Saturday, December 12, 2015

కార్తీకపురాణము--30


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన కార్తీకపురాణము--30  

ఋషులడిగిరి. ఓ సూతమహర్షీ! మాకు పుణ్యమైనా హరి మహాత్మ్యమును జెప్పిటివి. ఇంకా కార్తికమహాత్మ్యమును వినగోరితిమి చెప్పవలసినది. కలియుగమందు కలుషిత మానసులై రోగాదులకు లోబడియుండి సంసార సముద్రమందు మునిగియున్న వారికి అనాయాసముగా పుణ్యము లభించెడిది యేది? ధర్మములలో ఎక్కువ ధర్మమేది? దేనివలన మోక్షము సిద్ధించును? దేవతలలోపల ఎక్కువ దేవుడెవ్వడు? ఏ కర్మచేత మోహము నశించును? కలియుగమున మానవులు మందమతులు జడులు, మృత్యుపీడితులును అగుదురు. వారికి అనాయాసముగా మోక్షము దొరికెడి ఉపాయమును జెప్పుము. ఇంకా ఇతరమైన హరికథను జెప్పుము.

సూతుడు పల్కెను. మునీశ్వరులారా! మీరడిగిన ప్రశ్న చాలా బాగున్నది. మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది. కాబట్టి సర్వసుఖకరమైన దానిని చెప్పెదను వినుడు. మీరు అల్పబుద్దులయిన జనులకు మోక్షోపాయమును జెప్పుమని కోరితిరి. ఈ ప్రశ్నలో కోపకారము కొరకయినదగుట చేత నాకు చాలా ఆనందదాయకమైనది. అనేక యాగములు చేసియు, అనేక పుణ్య తీర్థములందు స్నానాదికమాచరించియు ఏ ఫలమును బొందెదరో ఆ ఫలము ఈలాటి మంచి మాటలచేత లభ్యమగును. మునీశ్వరులారా! వినుడు. కార్తిక ఫలము వేదోక్తమైనది. అనగా కార్తికమందు వేదోక్త ఫలమును బొందెదరాణి భావము. కార్తిక వ్రతము హరికి ఆనందకారణము. సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్థుడను గాను. కాలము చాలదు. కాబట్టి శాస్త్ర సారములలో సారమును జెప్పెడను వినుడు. శ్రీహరి కథను సంగ్రహముగా చెప్పెదను వినుడు. శ్రీహరి కథాసక్తులు ఘోరమైన నరకాలయందు పడక సంసార సముద్రమునుండి తరింతురు. కార్తికమందు హరిణి పూజించి స్నానము, దానము, ఆలయములందు రాత్రి దీపమును వెలిగించుటను జేయువారు అనేక పాపములనుండి శీఘ్రముగా ముక్తులగుదురు. సందేహము లేదు. సూర్యుడు తులారాశి యందు ప్రవేశించినది మొదలు ముప్పది దినములు ఒక్క కార్తిక వ్రతమును జేయవలెను. అట్లు చేయువాడు జీవన్ముక్తుడగును సుమా! బ్రాహ్మణులు గాని, క్షత్రియులు గాని, వైశ్యులు గాని, శూద్రులు గాని, స్త్రీలు గాని కార్తిక వ్రతమును జేయని యెడల తమ పూర్వులతో కూడా అంధతామిస్రమను పేరుగల నరకమును, (చీకట్లతో గ్రుడ్డిడగు నరకము) బొందుదురు. సంశయము లేదు. కార్తికమాసమున కావేరి జలమందు స్నానమాచరించు వారు దేవతలచేత కొనియాడబడి హరిలోకమును బొందుదురు. కార్తిమ మాసమందు స్నానము చేసి హరిణి పూజించు మానవుడు విగత పాపుడై వైకుంఠమును జేరును. మునీశ్వరులారా! కార్తిక వ్రతమును జేయని వారు వేయి జన్మములందు చండాలురై పుట్టుదురు. 

కార్తిక మాసము పుణ్యకరము. సమస్త మాసములందు శ్రేష్ఠము. కార్తిక వ్రతము హరి ప్రీతి దాయకము. సమస్త పాపహారము. దుష్టాత్ములకు అలభ్యము. తులయందు రవియుండగా కార్తిక మాసమందు స్నానమును, దానమును, పూజను, హోమమును, హరిసేవను జేయువాడు సమస్త దుఃఖ విముక్తులై మోక్షమొందెదరు. కార్తిక మాసమందు దీపదానము, కంచుపాత్ర దానము, దీపారాధానము, ధాన్యము, ఫలము, ధనము, గృహదానము అనంత ఫలప్రదములు. ధనికుడు గాని, దరిద్రుడు గాని హరిప్రీతి కొరకు కార్తిక మాసమందు కథను విన్నయెడల వినిపింపజేసినా యెడల అనంత ఫలమునొందును. కార్తిక మహాత్మ్యము సర్వ పాపములను నశింపజేయును. సమస్త సంపత్తులను గలుగజేయును. అన్ని పుణ్యముల కంటెను అధికము. ఎవరు ఈ పవిత్రమగు విష్ణువుకు ప్రీతికరమగు అధ్యాయమును వినునో వాడు ఈ లోకమున గొప్ప సుఖాలను అనుభవించి పరలోకమున బ్రహ్మానందము పొందును. తిరిగి జనన మరణ ప్రవాహమున పడకుండ జేయునదియే పరసుఖము లేక నిత్య సుఖము. 

ఇతి శ్రీస్కాందపురాణే కార్తిక మహాత్మ్యే ఫలశ్రుతిర్నామత్రింశోధ్యాయస్సమాప్తః!!

No comments: