Wednesday, November 27, 2013

పంచ దేవతలు ఎవరు?


















"మన హిందూ దేవాలయాలు,మరియు వాటి విశిష్టతలు''
పంచ దేవతలు ఎవరు? "పంచాయతనము" గురించి క్లుప్తంగా తెలుసుకుందాము:-
...........................................

ఆదిత్య మంబికా విష్ణుం గణనాథ మహేశ్వరమ్ 
సర్వేష్టం సారభూతం చ పంచదేవాయ సేవనమ్!! 
తాత్పర్యం:- 
................

సూర్యుడు, అంబిక , విష్ణు, గణపతి, ఈశ్వరుడు వీరినే పంచ దేవతలు అంటారు. వీరు కలియుగ పాపకర్మలు భరించలేక కొన్ని ప్రత్యేక శిలల్లో ఉన్నట్లు 'సిద్ధాంత శేఖరంలో' చెప్పబడినది. ఆ శిలలో మాత్రమే ఆ దేవతా విగ్రహాలను మలచి పూజలు సల్పిన సత్ఫలితము లొసంగును. దేవతా పూజా నిరాటంకముగా (ఆటంకం లేకుండా) సాగగలదు. పంచదేవతా పూజ చాలా ప్రశస్తమని 'దేవీ భాగవతము' నందు కలదు. కలియుగ ధర్మాన్ని అనుసరించి ఈ అయిదుగురు దేవతలు ఆయా సాల గ్రామ శిలలోనే ఉంటారట. 
1) సాల గ్రామ లింగం (విష్ణువు):-
............................................ 

ఈ శిలలు నేపాలులో ముక్తినాథ దగ్గర గండకీ నది యందు లభించును. ఈ శిలలు చిన్న చిన్న రంధ్రములు కలిగి ఉంటాయి. నీటిలో రాయి వేసి తులసీ దళం వేసిన ఆ రంధ్రానికి దగ్గరగా తులసి చేరునట. విష్ణువుని మధ్యలో పెట్టి మిగతా దేవతా విగ్రహాలు శాస్త్ర ప్రకారము పెట్టిన, అది విష్ణు పంచాయతన మందురు. అట్లు పూజించిన వారికి విష్ణు సాయుజ్యము కలుగునని పద్మ పురాణంలో గలదు. 
2)బాణ లింగం(శివుడు):- 
.................................

మధ్యప్రదేశ్ లో ఓంకారేశ్వర్ దగ్గర నర్మదానదిలో లభించును. బాణలింగ సహిత రుద్రుని పూజించుట వల్ల ఆత్మజ్ఞానం లభించును. బాణలింగ సహిత రుద్రుణ్ణి మధ్యలో పెట్టి పూజించిన శివాపంచాయతనమందురు.
3)స్ఫటిక లింగం (సూర్యుడు):- 
.......................................

ఈ స్ఫటికలింగాలు తంజావూరు దగ్గర కావేరీ నదిలో లభించును. ఆదిత్యం ఆరోగ్యం అన్నట్లు సూర్య పూజ వల్ల ఆరోగ్యం లభించును. సూర్యుని మధ్యలో పెట్టి పూజించిన సూర్య పంచాయతనమందురు. 
4)అంబికా లింగం (అంబిక):- 
....................................

ఈ లింగములు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ కాళహస్తి దగ్గర గల సువర్ల ముఖీనదిలో దొరుకును. అంబికాలింగ సహిత పూజసల్పిన భోగం లభించునని సిద్ధాంత శేఖరంలో గలదు. దేవీస్తానమందు దుర్గనుగాని, లక్ష్మినిగాని, సరస్వతిని గాని, శక్తి శ్రయాన్ని అర్చించవచ్చు. 
5)శోణలింగం (గణపతి):-
................................

ఉత్తరప్రదేశ్ లోని శోణభద్ర జిల్లాలో యున్న నదిలో కల శిలలు మైనాక పర్వతం నుండి ఉత్తరంగా వచ్చి గంగలో కలియుచున్నది.(పాట్నా వద్ద) ఈ శోణలింగ సహిత గణపతి పూజ వల్ల కార్యములు నిర్విఘ్నముగా నెరవేరును. గణపతిని మధ్యలో పెట్టి ఉంచిన గణపతిపంచాయతన మందురు.

No comments: