Friday, November 13, 2015

శివపురాణము--2


ఓం శ్రీ గురుభ్యోనమః___/\___  
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన శివపురాణము  
శివపురాణము--2

పరమశివుని లీలా మూర్తులలో పదమూడవ మూర్తి హరిహరమూర్తి. అనగా ఆయన శరీరంలో సగభాగమును శ్రీమహావిష్ణువు స్వీకరించారు. అలా పరమశివుణ్ణి ప్రసన్నుడిని చేసుకొని శరీరంలో సగాభాగామును స్వీకరించిన మూర్తిని హరిహరమూర్తి అంటారు. 'నీవు ఎటువంటి భక్తితో ఎటువంటి ఉపాసన చేసి శంకరుని అర్ధభాగమును పొందావో ఆ ఉపాయమును నాకు చెప్పవలసినది' అని పార్వతీ దేవి నారాయణుణ్ణి ప్రార్థన చేస్తే, శ్రీమన్నారాయణుడు పార్వతీదేవికి ఉపదేశం చేసిన స్తోత్రమే శివాష్టోత్తర శతనామ స్తోత్రము. ఈ శివాష్టోత్తర శత నామ స్తోత్రమును ఆధారము చేసుకొని పార్వతీ దేవి శంకరుని శరీరంలో అర్థ భాగమును పొందింది. అది పదునాల్గవ స్వరూపము. దానిని అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు. మనుష్య జన్మ ప్రయోజనం భగవంతునితో ఐక్యమే కనుక శివాష్టోత్తర శతనామ స్తోత్రమును ప్రదోష వేళలో చదవడం ఇహమునందు సమస్తమయిన కోరికలను తీరుస్తుంది. పరలోక సుఖమును, భగవంతుని అనుగ్రహమును మనయందు ప్రసరింపజేస్తుంది. 
‘శివో మహేశ్వరః’ అని పిలుస్తారు. ‘మహేశ్వరః’ అనబడే నామము చిత్రమయిన నామము. మంత్రపుష్పం చెప్పినప్పుడు 
ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్!
బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం!!
అని చెపుతాము. సర్వమంగళములకు కారణం అయినవాడు, సర్వ జగన్నిమాయకుడు, సృష్టిస్థితిలయలు చేసేవాడు తానొక్కడే అయివుండి, కాని సృష్టి చేసినప్పుడు ఒకడిగా, స్థితి కారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా, లయకారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా, మూడుగా కనపడుతూ ఆయన అనుగ్రహము చేత జ్ఞానము కలిగినప్పుడు అవి మూడు కావు ఒక్కటే అన్న జ్ఞానము ఎవరి నుంచి ప్రసరిస్తుందో ఆయన మహేశ్వరుడు. ఆయనే మూడుగా కనపడే ఒక్కడి. అందుకే పోతనగారు భాగవతంలో ఒకచోట ఒకమాట అంటారు – 
మూడు మూర్తులకును మూడు రూపములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమై యొప్పారు బ్రహ్మమనగ నీవె ఫాలనయన’. మనము సృష్టి స్థితిలయ అని మూడు మాటలు వాడుతుంటాము. మనలో చాలామందికి ఒక తప్పు అభిప్రాయం ఉంటుంది. రుద్రుడు లేదా శివుడు అనేసరికి ఆయన సంహారకర్త, లయకారుడు, ఆయన సంహరిస్తాడు అని అనుకుంటారు. అన్నివేళలా లయము అనే శబ్దమునకు అర్థం కేవలం చంపివేయడం కాదు. పరమశివుడు చాలా ఉదారుడై ఉంటాడు. మనకు లయమునందు ‘స్వల్పకాలిక లయం’ అని ఒకమాట ఉంది. గాఢనిద్ర పట్టినట్లయితే ఆ నిద్రలో దుఃఖం తెలియదు. హాయిగా నిద్ర పట్టింది అంటాడు. ఆ హాయి అనేది ఏమిటి? మనస్సు లేకపోవడమే హాయి. గాఢ నిద్రలో ఉన్న స్థితిలో మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయి ఆత్మగా ఉండిపోతే ఎంతో సంతోషంగా ఎంతో హాయిగా ఉంటుంది. ఆ స్థితిలో బాహ్యమునకు సంబంధించిన ఎరుక అంతా ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు గొప్ప ఆనందమును పొందుతాడు. ఇలా ఆనందమును పొందిన స్వరూపము ఏదైతే ఉందో ఆ ఆనందమే శంకరుడు. ఆ ఆనందమే పరమశివుడు. మనం పొందిన ఆ నిద్రను స్వల్పకాలిక లయం అని పిలుస్తారు. తెల్లవారి నిద్రలేవగానే మనస్సు మేల్కొంటుంది. మేల్కొనడం అనగా ఆత్మనుంచి విడివడుతుంది. యథార్థమునకు సృష్టి స్థితి లయ అనేవాటిని యిక్కడే దర్శనం చెయ్యాలి. అది మహేశ్వర స్వరూప దర్శనం అవుతుంది. తెలివిరాగానే మనం చేయవలసిన పనులకు సంబంధించి మనకు ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన అనేది మనస్సు స్వరూపం. ఆత్మగా ఉండి మీరు మొదటి ఆలోచనను చూసినట్లయితే దాని ఆలోచనలను చూడడం మీకు అలవాటు అవుతుంది. ఇదే సృష్టి. చతుర్ముఖ బ్రహ్మ దర్శనం. బ్రహ్మకి పూజలేదు. సంకల్పదర్శనం చేత మాత్రమె మీరు బ్రహ్మదర్శనం చేసేస్తారు. సృష్టి ప్రారంభం అయింది. అనగా మీ మనస్సు బయటకు వచ్చింది. ఇప్పుడు మీకు స్థితి కావాలి. స్థితి అంటే నిర్వహణ శక్తి. మనస్సు కొన్ని సంకల్పములను చేస్తుంది. వీటిని విడగొట్టగలిగిన ప్రజ్ఞ కావాలి. ఇలా చేయాలంటే మీకు సమర్థత కావాలి. ఇది నిర్వహణ సమర్థత. అటువంటి శక్తిని పొంది ఉన్నవాడు స్థితికారకుడు. అటువంటి శక్తిని స్త్రీగా చెప్తే నారాయణి అమ్మవారు. పురుషుడిగా చెప్తే శ్రీమహావిష్ణువు. కాబట్టి మీరు తప్పకుండా ప్రాతఃకాలమునందు విష్ణునామం చెప్పాలి. విష్ణుశక్తి మీయందు ప్రసరిస్తే సాయంకాలం వరకు ఆ ప్రజ్ఞ అలా వెడుతుంది. అందుకని విష్ణుపూజతో, విష్ణు నామంతో రోజు ప్రారంభం కావాలి. తరువాత మీరు అభిషేకం చేసుకోవచ్చు, శివార్చన చేసుకోవచ్చు. కానీ విష్ణునామంతో ప్రార్థించాలి. మనకు భగవంతుడు ఒక్కడే. కానీ మనకు ప్రయోజనం చేకూర్చడానికి అన్ని రూపములను పొందాడు. రాత్రి నిద్రపోయే ముందు 11 మార్లు శివనామం జపించి విశ్రాంతి స్థానమునకు శరీరమును చేర్చివేయాలి. ఇప్పుడు ఈ శివానుగ్రహం స్వల్పకాలికలయం. శివనామము చెప్పి నిద్రపోతే ‘నిద్రాసమాధి స్థితి’ – అది సమాధి స్థితి అవుతుంది. తొలి తలంపు ఏది వస్తుందో దానిని మీరు ఈశ్వరుని వైపు తిప్పడం మనస్సుకు ప్రయత్నపూర్వకంగా అలవాటు చెయ్యాలి. అపుడు మీరు కాలమునందు ఒకరోజు అనబడే విభాగమును మహేశ్వరుడిగా మారుస్తున్నారు. ఇది మహేశ్వరార్చనము. 
ఈ మహేశ్వరార్చన చేత మీరు మహేశ్వరుడు అయ్యారు. ఎలా? మొట్టమొదట ఆలోచన బయటకు వస్తూనే మనస్సుకి ఒక అలవాటు ఉండాలి. మీకు కూడా మీ మనస్సుకు తర్ఫీదు ఇవ్వడం రావాలి. నిద్రలేవగానే అది మొదటి సంకల్పం ఏమి చెప్పాలంటే –సాధారణంగా ఎడమవైపు నిద్ర పొమ్మని శాస్త్రం చెపుతోంది. మీరు నిద్రలేవగానే నీ దృష్టి ప్రసారం తిన్నగా మీరు ఆరాధించే దేవతా స్వరూపము మీద పడాలి. అలా లేవగానే దేవతా స్వరూపమును చూడడం మొదటిగా మనస్సుకు మీరు అలవాటు చేయాలి. అంతేకానీ, టైం అయిపోతోందని గడియారం వంక చూస్తూ కంగారు కంగారుగా లేవడం అలవాటు కాకూడదు. నిద్రలేవగానే మీ తలను తిప్పి కళ్ళు విప్పితే మొట్టమొదటి దృష్టి పరమేశ్వర మూర్తి మీద పడడం చేత పరావర్తనం చెంది ఆ పార్వతీ పరమేశ్వరులు లేక లక్ష్మీ నారాయణుల దర్శనం జరిగి ఈ కంటితో చూసి లేచిన తర్వాత కాలు పెట్టేముందు మనస్సునందు మరల ‘సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే’ అని శ్లోకం చెప్పి క్రిందకి దిగగానే గురువుగారూ, మీరు నాకు ఉపదేశం చేశారు – మీరు చెప్పిన బుద్ధితో ఈరోజు నారోజు గడుచుగాక’ అని నేలమీద పది గురువుగారి పాదములను ఒక్కసారి మనస్సులో ధ్యానం చేసి, వారి పాదములకు శిరస్సు తాటించి పైకి లేవాలి. ఇది మీకు అలవాటు అయితే మీకు తెలియకుండా మీకు మొదటి ఆలోచన రావడానికి సాక్షి అవుతుంది. ఇపుడు ఈ ఆలోచనను మీరు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదీ స్థితికారకత్వం. 
లలితాసహస్రంలో అమ్మవారికి 'భావనామాత్ర సంతుష్టాయై నమః' అని ఒక నామం ఉన్నది. నీ భావన చేత ఆవిడ సంతుష్టురాలవుతుంది. మీ మనస్సులో మీరు మంచి భావన చేస్తుంటే అక్కడ ఆమె ఆనందిస్తుంది. మనలోవున్న శక్తి అంతా ఆవిడే! ఇక్కడవున్న ప్రకృతి వికారమయిన శరీరము ఆవిడ. ఇది ఆయనను కోరుతోంది. దీనిని దానితో కలపాలని ఆవిడ తెరపైకెత్తుతుంది. ఇది మాయ అన్న యవనికను ఒకరోజున పైకి ఎత్తేస్తుంది. అప్పుడు మీరు దానితో కలుస్తారు. అప్పుడు మీరు జీవితంలో అనుసంధాన ప్రక్రియగా వెళ్ళవలసిన మహేశ్వర స్వరూపము. అంతేకాని - మహేశ్వర స్వరూపమనగా ఏదో దేవతలందరి చేత పూజించబడేవాడు అని అనుకోకూడదు. అలా అనుకోవడం దోషం కాకపోవచ్చు. కాని మీరు అలా అనుసంధానం చేసుకుంటే అది భక్తికి బాగా పనికొస్తుంది. కాని ఇది మీరు నిత్యజీవితమునందు అలవాటులోకి తెచ్చుకోవలసిన ప్రక్రియ. మీరు యిలా దర్శనం చేస్తూ వెడుతున్నట్లయితే మీ లయ పరమశివుడు. నిద్రలేవగానే మిమ్మల్ని ఎవరయినా 'మీరు ఇప్పటిదాకా ఎవరితో కలిసి ఉన్నారు' అని అడిగినట్లయితే అపుడు మీరు ధైర్యంగా 'నేను ఇప్పటివరకు కైలాసమునందు పార్వతీ పరమేశ్వరులతో కలిసి వున్నాను - అదీ నా నిద్ర' అని చెప్పగలగాలి. ఎందుచేత? నేను ణా నిద్రను పడుకోబోయే ముందు అలా స్వీకరించాను. నేను లేచినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ దర్శనమే ణా మేల్కొనుట. ణా పూజామందిర ప్రవేశము స్థితికర్త ప్రార్థన. నా నిన్నటిరోజు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తల సమాహారము. అది మహేశ్వర స్వరూపముగా నాచేత ఉపాసన చేయబడిన కాలము. కనుక నేను మహేశ్వరోపాసన చేత మరొక మాహేశ్వరుడను అయినాను. ఇది మీ జీవితమునందు రావలసిన ప్రక్రియ. ఇలా చెయ్యగా చెయ్యగా భ్రమరకీటక న్యాయంలో ఒకనాడు మీరు ఆ స్వరూపమును పొందుతారు. ఇలా కాకుండా వేరొక రకమయిన ఆలోచనతో వ్యగ్రతతో జీవితం వెళ్ళిందంటే అసలు ఆత్మలోంచి విడివడడంలో మీకు కృతజ్ఞతా భావం కలగదు. 
మహేశ్వర శబ్దం గురించి –
తమీశ్వరాణాం పరమం మహేశ్వరం తమ్ దేవతానాం పరమం చ దైవతం’ దేవతలు అందరూ కూడా ఎవరికీ ప్రార్థన చేసి నమస్కరిస్తారో, సర్వ జగత్తును ఎవరు నియమించి, పోషించి రక్షిస్తున్నాడో, ఎవడు దీనిని నిలబెడుతున్నాడో, ఎవడు దీనిని తనలోకి తీసుకుంటున్నాడో వాడే మహేశ్వరుడు. వాడు సర్వ జగన్నియామకుడు. వాడు పరబ్రహ్మమయి ఉన్నాడు. ఇటువంటి పరబ్రహ్మము ఎక్కడ దర్శనం అవుతుంది? దానిని మనం చూడగలమా? దీనికి శాస్త్రం సమాధానం చెప్పింది. మహేశ్వర దర్శనం చేయడానికి ముందుగా మీకు మహేశ్వర దర్శనం చేయాలన్న తాపత్రయం కలగాలి అని చెప్పింది. ఒక్కొక్కరు చాలా పెద్ద చదువులు చదువుకుంటారు. అలా చదువుకోవడం గొప్ప కాదు. అలా చదువుకున్న చదువును నిరంతరం ఎవరయితే అనుష్ఠానంలోనికి తెచ్చుకుంటారో వారు గొప్పవారు. అటువంటి వారు మహాపురుషులు అవుతారు. చదివిన విషయమును ఆచరణలో పెట్టడానికి శ్రద్ధ కావాలి. చెప్పాం కాదు., అనుష్ఠానం లో ఉండాలి. ఈశ్వరుడు సర్వసాక్షి. ఆయన చూస్తున్నాడు అనే బెరుకు మీకు ఉన్నట్లయితే, ఒకడు చూసి మిమ్ము మెచ్చుకోవాలని మీరు పనులు చేయరు. అ పనులు చేయడం మీవిదిగా భావించి పనులను చేస్తారు. శివ పురాణమును ఒక కథగా వినే ప్రయత్నం మీరు చేయకూడదు. అలా చేస్తే అది మీ జీవితమును అభ్యున్నతి మార్గం వైపు తీసుకువెళ్ళదు. శివపురాణం మన నిత్యజీవితంలో ఎలా ఉపయోగపడుతుందో మనం ఆలోచించాలి. ఈశ్వరుడిని చూడాలి అనే తాపత్రయం మీరు సృష్టి స్థితి లయానుసంధానం నిరంతర ప్రక్రియగా చెయ్యడంలో ఉంటుంది. ఆయన –
సర్వజ్ఞాతా తృప్తి రనాది బోధః స్వతంత్రతా నిత్యమలుప్త శక్తిః 
అనంత శక్తిశ్చ విభోర్విధిజ్ఞాత షడాహురంగాని మహేశ్వరస్య’ అంది శాస్త్రం. 
కొన్ని విషయములను కన్ను చూసినా మనస్సు వాటిని పట్టుకోదు. మనం ఒకచోట కూర్చుని కంటితో అన్నిటినీ చూస్తున్నా అల చూస్తున్నవాటిలో కొన్నిటిని మాత్రమే గుర్తు పెట్టుకోగలము. కానీ ఈశ్వరుడు అలా కాదు. మహేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయగతమయిన అభిప్రాయములను కూడా తెలుసుకోగలడు. 
మీ మనస్సును ఈశ్వరుని పాదముల మీద పెట్టగలిగితే ఈశ్వరుడు మీవెంట పడుగెడతాడు. మీ మనస్సు అక్కడ పెట్టడానికి మీరు చేస్తున్న పరిశ్రమకు ‘పూజ’ అని పేరు. అలా భగవంతునియందు మనస్సును కేంద్రీకరించి పూజ చేయడం అలవాటు చేసుకోవాలి. అది అలవాటు అయితే మీరు ఏ ప్రదేశంలో వున్నా పూజ చేసుకోగలుగుతారు. కాబట్టి పరమేశ్వరుడు హృదయగతాభిప్రాయమును పట్టగలిగినవాడు. దీనికే సర్వజ్ఞత అంటారు. సర్వజ్ఞత, స్వతంత్రత అనేవి రెండూ ఈశ్వరుడితో ముడిపడి ఉంటాయి. ఏకకాలమునందు సమస్త చరాచర జగత్తులో వున్న ప్రాణుల హృదయాంతర్గత భాగములను తాను చూస్తాడు. చూసి ఆ భావముల పరిపుష్టి చేత మోక్షమును కూడా అనుగ్రహిస్తాడు. పైకి చూస్తే ఈవిషయము మీకు ఒక్కనాటికీ దొరకదు.

No comments: