Thursday, June 16, 2011

గోవు పూజ పాట


గోవు అడుగులయందు అష్టైశ్వర్యములుండును.
గిట్టల మధ్యన గంధర్వులుందురు.
పాదాలయందు చతుర్వేదములుండు
పిక్కలయండు గుడి గంటలుండు
గిట్టల చివర పన్నగులుందురు
గిట్టల ప్రక్కలో అప్సరసలుందురు
తొడలయందు సర్వలోక తీర్ధములుండు
పొదుగున పుండరీకాక్షుడు ఉండును
చనులయందు సాలగ్రామాలుండును
పితుకుల యందు సప్త సముద్రములుండు
నాభియందున శ్రీకమలముండు
కడుపున భూదేవి స్థిరముగానుండు
తోకను సోముడు నివసించుచుండును
తోకయందలి రోమాల సూర్యరశ్మి యుండు
ఉర మధ్యమున ఋషులు నివసింతురు.
చర్మమున సకల శుభములు వర్ధిల్లు
శరీరములోని రోమాల సకల దేవతలు ఉండు
మాంసమున మాధవుడు నిలయమై ఉండు
ఎముకల యందు బ్రహ్మ నివసించు
పృష్ట భాగమున ఏకాదశ రుద్రులు ఉండెదరు
హృదయమున సాధ్వులు వసించుచుందురు
మూపురమున చుక్కలు మెరయుచునుందురు
మెడను ఇంద్రుడు నివసించుచుండు
పెదవులు వైకుంట ద్వారములగును
నాలుకయండు నారాయణుడుండు
దవడలయందు ధర్మదేవత యుండు
నోరున లోకేశము నిలయమై యుండు
హుంకారమున సరస్వతీ దేవి నివసించు
ముక్కున శీతాచల పుత్రి యుండు
ముక్కు కాడన కుమార స్వామి వర్ధిల్లు
గడ్డము కైలాస శిఖరమై యుండు
నుదురున పరమేశ్వరుడు నివసించును
నేత్రముల సూర్య చంద్రులు మెరయు
కర్ణముల అశ్వనీ దేవతలు వెలయు
కొమ్ములు గోవర్ధన పర్వతములగును
కొమ్ముల కొసలు సర్వ తీర్ధములగును
గోవు పాలయందు సరస్వతీ నదియు,
పంచితమున గంగానదియు,
గోమయమున శ్రీమహాలక్ష్మియును
ఆజ్యమున అగ్నిదేవుడును నివసించును

గోవుపాట పాడిన ఫలితమెయ్యది యనగా
వేకువన పాడితే కోటి వేల నదులలో స్నానాలు చేసిన ఫలితం
ప్రొద్దున్నే పాడితే కోటి వేల బ్రహ్మ కలశాల నోము నోచిన ఫలితం
మధ్యాహ్నమున పాడితే కోటి వేల బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం
సంధ్య వేళ పాడితే కోటి దేవాలయములలో దీపారాధన చేసిన ఫలితం
అమావాస్య నాడు పాడితే ఆరునెలల పాపం,
పౌర్ణమి నాడు పాడితే పది నెలల పాపం పోవును
గోవును వర్ణించిన ఇంతికి సకల శుభములు, ఇహ పర సుఖములు కలుగును.

No comments: