Thursday, March 22, 2012

ఉగాది..శ్రీ నందన నామ సంవత్సర శుభాకాంక్షలు

























































ఉగాది వచిందోయ్ కొత్త వసంతాలను మోసుకొచ్చిందోయ్
అందరికీ మిత్రులకీ..బంధువులకు..తదితరులకు అందరికీ..
ఉగాది..శ్రీ నందన నామ సంవత్సర శుభాకాంక్షలు

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ.
ఉగాది రోజున ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.

ఈ పండగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు



ఉగాది పచ్చడి - ప్రాముఖ్యత:
ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది . పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక -
బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం
ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు - పులుపు - కొత్త సవాళ్లు
మిరపపొడి – కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు

ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు.ఋతు మార్పు కారణంగా వచ్చే వాత,కఫ ,పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటాఱు.
ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు'వేపపువ్వు,చింతపండు,బెల్లం,పచ్చిమిరప కాయలు,మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు.ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

"త్వామష్ఠ శోక నరాభీష్టమధుమాస సముద్భవనిబామి శోక సంతప్తాంమమ శోకం సదా కురు

ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి.

ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్రలాంటివి ఉపయోగించాలి. ఈ పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదశాస్త్రం పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. వేపపూత పచ్చడికి శాస్త్రంలో నింబకుసుమ భక్షణం అని పేరుంది. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పేమాట అయితే ఒక్కపూట తింటేనే అంతఫలితం వస్తుందా అని కొందరంటారు. కానీ ఈ వేపపూత పచ్చడిని సేవించటం చైత్రశుక్ల పాడ్యమి నుండి పూర్ణిమ వరకు కానీ లేదా కనీసం ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటైనా వసంత నవరాత్రుల వరకూ అయినా సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేష్మాలవల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది. పూర్వం లేతవేప చిగుళ్ళు ఇంగువ పొంగించి బెల్లం, సైంధవల వణం కలిపి కొద్దిగా నూరి చింతపండు, తాటిబెల్లంకానీ, పటికబెల్లంకానీ, వాము, జీలకర్ర మంచిపసుపు కలిపి నూరేవారు. ఈ మిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉగాది నుండి తొమ్మిది రోజులుకానీ, పదిహేను రోజులుకానీ వీలును బట్టి సేవించేవారు. ఈ పద్ధతంతా చాలామంది మరచిపోయారు. ఉగాది పచ్చడితిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మ కుంభ దానంవల్ల సంవత్సరం మంతా కోరిన కోరికలు తీరుతాయన్నది నమ్మకం

ఉగాది ప్రసాదంఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రసాదంలో ముఖ్యంగా పానకం ,వడపప్పు చోటు చేసుకుంటాయి.ఉగాదితో వేసవి ఆంభం అవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటి నీరాహారం తినడం ఆవసరాన్నిఇది గుర్తు చేస్తుంది అలాగే వడపప్పు కూడా వడ పప్పు లో వాడే పెసరపప్పు చలవచేస్తుం కనుక వేసవిలో కలిగే అవస్థ లను ఇది కొంత తగ్గిస్తుంది.ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే కాక ఈ రుతువు మొత్తం తీసుకోవాలన్న సూచన ఈ ఆచారంలో నిబిడీకృతమై ఉంది.ఉగాదికి విసన కర్రలను పంచే ఆచారం ఉంది.ప్రస్థుత కాలంలో ఉన్న పంఖా లాంటి,ఏసీ మరియు ఎయిర్ కూలరు లాంటి వసతులు లేనికాలంలో వేసవిలో సంభవించే గాలి లేమిని విసనకర్రాలు కొంత తీరుస్తాయి కనుక ఈ ఆచారం ఉగాదితో ప్రారంభం అవుతుంది.

ఒక వారం ముందే పండగ పనులు మొదలవుతాయి. ఇంటికి వెల్ల వేసి, శుభ్రం చేసుకుంటారు. కొత్త బట్టలు, కొత్త సామాగ్రీ కొనడంలో ఉత్సాహం పండుగ సందడి ఒక వారం ముందేమొదలవుతుంది. పండుగ రోజున తెల్లవారుఝామునే లేచి, తలస్నానం చేసి, ఇంటికి మామిడి తోరణాలు కడతారు. పచ్చటి మామిడి తోరనాలకు ఈ రోజుకు సంబంధించి ఒక కధ ఉంది. శివపుత్రులు గణపతి, సుబ్రమణ్యస్వాములకు మామిడి పండ్లంటే ఎంతో ప్రీతి. సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి పచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద, మంచి పంట కలుగుతుందని దీవించాడని కధ. ప్రతీ ఇంట ముందు ఆవు పేడతో కల్లాపి జల్లి , రంగు రంగుల రంగవల్లులు తీర్చి దిద్దుతారు. శాస్త్రయుక్తంగా తమ ఇష్టదైవానికి పూజ చేసుకుని కొత్త సంవత్సరం అంత శుభం కలగాలనికోరుకుంటారు. ఆరోగ్య ఐశ్వర్యాలను ఆకాంక్షిస్తారు . ఈ రోజున కొత్త పనులు వ్యాపారాలు మొదలెడతారు.
ఇంటింట ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. పులిహోర, బొబ్బట్లు, పాయసం, అలాగే పచ్చి మామిడి కాయతో వంటకాలు విశేషం.

పంచాంగ శ్రవణం:
ఈ రోజున ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం జరుగుతుంది. సాధారణంగా సాయంత్ర సమయాన ఊరి జనాలు ఒక చోట చేరి, సిద్ధాంతి చెప్పే పంచాంగ వివరాలు, ఆ సంవత్సరరాశి ఫలాలు తెలుసుకుంటారు సిద్ధాంతి దేశ, రాష్ట్ర, వ్యక్తీ స్థితి గతులు ఎలా ఉంటాయో వివరణ చేస్తాడు. పంచాంగ శ్రవణం వాళ్ళ రానున్న మంచి చెడులను సమభావంతో స్వీకరించ గలరని, పంచాంగ శ్రవణం వినడం మంచిది అని మన పెద్దలు చెప్పటం జరిగింది.

ఊరగాయల కాలం:
మామిడికాయలు దండిగా రావడంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలెడతారు. వర్షాకాలం, చలికాలానికి ఉపయోగించు కోవడానికి వీలుగా మామిళ్ళను, ఇతర కాయలను ఎండబెట్టి, ఊరవేస్తారు. తెలుగు వారిళ్ళలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది "ఆవకాయ". “ఇలా వివిధ విశేషాలకు నాంది యుగాది - తెలుగువారి ఉగాది”
అందరికీ మిత్రులకీ..బంధువులకు..తదితరులకు అందరికీ..
ఉగాది..శ్రీ నందన నామ సంవత్సర శుభాకాంక్షలు

No comments: