ఓం శ్రీ గురుభ్యోనమః___/\___
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము
స్కందోత్పత్తి – కుమారసంభవం – 2
పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనం కుమారసంభవం జరగాలి. అందుకు ప్రకృతియందు ఉన్నది ఒక్కటే ఆధారం. మహా తపస్వి అయిన శంకరుని అమ్మవారు ఆకర్షించింది. కాబట్టి వారి దివ్యమైన క్రీడా జరుగుతోంది. దానినే శాస్త్రమునందు మైథునము అని పిలిచారు. ఇలా శివపార్వతుల దివ్యమైన క్రీడా శత దివ్య వత్సరములు జరిగింది. ఆయన అమ్మవారు ఆడితే ఆడతాడు, పాడితే పాడతాడు. కానీ ఆయన తేజస్సు స్ఖలనం కాదు. అనగా ఆయన కామ మొహితుడు కాలేదన్నమాట. శతదివ్య వత్సరములు అయిపోయాయి. తారకాసురుడు దేవతలను చితక్కొడుతూనే ఉన్నాడు. శివుని తేజస్సులోంచే కుమారుడు పుట్టి తారకాసురుడిని సంహరించగల మహా వీరుడైన ఒక కుమారుడిని కనాలి. కానీ ఆ తేజస్సు పార్వతీ దేవియందు ప్రవేశించకుండా ఉండాలి. శివుడితో ‘నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను’ అని సనత్కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది కానీ, ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు. పరమశివుడు ఇన్నింటిని ఏకకాలమునందు నిలబెట్టగలిగిన వాడు. దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మచ్చపడడానికి సిద్ధంగా ఉన్నవాడు. నూరు దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకీ కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు.
ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా! అందుకని మొట్టమొదట శివమాయ దేవతలమీద ప్రసరించింది. అసలు కుమారసంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు. వాళ్ళు శివ మాయా మోహితులు అయి అక్కర్లేని విషయమును చర్చ మొదలుపెట్టారు. బ్రహ్మ కూడా మాయా మోహితుడై పోయాడు. వాళ్ళు ఇప్పుడు అయ్యవారి తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహాగొప్ప తేజోమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమిమీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా? అందుకని ఇపుడు శివతేజస్సు కదలరాదు అన్నారు. శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చినవాళ్ళు వీళ్ళే. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పరమశివుడు దగ్గరకు వెళ్ళారు. ఇపుడు ఆయన పార్వతీ దేవితో కలిసి కామక్రీడలో ఉన్నాడు. అటువంటి వాడు బ్రహ్మతో కలిసి దేవతలు తనకొరకు వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చి మీ కోరిక ఏమిటి? అని అడిగాడు. నీ తేజస్సు కానీ స్ఖలనం అయితే దానిని పట్టగలిగిన వారు లేదు. కాబట్టి ఈశ్వరా మీ తేజస్సును మీయందే ఉంచేసుకోండి. ఏదయినా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు. దేవతల సలహా విన్న పరశివుడు చిరునవ్వు నవ్వి ఈ భూమి మీద అందరూ సుఖపడెదరు గాక! నా తేజస్సు బయటకు పదకుండు గాక! కానీ ఒకే ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి. నూరు దివ్య వర్షములు పార్వతీ దేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానమునుండి కదిలిపోయిన పరమపవిత్రమయిన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ‘భూమి భరిస్తుంది’ అని చెప్పారు. శివతేజస్సును గ్రహించదానికి భూమి అంగీకరించింది. అపుడు శివుని తేజస్సు భూమి మీద పడింది. అది సామాన్యమయినది కాదు. ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను, అరణ్యములను అన్నింటిని ఆక్రమించేసింది. అందరూ అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు. అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేడు.ఈ విషయం అమ్మవారు తెలుసుకుని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించకుందురు గాక అని దేవతలను శపించింది. పిమ్మట భూమివంక తిరిగి నీవు అనేక రూపములను పొందుతావు. ఒకచోట చౌడు నెల, సారవంతమయిన నేల ఇలా రకరకములయిన రూపములు పొందుతావు. చాలామందికి భార్యవు అవుతావు అంది. దేవతలందరూ సిగ్గుతో మ్రాన్పడి పోయారు. శివుడు పశ్చిమ దిశగా హిమవత్పర్వత ప్రాంత శృంగము మీదికి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయనను అనుగామించి అమ్మవారు వెళ్ళిపోయింది. అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివతెజస్సును గంగయందు విడిచిపెడితే ఉమాదేవి బెంగ పెట్టుకోదు. కాబట్టి గంగయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు. అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరకి వెళ్లి అమ్మా దేవతల ప్రియం కొరకు నీవు గర్భమును దాల్చాలి అని అడిగాడు. అపుడు ఆమె శివ తేజస్సును స్వీకరించడానికి మనఃస్ఫూర్తిగా అంగీకరించింది. అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివ తేజమును గంగయందు విడిచిపెట్టాడు. వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒకమాట అన్నది. నేను ఈ తేజస్సును భరించలేను. ఏమి చెయ్యను అని అడిగింది. దేవతలలో మరల కంగారు మొదలయింది. అగ్నిహోత్రుడు గంగతో నీవు భరించ లేకపోతే దానిని హిమవత్పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలిపెట్టు అన్నాడు. గంగ అలాగే చేసింది. తేజస్సు వెళ్లి భూమి మీద పడగానే విశేషమయిన బంగారం, దాని తర్వాత వెండి పుట్టాయి. దాని క్షారం లోంచి రాగి ఇనుము పుట్టాయి. దాని తేజో మలం లోంచి తగరము, సీసం పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములయిన ధాతువులు పుట్టాయి. అక్కడ శరవణపు పొదలు ఉన్నాయి. అక్కడే దగ్గరలో ఒక తటాకం ఉంది. దానిని శరవణ తటాకము అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరం. నీరుగా మారింది. ఈ తేజస్సు ఆ తటాకము నందు పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడ్డాడు. కుమార సంభవం జరిగింది.
ఈవిధంగా కుమార సంభవం జరగగానే దేవతలు పొంగిపోయారు. శరవణ తటాకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తులా అమ్మవారి రూపే వచ్చింది. చిన్న పిల్లవాడు శూలం పట్టుకుని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. ఇప్పుడు పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి. వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు. అమ్మవారే కృత్తికా రూపంలో ఉంటుంది. అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేశారు. అపుడు ఆ కృత్తికలు ఆరుగురు వచ్చి మేము పాలు ఇస్తాము కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలి అన్నారు. ఈ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలవబడతాడు అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు. మా అమ్మే పాలివ్వదానికి సిద్ధపడిందని ఆరు ముఖములతో ఆ పిల్లవాడు ఏకకాలమునందు పాలు తాగేశాడు. కాబట్టి ‘షణ్ముఖుడు’ అయ్యాడు. కృత్తికల పాలు త్రాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు. సనత్కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు. ఆరుగురు కృత్తికల స్తనములను ఏకాకాలమునందు పానము చేసిన వాడు కనుక ఆయనకు ‘షడాననుడు’ అని పేరు వచ్చింది. పరమశివుని తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక ‘కుమారా’ అని పిలిచారు. అగ్నిహోత్రుడు తనయందు ఉంచుకుని గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవానిని ‘పావకి’ అని పిలిచారు.
ఆయన ఒకే ఒకసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యౌవనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు. ఉత్తరక్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజునాడే దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టేసి దేవసేనాధిపతిగా అభిషేకం చేసేశారు. కాబట్టి ‘సేనాని’ అని పేరుపొందాడు. ఈయనే ‘గుహా’ అనే పేరు ఉంది. కాబట్టి పరమపవిత్రమయిన ఈ సుబ్రహ్మణ్య స్వామివారి జననము వినడం అన్నది, ఆయన సంబంధమును గూర్చి వినడం అన్నది ఎవరికో తప్ప చెల్లదు. ఎవరు కార్తికేయునకు భక్తులై, ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారు ఆయుష్మంతులై పుత్రపౌత్రులను చూస్తారు, స్కందలోకమును పొందుతారు.
No comments:
Post a Comment