Friday, December 30, 2011

తిరుప్పావై--16





పాశురము::16
నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ
వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్
తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్
వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా
నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్

Tiruppavai in English - Pasuram 16.

Naayaganai ninra Nadagopanudaya
Koil Kaappaane! Kodi thonrum thorana
Vaayil kaappaane! Mani-k-kadavam thal thiravaai
Aayar sirumiyaromukku arai parai
Maayan Manivannan, nennale vaai nerndhaan!
Thooyomaai vandhom, thuyil ezha-p-paaduvaan
Vaayal munnam munnam maatraadhe amma! Nee
Neyanilai-k-kadhavam neeku-el or empaavaai


Thiruppavai in Tamil

திருப்பாவை பாசுரம் 16
.

நாயகனாய் நின்ற நந்தகோபன் உடைய
கோயில் காப்பானே! கொடி தோன்றும் தோரண
வாயில் காப்பானே! மணிக்கதவம் தாள்திறவாய்
ஆயர் சிறுமியரோமுக்கு அறைபறை
மாயன் மணிவண்ணன் நென்னலே வாய்நேர்ந்தான்
தூயோமாய் வந்தோம் துயில்எழப் பாடுவான்
வாயால் முன்னம் முன்னம் மாற்றாதே அம்மா! நீ
நேய நிலைக்கதவம் நீக்கேலோர் எம்பாவாய்.


గోపికలు నిద్ర పోతున్న పదిమంది గోపికలను మేల్కొల్పి నంద గోప భవనమునకు చేరిరి. పదిమంది మాత్రమె కాదు..ఆనందముతో శ్రీ కృష్ణుని పొందే యోగ్యత కలగోపికలను అందరను మేలుకొలిపి నంద గోప భావనమునకు వచ్చిరి. నందగోపుని ద్వారమునకు వచ్చి ద్వార పాలకుని అర్ధించి లోన ప్రవేసింతురు .

అర్థము::
అందరకు నాయకునాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భావనపాలకా లోనికి విడువుము..తోరనములతో శోభిస్తున్న ద్వారమును కాపాడుతున్న ద్వారపాలకా మణులచే అందముగా వున్నా గడియలను తెరువుము..గోపబాలికలగు మాకు మాయావి అయిన మణివర్ణుడగు శ్రీ కృష్ణ పరమాత్మ ద్వని చేయ "పఱ " అను వాయిద్యము ను ఇచ్చెదనని నిన్న నేను మాట ఇచ్చాను . మేము వేరొక ప్రయోజనము కాంక్షించి రాలేదు. పవిత్రమైన భావముతో వచ్చాము..శ్రీ కృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయుటకు వచ్చినాము..స్వామీ ముందుగానే నీవు కాదనకు..దగ్గరగా ప్రేమతో ఒకదానినిఒకటి చేరి బిగువుగా పట్టుకొని వున్న తలుపులను నీవే తెరచి మమ్ములను లోనకు పోనిమ్ము..అని భావనద్వార పాలకులను గోపికలు వేడుకొన్నారు.




ఓం గురుభ్యో నమః____/\____ 
గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వరరావుగారు చెప్పిన

తిరుప్పావై 16వ రోజు పాశురము

నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ
వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్
తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్
వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా
నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్

మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో గత పది పాశురాల్లో ఒక పది మంది జ్ఞానుల అనుగ్రహాన్ని మన పై పడేట్టు చేసింది మన ఆండాళ్ తల్లి. ఈ రోజు వారందరిని మనతో కల్పి నందగోప భవనానికి తీసుకువచ్చింది. ఆ నందగోపుడినే మనం ఆచార్యుడు అంటాం. ఎందుకంటే భగవంతుణ్ణి తలచి, భగవంతుణ్ణి తనలో కల్గి ఆనందించేవాడు కాబట్టి ఆయన నందుడు, ఆ భగవంతున్ని దుష్టుల దృష్టిలో పడకుండా దాచి గోప్యంగా ఉంచేవాడు అందుకే ఆయన గోపుడు. ముందుగా మనం చేరాల్సింది ఆచార్యుడి వద్దకు, అందుకే ఆండాళ్ తల్లి మనల్ని ఆచార్య భవనానికి తీసుకెళ్తుంది.

ఆ భవనంకు ఒక తోరణం ఒక ధ్వజం కట్టి ఉన్నాయి, ఇదే నందగోప భవనం అని మన వాళ్లంతా వచ్చారు. నందగోకులం కదా, ఎప్పుడూ ఏదో ఒక అసురుడు వస్తాడేమోనని చాలా కాపలా ఉండేది, వీరంతా అక్కడికి రాగానే అక్కడ ద్వార పాలకులు అప్రమత్తం అయ్యారు. ఆండాళ్ ముందుగా వాళ్ళను ప్రసన్నం చేసుకుంటుంది.

"నాయగనాయ్ నిన్ఱ" నాయకుడవై ఉండే "నందగోపనుడైయ" నందగోపుడి "కోయిల్ కాప్పానే!" భవనాన్ని కాపాడేవాడా! నందగోపుడెందుకు మాకు, అసలు నీవే మానాయకుడివి. చిన్న పిల్లల్ని చూసి ఆయన కంటితోనే అంగీకారం చెప్పాడు, లోనికి పంపాడు. అక్కడ ఇంకో ద్వార పాలకుడు ఉన్నాడు, అక్కడ "కొడిత్తోన్ఱుమ్" ఒక గరుడ ధ్వజం ఉంది, దాన్ని గుర్తు చూసుకొని శ్రీకృష్ణుడు ఉందేది ఇక్కడే అని వాళ్ళంతా వచ్చారు. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి అందరూ రాత్రుల్లే వచ్చేవారు ఎందుకంటే ఆయన ఉదయం గోవులు కాయటానికి యమునా నదికి వెళ్ళేవాడు. మరి ఆ నందగోకులంలో భవనాలు అన్నీ ఒకేలా ఉండటంతో, తనను చే్రాల్సినవారు పొరపాటుతో వేరే ఇంటి తలుపు తట్టకుండా భగవంతుడు చేసుకున్న ఏర్పాటు - ఆ గరుడ ధ్వజం. ఇదీ భగవంతుని చేష్ట. "తోరణ వాశల్" మంచి అద్భుతమైన తోరణం చెక్కి ఉన్న ద్వారం ఏర్పాటు చేసాడు నందగోపుడు. ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణి చూద్దామని వచ్చిన వాళ్ళు. అధ్భుతమైన తోరణాన్నే చూస్తూ శ్రీకృష్ణుణ్ణే మరచిపోయేట్టు చేస్తాయట. ఇతర వాటి యందు దృష్టి లేకుండా శ్రీకృష్ణుడియందు మాత్రమే దృష్టి కల్గినవారు మాత్రమే నేరుగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళేవారు. మన ఆలయాల్లో ఉండే అద్భుతమైన శిల్పాల ఏర్పాటు అందుకే, ఒక వేళ మన దృష్టి ఇతరత్రమైన వాటి యందు ఉంటే అక్కడే ఆగిపోతావు, అది దాటితే లోపలున్న పరమాత్మను దర్శనం చేసుకుంటావు. అలాగే శ్రీకృష్ణుడి భవనానికి నందగోపుడు అలాంటి ఏర్పాటు చేయించాడు. అలాంటి ద్వారాన్ని "కాప్పానే" కాపాడేవాడా అని నమస్కరించారు. "మణిక్కదవం" మణి మాణిక్యాలతో ఉన్న ద్వారం "తాళ్ తిఱవా" తాళం తీయవయ్యా.

ఎందుకొచ్చారు మీరింత రాత్రి అడిగాడు ఆయన. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి వీళ్ళేదు అన్నాడేమో "ఆయర్ శిఱుమియరోముక్కు" చిన్న గొల్లపిల్లలం మేమంతా. మరి ఏం కోరి వచ్చారు మీరు అని అడిగాడు. "అఱై పఱై" వ్రత పరికరాలు ఇస్తానన్నాడు శ్రీకృష్ణుడు అందుకే వచ్చాం అన్నారు. ఓ ఏదో ప్రయోజనం కోరి వచ్చారు కదా, అయితే తెల్లవారిన తర్వాత రమ్మని చెప్పాడు. మా కర్మ ఇలా ఉంది కాని, "నెన్నలే వాయ్-నేరుందాన్" నిన్న మమ్మల్ని కల్సి ఇంటికి రమ్మని మాచుట్టూ తిరిగాడు, ఇప్పుడు మేం ఆయనచుట్టు తిరగాల్సొస్తుంది, "మాయన్" ఉత్త మాయావి, మరి వదిలేద్దామా అయనని అంటే "మణివణ్ణన్" ఆయన దివ్య కాంతి మమ్మల్ని వదలనివ్వటం లేదయా. ఆయన ఎడబాటుని తట్టుకోలేమయా మేం. "తూయోమాయ్ వందోమ్" చాలా పవిత్రులమై వచ్చాం, ఇతరత్ర ప్రయోజనాలు కోసం రాలేదు, ఆయనేదో ఇస్తానంటే పుచ్చుకుందాం అని అనుకున్నాం కాని మేం వచ్చింది "తుయిలెర ప్పాడువాన్" ఆయన పవళించి ఉంటే ఎట్లా ఉంటాడో చూసి సుప్రభాతం పాడి లేపుదాం అని.


"వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా" అమ్మా స్వామి ముందు నీవు నోటితో అడ్డు చెప్పకుండా, "నీ నేశనిలైక్కదవం" శ్రీకృష్ణ ప్రేమచే సుదృఢంగా బంధించబడి ఉన్న ఆ ద్వారాలను తెరువు, ఎందుకంటే నందగోకులంలో మనుష్యులకే కాదు, వస్తువులకు కూడా శ్రీకృష్ణుడంటే ప్రేమ, ఎవ్వరు పడితే వారు తెరిస్తే తెరుచుకోవు, "నీక్కు" నీవే తీయవయ్యా అని అయనను ప్రార్థించి లోపలికి వెళ్ళారు.

No comments: