కాలభైరవస్వరూపం
🔱🌿💜⚜️🌿💜⚜️💜🌿🔱🌿💜⚜️🔱🌿
ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో బ్రహ్మమెవరని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోదాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అను అయిదు ముఖములు ఉంటాయి. ఈ అయిదు ముఖములతో ఋషుల వంక చూస్తూ ‘అదేమిటి? బ్రహ్మమెవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును’ అన్నాడు. బ్రహ్మగారు ‘నేనే ఈ లోకములన్నిటిని సృష్టించాను నేనే నిక్కపు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను. నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. నాకన్నా బ్రహ్మమెవరు? నేనే బ్రహ్మమును’ అన్నాడు. పక్కనున్న విష్ణువు ‘బ్రహ్మా! నా అంతవాడిని నేను అంటున్నావు. నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా! బ్రహ్మమును నేను’ అన్నారు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదములని పిలుద్దాం అని వేదములను పిలిచారు. ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం చేస్తే మొట్టమొదట నారాయణుడు జన్మించాడో ఎవరు చిట్టచివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది. యజుర్వేదమును పిలిచారు. ఆసురీశక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది తరువాత సామవేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతు తనలో తాను రమిస్తూ ఉన్న శివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది. అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు. తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. నాలుగు వేదములు అదే చెప్తున్నాయి. ప్రణవాన్ని పిలిచారు. ప్రణవం ఎవడు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడై, శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము’ అని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈమాటలు రుచించక పోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారింది. జ్యోతి సాకారం అయింది. సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. బ్రహ్మ నీవు ఎవరు? నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి’ అన్నాడు.
బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి. ఇపుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. ‘ఏమి నీ ఆజ్ఞ అని మొదటి రూపమును అడిగాడు. అహంకారంతో మాట్లాడుతున్నాడు. అయిదవ తలను గిల్లెయ్యి’ అంది. ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై అయిదవతలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ నాలుగు తలకాయలు పట్టుకు వెళ్లి అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి ఈశ్వరా! నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు. శంకరుడు కాల భైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. నిన్ను ఇవాళ్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది. పుట్టేప్పటికే నీ స్వరూపమును చూసేటప్పటికీ లోకం అంతా గజగజలాడిపోయింది. నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు. ఎవడు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీనిని ‘భైరవ యాతన’ అంటారు. జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయమునకు వచ్చినపుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసెయ్యి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను నిన్ను ‘అమర్దకుడు’ అని పిలుస్తారు.
ఇకనుంచి నీవు నా దేవాలయములలో క్షేత్ర పాలకుడవయి ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేసెయ్యి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు ‘పాప భక్షకుడు’ అనే పేరును ఇస్తున్నాను. నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు’ అని చెప్పాడు. అందుకే మనను కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్రప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా’ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతా పూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇకనుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తాడు. భైరవ మూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మెడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి.
ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవయాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు.
అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసా దేవి ఆలయమునకు వెళితే బయటకు వచ్చేటప్పుడు ‘ఒకసారి ఒంగోండి’ అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి. ఈవిధంగా ఆ నాడు పరమేశ్వరుడు కాల భైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వర ఆజ్ఞను ఔదలదాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. ఆయన భక్తుల పాలిట కొంగుబంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు.
ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. ‘మేము కాశీ వెళ్ళాము – మాకు ఇంక ఏ భయమూ లేదు’ అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది.
ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు.
కాలభైరవ అష్టకమ్
దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం
వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్
నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే|| ౧||
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే||౨||
శూలటఙ్కపాశదణ్డపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే ||౩||
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్ |
వినిక్వణన్మనోజ్ఞహేమకిఙ్కిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౪||
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణశేషపాశశోభితాఙ్గమణ్డలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫||
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరఞ్జనమ్ |
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౬||
అట్టహాసభిన్నపద్మజాణ్డకోశసన్తతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికన్ధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౭||
భూతసఙ్ఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౮||
కాలభైరవాష్టకం పఠన్తి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాన్తి కాలభైరవాఙ్ఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||౯||
ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ||
No comments:
Post a Comment