ఓం శ్రీ గురుభ్యోనమః___/\___
బ్రహ్మశ్రీ చాగంటికోటీశ్వర రావుగారికి___/\___
పూజ్య గురువులు చెప్పిన కార్తీకపురాణము--9
విష్ణుదూతలడిగిరి. ఓ యమదూతలారా! మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి? మీయమదండనకు ఎవ్వడు తగినవాడు? పుణ్యమనగా ఏమి? ఈవిషయముల్లన్నిటిని మాకు జెప్పుడు. ఇట్లని విష్ణుదూతలడుగగా యమదూతలు ఇట్లు పల్కిరి. ఓ విష్ణుదూతలారా! సావధానముగా వినుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు. మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను జేసిన వానిని దండింతుము. వేదమార్గమును వదలి ఇచ్ఛానుసారముగా తిరుగుచు వేదశాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వానిని మేము దండింతుము. బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదములచేత తన్నువాడును, తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వారిని మేము దండింతుము. నిత్యము అబద్ధమాడుచు జంతువులను జంపుచు కులాచారములను వదిలినవారిని మేము దండింతుము. ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్నవానిని, డాంబికుని, దయాశాంతులు లేనివానిని, పాపకర్మలందాసక్తులైన వారిని మేము దండింతుము. పరుని భార్యతో క్రీడించువానిని, ద్రవ్యమును గ్రహించి సాక్ష్యములను జెప్పువానిని మేము దండింతుము. నేను దాతనని చెప్పుకొనువానిని, మిత్రద్రోహిని, ఉపకారమును మరచిన వానిని అపకారమును జేయువానిని మేము దండింతుము. వివాహమును చెరుచువానిని, ఇతరుల సంపత్తులను జూచి అసూయపడువానిని మేము దండింతుము. పరుల సంతానమును జూచి దుఃఖించువానిని కన్యాశుల్కముల చేత జీవించువానిని, వడ్డీతో జీవించువానిని మేము దండింతుము. చెరువును, నూతిని, చిన్న కాలువలను నిర్మించు వ్యాపారమును మార్పించు వానిని, నిర్మితములయిన వాటిని చెరుచు వానిని మేము దండింతుము. మోహముచేత మాతాపితరుల శ్రాద్ధమును విడచినవానిని, నిత్యకర్మను వదలిన వానిని మేము దండింతుము. పరపాకపరిత్యాగిని, పరపాకరతుని, పితృశేషాన్నమును భుజించువానిని మేము దండింతుము. పరపా పరిత్యాగియనగా తానువండిన అన్నములో ఇతరులకు యెంతమాత్రమును బెట్టకతానే అంతయు భుజించువాడు. పితృశేషాన్నభోక్తయనగా శ్రాద్ధభోక్తలు భుజింిన తరువాత మిగిలిన అన్నమును భుజించువాడు. ఇతరుడు దానము చేయుసమయాన ఇవ్వవద్దు అని పలుకువానిని, యాచించిన బ్రాహ్మణునకివ్వనివానిని, తన్ను శరణుజొచ్చినవానిని చంపువానిని మేము దండింతుము. స్నానమును సంధ్యావందనమును విడుచువానిని, నిత్యము బ్రాహ్మణనిందకుని బ్రాహ్మణహంతకుని, అశ్వహంతకుని, గోహంతకుని, మేము దండింతుము. ఈమొదలయిన పాతకములను జేయు మానవులు యమలోకమందుండు మాచేత యాతనలను పొందుదురు. ఈఅజామిళుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీ సంగలోలుడై పుట్టినది మొదలు చచ్చువరకు పాపములను చేసినాడు. ఇతనిచే చేయబడిన పాపములకు మితిలేదు. ఇట్టి విప్రాధముడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడగును. ఈప్రకారముగా పలికిన యమదూతలమాటలు విని విష్ణుదూతలు చిరునగవుతో వికసించిన ముఖపద్మములు గలవారై మేఘ సమాన గంభీరధ్వనితో నిట్లనిరి. ఏమియాశ్చర్యము. మీరింత మూఢులు, ధర్ మర్యాదను మేము చెప్పెదము. సావధానముగా వినుడు. దుస్సంగమును విడుచువాడు, సత్సంగము ఆశ్రయించువాడు, నిత్యము బ్రహ్మ చింతనమును జే్యువాడు యమదండార్హుడుగాడు. స్నాన సంధ్యావందనములాచరించువాడును, జపహోమాదులాచరించువాడును, సర్వభూతములందు దయావంతుడును యమలోకమును పొందడు. సత్యవంతుడై అసూయా దోషరహితుడై జపాగ్ని హోత్రములను జేయుచు కర్మల ఫలములను బ్రహ్మయందుంచినవాడు యమదండార్హుడుగాడు. కర్తృభోక్తృత్వాదులను సగుణపరమేశ్వరునియందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటయే తాత్పర్యముగా కలవాడు యమమందిరానికి వెళ్ళడు. అన్నదానమాచరించువాడును, జలదాతయు, గోదానకర్తయు, వృషోత్సర్గకర్తయు యమలోకమును పొందడు. వృషోత్సర్గము=ఆబోతును అచ్చుపోసి వదలుట. విద్యను గోరినవారికి విద్యాదానమాచరించువాడును, పరోపకారమందాసక్తి గలవాడును యమలోకమును పొందడు. హరిని బూజించువాడును, హరినామమును జపించువాడును, వివాహములను ఉపనయనములను జేయువాడును, యమలోకమును పొందడు. మార్గమధ్యమందు మండపములు కట్టించువాడును, క్రీడాస్థానములను గట్టించువాడును, దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారమును జేయించువాడును యమోకమును పొందడు. నిత్యము సాలగ్రామార్చనమాచరించి ఆతీర్థమును పానముజేసి దానికి వందనమాచరించువాడు యమలోకమును పొందడు. తులసీ కాష్ఠమాలికను మెడయందు ధరించి హరిని పూజించువాడును సాలగ్రామమును పూజించువాడును యమలోకమును పొందడు. భాగవతమును వ్రాసి గృహమందు పూజించుచున్నను, గృహమందుంచుకొన్నను యమలోకమును పొందడు. సూర్యుడు మేషతులా మకర సంక్రాంతులయందుండగా ప్రాతస్స్నానమాచరించు వారు యమలోకమును పొందరు. రుద్రాక్షమాలికను ధరించి జపదాన హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు. నిత్యము అచ్యుత, గోవింద, అనంత, కృష్ణ, నారాయణ, ఓరామయని హరినామ సంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు. కాశియందు మణికర్ణికాఘట్టమందు హరిస్మరణ చేయుచు మృతినొందినయెడల వాడు సర్వపాపములు చేసినవాడయినను యమలోకమును పొందడు. దొంగ, కల్లుత్రాగువాడు, మిత్రహంతకుడు, బ్రాహ్మణహంత, గురుభార్యరతుడు, స్త్రీహత్య, రాజహత్య, గురుహత్య, గోహత్య, చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించిన యెడల పాపవిముక్తులగుదురు.
మహిమను తెలుసుకొనిగాని, తెలియకగాని, మరణకాలమున హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములయినను ముక్తులగుదురు. పడినప్పుడును, తొట్రుపాటు బొందినప్పుడును, కొట్టబడినప్పుడును, జ్వరాదులచేత పీడింపబడినప్పుడును, సప్తవ్యసనములచే పీడింపబడునప్పుడును, వశముకానప్పుడును హరి హరీయని అన్నయెడల యమయాతన పొందడు. అనేక జన్మలలో సంపాదింపబడి ప్రాయశ్చిత్తములు లేక కొండలవలె పెరిగియున్న పాపములన్నియు భూమియందుగాని, స్వర్గమందుగాని హరినామసంకీర్తనము చేత నశించును. మరణావస్థలో ఉన్నవాడు హరినామస్మరణమును జేసినయెడల వాని పాపములన్నియు అగ్నిలోనుంచిన దూదివలె నశించును. విష్ణుదూతలిట్లు యమదూతలతో పలికి అజామిళుని యమదూతలవలన విడిపించిరి. తరువాత అజామిళుడు విష్ణుదూతలకు నమస్కారము చేసి మీ దర్శనము వలన నేను తరించితిననెను. తరువాత విష్ణుదూతలు వైకుంఠమునకుబోయిరి. తరువాత అజామిళుడు యమదూత విష్ణుదూతల సంవాదమును విని ఆశ్చర్యపడి అయ్యో ఎంతకష్టమాయెను. ఆత్మహితము చేసికొనలేకపోతినిగా ఛీ ఛీ నాబ్రతుకు సజ్జననిందితమాయెనుగదా, పతివ్రతయైన భార్యను వదలివేసి కల్లుద్రాగెడి ఈదాసీభార్యను స్వీకరించితినిగదా, వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వారును పుణ్యాత్ములయిన మాతాపితరులను నీచుడనై విడిచితిని గదా అయ్యో యెంత కష్టము,ధర్మమును చెరుచువారు కాముకులు నిరంతరమనుభవించెడి నరకమందిప్పుడు నేను నిశ్చయముగా పడెడివాడను. ఇదియేమి ఆశ్చర్యము. ఇది స్వప్నమా. ఆనల్లకత్తులను ధరించిన యమభటులెట్లు పోయిరి? నేను పూర్వజన్మమందు పుణ్యమాచరించినవాడను. ఇది నిజము. అట్లుగానిచో దాసీపతియైన నాకు మరణకాలమందు హరిస్మృతి యెట్లుగలుగును> నా జిహ్వహరినామమును యెట్లు గ్రహించును? పాపాత్ముడైన నేనెక్కడ, అంత్యకాలమందీ స్మృతియెక్కడ? సిగ్గువిడిచి బ్రాహ్మణులనుజంపు నేనెక్కడ, మంగళకరమయిన నారాయణనామమెక్కడ? అజామిళుడిట్లు విచారించి నిశ్చలమైన భక్తినిబొంది జితేంద్రియుడై కొంతకాలముండి సాయుజ్యముక్తిని పొందెను. కాబట్టి నారాయణ నామకీర్తన గావించువాడు సమస్తపాపవిముక్తుడై వైకుంఠలోకము పొందుదురు. ఇందుకు సందియము లేదు.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే నవమోధ్యాయస్సమాప్తః
No comments:
Post a Comment