Saturday, October 20, 2012

దసరా నవరాత్రులు – దేవీ అవతారం విశిష్టత -- బాలాత్రిపురసుందరి

 మొదటి రోజు :: బాలాత్రిపురసుందరీ అవతారం.



బాలాత్రిపురసుందరి:

ఆశ్వయుజ మాసం శక్తిని ఆరాధించే విశేషమాసం. శరత్కాలంలో వచ్చే రాత్రులు కావటంతో వీటిని శరన్నవరాత్రులనీ, దేవీ ఆరాధన ప్రధానమైనది కాబట్టి దేవీనవరాత్రులనీ అంటారు. అసురత్వాన్ని అంతం చేసి, దురితాలను దూరం చేసే దుర్గాదేవి దశావతారాలను, ఒక్కోరోజు ఒక్కో అవతారంలో అలంకరిస్తారు.

అరుణ కిరణజాలైరంచితా సావకాశా

విధృత జపపుటీకా పుస్తకాభీతిహస్తా
ఇతరవరకరాఢ్యా ఫుల్లకల్హారసంస్థా
నివసతు హృది బాలా నిత్యకళ్యాణశీలా॥


మొదటిరోజు అమ్మవారు శ్రీబాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపుర త్రయంలో ఈ దేవి మొదటిది. బాలాదేవి మహిమాన్వితమైనది. శ్రీబాలామంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకి గొప్పది. అతి ముఖ్యమైనది కూడా. అందుకే శ్రీవిద్యోపాసకులను మొట్టమొదట ఈ బాలా మంత్రాన్నే ఉపదేశిస్తారు. పవిత్ర శ్రీచక్రంలో మొదటి అమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. అందుకే ముందుగా ఆ దేవిని అర్చిస్తేనే మహాత్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. బాలా త్రిపురసుందరీదేవిని ధ్యానిస్తేనే దుర్గాదేవి సంతోషిస్తుంది. కాబట్టి బాలాదేవి స్వరూపం ఎలా ఉంటుందో భక్తులకు తెలియచేయటం కోసమే ఈ అలంకరణ. 

నైవేద్యం - పాయసాన్నం
అలంకరణ - బాలాత్రిపురసుందరి..

No comments: