Saturday, October 20, 2012

దసరా నవరాత్రులు - దేవీ అవతారం విశిష్టత -- శ్రీమహాలక్ష్మీదేవి

                                     
                                                 నాలుగవరోజు అవతారం శ్రీమహాలక్ష్మీ దేవీ

       
నాలుగవరోజు అవతారం శ్రీమహాలక్ష్మీ దేవీ
శ్రీమహాలక్ష్మీదేవి::

సిందూరాభాంచ పద్మస్థాం పద్మపత్రంచ దర్పణం
అర్ఘ్యపాత్రంచ దధతీం సద్భార మకుటాన్వితాం
నానా దాసీ పరివృతాం కాంచీ కుండలమండితాం

లావణ్య భూమికాం వందే సుందరాంగద బాహుకాం॥

దసరాలో ఆశ్వయుజ శుద్ధ చవితినాడు అమ్మవారిని శ్రీమహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. మంగళప్రదమైన దేవత లక్ష్మీదేవి. దుర్గాసప్తశతి అంతర్గతమైన దేవీచరిత్ర లో ఆదిపరాశక్తి... మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాలను ధరించి దుష్టరాక్షస సంహారం చేసిందని చెప్పబడింది. మూడు శక్తుల్లో ఒకటైన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి మహిషుడనే అసురుణ్ని సంహరించి మహిషమర్దినిగా ప్రసిద్ధి పొందింది. ఆ తరువాత మహిషాసురమర్దినీదేవిగా ఇంద్రకీలాద్రిపై కొలువైంది. సత్యలక్ష్మి, భోగలక్ష్మి, రాజ్యలక్ష్మి, యోగలక్ష్మి, విద్యాలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, అమృతలక్ష్మి, కామ్యలక్ష్మి అనే ఎనిమిది విధాలుగా మహాలక్ష్మీదేవి మనకు కనిపిస్తుంది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి అనే మరో ఎనిమిది రకాల అష్టలక్ష్ములు కూడా లోకంలో ప్రసిద్ధమయ్యాయి. దుర్గమ్మ త్రిశక్తుల్లో ఒకటైన మహాలక్ష్మి స్వరూపిణి కాబట్టి అమ్మవారి దేవాలయ కుడ్యకోష్టాల చుట్టుపక్కల అష్టలక్ష్మి విగ్రహాల్ని అందంగా ప్రతిష్టించారు. రెండు చేతుల్లో కమలాల్ని ధరించి వరదాభయహస్తాల్ని ప్రద ర్శిస్తూ గజరాజు తనని కొలుస్తుండగా కమలాసనాసీనురాలిగా మహాలక్ష్మీదేవి దర్శనమిస్తుంది.

నేటి నైవేద్యం: ముద్గాన్నం శాకాన్నము 
(పెసరపప్పు, పులగం)
 

No comments: