Monday, December 7, 2015

శివపురాణము--26


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము--26 

ఒకనాడు పార్వతీదేవి చెలికత్తెలయిన జయ విజయలు అమ్మవారితో ఒకమాట చెప్పారు. ‘అమ్మా, నంది నిన్నూ వహిస్తాడు, శంకరుడినీ వహిస్తాడు. కానీ ఆయనకు కొంచెం శంకరుని మాల ఔదలదాల్చడంలోనే సంతోషం ఎక్కువ. భ్రుంగీ అంతే. మన మాటే వినేవాడు ఒకడు లేడు. అలాంటి వాడు మనకి ఒకడు ఉంటే బాగుంటుంది. అందుకని నీవు ఒకడిని సృష్టించి ద్వారపాలకుడిగా పెడితే వాడు నీ మాటే వింటూంటాడు. అలాంటి వాడిని తయారు చెయ్యి. అతడు మన అంతఃపురమును కాపాడడానికి పనికివస్తాడు” అని చెప్పారు. వారి మాటలు విన్న పార్వతీ దేవి అలాగే చేద్దాం అని తన శరీరమునకు ఉన్న మలమును స్నానం చేసేటప్పుడు నలుగు పిండిలా తీసి దానిలోంచి ఒక పిల్లవాడిని తయారు చేసింది. నలుగులోంచి తయారు చేయబడిన పిల్లవాడు ఎలా ఉన్నాడన్నది ఎవరికీ తెలియదు. చాలా బాగుండాలని అమ్మవారు సంకల్పం చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. వాడు లేచి కూర్చున్నాడు. అపుడు వానితో నీవు వెళ్లి ద్వారము దగ్గర కూర్చుని ఎవరూ లోపలి రాకుండా నిలుపు’ అంది అపుడు ఆ పిల్లవాడు ద్వారం దగ్గర కూర్చున్నాడు. 
ప్రమథగణములలో ముందు నందీశ్వరుడు విజయం చేస్తుండగా శివుడు లోపలి వెళ్ళబోయాడు.ఈ పిల్లవాడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. ముందు శంకరుడు జ్యోక్యం చేసుకోలేదు. అపుడు ప్రమథగణములకు ఆ పిల్లాడికి మధ్య యుద్ధం జరిగింది. ఎవరు సలహా చెప్పారో వాళ్ళే అమంవారి దగ్గరకు వచ్చి అమ్మా పిల్లవాడు యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి నీ శక్తులను పిల్లవాడికి ఇవ్వవలసింది అని చెప్పారు. అమ్మవారు శక్తులను ఇచ్చింది. ఆ పిల్లవాడు అద్భుతమయిన యుద్ధం చేసి ప్రమథగణములనన్నిటిని ఓడించేశాడు. ఇంక అక్కడ నుండి బ్రహ్మ, విష్ణువు కూడా వచ్చేశారు యుద్ధానికి. అయినా ఆ పిల్లవాడు శంకరుడిని లోపలికి పంపించలేదు. అపుడు శంకరుడు చేతిలో త్రిశూలమును పట్టుకుని పిల్లవాని కంఠమునకు గురి పెట్టి విసిరాడు. అపుడు త్రిశూలం ఆ పిల్లవాని కంఠమును ఉత్తరించేసింది. ఆ పిల్లవాడు క్రిందపడి మరణించాడు. తరువాత శంకరుడు లోపలికి వెళ్ళాడు. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో పార్వతీదేవి బయట కాపలా పెట్టిన పిల్లవాని ప్రస్తావన వచ్చింది. అపుడు శివుడు ఆ పిల్లవానిని త్రిశూల ధారల చేత చంపేశాను అన్నాడు. అపుడు పార్వతీదేవి అయ్యో ఆ పిల్లాడిని నేనే సృష్టించాను – చంపేశారా అని దుఃఖమును పొందింది. ఆవిడ దుఃఖమును ఉపశమింపజేయడానికి దేవతలు అందరూ వచ్చారు. ఆవిడ శంకరుని తన బిడ్డను మరల బ్రతికించమని అడిగింది. అప్పుడు ఆయన తన అనుచరులను పిలిచి మీరు ఉత్తర దిక్కుగా వెళ్ళి మీకు మొట్టమొదట కనపడిన ప్రాణి ఏదయితే ఉంటుందో దాని తలకాయ తీసుకురండి. ఆ తలకాయ పిల్లవాడికి పెడతాను’ అన్నాడు. వాళ్లకి మొట్టమొదట ఏనుగు కనపడింది. వాళ్ళు దాని తలకాయ పట్టుకొచ్చారు. దానిని ఈ పడిపోయిన పిల్లవాని కంఠమునకు కలిపాడు. ఆ పిల్లవాడు చక్కగా లేచి కూర్చున్నాడు. ఇప్పుడు వానికి శంకరుడెవరో తెలిసి శంకరునికి నమస్కారం చేశాడు. వెంటనే శంకరుడు కూడా వాడిని ఎత్తి తొడమీద కూర్చోపెట్టుకున్నాడు. ఈలోపుగా సుబ్రహ్మణ్య జననం కూడా జరిగిపోయింది. ఈ ఇద్దరి పిల్లలతో సంసారం చక్కగా నడిచిపోతోంది. 
ఒకరోజు ఒక యోగ్యమయిన సంబంధం వచ్చింది విశ్వరూప ప్రజాపతి అనే ఆయన తన ఇద్దరు కుమార్తెలయిన సిద్ధిబుద్ధి అనే వాళ్ళను ఇవ్వాలనుకుంటున్నాను అని వచ్చాడు. అపుడు శంకరుడు తన కుమారులను పిలిచి ఎవరు ముందు భూప్రదక్షిణ చేసి వస్తే వారికి ముందుగా పెళ్ళి చేస్తానన్నాడు. ఇద్దరూ బయలుదేరారు. గణపటిది మూషిక వాహనం. అందుకని ఆయన తల్లిదండ్రులిద్దరికీ ఏడుమార్లు ప్రదక్షిణం చేసి వారిని పత్ర పుష్పములతో పూజ చేశారు. సుబ్రహ్మణ్యుడికి ఎక్కడికి వెళ్ళినా వినాయకుడు ముందుగా వెళ్ళిపోతున్నట్లు కనపడుతున్నాడు. పార్వతీ పరమేశ్వరునకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసిన ఫలితమును ఆయన ఖాతాలో వేసి ‘నువ్వు చెప్పినటువంటి నియమమును పాటించిన వాడివి కనుక నీకు ముందు వివాహం చేస్తున్నాను అని చెప్పి సిద్ధి బుద్ధిలను గణపతికిచ్చి వివాహం చేశారు. సుబ్రహ్మణ్య స్వామీ వారు క్రౌంచ పర్వతం దగ్గరకు వెళ్ళారు. పార్వతీ పరమేశ్వరులు కూడా వెళ్ళారు. 
ఇక్కడ మనకు కొన్ని సందేహములు కలగడానికి అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా శంకరుడు ఆ పిల్లవాని తలను తీసివేసి ఉంటే ఏనుగు తల పెట్టడం ఎందుకు? పడిపోయిన తలకాయనే అతికించవచ్చు కదా! అని. పార్వతీ దేవి అనగా పరమ ప్రక్రుతి. పరమ శివుడనగా పరమ పురుషుడు. పరమ ప్రకృతి అంటే పంచ భూతములు. పంచభూతములయందలి కదలిక పరమేశ్వరుడు. అమ్మవారు భూతములన్నిటిని తయారుచేస్తుంది. కానీ లోపల చైతన్యం శివుడు. అంటే శివ సంబంధమయిన ఎరుక లేదు. లోపల ఉన్న చైతన్యము ‘నేను’ అన్నది తెలియదు. పైన ఉన్న శరీరము మూడు గుణముల చేత బంధింపబడి ఉంది. ఈ మూడు గుణములే ప్రకృతి యొక్క మలము. అదే అమ్మవారి శరీరంలోంచి వచ్చిన మలము. ఆ మలముతో పిల్లవాడు తయారు అయాడు. అంటే త్రిగుణములయందు కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి ఈ తలకు ప్రకృతి తెలుసు శివుడు తెలియదు. లోపల ఉన్న చైతన్యం బయట నిలబడిన శివుడు అని తెలియదు. కాబట్టి ఆయన దానితోనే పోరాటం చేశాడు. శంకరుడు ఆ పిల్లవాని తలను త్రిశూలంతో తరిగేశాడు. త్రిశూలమునకు ఉన్న మూడు త్రిగుణములు, వీటికి ఆధారమైన సత్యము శంకరుని చేతిలో ఉన్న త్రిశూలం. శంకరుడు గుణాతీతుడు. ఎప్పుడయితే శివుడి చేతి త్రిశూలం పిల్లవాని కంఠమునకు తగిలిందో త్రిగుణములకు సంబంధించిన బుద్ధి పోయింది. ఇప్పుడు ‘గజ’ – ఏనుగు తల పెట్టబడింది. ‘గ’ అంటే గతి అంటే కదలడం; ‘జ’ అంటే పుట్టడం. ఇపుడు ఆ పిల్లవానికి ఇందులోంచి పుట్టి ఇందులోకి వెళుతున్నాడో తెలిసిపోయింది. అంటే ఇప్పుడు శివసంబంధం వచ్చేసింది. శివుడు తెలిసిపోయాడు. తెలిసిపోవడం గజముఖం. అందుకని శంకరుడికి నమస్కారం చేశాడు. ఇది మీరు చెయ్యవలసిన ఉపాసనా క్రమమును వినాయకుని మూర్తి ద్వారా లోకమునకు తెలియజెప్పడం. ఏనుగు తల బ్రహ్మాండమును చెప్తే మనిషి శరీరం పిండాండమును చెప్తుంది. బ్రహ్మాండం, పిండాండం రెండింటి యందు పంచభూతములు ఉన్నాయి. రెండూ పంచ భూతములలో నిండి ఉన్నప్పటికీ రెండింటియందు ఉన్నది ఒక్కటే అని జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్త్వమసి అర్థమయితే ‘తత్ త్వం అసి’ ‘అదే వాడి ఉన్నాడు’ జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు అని తెలియడమే ఏనుగు ముఖం మనుష్యుడు తల కంఠం దగ్గర శివానుగ్రహంతో కలవడం. కాబట్టి తత్త్వమసి మహావాక్యం నడయాడితే మహాగణపతిగా తిరుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడాయన వినాయకుడు అయ్యాడు. ‘వి’ అంటే విశిష్టమయిన – అనగా విశిష్టమయిన నాయకుడు అయ్యాడు. మీరు ఆయనను ఉపాసన చేస్తే ఆయన మిమ్మల్ని అటువంటి పథంలోకి తీసుకు వెడతాడు. ఆయన విఘ్నములకు నాయకుడు. విఘ్నమును తీసేస్తాడు. మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుస్తాడు. 
గణపతి పరబ్రహ్మమై ఉన్నాడు. ఈయనకు సిద్ధిబుద్ధి భార్యలు. ఎవరు బుద్ధిని ఉపయోగిస్తాడో వాడు సిద్ధిని పొందగలడు. బుద్ధి అనేది ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. గణపతి ఆరాధన చేత మంచి బుద్ధి వచ్చి సిద్ధి పొందడమే ఆయనకీ సిద్ధి బుద్ధి భార్యలు అయి ఉండడం. ఆ అనుగ్రహం మీయందు ప్రసరింపబడడం. ఏనుగుకు అన్నిటికన్నా ఇష్టమైనది దాని దంతం. కానీ అది నమలడానికి పనికిరాదు. ఏనుగు ముఖం ఉన్న గణపతి వ్యాసుడు భారతం చెప్తుంటే తన దంతమును విరిచేసి దానితో రచన చేశాడు. మనకి ఉన్న వస్తువులను లోకోపకారానికి ఉపయోగించాలి. భారతమును రచించడానికి తన దంతం ఉపయోగ పడితే కొన్ని యుగాలపాటు పంచమ వేదమయిన భారతమును లోకం చదువుకుని ఉద్ధరింపబడుతుంది అని భావించి తన దంతమును విరిచేసి దానితో భారతమును రచన చేశాడు. ‘ఏకదంతం, శూర్పకర్ణం, లంబోదరం’ అని పేర్లు సంపాదించాడు. ఎంతో శాశ్వతమయిన యశస్సు పొందాడు. శివుడు ఎంత సులభుడో వినాయకుడు అంత సులభుడు. ఇరువది ఒక్క గరిక తెచ్చి ఆయన పాదముల మీద వేస్తే చాలు. అన్నీ ఇచ్చేస్తాడు. కొద్దిగా సింధూరమును గండయుగ్మమునాకు రాస్తే చాలు పొంగిపోతాడు. ఏనుగు తల కనపడితే మంగళ ప్రదము. చివరకు కలలోకి ఏనుగు వచ్చినా అది మంగళప్రదమే. 
గణపతి స్వరూపంలో చిత్రమయినది ఎలుక. గణపతికి వాహనం ఎలుక. ఎలుక దొంగతనానికి ప్రతీక. మనతో పాటే ఉంటుంది. మన వస్తువులన్నీ ఎత్తుకుపోతూ ఉంటుంది. మన బ్రతుకూ అంతే. విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే మనకి ఆయన పదిమంది హృదయాలను కొల్లగొట్ట గలిగిన దొంగతనమును పొందుతాడు. అనగా ఈశ్వరాభిముఖుడై భగవద్భక్తి చేత తాను మాట్లాడిన మాటలకు పరవశులై చాలామంది హృదయాలను తాను కొల్లగొట్టే దొంగ అవుతాడు. ఇలా మారడానికి ఎలుక విఘ్నేశ్వరుడిని వహించింది. మీరు కూడా అలా వహించడం నేర్చుకోవాలి. పదిమంది ప్రేమను సంపాదించుకోవడం నేర్చుకోవాలి. దీనిని సూచించదానికే ఎలుకను వాహనంగా పెట్టుకున్నాడు. ఎలుక చెవులు పెద్దవిగా ఉంటాయి చేట లాగా. గణపతిని నమ్మి ఆవాహన చేసి జాగ్రత్తగా ఉపాసన చేస్తే లోకంలో పొల్లు తీసేసి సారం వైపుకి మనలను నడిపిస్తాడు. పరమభక్తిని ఇస్తాడు. ఆయన ఆయుధమయిన గొడ్డలితో కర్మ పాశములను తెంచి భక్తీ పాశములను వేసి తన వైపుకి లాక్కుంటాడు. 

చవితి తిథి ఆయనకు చాలా ఇష్టమైన తిథి. ఆరోజు ఎవరయినా వినాయకుడి గురించి ప్రత్యేకంగా వినినా, చదివినా వారు ఎంతో ప్రయోజనమును పొందుతారు. పరమ భక్తితో స్వామికి నమస్కారం చేసినా ఎవరు కోరుకున్నది వారికి అనుగ్రహిస్తాడు. విద్యార్థికి విద్య వస్తుంది. ద్రవ్యార్థికి ద్రవ్యం వస్తుంది. కన్యార్థికి కన్య దొరుకుతుంది. పుత్రార్థికి పుత్రుడు పుడతాడు. భోగార్థి అయిన వాడికి భోగములు కలుగుతాయి. మోక్షార్థికి మోక్షం దొరుకుతుంది. రాజ్యార్థికి రాజ్యం, కీర్తి కావాలనుకున్న వారికి కీర్తి వస్తుంది. ఆరోగ్యం కుదుటపడక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్లకి ఆరోగ్యం కలుగుతుంది. ఋణభారంతో ఉన్నవాడికి ఋణం తొలగుతుంది. ఇక్కట్టులలో ఉన్న వాడికి ఇక్కట్టులు తొలగిపోతాయి. గణపతి దర్శనం చేత గణపతి యొక్క అనుగ్రహం చేత గణపతి కథను చదవడం చేత సమస్త శుభములు సమకూడతాయని పెద్దలు మనకు ఫలశ్రుతిని వివరణ చేసి ఉన్నారు. కాబట్టి ఆ గజానన స్వరూపము అంత గొప్ప స్వరూపము.

No comments: