Saturday, October 20, 2012

దసరా నవరాత్రులు – దేవీ అవతారం విశిష్టత -- గాయత్రి దేవి


రెండవరోజు అవతారం గాయత్రి దేవి రెండవరోజు అవతారం గాయత్రి దేవి 

ఈ రోజు అవతారం గాయత్రి దేవి, ఈ అవతారం విశిష్టత

సకల వేద స్వరూపం గాయత్రి దేవి. అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ మాత. ముక్త, విదుమ్ర, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవి
ని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతః కాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది

ఓం బ్రహ్మకుండికాహస్తాం
శుద్ధజ్యోతిస్వరూపిణీం
సర్వతత్త్వమయీంక

వందే గాయత్రీం వేదమాతరమ్//

ఆశ్వయుజ శుద్ధ విదియనాడు కనకదుర్గమ్మను శ్రీగాయత్రీదేవిగా అలంకరిస్తారు. ఈ తల్లి సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొందింది. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టానదేవత. గాయత్రీమంత్ర ప్రభావం చాలా గొప్పది. ఆ మంత్రాన్ని వేయిసార్లు ధ్యానిస్తే చాలు, గాయత్రీమాత అనుగ్రహిస్తుందని, తద్వారా వాక్సుద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు. 


సకల మంత్రాలకు, అనుష్ఠానాలకు, వేదాలకు మూలదేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. సమస్త దేవతలకూ నివేదన చేయబోయే పదార్థాలన్నింటినీ ముందుగా గాయత్రీ మంత్రంతో నివేదన చేస్తారు. అంతటి మహిమాన్వితమైన గాయత్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదు ముఖాలతో, వరద అభయ హస్తాలు ధరించి కమలాసనాసీనురాలుగా దర్శనమిస్తుంది.

నేటి నైవేద్యం: స్నిగ్ధౌదనం (నేతి అన్నం)

"ముక్తావిద్రుమహేమనీలధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః 
యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే" 

తాత్పర్యము::

1)ముక్తా = ముత్యపు వర్ణము, 2) విద్రుమ = పగడపు వర్ణము, 3) హేమ = బంగారపు వర్ణము, 4) నీల = నీలవర్ణము, 5) ధవళ = తెల్లని వర్ణము గల ఐదు ముఖములు కలిగినదియు, 

ప్రతిముఖమునకు మూడు నేత్రములు కలిగినదియు, 
చంద్రకళతో కూడిన కిరీటము కలదియు, 
పరమార్థ వివరాణత్మక బీజాక్షరములు కలిగినదియు,

వరద మరియు అభయముద్రలు, అంకుశము, కొరడా, స్వచ్ఛమైన కపాలము, శంఖము, చక్రము, గద, రెండు పద్మములను తన పది హస్తములందు ధరించునదియుయైన గాయత్రీదేవి దర్శనమిస్తుంది.

సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. 
అమ్మవారు 24 తత్త్వములతో, 5 ముఖములు కలిగిన శక్తిగా ప్రభోధిస్తారు.

ఆది శంకరులు గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. 
ప్రాత: కాలంలో గాయత్రిగానూ, 
మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, 
సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. 

ముఖంలో అగ్ని, 
శిరస్సులో బ్రహ్మ, 
హృదయంలో విష్ణువు, 
శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. 

గాయత్రియే సకల దేవతలకు ఆరాధనీయం. "న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పరదైవతమ్"
భావము: తల్లిని మించిన దైవము, గాయత్రిని మించిన మంత్రము లేవు - ఆర్యోక్తి 

"గాయతాం త్రాయతే ఇతి గాయత్రి" - గానము చేయువాని రక్షించేది గాయత్రి. అనగా గొంతెత్తి బిగ్గరగా రాగ భావ శృతి లయ యుక్తంగా పాడవలెను. 

అమ్మను ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి, తద్వార బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది.

"ఓం భూర్భువస్సువః| ఓం తత్సవితుర్వరేణ్యమ్| భర్గో దేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్|"

గాయత్రీ మంత్ర పదవిభాగము:
ఓం, తత్, సవితుః, వరేణ్యమ్, భర్గః, దేవస్య ధీమహి, ధియః, యః, నః, ప్రచోదయాత్

పదక్రమము:
వరేణ్యమ్, నః, ధియః,ప్రచోదయాత్ యః తత్, ఓం సవితుః, దేవస్య, భర్గః, ధీమహి

అర్థములు:
వరేణ్యమ్ = కోరదగినదియు (అందరికీ శ్రేయస్సును కలిగించుటలో)
నః = మన
ధియః = బుద్ధులను
ప్రచోదయాత్ = ప్రేరేపించునదియు,
యః = ఎవరో
ఓం = ప్రణవ ప్రతీకమైన
తత్ = ఆ
సవితుః దేవస్య = వెలుగుల సవితృ మూర్తి యొక్క
భర్గః = స్వయం ప్రకాశ ప్రాసర గుణ సమన్వితమైన తేజస్సును
ధీమహి = ధ్యానించుదుము (గాక)

తాత్పర్యము: 
అందరికి శ్రేయస్సును కలిగించుటలో కోరదగినదియు, మన బుద్ధులను ప్రేరేపించునది ఎవరో - ప్రణవ ప్రతీకమైన ఆ వెలుగుల సవితృమూర్తియొక్క(స్వయం ప్రకాశ ప్రాసర గుణ సమన్వితమైన) తేజస్సును ధ్యానించెదము గాక!

గాయత్రీ స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేయాలి. గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేయాలి. 

లోకాస్సమస్తాః సుఖినో భవంతు | ఓం శాంతిః శాంతిః శాంతిః|

No comments: