సర్వవ్యాపి నారాయణుడి విశిష్టతను యావత్ ప్రపంచానికీ చాటుతూ ఉత్తరాదిన బదరీనాథ్, ద్వారక, దక్షిణాదిన రామేశ్వరం, మధ్య తూర్పున పూరీధామాలు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నాయి. 'శ్రీ పీఠం'గా పిలిచే పూరీఆలయం 214 అడుగుల ఎతైన గోపురంతో, 68 అనుబంధ ఆలయాలతో భక్తజనులను ఆకర్షిస్తున్నది. ఇక్కడ కొలువు దీరిన బలభద్ర, జగన్నాథ, సుభద్రలను సృష్టి (బ్రహ్మ), స్థితి (విష్ణు), లయ (మహేశ్వరుడు)లకు ప్రతీకగానూ; రుద్ర, విష్ణు, ఆదిపరాశక్తి రూపాలుగానూ భావిస్తుంటారు.
సాధారణంగా ఆలయాల్లో స్వామి మూలరూపం స్వయంభూవుగానో, లేదా ప్రతిష్ఠించో ఉంటుది. కానీ, పూరీనాథుడి రూపం 'దైవం చెక్కిన దారు శిల్పం'. అంగవైకల్యం కలిగిన విచిత్ర రూపం. సోదరి సుభద్రతో పాటు అన్నదమ్ములిద్దరు మొండిచేతులు, నడుం వరకు ఆకృతితోనే దర్శనం ఇస్తారు. అవయవ లోపంగల విగ్రహాలు అర్చనకు అనర్హమంటారు.కానీ 'నీలాచలం' క్ష్తేత్రంలో అదే ప్రత్యేకత. ఇందుకు సంబంధించి వాడుకలో ఉన్న కథల్లో ఒకటి- 'సముద్రంలో కొట్టుకు వచ్చే కలపదుంగతో తన మూర్తిని చెక్కించవలసిందిగా శ్రీమహావిష్ణువు ఇంద్రద్యుమ్నుడనే రాజును స్వప్నంలో కోరతాడు.
అయితే, ఆ పని ఎవరి వల్ల కాని పరిస్థితుల్లో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ముందుకు వస్తాడు. 21 రోజలు వరకు తన పనికి ఆటంకం కల్పించ రాదంటూ గదిలోకి వెళి తలుపులు మూస్తాడు. అయితే, ఉత్సుకతను ఆపుకోలేని రాజదంపతులు పక్షం రోజులకే గది తలుపులు తెరవగా, మూడు ప్రతిమలు అసంపూర్తిగా కనిపించాయట. కానీ బ్రాహ్మణుడి జాడ లేదు. దాంతో ఆయనను సాక్షాత్తు శ్రీమన్నారాయుణుడిగా భావించిన రాజు తమ పొరపాటుకు చితించి, ఆ మూర్తులను అలాగే ప్రతిష్ఠించి మందిరం కట్టించారు. ఆ తరువాత క్రీ.శ. 1140లో అప్పటి రాజు అనంతవర్మ చోడగంగాదేవ్ నూతన మందిరం నిర్మించగా, అనంతరకాలంలో శిథిలమైనదానిని ఆయన మనువడు అనంగ మహాదేవుడు పునర్నిర్మించారు.
'విశ్వ'రథయాత్ర
ప్రపంచ రథయాత్రల్లో పూరీక్షేత్రం రథయాత్రకు పెట్టింది పేరు. అన్ని క్షేత్రాల్లో రథయాత్రలు జరుగుతున్నా, జాతిమతకులవర్గలింగ భేదాలకు అతీతంగా సర్వులూ పాల్గొనడం, స్వయంగా రథం లాగడం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు దీనిని పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. జగముల నేలే దేవదేవుడే తన నివాసం 'శ్రీపీఠం' వీడి జనం మధ్యకు రావడం, రోజుల తరబడి ఆలయం వెలుపలే ఉండడం మరో ప్రత్యేకత. ఆయనను చేరలేని తమ కోసం తానే తరలివస్తారని భక్తకోటి విశ్వాసం. ధర్మరక్షణ, పతితోద్ధరణకు జగన్నాథుడు అలా రథయాత్ర చేస్తారని చెబుతారు. ఆలయ నియమం ప్రకారం 'యాత్ర' ప్రారంభమైన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ రథం పురోగమనమే తప్ప తిరోగమించదు.
ఏటా ఆషా«ఢ శుద్ధ విదియనాడు ప్రారంభమై ఏకాదశి వరకు సాగే రథయాత్రలో బలభద్ర, సుభద్ర, జగన్నాథులు వేర్వేరు రథాలు అధిరోహించి భక్తులకు దర్శనం ఇస్తారు. గజపతుల ప్రథమ హారతితోనే రథయాత్ర ఆరంభమవుతుంది. తరువాత, ఆ ముగ్గురు దేవతలు జన్మించిన ప్రాంతంగా భావించే 'అడప మండపం' వద్ద బసచేసి, తొమ్మిదవ నాడు తిరుగు ప్రయాణం (బహుదా యాత్ర) అవుతారు. ఆలయానికి చేరిన దేవతలకు 'పన' మధుర పదార్థాన్ని అందిస్తారు. అనంతరం జగన్నాథ స్వామి బంగారు జలతారు వస్త్రాలు ధరించి భక్తులకు పునర్దర్శనం ఇస్తారు. ఆలయ నియమం ప్రకారం 'యాత్ర' ప్రారంభమైన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ రథం తిరోగమించకూడదు.
మూలవిరాట్లు కదులుతాయి!
ఇతర క్షేత్రాల్లో ఉత్సవమూర్తులు ఆలయవీధుల్లో విహరిస్తే, ఇక్కడ 'మూల విగ్రహాలే' తరలి వెళతాయి. సాధారణంగా ఆలయాల్లో మూలవిరాట్లు శిలారూపాలుగా, ఉత్సవ విగ్రహాలు పంచలోహాలతో రూపొందించినవిగా ఉంటాయి. పూరీ క్షేత్రంలో అన్ని విగ్రహాలు 'దారు' (కొయ్య) నిర్మితాలే. అన్ని ఆలయాల్లో స్వామివారు దేవేరులతో కొలువు దీరితే, ఇక్కడ జగన్నాథుడు అన్నాచెల్లెళ్ల (బలరాముడు, సుభద్ర)తో కలసి ఉండడం ఇంకో ప్రత్యేకత. ఈ రథయాత్రను సోదరి పట్ల ప్రేమకు ప్రతీకగా చెప్పవచ్చు.
ముందు భాగంలో బలభ«ద్రుడి రథం, దాని వెంట సోదరి రథం వెళుతుంటే జగన్నా««థుడి తేరు వారినియ అనుసరిస్తూ చెల్లెలిని సు'భద్రం'గా చూసుకునే తీరు అవగతమవుతుంది. శ్రీవారు తనను మరచి అన్నాచెల్లెళ్లతో రథయాత్ర సాగించారన్న కినుకతో శ్రీమహాలక్ష్మి జగన్నాథుడు మందిరంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుందని, స్వామి కొన్ని మధుల పదార్ధాలు తెచ్చి ఆమను ప్రసన్నం చేసుకుని మందిర ప్రవేశం చేస్తారని కథనం. పూజారులు పాటలతో ఆ దృశ్యాన్ని అభినయించడం ఆకట్టుకునే దృశ్యం.
సమానత్వం జగన్నాథ తత్త్వం
లౌకికవాదం, సమానత్వం జగన్నాథుని సిద్ధాంతమని ఆయన పూజాదికాలు, దర్శనంలో బోధపడుతుంది. దర్శనం, ఆ«రాధనల్లో హెచ్చుతగ్గులు-స్థాయీభేదాలు కానీ, 'మహాప్రసాదం' స్వీకరణలో 'అంటూసొంటూ' కానీ ఉండవు. 'సర్వం జగన్నాథం'నానుడి అలానే పుట్టిందేమో! జగన్నాథ ఆరాధన శైలి మానవ జీవితచక్రాన్ని పోలి ఉంటుంది. ఆకలి దప్పులు, అనారోగ్యం, మమతలు, అభిమానాలు, అలకలు గోచరిస్తాయి.
రథోత్సవ ప్రారంభానికి ముందు జ్యేష్ఠ పూర్ణిమ నాడు 108 బిందెలతో దేవతామూర్తులకు స్నానం చేయిస్తారు ఈ 'సుదీర్ఘ' స్నానంతో వారు మానవ సహజమైన అనారోగ్యం బారినపడి, తిరిగి కోలుకునే వరకు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. 56 రకాల ప్రసాదాలు ఆరగించే స్వామికి, ఆ సమయంలో 'పథ్యం'గా కందమూలాలు, పండ్లు మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. మళ్లీఆలయ ప్రవేశంతో 'నేత్రోత్సవం' జరిపి, యథాప్రకారం నైవేద్యం సమర్పిస్తారు.
'భాగ్యనగరి' లో ఉత్కళ 'నాథుడు'
భాగ్యనగరిలో 'ఉత్కళ నాథుడు' కొలువుదీరాడు. పూరీ ఆలయ శిల్ప సౌందర్యానికి ప్రతీకగా హైదరాబాద్ బంజారాహిల్స్లో 'కళింగ కల్చరల్ ట్రస్టు' ఆధ్వర్యంలో ఎకరంన్నర విస్తీర్ణంలో జగన్నాథ మందిరం రూపుదిద్దుకుంది. 74 అడుగుల ఎత్తు గోపురంతో, ఆలయ ప్రాంగణంలో శ్రీమహాలక్ష్మి, కాశీవిశ్వనాథ,విమల (దుర్గాదేవి), గణపతి, హనుమాన్, నవగ్రహ ఉప ఆలయాలు ఉన్నాయి.
ప్రాకారాలపై రామాయణ, భాగవత, భారత పురాణాల ప్రధాన ఘట్టాలు, దశావతర ఘట్టాలు కన్నుల విందు చేస్తాయి. పూరీ తరహాలోనే ఇక్కడ ్డ అర్చనలు నిర్వహిస్తున్నారు. ఆలయం నిర్మించాక జరిగిన తొలియాత్ర మాదిరిగానే జూలై 3వ తేదీన జరిగే రెండవ రథయాత్రను కూడా గవర్నర్ ఇ.ఎస్ఎల్. నరసింహన్ ప్రారంభిస్తారు. 'ర థస్తం వామనమ్ దృష్ట్వా పునర్జన్మ న విద్యతే'... అని ఆర్యోక్తి. వామనుడు జగన్నాథుని అవతారమని, రథంపై ఉన్న ఆయన దర్శనంతో పాపవిమోచనం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఆ శోభాయాత్ర కోసం వారి నిరీక్షణ...
'నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే!
సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళమ్!!
మహేందర్ భొద్దు గారి ప్రేరణ..వీరి ప్రేరణలు నాకు బాగా నచ్చుతాయి
వీరు రాసిన ఈ వ్యాసం మీరందరు చదివి కామెంటు రాస్తారని ఆశిస్తూ...