Thursday, May 15, 2014

సింహాచల క్షేత్రమహత్యం



















సింహాచల క్షేత్రమహత్యం 

ఆదికాలం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని 'సింహాచలం' ఒక ప్రసిద్ధమైన వైష్ణవ పుణ్యక్షేత్రం. కైలాసంగా పిలవబడే ఈ పుణ్యక్షేత్రం సముద్రమట్టానికి 1500 అడుగుల ఎత్తున, విశాఖ పట్టణానికి ఉత్తరాన 10 మైళ్ళ దూరంలో ఉంది. ఈ ప్రదేశం అధికభాగం అడవులు, కొండలతో నిండి ఉంటుంది. ఈ కొండల సముదాయం నీటిధారలతో, సన్నని కాలువలతో కూడివుంది ఇందులో ముక్యమైనది ఈశాన్యంలో ఉన్న హనుమంత ధార. మరికొన్ని ముఖ్యమైన ధారలు సీతమ్మ ధార, సింహాచలధార, మాధవధార, ఇందులో సింహాచల ధార అన్నిటికన్నా పెద్దది. సింహాచలం అంటే 'సింహం యొక్క కొండ' అని అర్థం. ఇది విష్ణువు నాలుగవ అవతారమైన నరసింహుని కొండగా భావించబడుతోంది. "సర్వం విష్ణు మయం జగత్'' అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు అనడానికి ప్రతీకగా నరసింహ అవతారం మనకి నిదర్శనంగా కనబడుతుంది. ఈ ఆలయ ప్రధాన దేవత శ్రీవరాహ నరసింహస్వామి. యాదగిరిగుట్టలో యోగ నరసింహుడిగా, వేదాద్రిలో లక్ష్మీనరసింహుడుగా, నరసింహస్వామి వారిని అనేక రూపాలతో భక్తులు ఆరాధిస్తారు. దశావతారాలలో విడి అవతారాలైన వరాహ, నరసింహ అవతారాలు రెండూ కలిసి వరాహనరసింహునిగా కనిపించడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. వరాహ ముఖం, మానవశరీరం, సింహతోకతో కూడిన స్వామివారి శరీరం మరెక్కడా కనిపించదు. ఇక్కడి ప్రజలు స్వామివారిని "సింహాద్రి అప్పన్న'' అని పిలుస్తారు. 

బయటనుంచి ఈ ఆలయం ఒక కోటను తలపిస్తుంది. మిగతా ఆలయాలకు విరుద్ధంగా ఈ ఆలయం పడమరముఖంగా ఉంటుంది. పడమర ముఖంగా ఉన్న మహాగోపురం నుండి ఆలయంలోకి ప్రవేశిస్తే ప్రదక్షిణ చేసేందుకు వీలయిన మూడు ప్రాకారాలతో, అయిదు ద్వారాలతో, నాట్య, ఆస్థాన, భోగ మంటపాలతో ఆలయం విలసిల్లుతూ ఉంటుంది. సంతాన గోపాలయంత్రంపై ప్రతిష్టింపబడిన కప్పస్తంభాన్ని కౌగిలించుకున్న దంపతులకు సంతాన సౌభాగ్యం కలుగుతుందని ఇక్కడివారి విశ్వాసం. ఇక్కడ ఉత్సవమూర్తులు షడ్రూపులు. వాటినే షడ్బేరులు (ఆరు) అంటారు. ఒక్కొక్క సేవకు ఒక్కొక్కరు. ఉత్సవమూర్తి గోవిందరాజులు, కౌతుక మూర్తి మదనగోపాలుడు, శయనమూర్తి వేణుగోపాలుడు, స్నపన (స్నానంచేసే మూర్తి), యోగానంద నరసింహుడు, బలిమూర్తి సుదర్శన చక్ర పెరుమాళ్ ఇవన్నీ స్వామివారి విభిన్న రూపాల క్రిందే లెక్క. ఆయా శరీరాలతో, ఆయా కైంకర్యాలను స్వామివారు స్వీకరిస్తూ ఉంటారన్నమాట. మూల విరాట్టు శిలావిగ్రహం కాగా, మిగిలినవి లోహమూర్తులు.

మూలవిరాట్టు :

మూలవిరాట్టు 'వరాహనరసింహ' ప్రహ్లాద మందిరం మధ్యలో చందనపూతతో, లింగాకారంలో దర్శనమిస్తాడు. ఇందులో స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసే వీలుంది. ఏడాదిలో ఒక్క అక్షయతదియ (వైశాఖశుద్ధ తృతీయ) రోజు మాత్రమే కొద్ది గంటలసేపు స్వామివారిపై ఉన్న పూతను ఒలిచి, నిజరూప దర్శనం చేసుకునే అవకాశం భక్తులకు లభిస్తుంది. అప్పుడు త్రిభంగి భంగిమలో రెండుచేతులతో, వరాహ ముఖంతో, నరుని శరీరంతో, సింహ తోకతో స్వామివారు దర్శనమిస్తారు. మూలవరులకి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఉన్నారు. పద్మాసనంలో కూర్చుని, చేతిలో పద్మంతో అభయ వరద ముద్రలో ఉన్న చతుర్భుజ తాయారు (లక్ష్మీ)కి, ఆండాళ్ సన్నిధులు ఉన్నాయి. ఆళ్వారులకు ఈ ఆలయంలో గౌరవస్థానం కల్పించబడింది. ఇక్కడ భగవద్రామానుజులు, మణవాళ మహాముని, విష్వక్సేన సన్నిధులు కూడా ఉన్నాయి. వారి జన్మ నక్షత్రాలలో విశేషమైన పూజలు నిర్వహించబడతాయి. రామానుజ కూటం అనే వంటశాల ఆలయంలో ఉంది. వైశాఖ, జ్యేష్ఠ మంటపాలలో విశేష పూజలు జరుగుతాయి. ప్రతి ఏటా చైత్రమాసంలో స్వామివారి కళ్యాణం జరిపించడానికి ప్రత్యేకమైన కళ్యాణమండపం కూడా ఉంది. ఈ ఆలయానికి రెండు పుష్కరిణిలు ఉన్నాయి. ఒకటి స్వామి పుష్కరిణి, మరొకటి వరాహ పుష్కరిణి. ఇది కొండ కింద భాగంలో ఉంది. విశేషమైన పండుగ ఉత్సవాలలో స్వామికి ఈ పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. కొండ క్రింద ఉన్న రెండు ఉద్యానవనాల్లో స్వామి పండుగ సమయాలలో ఊరేగిస్తారు. 'గంగధార'కు వెళ్ళే దారిలో శ్రీత్రిపురాంతక, త్రిపురసుందరి ఆలయం ఉంది. శ్రీత్రిపురాంతక స్వామి ఇక్కడి క్షేత్రపాలకుడు. గంగధార ప్రక్కన సీతారాముల గుడిని కూడా దర్శించుకోవచ్చు. గుడికి వెళ్ళే మార్గంలో శ్రీకాశీ విశ్వేశ్వర, అన్నపూర్ణదేవీల సన్నిధి ఉంది. హనుమంతునికి కూడా ప్రత్యేకమైన ఆలయం ఉంది.

దక్షిణ భారతదేశంలో గల చాలా ఆలయాలవలెనే ఈ ఆలయానికి కూడా ప్రత్యేకమైన స్థల పురాణం ఉంది. ఈ స్థల పురాణం 32 అధ్యాయాలుగా విభజింపబడింది. తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి విష్ణుమూర్తి ఈ కొండపై దర్శనమిస్తాడు. పురాణాల కథనం ప్రకారం, ఇది త్రేతాయుగానికి చెందినది. మునులను అవమానించిన కారణంగా విష్ణుమూర్తి ద్వార పాలకులైన జయ, విజయలు కశ్యప మహామునికి కుమారులుగా హిరణ్యకశిప, హిరణ్యాక్షులుగా జన్మిస్తారు. చిన్నవాడైన హిరణ్యాక్షుడు భూమిని బంధించి సమస్త ప్రాణులను హింసిస్తుండగా విష్ణుమూర్తి వరాహ రూపంలో అతన్ని సంహరించి భూమిని రక్షించాడు. సోదరుని మరణవార్తతో హిరణ్యకశిపుడు క్రోధుడై దేవతలను, ఋషులను, హరిభాక్తులను హింసిస్తుండగా శ్రీమహావిష్ణువు తన సేవకుల్లో ఒకరైన సుముఖున్ని హిరణ్యకశిపునికి కుమారుడిగా జన్మించమని ఆదేశించగా, అతడు ప్రహ్లాడునిగా జన్మించి, చిన్నతనంనుండే విష్ణుభక్తుడు అయ్యాడు. ఇది సహించక హిరణ్యకశిపుడు అనేక విధాలుగా అతన్ని మార్చడానికి ప్రయత్నించి విఫలుడై తన సేవకులతో ప్రహ్లాదున్ని సముద్రంలో పడవేసి, అతని మీద ఒక పర్వతాన్ని వేయవలసిందిగా ఆజ్ఞాపించాడు.

అప్పుడు సేవకులు సింహగిరి పర్వతాన్ని ప్రహ్లాదునిపై వేయగా స్వామి వచ్చి రక్షిస్తాడు. ఆ సింహగిరే నేటి సింహాచలంగా రూపాంతరం చెందింది. ప్రహ్లాదుని కోరికపై హిరణ్యాక్ష, హిరణ్యకశిపులని వధించిన అవతారాలైన వరాహ, నారసింహ రూపాలతో కలిసిన రూపంగా స్వామి ఇక్కడ వెలిశాడు. భక్తితో ప్రహ్లాదుడు స్వామికోసం ఇక్కడ ఒక ఆలయం కట్టించి వరాహనృసింహ స్వామిని పూజించినట్టు పురాణ కథనం. కృతయుగం చివరిలో ఈ ఆలయం నిరాదరణకు గురై కొంత భాగం భూమిలో కప్పబడిపోయింది. తరువాతి యుగంలో చంద్రవంశ రాజు వురూరవుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు. ప్రహ్లాదుని కథ విష్ణుపురాణంలోను, భాగవతంలోను ప్రస్తావించబడింది. సింహాచలం ప్రహ్లాదుని రక్షించిన క్షేత్రంగాను, అహోబిలం హిరణ్యకశిపుని వధించిన తరువాత వెలసిన క్షేత్రంగాను పురాణ కథనం. 

ఆలయంలో స్వామివారి ప్రధానోత్సవాలు :

ఆగమ శాస్త్రం మరియు శిష్టాచార సాంప్రదాయం ప్రకారం ఆలయ ఉత్సవాలు చాలా ఉన్నాయి. కల్యాణోత్సవం, చందనోత్సవం, ధనుర్మాస ఉత్సవం, వారోత్సవం, మాసోత్సవం జరుపుతారు. చందనయాత్ర వీటిల్లో అతి ముఖ్యమైనది. ఈ ఉత్సవానికి దేశం నలుమూలలనుండి భక్తులు వస్తారు. వైశాఖ మాసంలోని అక్షయతృతీయ రోజు ఈ ఉత్సవం చేస్తారు. ఇది శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైన ఉత్సవంగా భావిస్తారు. ఈ రోజు స్వామికి చందనం సమర్పించినవారికి, దర్శించినవారికి మోక్షం, ఆనందం కలుగుతాయి. స్వామివారి చందనం తెల్లవారుఝామున తీసి పన్నెండు గంటల నిజరూప దర్శనం తరువాత సాయంత్రం మళ్ళీ చందనపూత వేస్తారు. పన్నెండు మణుగుల చందనం స్వామివారికి మూడు సార్లుగా వేస్తారు. అవి నరసింహ జయన్తి, ఆషాడ శుద్ధపూర్ణిమ, జ్యేష్ఠ శుద్ధ పూర్టిమ.

ఈ ఆలయం కట్టడం విభిన్నంగాను వివిధ పద్ధతుల మిళితంగాను ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న స్తంభాలు శిల్పకళా శోభితాలు. స్తంభాల మీద రకరకాల నరసింహ మూర్తులను ధ్యాన శ్లోక వర్ణనల ఆధారంగా మలిచారు. శ్రీవరాహ స్వామికి, శ్రీనరసిహునికి విడివిడిగా అనేక ఆలయాలు ఉన్నప్పటికీ ఈ రెండు ఒకటిగా కలిసి ప్రధాన దైవంగా ఆరాధించబడే స్థలం సింహాచలం ఒక్కటే. రెండూ స్వామివారి ఉగ్రరూపాలు అవడం చేత చందనంతో కప్పబడి ఉంచారనే అభిప్రాయం ఉంది.

Brahmasri chaganti koteswara rao garu 


No comments: