Wednesday, December 9, 2015

కార్తీకపురాణము--28


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన కార్తీకపురాణము--28  

అంబరీష ఉవాచ:
అంబరీషుడు ఇట్లు పలికెను. ఓ సుదర్శన చక్రమా! ఆగు ఆగు. నీకు నమస్కారము. ఈతడు బ్రాహ్మణుడు. ఇతనిని చంపుట తగదు. నీకు వధతో కూడిన ఆహారము కావలెనన్న నా శరీరమును యిచ్చెదను. ఈ బ్రాహ్మణుని విడువుము. లేనియెడల నాతొ యుద్ధము చేయుము. నీవు హరియొక్క ఆయుధముగనుక నాకు దైవమువైతివి. అయినప్పటికీ నీతో యుద్ధము చేయుదును గాని నిన్ను బ్రతిమాలుటలేదు. క్షత్రియునకు బ్రహ్మయుద్ధమును విధించెను గాని యాచనను విధించలేదు. అయినాను నీవు నాకు దేవతవు గనుక యాచించవచ్చును. ఓ సుదర్శన చక్రమా! నీవు సమస్త భూతములకు అజేయుడవు. ఈమాట నాకు తెలియునుగాని అయినాను నా బాహుబలమును జూడుము. విష్ణ్వాది దేవతలందరూ నీ బలమును నా బలమును చూతురు గాక. నిన్నిపుడు భూమియందు పడవైచెదను. అట్టియవస్థను జెందక యీతనిని విడువుము. నీకు జీవించియుండి హరిహస్తమందు నివసించు కోరికయున్న యెడల నన్ను పాలించుము. శరణాగతుడైన ఈ బ్రాహ్మణుని విడువుము. రాజిట్లు స్తుతించగా సుదర్శన చక్రదేవత సంతోషించి రాజును పరీక్షించవలయునను తలంపుతో కోపము వచ్చిన వాడు వలె నటించి యిట్లనియె.
సుదర్శనమిట్లు పలికినది. రాజా! నీకు తెలియునా? మధుకైటభులను నేను చంపితిని దేవతలకు జయించుటకు శక్యము కాని వారైన రాక్షసులను అనేకులను చంపితినని తెలియదా? ఈ దుర్వాసుని కోపముతో గూడిన ముఖమును జూచుటకెవ్వడైన సమర్దుడున్నాడా? ఇట్టి దుర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క తేజోధారియైనను యిప్పుడిట్టి అవస్థను నావలన జెందెను గదా? శంకరుని వలన క్షత్రియ సంహారకారకమయిన తేజస్సు సంభవించినది. ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికము గాదు. అదియు నాచేత అనేక పర్యాయములతిక్రమించబడినది. క్షత్రియతేజోవంతుడైన నీవు నాతో యుద్ధమునకెట్లు సమర్థుడవగుదువు? బ్రహ్మ శంకరుల రెండు తెజస్సులు నాకు చాలనివైయున్నవి. రాజా! క్షేమము కోరినవాడు బలవంతునితో స్నేహము చేయవలెను. ఇట్లు న్యాయముండగా నీవు మూర్ఖత్వమునవలంబించి నాతో యుద్ధమునకు సన్నద్ధుడవెందుకైతివి? నీవు హరిభక్తుడవని నేను నిన్ను ఇంతవరకు సహించితిని. కాబట్టి నీవు దూరముగా పొమ్ము. ప్రాణములను వృధాగా పోగొట్టుకొనకుము. ఇట్లు సుదర్శన చక్ర వాక్యమును విని అంబరీషుడు కళ్ళెర్రజేసి సుదర్శన చక్రముతో ఇట్లనెను.
అంబరీషుడు ఇట్లు చెప్పెను. సుదర్శన చక్రమా! నీవు నా దేవునకు ఆయుధమైతివని నిన్ను బాణములచేత నూరు ఖండములుగా కొట్టలేదు. నీవు క్షత్రియ ధర్మమూ అవలంబించి నాతో మాట్లాడుచున్నావు. గనుక ఇకముందు నీకు గర్వముండబోదు. నీ గర్వమును నశింపజేయు బాణములు నా హస్తమందున్నవి. నేను బ్రాహ్మణులందును, దేవతలందును, స్త్రీలయందును, జ్ఞాతులందును గోవులందును, బాణములను వదలను. నీవు క్రూరుడవైనను దేవుడవగుట చేత ఇంతవరకు ఉపేక్షించితిని. నీవు దేవత్వమును వదలుకొని క్షత్రియత్వముతో గూడి నాయందు నిలిచి అగ్నితో సమానమైన వేడిగల నా బాణములను సహించుము చూతము. ఇట్లని అంబరీషుడు ఇరువది నాలుగు బాణములను సుదర్శన చక్ర పాదముల మీద వదలెను. ఇట్లు క్షాత్ర పౌరుషముతో గూడిన రాజును జూచి సుదర్శనుడు నవ్వుచు యిట్లనియె. సుదర్శనుడు ఇట్లు పలికెను. రాజా! నీ సంరక్షణ నిమిత్తమే హరినన్ను పంపినాడు. నిన్ను శరణాగతుడైన బ్రాహ్మణుని విడిచితిని. సుఖముగా నుండుము. ఇట్లు పలికి ధనుర్బాణములతో గూడియున్న రాజును కౌగలించుకుని భూమియందు పది నమస్కారము చేసెను. ఓ అగస్త్యా! రాజు అలా విధేయుడైన సుదర్శన చక్రస్థ పురుషునితో చక్రముతో యిట్లనియె. సంసార మధ్యను సంచరించెడు పురుగునైన నేనెక్కడ? హరియొక్క హస్తమందు ప్రకాశించెడి నీవెక్కడ? ఇట్లు తెలిసియు నీతో యుద్ధమునకు సన్నద్ధుడయిన నా తప్పును క్షమించుము. నేను నిన్ను తిరస్కరించి విజ్రుంభించి యుద్ధమునకు సిద్ధపడితిని. క్రూరమయిన నా క్షత్రియ స్వభావమిట్లు చేసినది గనుక క్షమించుము. ఇది శుక్ల పక్షము. పగలు. యుద్ధభూమి. మకరమాసము. మాఘమాసము. ఇట్టి పుణ్యకాలమునందు నా దేవుడైన నీవలన మృతిని గోరియే యుద్ధమునకు వచ్చితిని. భగవద్గీతయందు ఇట్లు కలదు. ఉత్తరాయణమందు శుక్లపక్షమందు పగలు మృతినొందిన వారు అర్చిరాది మార్గమున పోయి బ్రహ్మపదమును జేరుదురు. కార్తిక శుక్ల ద్వాదశినాడు వెళ్ళిన దుర్వాసనుడు మాఘమాసమునకు తిరిగి వచ్చెను. సుమారు ౩ మాసాలకు అంబరీషుని చేరినాడు.
జ్వాలలచేత భయంకరమును, దేవదానవులకసహ్యమును నూరు మెరుపులకంటే అధికమయిన కాంతిగలదియును అయిన నీ రూపమును గవ్వతో సమానుడను నేనెట్లు సహింతును? సహస్రాగ్నియుతమైన రవిబింబము వలె సహస్రారములను ధరించునటువంటి సమస్త సంహారకరమగునటువంటి నీ రూపముతో యుద్ధము చేయనేనెట్లు శక్తుడనగుదును? కోరలతో గూడి భయంకరము దశదిక్కులందు అగ్నులను బయటకి చిమ్ముచున్నటువంటి నీ యొక్క దంతపుదెబ్బను దేవుడుగాని, రాక్షసుడు, దేవేంద్రుడు గాని, రాక్షసాధిపతి గాని యింకెవ్వడు గాని సహించగలడు? మెరుపులను సూర్యునికిరణజాలములును మొత్తములై భయంకరాకారములను ధరించి వచ్చినను నీ తేజస్సును తిరస్కరించలేవు. విష్ణువు భయంకరాకారమయిన నిన్నాశ్రయించి మూడు లోకములను పాలించుచున్నాడు. నీతో విరోధించినయెడల దేవతలు గాని, దానవూ గాని, అన్యులు ఆని నిన్ను జయించలేరు. దైత్యులు చంపుదానవు భక్తులను పరిపాలించుదానవు. విష్ణువు యొక్క కాంతిచేత ప్రకాశించుదానవు. ప్రాణగమన కష్టమును హరించుదానవు అగు నీకు నమస్కారము. ఇట్లు స్తుతించి భూమియందు నమస్కారము చేయుచున్న రాజును లేవదీసి నీకు క్షేమమగుగాక! అని సుదర్శనుడు పలికెను. ఈ సుదర్శన చక్ర స్తోత్రమును మూడు కాలములందు పఠించువాడు ఆపదలనుండి విముక్తుడై చిరతరసుఖములను బొందును. కలియుగమందీయధ్యాయమును ఒకమారయినను వినువారు అనేక భోగములు పొంది అంతమందు మోక్షము పొందుదురు.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే అష్టావింశాధ్యాయః!!

No comments: