ఆది శంకరుల గంగా స్తోత్రం
1::దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే
శంకరమౌళివిహరిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే
ప్రకాశించేదానా! దేవతలకు దేవతా!పూజ్యురాలా! ఓ గంగాదేవీ! మూడు లోకములను తరింపచేయుదానా! ప్రకాశించే తరంగములు కలదానా!
శుభాలు కలిగించే శంకరుని కొప్పుపై విహరించుదానా! పవిత్రమైనదానా! నీ పాద పద్మములయందు ఎప్పుడు నా బుద్ధి నిలిచి యుండుగాక!
2::భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః
నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామ జ్ఞానమ్
అందరికీ సుఖాన్ని కలిగించే భాగీరథి (భగీరథునిచే భూమికి తేబడినది) అని పిలువబడే గంగమ్మా! నీ పవిత్రమైన నీటి మహిమ వేదములలో వర్ణింపబడినది.
నీ యొక్క మహిమను నేను పూర్తిగా తెలుసుకోలేను. దయ కలిగిన దానా ! నా అజ్ఞానమును క్షమించు.
3::హరిపదపాద్యతరంగిణి గంగే హిమవిధుముక్తాధవళతరంగే
దూరీకురు మమ దుష్కృతిభారం కురు కృపయా భవసాగరపారమ్
గంగా మాతా! నువ్వు శ్రీహరి పాదములనుంచి పుట్టావు. నీ స్వచ్చమైన తరంగాలు , తెల్లటి మంచును, చంద్రుని, ముత్యాలను పోలిఉంటాయి. పాపభారాన్ని నానుంచి తొలగించు.ఈ సంసార సాగరాన్ని తరింపచేయి
4::తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతమ్
మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం న యమః శక్తః
గంగా మాతా! నీ స్వచ్చమైన నీటిని త్రాగినవాడు తప్పకుండా మోక్షాన్ని పొందుతాడు.
నీ భక్తుడిని చూసే శక్తి యమునికి ఉండదు. ( గంగాదేవి భక్తుడు యమలోకానికి వెళ్లడని భావము)
5::పతితోద్ధారిణి జాహ్నవి గంగే ఖండిత గిరివరమండిత భంగే
భీష్మజనని హే మునివరకన్యే పతితనివారిణి త్రిభువన ధన్యే
గంగా మాతా! అధోగతిని పొందినవారిని నువ్వు ఉధ్ధరిస్తావు. హిమలయ పర్వతములనుండి ప్రవహించే సం దర్భంలో పర్వతాగ్రాలను నువ్వు ఖండిస్తూ, ఒక రకమైన అలంకారాన్ని ఆ పర్వతాలకు ఇస్తుంటావు.
భీష్మునికి తల్లీ ! జహ్ను ముని కూతురా ! జీవితంలో పడిన వారిని, పదవి చెడినవారిని ఉద్ధరిస్తావు. మూడు లోకాలను ధన్యము చేస్తావు.
6::కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే
పారావారవిహారిణి గంగే విముఖయువతి కృతతరలాపాంగే
ఓ గంగా మాతా! నువ్వు కల్పలత వలె లోకాలకు ఫలాలను అందిస్తుంటావు. నీకు నమస్కరించినవాడు ఏనాడు శోకాన్ని పొందడు.
అనురాగముతో కదిలే చూపులు కలిగిన యువతి చూపులవలె -నువ్వు సముద్రములో కలిసేటప్పుడు (విహరించేటప్పుడు) నీ తరంగాలు ఉంటాయి.
7::తవ చేన్మాతః స్రోతః స్నాతః పునరపి జఠరే సోపి న జాతః
నరకనివారిణి జాహ్నవి గంగే కలుషవినాశిని మహిమోత్తుంగే
ఓ గంగా మాతా! ఒక్కసారి నీలో స్నానము చేసిన వాడు , మళ్ళీ పునర్జన్మను పొందడు
నువ్వు నరకాన్ని నివారించేదానివి.పాపాలను నశింపచేసే దానివి. ఉన్నతమైన మహిమలు కలదానివి.
8::పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే
ఇంద్రముకుటమణిరాజితచరణే సుఖదే శుభదే భృత్యశరణ్యే
ఓ జాహ్నవీ దేవీ ! నీ కు జయము. జయము. నువ్వు ఈ మలిన యుక్తమైన శరీరాన్ని నీ తరంగాలతో పవిత్రము చేస్తావు.
నీ పాదాలు ఇంద్ర కిరీటములోని మణుల కాంతులతో అలంకరించబడి ఉంటాయి. సేవా భావంతో నీకు శరణన్నవానికి సుఖాన్ని ఇస్తావు. శుభాన్ని ఇస్తావు.
9::రోగం శోకం తాపం పాపం హర మే భగవతి కుమతికలాపమ్
త్రిభువనసారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే
ఓ పూజ్యురాలైన గంగా మాతా! నా రోగాన్ని, విచారాలను, పాపాలను, చెడు భావాలను తొలగించు.
నువ్వు మూడు లోకాలకు సార భూతమైన దానివి. ఈ భూమికి నువ్వు ఒక హారమువంటి దానివి.ఈ సంసారములో నువ్వే నాకు గతివై ఉన్నావు.
10::అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంద్యే
తవ తటనికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః
ఓ అలకానందా ! గంగాదేవీ! పరమానందము ఇచ్చేదానా ! భయపడిన వారిచే నమస్కరింపబడేదానా! నా యందు దయ యుంచు.
నీ తీరములో ఎవడు ఉంటాడో, వాడు వైకుంఠములో ఉన్నట్లే.
విశేషాలు
గంగ హిమాలయాలలో గంగోత్రి వద్ద ప్రారంభమై దేవప్రయాగ వద్ద అలకానంద ఉపనదితో కలిసి ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మీదుగా 2,525 కి.మీ. ప్రయాణించి కోల్ కత వద్ద గంగాసాగర్ లో (బంగాళఖాతం) కలుస్తున్నది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో గంగ దేశంలోని 40 శాతం మందికి త్రాగునీరు అందిస్తున్నది. 50 కోట్లమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధిని కలిగిస్తున్నది. అటువంటి గంగలోనికి నిత్యం 270 కోట్ల లీటర్ల కాలుష్య జలం చేరుతూ గంగ పవిత్రతకు భంగం కలిగిస్తున్నది.(అంతర్జాల సౌజన్యం)
11::వరమిహ నీరే కమఠో మీనః కిం వా తీరే శరటః క్షీణః
అథవాశ్వపచో మలినో దీనస్తవ న హి దూరే నృపతికులీనః
ఓ గంగా మాతా! నీ నీటిలో తాబేలుగా కాని, చేపగా కాని, నీ నీటి ఒడ్డున అల్పమైన ఊసరవెల్లిగా కాని జీవించుట ఎంతో అదృష్టము ఉంటే కాని కలుగదు.
పవిత్రమైన నీ నది ఒడ్డున కుక్కను వండుకొని తినే శ్వపచుడు, నీకు దూరంగా జీవించే ఉత్తమ కులీనుడైన రాజు కంటె గొప్పవాడు.
12::భో భువనేశ్వరి పుణ్యే ధన్యే దేవి ద్రవమయి మునివరకన్యే
గంగాస్తవమిమమమలం నిత్యం పఠతి నరో యః స జయతి సత్యమ్
ప్రపంచానికి ఈశ్వరీ ! ఓ పుణ్యురాలా ! ధన్యురాలా! దేవీ! ద్రవ రూపములో మహా ముని జహ్ను మహర్షి కుమార్తె గా మారిన దానా !
పవిత్రమైన ఈ గంగాస్తవమును ప్రతిరోజూ ఎవడు చదువుతాడో, అతనికి తప్పక జయము సిద్ధిస్తుంది.
13::యేషాం హృదయే గంగా భక్తిస్తేషాం భవతి సదా సుఖముక్తిః
మధురాకంతా పంఝటికాభిః పరమానందకలితలలితాభిః
ఎవరి హృదయములో గంగా భక్తి ఉంటుందో, అతడు తప్పకుండా స్వేచ్చ యొక్క ఆనందాన్ని హృదయములో అనుభవిస్తాడు.
పంఝటికా చందస్సు లో (?) మధురాహ్లాదముగా రచింపబడిన ఈ గంగా స్తోత్రము పరమానంద సంభరితమైనది.
14::గంగాస్తోత్రమిదం భవసారం వాంఛితఫలదం విమలం సారమ్
శంకరసేవక శంకర రచితం పఠతి సుఖీః తవ ఇతి చ సమాప్తః
ఈ సంసారములోని సారము ఈ గంగా స్తోత్రము. ఈ స్తోత్రాన్ని భక్తితో చదువుకొన్నవారికి కోరిన కోరికలు నెరవేరుతాయి.ఇది స్వచ్చమైనది.
శంకరుని సేవకుడైన శంకరునిచే ఈ స్తోత్రము రచింపబడినది.ఈ స్తోత్రము ఆసాంతము చదివిన వాడు సుఖము పొందుతాడు. అందరికి జయాన్ని కోరుతూ ఇంతటితో ఈ స్తోత్రము ముగిసినది.