Monday, November 4, 2013

కార్తీక మాసం విశిష్టత:-


















కార్తీక మాసం విశిష్టత:-
............................

స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, 
వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి 
అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం “కార్తీకమాసం’. 
చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవది. 

“న కార్తీక నమో మాసః
న దేవం కేశవాత్పరం!
నచవేద సమం శాస్త్రం
న తీర్థం గంగాయాస్థమమ్”

అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే “కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. 
శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. 
వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు.” అని అర్ధం.

శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. 
ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. 

ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. 
పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. 
హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. 
ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం 
మహిళలు పూజలు చేస్తుంటారు. 
హరిహరాదులకు ప్రీతికరం..కార్తీక మాసం

మన భారతీయ సంస్కృతిలో కార్తీకమాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగదినాలే! 
అందులోను కార్తీకమాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. 

దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, 
అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు. 

అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడు. 
కాబట్టి ఆ స్వామికి ‘‘ఆశుతోషుడు’’ అనే బిరుదు వచ్చింది.

‘‘హరిః ఓం నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ
త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ
మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః''

ప్రతి ఈశ్వరాలయంలో ఆ రుద్ర నమకం మంత్రభాగం మారుమోగిపోతూ, ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. 
హిందువుల గృహాలలో ‘‘ఆదిత్యమంబికా విష్ణూగణనాథం మహేశ్వరం’’ అనే పంచాయతన దేవతలను విశేషంగా ఆరాధిస్తారు. 

ఈ కార్తీకమాస మహత్యం గురించి పూర్వం నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునులు 
అందరికీ సూతమహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలు, విష్ణు మహిమలను వినిపించే సమయంలో, 

"ఓ సూతముని శ్రేష్ఠా! కలియుగంలో ప్రజలు సంసార సాగరమునుండి తరింపలేక, 
అరిషడ్వర్గాలకు దాసులై, సుఖంగా మోక్షమార్గం తెలియక ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు 
ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మమేది? దేవతలు అందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవమెవరు? 
మానవునికి ఆవరించియున్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలం యిచ్చే కార్యమేది? 
ప్రతిక్షణం మృత్యువు వల్ల వెంబడించబడే ఈ మానవులకు మోక్షము కలిగించు చక్కని ఉపాయము చెప్ప''మని కోరారు.

ఆ ప్రశ్నలను విన్న సూతముని, "ఓ ముని పుంగవులారా! క్షణికమైన సుఖభోగాల కోసం పరితపించుతూ, 
మందబుద్ధులు అవుతున్న మానవులకు ‘‘ఈ కార్తీకమాస వ్రతము’’ హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైంది. 

దీనిని ఆచరించటం వల్ల సకల పాపాలు హరింపబడి మరు జన్మలేక పరంధామము పొందగలరు. 
పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీకమాస వ్రతమాచరించాలని కోరికను కలుగచేస్తాడు ఆ పరమాత్మ! 
దుష్టులకు, దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యేవరకు ఏవగింపు కలిగిస్తాడు.

ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అత్యంత పుణ్యప్రదమైనవి. 
నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజులలో పవిత్రపుణ్య నదీ స్నానం ఆచరించి, 
ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, 
లలిత, విష్ణు సహస్రనామ పారాయణాలు, ప్రతి నిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్య ఫలం లభిస్తుంది. 
ఈ కార్తీకమాసం ముప్పై రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది.

ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం. 
సూర్యాస్తమయం అయ్యాక మూడు గడియలు (ఒక గంట) ప్రదోషోరజనీముఖమ్‌. 
రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయం. 
ఇలా ప్రతి నిత్ర్యం వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు. 
ఈ ప్రదోషం నాలుగు విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు. 
1. నిత్య ప్రదోషం. 2. పక్ష ప్రదోషం 3. మాస ప్రదోషం 4. మహాప్రదోషం అని చెప్తారు.

కొందరు నిష్టాపరులు ఈ కార్తీకమాసమంతా పుణ్యనదీస్నానం ఆచరిస్తూ 
ప్రతి నిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారం. పాలు, పండ్లు,తింటు పూజిస్తూ ఉంటారు.

ప్రత్యూష కిరణాలు::రచన వెంకట మధు

No comments: