Wednesday, December 9, 2015

మహాలింగ స్తుతి


అనాదిమల సంసార రోగ వైద్యాయ శంభవే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
ఆదిమధ్యాంత హీనాయ స్వభావానలదీప్తయే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
ప్రళయార్ణవ సంస్థాయ ప్రళయోత్పత్తి హేతవే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
జ్వాలామాలావృతాంగాయ జ్వలనస్తంభరూపిణే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
మహాదేవాయ మహతే జ్యోతిషేనంతతేజసే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
ప్రధాన పురుషేశాయ వ్యోమరూపాయ వేధసే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
నిర్వికారాయ నిత్యాయ సత్యాయామలతేజసే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
వేదాంతసార రూపాయ కాలరూపాయ ధీమతే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో బ్రహ్మాదులు స్తుతించిన మహాలింగ స్తుతి ఇది.

కార్తీకపురాణము--28


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన కార్తీకపురాణము--28  

అంబరీష ఉవాచ:
అంబరీషుడు ఇట్లు పలికెను. ఓ సుదర్శన చక్రమా! ఆగు ఆగు. నీకు నమస్కారము. ఈతడు బ్రాహ్మణుడు. ఇతనిని చంపుట తగదు. నీకు వధతో కూడిన ఆహారము కావలెనన్న నా శరీరమును యిచ్చెదను. ఈ బ్రాహ్మణుని విడువుము. లేనియెడల నాతొ యుద్ధము చేయుము. నీవు హరియొక్క ఆయుధముగనుక నాకు దైవమువైతివి. అయినప్పటికీ నీతో యుద్ధము చేయుదును గాని నిన్ను బ్రతిమాలుటలేదు. క్షత్రియునకు బ్రహ్మయుద్ధమును విధించెను గాని యాచనను విధించలేదు. అయినాను నీవు నాకు దేవతవు గనుక యాచించవచ్చును. ఓ సుదర్శన చక్రమా! నీవు సమస్త భూతములకు అజేయుడవు. ఈమాట నాకు తెలియునుగాని అయినాను నా బాహుబలమును జూడుము. విష్ణ్వాది దేవతలందరూ నీ బలమును నా బలమును చూతురు గాక. నిన్నిపుడు భూమియందు పడవైచెదను. అట్టియవస్థను జెందక యీతనిని విడువుము. నీకు జీవించియుండి హరిహస్తమందు నివసించు కోరికయున్న యెడల నన్ను పాలించుము. శరణాగతుడైన ఈ బ్రాహ్మణుని విడువుము. రాజిట్లు స్తుతించగా సుదర్శన చక్రదేవత సంతోషించి రాజును పరీక్షించవలయునను తలంపుతో కోపము వచ్చిన వాడు వలె నటించి యిట్లనియె.
సుదర్శనమిట్లు పలికినది. రాజా! నీకు తెలియునా? మధుకైటభులను నేను చంపితిని దేవతలకు జయించుటకు శక్యము కాని వారైన రాక్షసులను అనేకులను చంపితినని తెలియదా? ఈ దుర్వాసుని కోపముతో గూడిన ముఖమును జూచుటకెవ్వడైన సమర్దుడున్నాడా? ఇట్టి దుర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క తేజోధారియైనను యిప్పుడిట్టి అవస్థను నావలన జెందెను గదా? శంకరుని వలన క్షత్రియ సంహారకారకమయిన తేజస్సు సంభవించినది. ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికము గాదు. అదియు నాచేత అనేక పర్యాయములతిక్రమించబడినది. క్షత్రియతేజోవంతుడైన నీవు నాతో యుద్ధమునకెట్లు సమర్థుడవగుదువు? బ్రహ్మ శంకరుల రెండు తెజస్సులు నాకు చాలనివైయున్నవి. రాజా! క్షేమము కోరినవాడు బలవంతునితో స్నేహము చేయవలెను. ఇట్లు న్యాయముండగా నీవు మూర్ఖత్వమునవలంబించి నాతో యుద్ధమునకు సన్నద్ధుడవెందుకైతివి? నీవు హరిభక్తుడవని నేను నిన్ను ఇంతవరకు సహించితిని. కాబట్టి నీవు దూరముగా పొమ్ము. ప్రాణములను వృధాగా పోగొట్టుకొనకుము. ఇట్లు సుదర్శన చక్ర వాక్యమును విని అంబరీషుడు కళ్ళెర్రజేసి సుదర్శన చక్రముతో ఇట్లనెను.
అంబరీషుడు ఇట్లు చెప్పెను. సుదర్శన చక్రమా! నీవు నా దేవునకు ఆయుధమైతివని నిన్ను బాణములచేత నూరు ఖండములుగా కొట్టలేదు. నీవు క్షత్రియ ధర్మమూ అవలంబించి నాతో మాట్లాడుచున్నావు. గనుక ఇకముందు నీకు గర్వముండబోదు. నీ గర్వమును నశింపజేయు బాణములు నా హస్తమందున్నవి. నేను బ్రాహ్మణులందును, దేవతలందును, స్త్రీలయందును, జ్ఞాతులందును గోవులందును, బాణములను వదలను. నీవు క్రూరుడవైనను దేవుడవగుట చేత ఇంతవరకు ఉపేక్షించితిని. నీవు దేవత్వమును వదలుకొని క్షత్రియత్వముతో గూడి నాయందు నిలిచి అగ్నితో సమానమైన వేడిగల నా బాణములను సహించుము చూతము. ఇట్లని అంబరీషుడు ఇరువది నాలుగు బాణములను సుదర్శన చక్ర పాదముల మీద వదలెను. ఇట్లు క్షాత్ర పౌరుషముతో గూడిన రాజును జూచి సుదర్శనుడు నవ్వుచు యిట్లనియె. సుదర్శనుడు ఇట్లు పలికెను. రాజా! నీ సంరక్షణ నిమిత్తమే హరినన్ను పంపినాడు. నిన్ను శరణాగతుడైన బ్రాహ్మణుని విడిచితిని. సుఖముగా నుండుము. ఇట్లు పలికి ధనుర్బాణములతో గూడియున్న రాజును కౌగలించుకుని భూమియందు పది నమస్కారము చేసెను. ఓ అగస్త్యా! రాజు అలా విధేయుడైన సుదర్శన చక్రస్థ పురుషునితో చక్రముతో యిట్లనియె. సంసార మధ్యను సంచరించెడు పురుగునైన నేనెక్కడ? హరియొక్క హస్తమందు ప్రకాశించెడి నీవెక్కడ? ఇట్లు తెలిసియు నీతో యుద్ధమునకు సన్నద్ధుడయిన నా తప్పును క్షమించుము. నేను నిన్ను తిరస్కరించి విజ్రుంభించి యుద్ధమునకు సిద్ధపడితిని. క్రూరమయిన నా క్షత్రియ స్వభావమిట్లు చేసినది గనుక క్షమించుము. ఇది శుక్ల పక్షము. పగలు. యుద్ధభూమి. మకరమాసము. మాఘమాసము. ఇట్టి పుణ్యకాలమునందు నా దేవుడైన నీవలన మృతిని గోరియే యుద్ధమునకు వచ్చితిని. భగవద్గీతయందు ఇట్లు కలదు. ఉత్తరాయణమందు శుక్లపక్షమందు పగలు మృతినొందిన వారు అర్చిరాది మార్గమున పోయి బ్రహ్మపదమును జేరుదురు. కార్తిక శుక్ల ద్వాదశినాడు వెళ్ళిన దుర్వాసనుడు మాఘమాసమునకు తిరిగి వచ్చెను. సుమారు ౩ మాసాలకు అంబరీషుని చేరినాడు.
జ్వాలలచేత భయంకరమును, దేవదానవులకసహ్యమును నూరు మెరుపులకంటే అధికమయిన కాంతిగలదియును అయిన నీ రూపమును గవ్వతో సమానుడను నేనెట్లు సహింతును? సహస్రాగ్నియుతమైన రవిబింబము వలె సహస్రారములను ధరించునటువంటి సమస్త సంహారకరమగునటువంటి నీ రూపముతో యుద్ధము చేయనేనెట్లు శక్తుడనగుదును? కోరలతో గూడి భయంకరము దశదిక్కులందు అగ్నులను బయటకి చిమ్ముచున్నటువంటి నీ యొక్క దంతపుదెబ్బను దేవుడుగాని, రాక్షసుడు, దేవేంద్రుడు గాని, రాక్షసాధిపతి గాని యింకెవ్వడు గాని సహించగలడు? మెరుపులను సూర్యునికిరణజాలములును మొత్తములై భయంకరాకారములను ధరించి వచ్చినను నీ తేజస్సును తిరస్కరించలేవు. విష్ణువు భయంకరాకారమయిన నిన్నాశ్రయించి మూడు లోకములను పాలించుచున్నాడు. నీతో విరోధించినయెడల దేవతలు గాని, దానవూ గాని, అన్యులు ఆని నిన్ను జయించలేరు. దైత్యులు చంపుదానవు భక్తులను పరిపాలించుదానవు. విష్ణువు యొక్క కాంతిచేత ప్రకాశించుదానవు. ప్రాణగమన కష్టమును హరించుదానవు అగు నీకు నమస్కారము. ఇట్లు స్తుతించి భూమియందు నమస్కారము చేయుచున్న రాజును లేవదీసి నీకు క్షేమమగుగాక! అని సుదర్శనుడు పలికెను. ఈ సుదర్శన చక్ర స్తోత్రమును మూడు కాలములందు పఠించువాడు ఆపదలనుండి విముక్తుడై చిరతరసుఖములను బొందును. కలియుగమందీయధ్యాయమును ఒకమారయినను వినువారు అనేక భోగములు పొంది అంతమందు మోక్షము పొందుదురు.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే అష్టావింశాధ్యాయః!!

శివపురాణము,--28


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము 

ఒకానొక సమయంలో భారతదేశమంతటా బౌద్ధమతము వ్యాప్తి చెందినది. దీనికి సంబంధించి సనాతన ధర్మంలో కొంత ఆందోళన పాడడం జరిగింది. బౌద్ధము వేదమును అంగీకరించదు. వేదము ప్రమాణము కాదు అన్నవారిని నాస్తికుడు అని పిలుస్తారు. వేదప్రమాణమును అంగీకరించనిది నాస్తికము అవుతుంది. బౌద్ధము వైపు వెళ్ళిపోతే నాస్తికులు అయిపోతారని నాస్తిక మతమును ఖండించి తిరిగి ప్రజలలో కర్మ నియతిని ఏర్పరచి, మరల అందరినీ వేదమార్గంలో నడిపించడం కోసమని సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారు కుమారిల భట్టుగా వెలశారు. ఆయన ప్రయాగ క్షేత్రంలో పుట్టారు. ఏదయినా తెలుసుకోకుండా ఖండిస్తే దానివలన మర్యాద ఉండదు. బాగా తెలుసుకుని ఖండించాలి. అందుకని వారు ఒక బౌద్దారామమునందు చేరారు. అది ఏడు అంతస్తుల ప్రాకారము కలిగినటువంటి ఆరామము. అక్కడ అనేకమంది బౌద్ధులు ఉండేవారు. వేదము కాని, యజ్ఞము కాని, యాగము కాని, ప్రార్థన కాని, స్తోత్రము కాని చేయడం వారు అంగీకరించరు. అక్కడే కూర్చుని గురువుగారు చెప్పేది ఆయన వినేవారు. సనాతన ధర్మమును ఖండించినపుడు వాటి గురించి చెప్పినపుడు కుమారిల భట్టు ఏడుస్తూ ఉండేవాడు. ఒకరోజున గురువు ‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగాడు. అపుడు ఆయన ‘సనాతన ధర్మంలోని విషయములను ఎంతో గొప్పగా ఖండించారు. అందుకు సంతోషంతో ఆనంద భాష్పములు కారుస్తున్నాను’ అని ఆయన అబద్ధం చెప్పారు. ఎందుకు? అసలు ఆ మతంలో ఉన్నదేంటో తెలుసుకుంటే తప్ప ఖండించడం కుదరదు. పూర్వం అంటే అటువంటి కర్మనిష్ఠ ఉండేది. ఇప్పుడు నాలుగు శ్లోకములు, రెండు పద్యములు చదవడం రాకపోయినా అసలు అవతల మతంలో గొప్పతనం ఏమి ఉన్నదో తెలియకపోయినా అవతల మతానికున్న ప్రస్తాన త్రయం అంటే ఏమిటో తెలియకపోయినా, అవతల మతం మీద దుమ్మెత్తి పోసెయ్యవచ్చు. అంతటి హీనస్థితికి మనం దిగజారిపోయాము. ఇది కలియుగం కదా! కానీ కుమారిల భట్టు అటువంటి వాడు కాదు. విషయమును తెలుసుకుని, ఏది చెడో దానిని మాత్రమే ఖండించాలని అనుకున్నాడు. ఇలా అనుకుని గురువుగారి దగ్గర నేర్చుకున్నాడు.
బాగా నేర్చుకున్న తర్వాత ఈయన ఉద్దేశ్యమును శిష్యులు, గురువులు కనిపెట్టారు. ‘ఈయన బౌద్ధుడు కాడు. ఈయన బ్రాహ్మణుడు. ఈయన సనాతన ధర్మమునందు మక్కువ ఉన్నవాడు. వేదమంటే చాలా ప్రీతి కలిగిన వాడు. ఈయన కేవలం మన మతం గురించి తెలుసుకోవడానికి మనలో చేరాడు. కుశాగ్రబుద్ధి కనుక ఈవేళో రేపో మనతో వాదానికి దిగుతాడు. అప్పుడు మనం ఈయనను తట్టుకోవడం కష్టం. కాబట్టి ఆయన ఈ స్థితిని పొందకముందే ఈయనను చంపేస్తే గొడవ వదిలిపోతుంది’ అని అనుకున్నారు. ఆయనను మాటలలో పెట్టి ఏడవ అంతస్తుకి తీసుకువెళ్ళారు. ఒక కిటికీ దగ్గర నిలబెట్టి ఆయనతో మాట్లాడుతుండగా కొందరు వెనకనుంచి వచ్చి ఆయన రెండు కాళ్ళూ ఎత్తేసి, ఆయనను పైనుండి క్రిందికి తోసేశారు. అపుడు కుమారిల భట్టు క్రింద పడిపోతూ ఆయన ఒక శ్లోకం చెప్పారు. ‘వేదమే ప్రమాణం అయితే, సనాతన ధర్మం సత్యం అయితే వేదములలో చెప్పబడినవన్నీ సత్యములే అయితే, అది అనుష్టించవలసిన మతమయితే నేను క్రిందపడినప్పుడు మరణించకుందును గాక’ అని దాని అర్థం. ఏడంతస్తుల నుండి కిందపడిపోయినా ఆయనకు ఏమీ అవలేదు. కానీ కంట్లో ఒకరాయి గుచ్చుకుని నెత్తురు వచ్చింది. ఆయన వెంటనే వేదమాతను ప్రార్థన చేసి ‘నువ్వు ప్రమాణం అయితే నేను మరణించకూడదు అని నేను అన్నాను. ఇపుడు నేను మరణించలేదు. బ్రతికాను. నువ్వు ప్రమాణమని నిరూపించావు. చాలా సంతోషం. కానీ ఈ రాయి నా కంట్లో ఎందుకు గుచ్చుకోవాలి?’ అని అడిగాడు.
మనకి పురాణములలో అశరీరవాణి పలికింది అని తరచుగా చెప్తుంటారు. అశరీరవాణి అంటే వేదం. ఇప్పుడు వేదం అశరీరవాణియై పలికింది. వేదమును మొట్టమొదట ఈశ్వరుడు ఋషులకు చెప్పాడు. ఏ రూపము లేకుండా వారికి వినపడేటట్లుగా వాళ్ళ చెవిలో చెప్పాడు. అది అప్పటినుంచి వినబడుతూ గురువు దగ్గర శిష్యుడు, గురువు దగర శిష్యుడు అలా వింటూ వెళ్ళింది. కాబట్టి దానికి ‘శృతి’ అని పేరు వచ్చింది. వింటూ స్వరం తెలుసుకుని పలికారు కనుక దానికి శృతి అని పేరు వచ్చింది. కాబట్టి ‘మనకి శృతి ప్రమాణము. ఇటువంటి శృతి ప్రమాణం అయితే చావకూడదని నేను అనినప్పుడు నేను చావలేదు కానీ నా కంటికి ఎందుకు దెబ్బతగిలింది’ అని ఆయన అడిగారు. అలా అడిగితే అశరీరవాణియైవేదము అంది ‘నీవు పైనుండి క్రింద పడిపోయేటప్పుడు ‘వేదమే ప్రమాణం అయితే’ అంటూ పడ్డావు. ‘వేదము ప్రమాణం కనుక నేను మరణించను’ అని నీవు అనలేదు. చిన్న అనుమానం పెట్టుకున్నావు. అటువంటి అనుమానము నీ శ్లోకమునండు ఉండరాదు. నీవు బ్రతికావు కానీ నీకు ఈ చిన్న అనుమానం ఉండడం వల్ల కంట్లో రాయి గుచ్చుకుంది’ కుమారిల భట్టుకి కంటికి దెబ్బ తగిలింది కానీ వేదము ప్రమాణం అయింది. అప్పటి నుంచి మరల అందరూ కర్మానుష్ఠానం యజ్ఞము, యాగము, దానము ఇవన్నీ మళ్ళీ మొదలుపెట్టారు.
కానీ శంకర భగవత్పాదుల అంశ కుమారిల భట్టుకన్నా కొంచెం పైస్థాయి. వీళ్ళకి కర్మయందు కొంచెం కోరిక ఉండడం, కోరిక తీరకపోతే కోపం రావడం లాంటివి ఉంటాయి. ముందు కర్మ నిలబడితే వెనక జ్ఞానం వస్తుంది. ఇంత గొప్ప కుమారిల భట్టుకు కర్మ నిలబెట్టవలసి వచ్చినపుడు కంటివెంట అప్పుడప్పుడు నీళ్ళు వచ్చాయి. అదే శంకరాచార్యుల వారు అయితే జ్ఞానంలో ఉంటారు. ఆయన బ్రహ్మజ్ఞాని. తలకాయను ఇచ్చేస్తారా అని కాపాలిని అడిగితే తీసుకుపో అన్నారు. అందుకే బ్రహ్మజ్ఞాని స్థాయిని చూసి ఈశ్వరుడు కూడా పొంగిపోతాడు. బ్రహ్మజ్ఞాని కన్నా గొప్ప స్థాయి ఇంక సనాతన ధర్మమందు లేదు.
కుమారిల భట్టు కర్మ గురించి వ్యాప్తిచేశాడు కనుక జ్ఞానమార్గము గొప్పది అని చెప్పడానికి శంకరాచార్యుల వారు ఆయన దగ్గరకి వచ్చారు. కానీ అప్పటికి కుమారిల భట్ట తుషాగ్ని ప్రవేశం చేసేశారు. తుషాగ్ని అంటే ఊకను పెద్ద రాశిగా పోసుకుని ఆ ఊకను అంటిస్తారు. ఊకకు ఉండే లక్షణం ఏమిటంటే అది గబగబా కాలిపోదు. తుషాగ్నిలో నిప్పు సెగ మెలమెల్లగా క్రిందనుండి అంటుకుంటూ వస్తుంది. ముందు వేడి పుడుతుంది. సెగ పుడుతుంది. ఒళ్ళు ఉడికిపోతుంది. తరువాత కిందకు వస్తుంది. తరువాత పాదములు, మోకాళ్ళు, తొడలు అన్నీ కాలిపోతుంటాయి. ఎంత కాలిపోతుంటే బూదిలోకి అలా దిగిపోతూ ఉంటాడు. ఎంత దిగిపోతుంటే అంత కాలుస్తూ ఉంటుంది. కాల్చి కాల్చి చివరకు ప్రధానమయిన అవయవములయిన గుండె మొదలగునవి కాలిపోయేంత వరకు ఆ ఒళ్ళు కాలిపోతున్న బాధ అనుభవించవలసిందే. ఈవిధంగా క్రిందనుండి పైకి కాలుస్తూనే ఉంటుంది. కదలకుండా కూర్చుని తుషాగ్నిలో ఆయన కాలిపోతున్నారు. ఆ సమయంలో శంకరాచార్యుల వారు వచ్చారు. వచ్చి ‘అయ్యో, మీరు ఎందుకు ఇలా కాలిపోతున్నారు? ఎందుకు మీరు ఈ పని చేయవలసి వచ్చింది? నేను మిమ్మల్ని కర్మ మార్గం నుండి జ్ఞాన మార్గంలోకి తిప్పడానికి వచ్చాను’ అని చెప్పారు. అపుడు కుమారిల భట్టు ‘నేను తెలిసి చేసినా తెలియక చేసినా గురువుల పట్ల అపచారం చేశాను. బౌద్ధము సనాతన ధర్మమును అంగీకరించని నాస్తికమతం కావచ్చు. కానీ ఇప్పుడు నేను సనాతన ధర్మ ప్రచారం కోసం బౌద్ధమతంలో ఉన్న రహస్యములు తెలుసుకోవడం కోసం వాటిని ఖండించడం కోసం గురువుల దగ్గర శిష్యుడుగా చేసి వాటిని నేర్చుకున్నాను. ఇలా గురువు దగ్గర వినకూడదు. వాటిని విన్నాను కనుక దానికి ఈ శరీరం తుషాగ్నిలో కాలిపోవడం ఒక్కటే సరియైన ప్రాయశ్చిత్తం. అందుచేత దీనిని ఇలా కాల్చేస్తున్నాను’ అన్నారు. ఆయన ఎంతటి మహాత్ములో చూడండి. నిష్ఠతో ఉన్నవాడు కాబట్టి ఆ కర్మనిష్ఠకే శరీరమును వదిలేశాడు. సుబ్రహ్మణ్య స్వామీ అవతారములు అన్నీ కూడా అగ్నియందే పర్యవసిస్తాయి. అందుకే అగ్నిహోత్రంలోకే తుషాగ్నిలోకి కుమారిల భట్టు వెళ్ళిపోతూ ‘నా శిష్యుడు మండనమిశ్రుడు’ ఉన్నాడు. ఆయనతో వాదించి ఓడించండి. అపుడు లోకం అంతా కర్మమార్గం నుండి జ్ఞానమార్గంలోకి వెడుతుంది’ అన్నాడు.
ఏమి చిత్రం జరిగిందంటే అంతకుపూర్వం వరకు పూజలుచేస్తే మీరు ఏ పూజ చేస్తున్నారో ఆ పూజలో స్వామి పేరు చెప్పి ప్రీత్యర్థం అనేమాట చెప్పడం సంకల్పంలో లేదు. ఇది చెప్పకుండా పూజ చేసేవారు. శంకరాచార్యుల వారు మండనమిశ్రుని గెలిచిన తర్వాత కర్మ భాగమునందు ఒక కొత్త విషయం కలిసింది. మీరు ఏది చేసినా సంకల్పంలో....ప్రీత్యర్థం అని దేవత పేరు చెప్పి నీళ్ళు ముట్టుకుంటారు. ‘ఈ కర్మను నేను ఇప్పుడు ఈశ్వరానుగ్రహం కొరకు చేస్తున్నాను’. ఈ కర్మ చేస్తే ఫలితం వచ్చేస్తుందని కాదు. ఈ కర్మ చేస్తే ఈశ్వరుడు ప్రీతిచెంది ఫలితమును ఇవ్వాలి. ఈశ్వర ముఖంగా ఫలితం రావాలన్న జ్ఞానమును అంకురింపచేయడానికి సంకల్పమును శంకరాచార్యుల వారే అక్కడ మార్చారు. మండనమిశ్రుడు ఓడిపోయినతరువాతి నుండి అలా మారింది. కనుక తుషాగ్నిప్రవేశం చేసిన గొప్ప అవతారం కుమారిల భట్టు అవతారం. ఆయన అవతారం రాబట్టే మనకి సనాతన ధర్మం మరల నిలబడే అవకాశం ఈ లోకమునందు కలిగింది. అంతటి మహోత్కృష్టమయిన అవతారం కుమారిలభట్టు అవతారం.
ఎప్పుడెప్పుడు వేదం చేత ప్రతిపాదింపబడిన బ్రహ్మమును గూర్చిన ఆలోచనయందు వైక్లబ్యము కలుగుతుందో, వేదము ప్రమాణము కాదనే ఆలోచనలు ప్రబలుతాయో, అప్పుడు ముందుగా సుబ్రహ్మణ్యుడే అవతరిస్తూ ఉంటాడు. రాక్షసులను సంహరించడం ఆయనకేమీ పెద్ద విషయం కాదు. లోకమునకు వైదికమయిన మార్గమును ప్రబోధం చేయవలసి వస్తే ఎప్పుడెప్పుడు ఎంతవరకు సమాజంలో బోధ జరిగితే తప్ప కుదరదో అంత గొప్ప బాధ్యతను ఆయన భుజాల మీదకు ఎత్తుకుంటాడు. ఆయన మహాజ్ఞాని. ఆయన జ్ఞాన బోధ చేయగలడు. లోకం అంతాకూడా సనాతన ధర్మమును విడిచిపెట్టి నాస్తికము వైపు నడుస్తున్న రోజులలో ముందు కర్మనిష్ఠను చూపించడం కోసమని ఆయన కుమారిల భట్టు రూపంగా వచ్చాడు. అంతే కర్మనిష్ఠతో చిట్టచివరకు ఆయన తుషాగ్ని ప్రవేశం చేసేశారు. వేరొక సందర్భంలో ఆయన తిరుజ్ఞాన సంబంధర్ గా వచ్చారు.

Tuesday, December 8, 2015

కార్తీకపురాణము--27



ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన కార్తీకపురాణం  
కార్తీకపురాణము--27

ఓ అగస్త్య మునీంద్రా! భగవంతుడైన పురుషోత్తముడిట్లు దుర్వాసునితో పలికి స్వభక్తపాలన దీక్షాతిసహాయమును బ్రకటించుచు యిట్లనియె. భగవంతుడిట్లు పల్కేను. దుర్వాసా! అంబరీషుని గురించి యిచ్చిన శాపములు నాకు చాలా సంతోషమును జేయుచున్నవి. ఈ శాపజన్మల వల్ల నాకేమీ కష్టము లేదు. నీ వచనము వేదతుల్యము గనుక దానిని సత్యముగా చేయవలెను. అట్లుగాని యెడల బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును. అట్లు నాశము కలిగినంతలో నాకది శాపమగును గాన అట్టి కష్టము లేక ఆనందము కైగినది. రాజు ప్రాయోపవిష్టుడు వాలే బ్రాహ్మణ పరివేష్టితుడై పడియున్నాడు. అదిగాక అయ్యో బ్రాహ్మణాపకారి యీ ఆత్మయని దుఃఖించుచున్నాడు. కాబట్టి త్వరగా పొమ్ము. రాజు యీ ప్రకారముగా చింతించి దుఃఖించుచున్నాడు. ణా మూలముగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంటబడినది. ఛీ!ఛీ! బ్రాహ్మణోపద్రపకారకుడయిన రాజు ఎందుకు? రాజు మనుష్యులను పాలించువాడు గనుకను, రాజుకు ముఖ్యము ప్రజారక్షణము గనుకను, రాజు గోవుల నిమిత్తము కొరకును, బ్రాహ్మణుల నిమిత్తము కొరకును ప్రాణములు విడువవలెను. రాజు స్వేదజ, అండజ, ఉద్భిజ్జ, జరాయుజములను నాలుగు విధములగు జీవములను సర్మార్గమందుంచి పాలించవలెను. అందులో అందరికి దండన మీయదగును. పాలించవలెను. బ్రాహ్మణులను విడువవలెను. బ్రాహ్మణుని సత్య ధర్మరతులును, లోభ దంభ శూన్యులును అగు బ్రాహ్మణులే అతని తప్పును దెలిసికొని దండించవలెను. బ్రాహ్మణుడు పాపమును జేసి ప్రాయశ్చిత్తమును జేసికోనని పక్షమందు అతని తల గోరిగించుట, ధనమును హరించుట, స్థాన భ్రష్టత్వము మొదలయిన దండనముల చేత దండించవలెను. బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నాను వానిని రాజు దండించరాదు. రాజు ధర్మార్ధ బుద్ధి గలవాడగుచు ఎప్పుడైనను బ్రాహ్మణునకు గాని తనకపకారము చేయువానికి గాని శాస్త్ర ప్రయోగము ఆచరించదగదు. బ్రాహ్మణేతారులందరూ భయములేక క్షాత్ర కీర్తిని చూపవలయును గాని బ్రాహ్మణ హిమ్సమాత్రము చేయగూడదు. తానూ స్వయముగా బ్రాహ్మణుని చంపినాను, తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబదినాను, అన్యుని చేత చంపించినను బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రమునందు చెప్పబడియున్నది. బ్రాహ్మణుడు లాగబడిగాని, కొట్టబడి గాని, ధనహీనుడుగా చేయబడి గాని, ఎవని నుద్దేశించి ప్రాణములు విడుచునో వాడును బ్రహ్మ హంతకుడగును.
దుర్వాసునకు ప్రాణ హానికరమైన కష్టము నామూలముగా గలిగెను గదా? కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడనైతిని అని అతడు తలచుచున్నాడు. దుర్వాసా! అంబరీషుడీ ప్రసంగముతో మిక్కిలి దుఃఖముతో నున్నాడు. కాబట్టి నీవచ్చటికి త్వరగా పొమ్ము. నీకును రాజునకును కుశలమగును. ఇట్లు విష్ణువు చెప్పిన మాటను విని దుర్వాసుడు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడైన రాజు వద్దకు వచ్చెను. ఇట్లు సూర్యకాంతితో వచ్చుచున్న దుర్వాసుని చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రముతో యిట్లని విన్నవించెను. అంబరీషుడు పల్కేను. ఓ చక్రమా! నన్ను మన్నించుము. ఆర్తుని సంహరించుట న్యాయము గాదు. గనుక బ్రాహ్మణుని రక్షించుము. అతి క్రౌర్యముతో హింసించుట తగదు. రక్షించుమని వేడుచున్న నన్నును శరణాగతుడైన బ్రాహ్మణుని రక్షించుము. అంబరీషుడిట్లు పలుకుచు దుర్వాసుని కౌగలించుకుని తరువాత అతనిని తన వెనుక ఉంచుకొని తాను ముందు నిలబడి భయములేక ధనువును ఎక్కుపెట్టి సుదర్శన చక్రముతో ఇట్లనియెను.
ఇతి శ్రీస్కాంద పురాణే కార్తిక మహాత్మ్యే సప్తవింశాధ్యాయస్సమాప్తః!!

శివపురాణము--27


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము  
శివపురాణము--27

ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మమెవరని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీరతామని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోదాత, అఘోర తత్పురుష ఈశాన వామదేవ అను అయిదు ముఖములు ఉంటాయి. ఈ అయిదు ముఖములతో ఋషుల వంక చూస్తూ అన్నాడు ‘అదేమిటయ్యా బ్రహ్మమెవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును’ అన్నాడు. అపుడు బ్రహ్మగారు ‘నేనే ఈ లోకముల నన్నిటిని సృష్టించాను నేనే నిక్కపు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. కాబట్టి నాకన్నా బ్రహ్మమెవరు? నేనే బ్రహ్మమును’ అన్నాడు. తరువాత పక్కనున్న విష్ణువు ‘బ్రహ్మా, నా అంతవాడిని నేను అంటున్నావు. అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా! బ్రహ్మమును నేను’ అన్నారు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదాలని పిలుద్దాం అని వేదాలని పిలిచారు. అపుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం చేయాలని మొట్టమొదట నారాయణుడు జన్మించాడో ఎవడు చిట్టచివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది. దాన్ని తీసి పారేసి యజుర్వేదమును పిలిచారు. అసురీశాక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది తరువాత సామవేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో ఎవరడు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది. పిమ్మట అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు. తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. నాలుగు వేదములు అదే చెప్తున్నారు. ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అపుడు ప్రణవం ఎవడు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము’ అని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈమాటలు రుచించక పోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారింది. జ్యోతి సాకారం అయింది. సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ నీవు ఎవరు? నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి’ అన్నాడు.
బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి. కాబట్టి ఇపుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. ‘ఏమి నీ ఆజ్ఞ అని మొదటి రూపమును అడిగాడు. అహంకారంతో మాట్లాడుతున్నాడు. అయిదవ తలను గిల్లెయ్యి’ అంది. ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై అయిదవతలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ నాలుగు తలకాయలు బట్టుకు వెళ్లి అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి ఈశ్వరా, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు. అపుడు శంకరుడు కాల భైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఇవాళ్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. అపుడు నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది. పుట్టేతప్పటికే నీ స్వరూపమును చూసేటప్పటికీ లోకం అంతా గజగజలాడిపోయింది. కాబట్టి నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు. ఎవడు ఈశ్వరుని ధిక్కరించి ఇచట బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీనిని ‘భైరవ యాతన’ అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయమునకు వచ్చినపుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసెయ్యి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను ‘అమర్దకుడు’ అని పిలుస్తారు. 
ఇకనుంచి నీవు నా దేవాలయములలో క్షేత్ర పాలకుడవయి ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేసెయ్యి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు ‘పాప భక్షకుడు’ అనే పేరును ఇస్తున్నాను. నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు’ అని చెప్పాడు. అందుకే మనను కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్రప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా’ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతా పూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇకనుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తాడు. భైరవ మూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మేడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి.
ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు.
అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసా దేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ‘ఒకసారి ఒంగోండి’ అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి. ఈవిధంగా ఆ నాడు పరమేశ్వరుడు కాల భైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వర ఆజ్ఞను ఔదలదాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. ఆయన భక్తుల పాలిట కొంగుబంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు. 
కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. ‘మేము కాశీ వెళ్ళాము – మాకు ఇంట ఏ భయమూ లేదు’ అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది. 
ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటారు.

Monday, December 7, 2015

కార్తీకపురాణము--26



ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన కార్తీకపురాణం  
కార్తీకపురాణము--26

ఇట్లు దుర్వాసుడు భూలోకము మొదలైన సమస్త లోకములు తిరిగి రక్షణము పొందలేక శీఘ్రముగా హరి నిలయమైన వైకుంఠమునకు జేరెను.దుర్వాసుడు ఇట్లు ప్రార్థించెను. జగన్నాథా! బ్రాహ్మణ ప్రియా! మధుసూదనా! సుదర్శన చక్ర సంభవమైన మంటలు నాపైన పడకుండా రక్షించుము. ఓ విష్ణో! సూర్య కోటి సమాన కాంతి గల ఈ ఘోర చక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది. నివారించుము స్వామీ, నివారించుము. నీ భక్తుడైన అంబరీషునకు శాపమిచ్చిన పాతకునకు నాకు ఈ శిక్ష తగియే ఉన్నది. వేలకొలదీ బ్రాహ్మణులలో నేను బహు పాతకుడను. కాబట్టి నన్ను రక్షించుము. హరీ! నీ వక్షస్థలమందు బ్రాహ్మణుని పదము ఉండలేదా? భృగుమహర్షి హరిని పాదముతో వక్ష స్థలమందు తన్నెను గదా! కాబట్టి అట్లే నా పాతకము కూడా నీవు సహించవలెను. ఈ ప్రకారము విష్ణుమూర్తి ముందు దుర్వాస మహాముని సాష్టాంగ నమస్కారము చేసినవాడై ఓ స్వామీ! నను రక్షించుమని అనేక మారులు దుర్వాసుడు పలికినవాడాయెను. అంత హరి నవ్వుచు ఇట్లనియెను. దుర్వాసా! బ్రాహ్మణులు నాకు దేవతలు అను మాట నిజమే. మీవంటి వారు మిక్కిలి దేవతలేయగుదురు. బ్రాహ్మణోత్తమా! నీవు సాక్షాత్ శంకరుడవు. బ్రహ్మ స్వరూపుడవు. జటలతో గూడి భృకుటికుటిలమైన నీ ముఖమును జూచినచో యెవ్వరికి భయము గలుగదు? మీవంటి వారు స్వభావమునకు వికారమును గలుగనివ్వరు గదా! నేను మనో వాక్కాయముల చేత బ్రాహ్మణులకు అపకారము కొంచెమైనను చేయను. ఆ సంగతి నీకు తెలిసియేయున్నది గదా! దేవతలకు, బ్రాహ్మణులకు, సాధువులకు, గోవులకు సుఖము కొరకు ప్రతియుగమందు నేనవతరించుచుందును. దుర్వాసా! నీవు సాదు నిందితమైన కర్మను ఆచరించితివి. అంబరీషునకు కారణము లేని శాపమునిచ్చితిని. అంబరీషుడు మనోవాక్కాయములచేత శత్రువునకును అపకారమును జేయదు. సర్వభూతములయందును నన్ను బావించుచు చరాచరమూలందంతటను నన్ను జూచుచుండును. అట్టి వానిని వృధాగా నీవు అనేక బాధలు పెట్టితివి. ఇది నీకు తగునా? నీవు భోజనమునకు వచ్చెదనని చెప్పి పోయి సకాలమునకు రాలేదు. నీకు అనుష్ఠానమున్నచో చేసుకోనవచ్చును. కానీ అట్టి స్థితిలో నీవు అతనికి అనుజ్ఞయునివ్వలేదు. కేవలము జలమును బుచ్చుకొని ద్వాదశీ పారణ ముఖ్య కాలమునకు చేసెను. ఉదక పానమందేమి దోషమున్నది? ఉపవాస కాలమును నీరు త్రాగుట దోషము కానేరదు. బ్రహ్మచర్యాదులకు ఆహారము నిషిద్ధమైనప్పుడు ఉదక పానము విహితమై యుండగా దాహ శాంతికై అంబరీషుడు జలపానము చేసినందున ఏమి దోషము జరిగినది? నీకేదీ సందు దొరకక దానినొక తప్పుగా చేసుకొని శాపమిచ్చితివి గానీ విచారించిన అది దోషము అగునా! అప్పటికీ నిన్ను అనేక విధములుగా ప్రార్థించినా నీవు కోపమును తగ్గించుకొనలేక తన్ని దూరముగా పోగానే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడవైన నీవలన భయము పొంది తన హృదయాంతర్వాసియైన స్వయం ప్రభువైన నన్ను శరణు వేడెను. అంతలో నీవు శాపమిచ్చితివి. బ్రాహ్మణుని మాట అసత్యమై పోవునను తలంపుతో రాజు హృదయమందున్న నేను ఈ పది జన్మల శాపమును అంగీకరించితిని. రాజు నీవు శాపమిచ్చుటయే ఎరుగడు. వినలేదు. నీవు శాపమిచ్చు సమయమున రాజు అయ్యో బ్రాహ్మణాపకారము గలిగినదే ద్వాదశిని విడిచిన హరి భక్తి లోపించునను భయంతో జలపారణ చేసితిని. దానితో బ్రాహ్మణ తిరస్కార మాయెంగదా? హరీ! నన్నెట్లు కాపాడుదువు అని దీనుడై నన్ను శరణు జొచ్చి నాయందే మనసు ఉంచి ఇతర విషయములు మరిచి తన శరీరమును తానెరుగక యుండెను. ఇట్లుండగా నీవు శాపమిచ్చితివి. శాపమందు నీవు, "మీనము, కూర్మము మొదలైన పది జన్మలు గమ్ము" అని చెప్పితివి. అప్పుడు భక్తుల బాధలకు నివర్తకుడైన నేను అతని హృదయమందు నివసించి అతని చెవి వలన నీవిచ్చిన శాపమును వినుచు భక్తునికి అన్యాయముగా శాపము గలిగెను గదా దీనినెట్లు చేయుదును అని ఆలోచించితిని . బ్రాహ్మణుడి మాటను సత్యముగా చేసితేని ణా భక్తునికి అనిష్టము గల్గును. శాపమును నివారించితినేని బ్రాహ్మణ వచనము సత్యమగును. కాబట్టి బ్రాహ్మణ వాక్యము సత్యమగుటకు భక్త రక్షణమౌటకు ఆలోచించి నీవిచ్చిన శాపములను నేను స్వీకరించితిని. భక్తులకు కల్గిన అంతులేని మహా కష్టములనన్నింటినీ నేను హరింతును. నాభక్తుడు ధర్మాత్ముడు, సమస్త భూతములయందు సమబుద్ధి కలవాడు. అట్టి విషయమును ఎరింగియుండియు నీవు అధర్మముగా శాపమిచ్చితివి. వేదములందు దేశమును బట్టి కాలముననుసరించి ముఖ్యముగా వయస్సును చేసుకొని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయములుగా చేసికొని మనుష్యులకు వివిధ ధర్మములు చెప్పబడినవి గదా!

పురుషులకు కొన్ని ధర్మములు, స్త్రీలకు కొన్ని ధర్మములు, మనుష్య జాతికంతకూ కొన్ని ధర్మములూ చెప్పబడినవి. కాబట్టి మనుష్య జాతికి సామాన్యముగా చెప్పబడిన ధర్మములను మనుష్యులందరూ విడువకూడదు. రెండు పక్షములందును మనుష్యులందరికిని ఏకాదశినాడు భోజనమాచరించకూడదని వేదములందు పరమ ధర్మము విధించబడినది. అట్లుగాక భుజించిన యెడల దోషము చెప్పబడి యున్నది. ద్వాదశిని విడిచినచో ఏకాదశిని విడిచిన దోషమూ సంభవించును. కాబట్టి నాభక్తి లోపించునను భయముతో వాడు జలపారణము చేసెను. ఇట్లుండగా నీవు వృధాగా విచారించక శాపమిచ్చితివి గదా! అంతట విరమించక తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నోరు తెరుచునంతలో దుర్వాసుని మాటను అసత్యముబొందించతగదు అని తలంచి నేను చక్రమును పంపితిని. అనగా శాపమిచ్చిన గ్రహించువారు లేరు గాన శాపము వృధాయగునని తలంచి నివారించు భావముతో చక్రమును పంపితిని. బ్రాహ్మణోత్తమా! దుఃఖించకుము. అంబరీషుని విషయమై నీవిచ్చిన శాపము నాకు వరమాయెను. నేను ఈ రూపములను ధరించి అవతారములను ఎత్తవలసి యున్నది. నేను ఈ కల్పమందు ప్రళయమందు జగత్తుయొక్క స్థితి కారణము కొరకు శంఖాసురుని సంహరించుటకునూ, మనువును రక్షించుటకునూ, పెద్ద చేపనగుదును. దేవదానవులు సముద్రమును మదించు తరిని సముద్రమందు మునిగిన మందర పర్వతమును నావీపున ధరించుటకు తాబేలునగుదును. హిరణ్యాక్షుని సంహరించుటకునూ, భూమిని ఉద్ధరించుటకునూ నీలాద్రితో నల్లకొండతో సమానమైన పందిని అగుదును. హిరణ్య కశిపుని సంహరించుటకు క్రోధ జ్వాలల చేత దిగంతముల వ్యాపించుచూ వికృతాననుడైన మనుష్య సింహమునగుదును. లోక త్రయమును జయించి బలిని బంధించి ఇంద్రునకు పోయిన రాజ్యమును వామనుడిగా పొట్టివాడనగుదును. క్షత్రియ నాశనము కొరకు మహా బలముతో కూడి క్రూర కర్మయుతుడనై పరశురాముడను పేరుగల బ్రాహ్మణుడనగుదును. రావణుని సంహారం కొరకు ఆత్మ జ్ఞాన శూన్యుడైన రాముడను రాజును అగుదును. యదువంశమందు ఆత్మజ్ఞానము గలిగియు గోపికాముకుడనై రాజ్యములేని కృష్ణుడనగుదును. కలియుగమందు పాపమోహము కొరకు బుద్ధుడను దితి కుమారుడనై పాషండ మార్గోపదేశినగుదును. కలి యుగాంతమందు విప్ర శత్రు ఘాతకుడనైన బ్రాహ్మణుడనగుదును. ఇట్లు నాకు పది జన్మలు గల్గును. ఈ పది అవతారములు విను వారికి పాతకనాశనములగును.

ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తిక మహాత్మ్యే షడ్వింశాధ్యాయ సమాప్తః!!

శివపురాణము--26


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము--26 

ఒకనాడు పార్వతీదేవి చెలికత్తెలయిన జయ విజయలు అమ్మవారితో ఒకమాట చెప్పారు. ‘అమ్మా, నంది నిన్నూ వహిస్తాడు, శంకరుడినీ వహిస్తాడు. కానీ ఆయనకు కొంచెం శంకరుని మాల ఔదలదాల్చడంలోనే సంతోషం ఎక్కువ. భ్రుంగీ అంతే. మన మాటే వినేవాడు ఒకడు లేడు. అలాంటి వాడు మనకి ఒకడు ఉంటే బాగుంటుంది. అందుకని నీవు ఒకడిని సృష్టించి ద్వారపాలకుడిగా పెడితే వాడు నీ మాటే వింటూంటాడు. అలాంటి వాడిని తయారు చెయ్యి. అతడు మన అంతఃపురమును కాపాడడానికి పనికివస్తాడు” అని చెప్పారు. వారి మాటలు విన్న పార్వతీ దేవి అలాగే చేద్దాం అని తన శరీరమునకు ఉన్న మలమును స్నానం చేసేటప్పుడు నలుగు పిండిలా తీసి దానిలోంచి ఒక పిల్లవాడిని తయారు చేసింది. నలుగులోంచి తయారు చేయబడిన పిల్లవాడు ఎలా ఉన్నాడన్నది ఎవరికీ తెలియదు. చాలా బాగుండాలని అమ్మవారు సంకల్పం చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. వాడు లేచి కూర్చున్నాడు. అపుడు వానితో నీవు వెళ్లి ద్వారము దగ్గర కూర్చుని ఎవరూ లోపలి రాకుండా నిలుపు’ అంది అపుడు ఆ పిల్లవాడు ద్వారం దగ్గర కూర్చున్నాడు. 
ప్రమథగణములలో ముందు నందీశ్వరుడు విజయం చేస్తుండగా శివుడు లోపలి వెళ్ళబోయాడు.ఈ పిల్లవాడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. ముందు శంకరుడు జ్యోక్యం చేసుకోలేదు. అపుడు ప్రమథగణములకు ఆ పిల్లాడికి మధ్య యుద్ధం జరిగింది. ఎవరు సలహా చెప్పారో వాళ్ళే అమంవారి దగ్గరకు వచ్చి అమ్మా పిల్లవాడు యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి నీ శక్తులను పిల్లవాడికి ఇవ్వవలసింది అని చెప్పారు. అమ్మవారు శక్తులను ఇచ్చింది. ఆ పిల్లవాడు అద్భుతమయిన యుద్ధం చేసి ప్రమథగణములనన్నిటిని ఓడించేశాడు. ఇంక అక్కడ నుండి బ్రహ్మ, విష్ణువు కూడా వచ్చేశారు యుద్ధానికి. అయినా ఆ పిల్లవాడు శంకరుడిని లోపలికి పంపించలేదు. అపుడు శంకరుడు చేతిలో త్రిశూలమును పట్టుకుని పిల్లవాని కంఠమునకు గురి పెట్టి విసిరాడు. అపుడు త్రిశూలం ఆ పిల్లవాని కంఠమును ఉత్తరించేసింది. ఆ పిల్లవాడు క్రిందపడి మరణించాడు. తరువాత శంకరుడు లోపలికి వెళ్ళాడు. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో పార్వతీదేవి బయట కాపలా పెట్టిన పిల్లవాని ప్రస్తావన వచ్చింది. అపుడు శివుడు ఆ పిల్లవానిని త్రిశూల ధారల చేత చంపేశాను అన్నాడు. అపుడు పార్వతీదేవి అయ్యో ఆ పిల్లాడిని నేనే సృష్టించాను – చంపేశారా అని దుఃఖమును పొందింది. ఆవిడ దుఃఖమును ఉపశమింపజేయడానికి దేవతలు అందరూ వచ్చారు. ఆవిడ శంకరుని తన బిడ్డను మరల బ్రతికించమని అడిగింది. అప్పుడు ఆయన తన అనుచరులను పిలిచి మీరు ఉత్తర దిక్కుగా వెళ్ళి మీకు మొట్టమొదట కనపడిన ప్రాణి ఏదయితే ఉంటుందో దాని తలకాయ తీసుకురండి. ఆ తలకాయ పిల్లవాడికి పెడతాను’ అన్నాడు. వాళ్లకి మొట్టమొదట ఏనుగు కనపడింది. వాళ్ళు దాని తలకాయ పట్టుకొచ్చారు. దానిని ఈ పడిపోయిన పిల్లవాని కంఠమునకు కలిపాడు. ఆ పిల్లవాడు చక్కగా లేచి కూర్చున్నాడు. ఇప్పుడు వానికి శంకరుడెవరో తెలిసి శంకరునికి నమస్కారం చేశాడు. వెంటనే శంకరుడు కూడా వాడిని ఎత్తి తొడమీద కూర్చోపెట్టుకున్నాడు. ఈలోపుగా సుబ్రహ్మణ్య జననం కూడా జరిగిపోయింది. ఈ ఇద్దరి పిల్లలతో సంసారం చక్కగా నడిచిపోతోంది. 
ఒకరోజు ఒక యోగ్యమయిన సంబంధం వచ్చింది విశ్వరూప ప్రజాపతి అనే ఆయన తన ఇద్దరు కుమార్తెలయిన సిద్ధిబుద్ధి అనే వాళ్ళను ఇవ్వాలనుకుంటున్నాను అని వచ్చాడు. అపుడు శంకరుడు తన కుమారులను పిలిచి ఎవరు ముందు భూప్రదక్షిణ చేసి వస్తే వారికి ముందుగా పెళ్ళి చేస్తానన్నాడు. ఇద్దరూ బయలుదేరారు. గణపటిది మూషిక వాహనం. అందుకని ఆయన తల్లిదండ్రులిద్దరికీ ఏడుమార్లు ప్రదక్షిణం చేసి వారిని పత్ర పుష్పములతో పూజ చేశారు. సుబ్రహ్మణ్యుడికి ఎక్కడికి వెళ్ళినా వినాయకుడు ముందుగా వెళ్ళిపోతున్నట్లు కనపడుతున్నాడు. పార్వతీ పరమేశ్వరునకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసిన ఫలితమును ఆయన ఖాతాలో వేసి ‘నువ్వు చెప్పినటువంటి నియమమును పాటించిన వాడివి కనుక నీకు ముందు వివాహం చేస్తున్నాను అని చెప్పి సిద్ధి బుద్ధిలను గణపతికిచ్చి వివాహం చేశారు. సుబ్రహ్మణ్య స్వామీ వారు క్రౌంచ పర్వతం దగ్గరకు వెళ్ళారు. పార్వతీ పరమేశ్వరులు కూడా వెళ్ళారు. 
ఇక్కడ మనకు కొన్ని సందేహములు కలగడానికి అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా శంకరుడు ఆ పిల్లవాని తలను తీసివేసి ఉంటే ఏనుగు తల పెట్టడం ఎందుకు? పడిపోయిన తలకాయనే అతికించవచ్చు కదా! అని. పార్వతీ దేవి అనగా పరమ ప్రక్రుతి. పరమ శివుడనగా పరమ పురుషుడు. పరమ ప్రకృతి అంటే పంచ భూతములు. పంచభూతములయందలి కదలిక పరమేశ్వరుడు. అమ్మవారు భూతములన్నిటిని తయారుచేస్తుంది. కానీ లోపల చైతన్యం శివుడు. అంటే శివ సంబంధమయిన ఎరుక లేదు. లోపల ఉన్న చైతన్యము ‘నేను’ అన్నది తెలియదు. పైన ఉన్న శరీరము మూడు గుణముల చేత బంధింపబడి ఉంది. ఈ మూడు గుణములే ప్రకృతి యొక్క మలము. అదే అమ్మవారి శరీరంలోంచి వచ్చిన మలము. ఆ మలముతో పిల్లవాడు తయారు అయాడు. అంటే త్రిగుణములయందు కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి ఈ తలకు ప్రకృతి తెలుసు శివుడు తెలియదు. లోపల ఉన్న చైతన్యం బయట నిలబడిన శివుడు అని తెలియదు. కాబట్టి ఆయన దానితోనే పోరాటం చేశాడు. శంకరుడు ఆ పిల్లవాని తలను త్రిశూలంతో తరిగేశాడు. త్రిశూలమునకు ఉన్న మూడు త్రిగుణములు, వీటికి ఆధారమైన సత్యము శంకరుని చేతిలో ఉన్న త్రిశూలం. శంకరుడు గుణాతీతుడు. ఎప్పుడయితే శివుడి చేతి త్రిశూలం పిల్లవాని కంఠమునకు తగిలిందో త్రిగుణములకు సంబంధించిన బుద్ధి పోయింది. ఇప్పుడు ‘గజ’ – ఏనుగు తల పెట్టబడింది. ‘గ’ అంటే గతి అంటే కదలడం; ‘జ’ అంటే పుట్టడం. ఇపుడు ఆ పిల్లవానికి ఇందులోంచి పుట్టి ఇందులోకి వెళుతున్నాడో తెలిసిపోయింది. అంటే ఇప్పుడు శివసంబంధం వచ్చేసింది. శివుడు తెలిసిపోయాడు. తెలిసిపోవడం గజముఖం. అందుకని శంకరుడికి నమస్కారం చేశాడు. ఇది మీరు చెయ్యవలసిన ఉపాసనా క్రమమును వినాయకుని మూర్తి ద్వారా లోకమునకు తెలియజెప్పడం. ఏనుగు తల బ్రహ్మాండమును చెప్తే మనిషి శరీరం పిండాండమును చెప్తుంది. బ్రహ్మాండం, పిండాండం రెండింటి యందు పంచభూతములు ఉన్నాయి. రెండూ పంచ భూతములలో నిండి ఉన్నప్పటికీ రెండింటియందు ఉన్నది ఒక్కటే అని జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్త్వమసి అర్థమయితే ‘తత్ త్వం అసి’ ‘అదే వాడి ఉన్నాడు’ జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు అని తెలియడమే ఏనుగు ముఖం మనుష్యుడు తల కంఠం దగ్గర శివానుగ్రహంతో కలవడం. కాబట్టి తత్త్వమసి మహావాక్యం నడయాడితే మహాగణపతిగా తిరుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడాయన వినాయకుడు అయ్యాడు. ‘వి’ అంటే విశిష్టమయిన – అనగా విశిష్టమయిన నాయకుడు అయ్యాడు. మీరు ఆయనను ఉపాసన చేస్తే ఆయన మిమ్మల్ని అటువంటి పథంలోకి తీసుకు వెడతాడు. ఆయన విఘ్నములకు నాయకుడు. విఘ్నమును తీసేస్తాడు. మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుస్తాడు. 
గణపతి పరబ్రహ్మమై ఉన్నాడు. ఈయనకు సిద్ధిబుద్ధి భార్యలు. ఎవరు బుద్ధిని ఉపయోగిస్తాడో వాడు సిద్ధిని పొందగలడు. బుద్ధి అనేది ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. గణపతి ఆరాధన చేత మంచి బుద్ధి వచ్చి సిద్ధి పొందడమే ఆయనకీ సిద్ధి బుద్ధి భార్యలు అయి ఉండడం. ఆ అనుగ్రహం మీయందు ప్రసరింపబడడం. ఏనుగుకు అన్నిటికన్నా ఇష్టమైనది దాని దంతం. కానీ అది నమలడానికి పనికిరాదు. ఏనుగు ముఖం ఉన్న గణపతి వ్యాసుడు భారతం చెప్తుంటే తన దంతమును విరిచేసి దానితో రచన చేశాడు. మనకి ఉన్న వస్తువులను లోకోపకారానికి ఉపయోగించాలి. భారతమును రచించడానికి తన దంతం ఉపయోగ పడితే కొన్ని యుగాలపాటు పంచమ వేదమయిన భారతమును లోకం చదువుకుని ఉద్ధరింపబడుతుంది అని భావించి తన దంతమును విరిచేసి దానితో భారతమును రచన చేశాడు. ‘ఏకదంతం, శూర్పకర్ణం, లంబోదరం’ అని పేర్లు సంపాదించాడు. ఎంతో శాశ్వతమయిన యశస్సు పొందాడు. శివుడు ఎంత సులభుడో వినాయకుడు అంత సులభుడు. ఇరువది ఒక్క గరిక తెచ్చి ఆయన పాదముల మీద వేస్తే చాలు. అన్నీ ఇచ్చేస్తాడు. కొద్దిగా సింధూరమును గండయుగ్మమునాకు రాస్తే చాలు పొంగిపోతాడు. ఏనుగు తల కనపడితే మంగళ ప్రదము. చివరకు కలలోకి ఏనుగు వచ్చినా అది మంగళప్రదమే. 
గణపతి స్వరూపంలో చిత్రమయినది ఎలుక. గణపతికి వాహనం ఎలుక. ఎలుక దొంగతనానికి ప్రతీక. మనతో పాటే ఉంటుంది. మన వస్తువులన్నీ ఎత్తుకుపోతూ ఉంటుంది. మన బ్రతుకూ అంతే. విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే మనకి ఆయన పదిమంది హృదయాలను కొల్లగొట్ట గలిగిన దొంగతనమును పొందుతాడు. అనగా ఈశ్వరాభిముఖుడై భగవద్భక్తి చేత తాను మాట్లాడిన మాటలకు పరవశులై చాలామంది హృదయాలను తాను కొల్లగొట్టే దొంగ అవుతాడు. ఇలా మారడానికి ఎలుక విఘ్నేశ్వరుడిని వహించింది. మీరు కూడా అలా వహించడం నేర్చుకోవాలి. పదిమంది ప్రేమను సంపాదించుకోవడం నేర్చుకోవాలి. దీనిని సూచించదానికే ఎలుకను వాహనంగా పెట్టుకున్నాడు. ఎలుక చెవులు పెద్దవిగా ఉంటాయి చేట లాగా. గణపతిని నమ్మి ఆవాహన చేసి జాగ్రత్తగా ఉపాసన చేస్తే లోకంలో పొల్లు తీసేసి సారం వైపుకి మనలను నడిపిస్తాడు. పరమభక్తిని ఇస్తాడు. ఆయన ఆయుధమయిన గొడ్డలితో కర్మ పాశములను తెంచి భక్తీ పాశములను వేసి తన వైపుకి లాక్కుంటాడు. 

చవితి తిథి ఆయనకు చాలా ఇష్టమైన తిథి. ఆరోజు ఎవరయినా వినాయకుడి గురించి ప్రత్యేకంగా వినినా, చదివినా వారు ఎంతో ప్రయోజనమును పొందుతారు. పరమ భక్తితో స్వామికి నమస్కారం చేసినా ఎవరు కోరుకున్నది వారికి అనుగ్రహిస్తాడు. విద్యార్థికి విద్య వస్తుంది. ద్రవ్యార్థికి ద్రవ్యం వస్తుంది. కన్యార్థికి కన్య దొరుకుతుంది. పుత్రార్థికి పుత్రుడు పుడతాడు. భోగార్థి అయిన వాడికి భోగములు కలుగుతాయి. మోక్షార్థికి మోక్షం దొరుకుతుంది. రాజ్యార్థికి రాజ్యం, కీర్తి కావాలనుకున్న వారికి కీర్తి వస్తుంది. ఆరోగ్యం కుదుటపడక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్లకి ఆరోగ్యం కలుగుతుంది. ఋణభారంతో ఉన్నవాడికి ఋణం తొలగుతుంది. ఇక్కట్టులలో ఉన్న వాడికి ఇక్కట్టులు తొలగిపోతాయి. గణపతి దర్శనం చేత గణపతి యొక్క అనుగ్రహం చేత గణపతి కథను చదవడం చేత సమస్త శుభములు సమకూడతాయని పెద్దలు మనకు ఫలశ్రుతిని వివరణ చేసి ఉన్నారు. కాబట్టి ఆ గజానన స్వరూపము అంత గొప్ప స్వరూపము.