Saturday, May 5, 2012

నృసింహజయంతి శుభాకాంక్షలుఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ
మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్ |
వామేతరేణ వరదాభయ పద్మ చిహ్నం
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్ ||


ప్రార్ధన శ్లోకం:


సత్యజ్ఞాన శివస్వరూప మమలమ్ క్షీరాబ్ధి మధ్యస్థితం

యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్|

త్ర్యక్షం చక్ర పినాక సాభయ వరాన్విభ్రాణమర్కచ్ఛవిమ్

ఛత్రీభూత ఫణీన్ద్ర మిన్దు ధవళమ్ లక్ష్మీనృసింహం భజే|


నరసింహావతారం:::--

మానవ పరిణామ క్రమంలో అసంపూర్ణమైన (సగం మానవా కారం, సగం సింహాకారం) మానవ రూపంతో కంనిపించే మొట్టమొదటి అవతారమే నరసింహావతారం. ఈ అవతారానికి ముందు మత్స్య, కూర్మ, వరాహావతారాలున్నాయి. అవి జంతు సంబంధమైనవి. విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా వెన్నెముక నిటారుగా ఉన్న అవతారాల్లో మొట్టమొదటిది నరసింహావతారమే. మానవావిర్భావం మొదట మత్స్య రూపమునుంచి ఆవిర్భవించిందనే సిద్ధాంతానికి, దశావతారాల్లో కనిపించే క్రమమూ, పరిణామమూ నిదర్శనాలుగా నిలుస్తాయి.

నరసింహావతారంలో రెండు భిన్న పార్శ్వాలు కనిపిస్తాయి. నృసింహుడు హిరణ్యకశిపుని పాలిట ఉగ్రుడై కనిపిస్తే, అదే రూపం ప్రహ్లాదునిపై దయారసాన్ని కురిపించింది. హిరణ్యకశిపుడు భయభ్రాంతుడైతే, అదే రూపాన్ని దర్శించిన ప్రహ్లాదుడు భక్తిరసాంబుధిలో ఓలాలాడాడు. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు వీరిద్దరిలో ఎవరు ధైర్యవంతులు? భుజబలం ఉన్నప్పటికీ మానసిక శక్తులు లేని హిరణ్యకశిపునికన్నా, బాలుడైనా ఆత్మశక్తి ద్వారా సంపాదించిన భక్తిబలంతో ప్రహ్లాదుడు ఉగ్రభీకర నృసింహ స్వరూపాన్ని చూసి భయపడలేదు. అలాగే హిరణ్యకశిపుడు కోరిన కోర్కెలు విషయవాంఛలు. విషయ వాంఛలపై ఎంతగా ప్రలోభపడినా చివరికి ఏదో ఒక రూపంలో అవి మనల్ని కాటేయక మానవు.

సంప్రదాయంలో నారసింహస్వామి విజయాన్ని అందించే వేల్పుగా ఖ్యాతి వహించాడు. రాజ్యలక్ష్మి సమేతుడై శత్రుభయంకరుడై, ఆర్తుల ఆర్తిని పోగొట్టే ఆర్తత్రాణ పరాయణుడు. నియమపూర్వకమైన సాధనల ద్వారా యౌగిక స్తంభాన్ని చేధిస్తే మాత్రమే మన హృదయంలో ఆవిర్భవించే విజ్ఞాన స్వరూపుడు. అహంకారంతో, ప్రలోభాలతో శరీరాకృతిలో మనల్ని పీడించే భవబాధలను వివేకమనే నఖాగ్రాలతో చీల్చి ఉపశమంపచేసే వాత్సల్య స్వరూపుడు. అందుకే ఆది శంకరాచార్యులు -

సంసార సాగర విశాల కరాళకాల
నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య
వ్యగ్రస్య రాగరసనోర్మిని పీడితస్య
లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబం!!

అని లక్ష్మీనృసింహుని సంసారం నుంచి విముక్తి కలింగించే ఆపద్బాంధవునిగా కొనియాడారు. నరసింహుని వీరత్వంగానీ, వాత్సల్యం కానీ, విరాట్ రూపంగానీ సమాన్యమైనవి కాదు. వర్ణనాతీతమైనవి. ప్రహ్లాదుడంటేనే లోకానికి ఆహ్లాదం కలిగించేవాడు. ఆ ప్రహ్లాదునికే ఆహ్లాదంకలిగించిన నృసింహుడు ప్రహ్లాదహ్లాదుడై, ప్రహ్లాద భక్త వరదుడై, కరుణా సముద్రుడయ్యాడు. నృసింహనామాన్ని ఒక్కసారి స్మరిస్తే చాలు – సర్వారిష్టాలు, భయభ్రాంతులు, ఈతిబాధలు, శారీరక రోగాలు పటాపంచలై పోతాయని ఎందరో విశ్వసిస్తారు.

ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం!!

నృసింహజయంతి శుభాకాంక్షలు

No comments: