Wednesday, November 13, 2013

అంజన పుట్టుక ( హనుమంతుడి తల్లి )























అంజన పుట్టుక ( హనుమంతుడి తల్లి )
...............................................

ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరిన సమయాన "పుంజికస్థల" అను అప్సరస బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగం చేయసాగింది, ఆమె యొక్క హావ భావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానర స్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపం పెట్టాడు. అంత ఆ "పుంజికస్థల" తన తప్పిదాన్ని మన్నించి శాపవిమోచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మనిచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించే. ఇది కంబ రామాయణ గాధలో గల వృత్తాంతము.

ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భము దాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" వారికి జన్మనిచ్చింది. ఆ బాలుడు శుక్ల పక్ష చంద్రునిలా దిన దిన ప్రవర్ధమానముగా పెరిగి సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏకసంథాగ్రాహియై అచిరకాలములోనే సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అందుకు సూర్యభగవానుడు గురుదక్షిణగా నీవు "సుగ్రీవుని" వాలి బారి నుండి ఎల్లప్పుడు రక్షిస్తూ ఉండవలసిందిగా కోరెను.అందువల్లనే హనుమంతుడు సూర్యభగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడుగా, మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందించసాగే. 

విచిత్ర రామాయణంలో అంజన పుట్టుక గురించి ఓ వింత కథ ఉంది.
అంజన --(అహల్య, గౌతమ ముని కుమార్తె)

వృక్షవ్రజస్సు (కుంజరుడు) అనే గొప్ప వానరరాజు ఉండేవాడు. ఒకసారి వృక్షవ్రజస్సు ఒక తటాకంలో స్నానం చేస్తాడు, ఆ తటాకమునకు ఉన్న శాపప్రభావం వల్ల వృక్షవ్రజస్సు ఒక అప్సరసగా మారిపోతాడు. అప్పుడు ఆ ప్రదేశంలొ సూర్యుడు, ఇంద్రుడు ఆ అప్సరసగా ఉన్న వృక్షవ్రజస్సు చూసి మోహిస్తారు. స్త్రీగా మారిన వ్రుక్షవ్రజస్సు ...అహల్యగా గౌతమమునిని వివాహమాడే. కొంతకాలానికి గౌతమముని వలన అంజన (శాపగ్రస్తురాలైన "పుంజికస్థలి" అనే అప్సరస), సూర్యుని వలన వాలి, ఇంద్రుని వలన సుగ్రీవులు జన్మిస్తారు. ఈ విషయాన్ని కుంభకర్ణుడు సుగ్రీవుడితో పలికిన మాటలు.
కొన్నాళ్ళకు ఓ రోజు గౌతముడు కుమారులను ఎత్తుకుని, కూతురిని నడిపించుకుని, సముద్రతీరంలో తిరుగుతూ ఉంటే అంజన "నీ కూతురిని నడిపించి పరుల బిడ్డలను ఎత్తుకుంటావా?" అన్నదట. దానితో గౌతముడు సందేహించి "మీరు పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానర ముఖాలగుగాక" అని శపించి వారిని సముద్రంలోకి తోశాడు. ఆ పిల్లలే వాలి, సుగ్రీవులైనారని, తన గుట్టు బయటపెట్టినది, కనుక అహల్య, అంజనను - నీయందు వానరుడు జన్మించునని శపించెననీ - విచిత్ర రామాయణంలో ఉంది.
హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రధాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి ఎన్నో పేర్లతో హనుమంతునిని ఆరాధిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు.
హనుమంతుని జీవితం గురించి వివిధ గాధలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాధలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాధలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాధే క్లుప్తంగా చెప్పబడింది.
rachana::venkata madhu

No comments: