Saturday, October 20, 2012

దసరా నవరాత్రులు - దేవీ అవతారం విశిష్టత -- శ్రీ లలితా త్రిపుర సుందరీ

                                              ఆరవ రోజు అవతారం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి


శ్రీ లలితా త్రిపుర సుందరీ

ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం


బింబాధరం పృధుల మౌక్తిక శోభినాసమ్
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాభ్యాం
మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశమ్‌॥

దసరాలో ఆశ్వయుజ శుద్ధసప్తమి నాడు దుర్గమ్మను శ్రీలలితాత్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు.
త్రిపురాత్రయములో రెండొవ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు అమ్మ ముఖ్య దేవత.

త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపము. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపురసుందరీ దేవిని ఆరాధిస్తారు. 
సకల లోకాతీతమైన కోమలత్వము కలిగిన మాతృమూర్తి అమ్మ.

బ్రహ్మవిష్ణుమహేశ్వరులకన్నా పూర్వం నుంచి ఉన్నది కాబట్టి త్రిపురసుందరి అని పిలువబడుతోంది. 
శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్ర అధిదేవతగా భక్తుల్ని, ఉపాసకుల్ని అనుగ్రహిస్తుంది. 
దుర్గమ్మ సన్నిధిలో శంకరాచార్యుల వారిచే ప్రతిష్ఠితమైన శ్రీచక్ర అధిష్టాన దేవత కూడా ఈ లలితాత్రిపురసుందరీదేవే. 
పూర్వం దుర్గమ్మ ఆలయంలో శంకరాచార్యులు శ్రీచక్రయంత్రాన్ని ప్రతిష్ఠించారు. 
అప్పటి వరకు ఉగ్రస్వరూపంతో చండీదేవిలా ఉన్న దుర్గాదేవి లలితంగా పరమశాంత స్వరూపంతో దర్శనమిస్తోంది. 
అందుకని ఇక్కడి శ్రీచక్రానికి నిత్యం లలితా ఆష్టోత్తరం, లలితా సహస్రనామాలతో కుంకుమపూజ చేస్తారు. 
లలితాసహస్రనామ స్తోత్రంలో వర్ణించిన విధంగా 
‘సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా’ అన్నట్లు లక్ష్మీదేవి, సరస్వతీదేవి అటు ఇటూ నిలబడి 
లలితా పరాభట్టారికను వింజామరతో సేవిస్తున్నట్లుగా అలంకారం చేస్తారు. 
మధ్యలో ఉన్న లలితాదేవి చిరునవ్వులు చిందిస్తూ చేతిలో చెరకుగడను ధరించి, 
శివుని వక్షస్థలం మీద కూర్చుని అపురూప లావణ్యంతో ప్రకాశిస్తూ భక్తులకు దర్శనమిస్తుంది. 

దారిద్ర్య దుఃఖాలను తొలిగించి సకల ఐశ్వర్యాభీష్టాలను సిధ్ధింపజేస్తుంది. 
అమ్మ శ్రీవిద్యా స్వరూపిణి. సృష్ఠి, స్థితి సమ్హార రూపిణి.
ఈ అమ్మ వారికి ప్రీతికరమైన ప్రసాదం గారెలు,పులిహోర.

కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసినులకు తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.

మంత్రము: “ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః” అనే మంత్రము 108 మార్లు జపించవలెను.

రోజూ శుభోదయాన్న శ్రీచక్రానికి కుంకుమార్చన చేస్తూ..
లలితా సహస్రనామావళి చెప్పుకొంటే
అనుకొన్న కార్యాలు నెరవేరుతాయి..దయామయి సౌశీలవతి అయిన ఆ పరాశక్తి 
ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ...జై శ్రీ మాత్రేనమహా... 




"ఈ ప్రపంచం అంతా 'త్రిపురం'. పురం అంటే చోటు అని అర్థం. ........... 
........ మనమున్నచోటు నడిమి భాగం. దానికి పైన ఊర్థ్వలోకాలు. క్రింద అధోలోకాలు. ఈ ఊర్థ్వ, మధ్య, అధో లోకాలు .. మూడు లోకాలు. 
అలాగే భూత, భవిష్యత్, వర్తమానాలు. 
వ్యాపించిన గుణాలు .. సత్త్వ, రజస్తమో గుణాలు. 
జరిగే పనులు సృష్టి, స్థితి, లయలు... 
ముగ్గురు వేల్పులు బ్రహ్మ, విష్ణు, రుద్రులు. 
ఓంకారం మూడు అంగాలు... అ, ఉ, మ. 
వేదానికి ప్రధానంగా మూడు రకాల మంత్రాలు... ఋక్, యజు, స్సామములు.
ఇలా అన్నీ "త్రి" పురాలే.. 
ఇక మనలో .. భౌతిక, ప్రాణిక, మానసిక శక్తులు మూడు. 
స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు మూడు. 
జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలు మూడు. 
యోగపరమైన నాడులు మూడు... ఇడ, పింగళ, సుషుమ్న. 
ఇలా బైటా, లోపలా ఉన్న ప్రపంచమంతా మూడింటితో కూడినదే. ఈ మూడింటిలో వ్యాపించిన సౌందర్యమే...'త్రిపుర సుందరి'......
........ 'పురా' అంటే.......... 'పూర్వము' అని కూడా అర్థం...ఈ మూడు చోట్లు (ముల్లోకాలు, మూడు స్థితులు, మూడు కాలాలు వగైరాలు) కలుగక పూర్వమే ఉంది ఆ 'సౌందర్యం'..........
.......ముందున్నదీ, నిండినదీ అయిన ఆ శాశ్వత చిత్ శక్తియే నిజమైన లావణ్యం. అందుకే అది 'లలిత'. జీవరాశి అంతా ఆ శక్తినే ఆశ్రయించుకున్నది.. ఆశ్రయ శక్తినే 'శ్రీ' అంటారు. ... చైతన్యంకన్నా నిజమైన 'ఐశ్వర్యం' ఏముంది ? చైతన్యమేలేకుంటే శోభ, కాంతి ఉండవు.. అందుకే 'సౌందర్యలహరి'యే 'శ్రీమాత'.."
....................(... బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి కలం నుండి వెలువడిన "...ఏష ధర్మః సనాతనః" గ్రంధం నుండి.)

ఆ జగన్మాతను ఈ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరిగా ఆరాధిస్తున్నాము...
రాసినవారు ( Dinavahi Vekata Hanumantharao ) వారి నుండి సేకరణ 

No comments: