కూడా పట్టుబడి దర్శనమిచ్చిన నువ్వు... నీకై ఇంత సాధన, ఇంత పరితాపం చెంది నేను ప్రయత్నిస్తే నన్ను కరుణించక పోవడం న్యాయమా..ఇక నా జన్మ ఎందుకు?' అని ఆత్మ త్యాగం చేసుకొనబోతుంటే, దివ్య నృసింహ మూర్తి 'వీడు కోటి జన్మలలో కూడా సాధ్యం కాని తీవ్రమైన ఏకాగ్రతను ఒక్క నీ బోధతోనే సాధించాడు..కనుక పట్టుబడ్డాను..నీకు మంత్ర సిద్ది కలిగింది..ఎప్పుడు నీవు అవసరమై నన్ను స్మరిస్తే అప్పుడు నీ కోర్కె నెరవేరుస్తాను..ఈ జన్మకింతే ప్రాప్తం..ఈ జన్మ అనంతరం నీవు నా సన్నిధిని చేరుకుంటావు' అని తన పలుకులను మాత్రం వినిపించాడు, కనిపించకుండా! ఆ గిరిజనుడికి నమస్కరించి, స్వామిని ధ్యానిస్తూ వెళ్ళిపోయిన విష్ణు శర్మ అనంతర కాలంలో ఆది శంకరుల శిష్యుడై, ఆయనకు కొందరు ప్రయోగం చేసి తీవ్రమైన 'భగ రంద్ర' వ్యాధిని కలిగిస్తే, తన మంత్ర శక్తి తో దాన్ని నయం చేసి ఆయనను రక్షించారు!

ఉభయభారతిని జయించిన అనంతరం, దక్షిణా పథానికి పయనమైన ఆది శంకరాచార్యుల వారు శ్రీ శైలం సందర్శించి..అక్కడి గుహలలో తపస్సు చేస్తూ, శివానంద లహరి, సౌందర్య లహరి, భ్రమరాంబ అష్టకం మొదలైన దివ్య స్తోత్రాలను వెలువరించి, తమ భాష్యాల ఉపదేశాలు కూడా చేశారు. శ్రీ శైల పరిసర ప్రాంతాలు తీవ్రమైన కాపాలిక మత ఉపాసనా కేంద్రాలు, ఆ నాడు, ఈ నాడు కూడ! తీవ్రమైన అనాచారాలతో, దురాచారాలతో హింసాత్మకమైన ఉపాసనా విధానమైన కాపాలిక మతానుయాయులను ఆది శంకరులు తమ బోధనలతో అనేకులను తమ శిష్యులుగా చేసుకుని ఆ మతానికి చెందిన వారిని ఆగ్రహానికి, నిస్ప్రుహకూ గురి చేశారు! ఒక నాడు కాపాలిక మతాచార్యు డొకరు ఆది శంకరుల వారిని వంచనతో వినయం గా సమీపించి ఒక వరదానమిమ్మని అడిగాడు. సరేనన్న ఆది శంకరులతో తన తపస్సిద్దికై మహా చక్ర వర్తిని గానీ, మహా జ్ఞానిని గానీ స్వచ్చందంగా ముందుకు వచ్చిన వారిని బలి ఇవ్వాలనీ..చక్రవర్తిని ఎవరినీ వోప్పించడం సాధ్యం కాదు కనుక, ఆది శంకరుల కన్నా జ్ఞాని ఎవరుంటారు కనుక ఆది శంకరులను బలికి అంగీకరించమని వేడుకుంటే..భోళా శంకరుని ప్రతి రూపమైన ఈ ఆది శంకరుడు సరే అని, మర్నాడు, తన శిష్యులు ఎవరూ గమనించకుండా వచ్చి తన పని పూర్తి చేసుకొమ్మని ఆది శంకరులు చెప్తే, ఆ కాపాలికుడు సంతోషం గా వెళ్లి, మర్నాడు ఉదయమే, తన తీవ్ర క్షుద్ర పూజలు ముగించుకుని, సురాపానం చేసి, గండ్ర గొడ్డలిని ధరించి వచ్చాడు. పద్మ పాదుల వారు ఎక్కడ వున్నా ఆయన దృష్టి, మనసు సర్వం ఆది శంకరుల మీదే ఉండేదిట. గండ్ర గొడ్డలిని ధరించి వస్తూన్న కాపాలికుడిని అల్లంత దూరం నుండే చూసి ఏదో జరుగ కూడనిది జరుగ బోతున్నదని అనుమానించి ఆయన పరుగున ఆది శంకరుల సన్నిధికి చేరుకుంటుంటే, తమ ధ్యానాన్ని ముగించిన ఆది శంకరులు కాపాలికుడికి అంగీకార సూచకంగా తలను ఊపి కనులు మూసుకున్నాడు. కాపాలికుడు తన గండ్ర గొడ్డలిని పైకెత్తి ఆది శంకరుల వారి శిరస్సును ఖండించబోతుంటే..పద్మ పాదుల వారు సమయం లేదని గ్రహించి..నృసింహ మంత్రాన్ని పఠించి స్వామిని ప్రార్ధిస్తే..ఉగ్ర నరసింహుడు పద్మ పాదులవారి శరీరం పై పూని..వుట్టి చేతులతో..గోళ్ళతో..ఆ కాపాలికుడిని చీల్చి ముక్కలు ముక్కలు చేసి..వాడి ప్రేవులను ధరించి మహోగ్రుడై ప్రళయం సృష్టిస్తుంటే..అప్పటికి..ఆ కాపాలికుడి మంత్ర కట్టు విడిపోయి..కనులు తెరచిన ఆది శంకరులు నృసింహ శాంతి మంత్రాలతో పద్మ పాదాచార్యులవారిని శాంతింప జేయాల్సి వచ్చింది. ఆ రకంగా మరొక సారి ఆది శంకరుల వారిని ప్రాణాపాయం నుండి పద్మ పాదాచార్యుల వారు రక్షించి హైందవ ధర్మానికి మహోపకారం చేశారు!

అనంతర కాలంలో పద్మ పాదాచార్యుల వారు శంకరాచార్యుల వారి బ్రహ్మ సూత్రాల భాష్యానికి 'పంచ పాదిక' అనే టీకా వ్రాసి, గురువు గారికి వినిపిస్తే, ఆది శంకరాచార్యుల వారు..తదేక ధ్యానంతో ఆ టీకా ను సమగ్రం గా విన్నారు. ఆది శంకరుల దక్షిణ దేశ యాత్రల సందర్భంగా ఆయనతోనే వున్న పద్మ పాదాచార్యులవారు రామేశ్వర సమీపంలోని, పూర్వాశ్రమంలోని తమ మేన మామ గారి ఇంటికి వెళ్లారట, వారి ఆహ్వానం మేరకు. ఆ మేనమామ మీమాంసా శాస్త్రం లో ఉద్దండ పండితుడు. తన మేనల్లుడికి ఈర్ష్యతో మతి మరపు మందు పెట్టి ఆయనను ఉన్మత్తుడిని, అజ్ఞానిని చేసి, అంతటితో ఊరుకోకుండా 'పంచ పాదిక' గ్రంధాన్ని అగ్నిలో ఆహుతి చేశాడట. విషయం గ్రహించిన శంకరాచార్యుల వారు తన మహిమతో శిష్యుని మామూలుగా చేసి, అంతకు ముందు తాము అతను పఠిస్తుంటే విన్న 'పంచ పాదిక' గ్రంధాన్ని ఆసాంతం తిరిగి అప్ప జెప్పి..మరలా ఆ గ్రంధాన్ని లిఖింప జేశారు. ఇప్పుడు ఆ గ్రంధంలో కేవలం నాలుగు సూత్రాలకు మాత్రమే టీకా దొరుకుతున్నదని శంకరుల అనుయాయుల ఉవాచ! పద్మ పాదుల వారి చేత శంకరాచార్యుల వారి తల్లి బదరీ క్షేత్రంలోని దేవాలయానికి ధనం పంపించిందని దానితో దేవాలయ కార్యక్రమాలను పూర్తి చేశారని కూడా శంకర విజయాలు చెప్తాయి! అనంతర కాలంలో పూరీ జగన్నాధ పీఠానికి అధిపతి గా పద్మ పాదాచార్యుల వారు ఆది శంకరుల సేవా మార్గంలో ధన్య జీవిగా తనువు చాలించారు! అంతే కాదు..వ్యాస మహర్షి శంకరాచార్యుల వారి భాష్యాన్ని వినాలని వృద్ధ బ్రాహ్మణ రూపం తో వచ్చి వాదనకు దిగితే..ఇరువురి మధ్య తీవ్రమైన చర్చ జరుగుతుంటే, ఆది శంకరుల భాష్యానికి వంద ఉపమానాలతో ఖండన చేసిన వ్యాసుల వారి వాదాన్ని ఒక వేయి ఉపమానాలతో ఆది శంకరుల వారు ఖండించి, నాలుగు రొజుల పాటు విరామం లేకుండా, ఆసనాల మీది నుండి లేవ కుండా వాదం ప్రతివాదం జరుగుతుంటే..ఆ వచ్చిన వారెవరో ముందుగా గ్రహించినది పద్మ పాదాచార్యుల వారే. వాదం లో వున్న ఇరువురి మధ్యన నిలబడి..వినయంగా నమస్కరించి..తమరు సాక్షాత్తూ నారాయణాంశా సంభూతులైన బాదరాయణులు..నా గురుదేవుడు సాక్షాత్తూ కైలాస వాసి ఐన పరమ శివుడు..శివ కేశవుల వాదానికి కింకరుడనైన నేనేమి చేయగలను? అని పలికితే ఆది శంకరుల వారు అప్పుడు తమ ఎదురుగా వున్నది వ్యాసుల వారే అని తెలుసుకుని వందనం చేశారుట! జయ జయ జయ శంకర!!!

No comments: