Saturday, December 21, 2013

ధృవుడు 'ధృవ తారగా' ఎలా మారాడు?





















ధృవుడు 'ధృవ తారగా' ఎలా మారాడు?
..............................
పూర్వం ఉత్తానపాదుడనే రాజు ఉండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు. వారిద్దరికీ చెరొక కొడుకూ ఉండేవారు. 
పెద్ద భార్య సునీతి శాంత స్వభావం కలది. ఆమె కొడుకు ధృవుడు. 

రెండోభార్య సురుచికి అందగత్తెననే అహంకారం. నోటి దురుసు తనం వల్ల రాజు ఆమెను ఎదిరించలేక పోయేవాడు. ఆమె కొడుకు ఉత్తముడు.

అప్పుడు ధృవుడు ఐదేళ్ల పసివాడు. అయినా తన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టే నేర్పు ఆ పసివాడికి పుట్టుకతో వచ్చింది. 

పట్టపు రాణిగా తన తల్లికి లభించవలసిన గౌరవం తండ్రి గాని, పినతల్లి గాని ఇవ్వక పోగా, ఆమెను దాసి కన్నా చులకనగా చూడటం గమనించాడు. 

శాంత గుణం, ఓరిమి గల తల్లి పినతల్లి అధికారాన్ని, తండ్రి నిర్లక్ష్యాన్ని సహించి, లోలోపలే బాధపడటం కూడా గమనించాడు. 

ఒకనాడు రాజు అంతఃపురంలో సింహాసనంపై కూర్చుని, ఒడిలో ఉత్తముని పెట్టుకుని ముద్దాడుతున్నాడు. 
అటువైపు వచ్చిన ధృవుడు, తండ్రి దగ్గరకు వెళ్లి తాను కూడా ఒడిలో కూర్చుంటానని అడిగాడు. 
అయితే చిన్న భార్య అక్కడే ఉండటంతో, రాజు ధృవుణ్ని దగ్గరకు తీయలేదు. 

కానీ ధృవుడు తాను కూడా తండ్రి ఒడిలో కూర్చోవాలన్న పట్టుదలతో తమ్ముడిని లాగ బోయాడు. 
పినతల్లి అతణ్ని చూసి హేళనగా ‘‘నా కడుపున పుట్టినవారికే ఆ స్థానం దక్కుతుంది. 

నీకంత కోరికగా ఉంటే, తపస్సు చేసి దేవుడిని ఆ స్థానం కావాలని ప్రార్థించు’’ అని బయటకు ఈడ్చింది.
తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండటం చూసి ధృవుడికి కోపం, రోషం, ఏడుపు అన్నీ ఒక్కసారిగా వచ్చాయి. 

చిన్నబోయిన ముఖంతో తల్లి వద్దకు వెళ్లాడు. 
కొడుకు బాధను చూసి ఆ తల్లి ఏడ్చింది. 
‘‘నీ పినతల్లి చెప్పింది నిజమే. 
నీవు నా కడుపున పుట్టకుండా ఆమె కడుపున పుట్టి ఉంటే, 
నీకు ఇంత అవమానం జరిగేది కాదు. 
ఆమె చెప్పినట్లే భగవంతుని ప్రార్థించు నాయనా’’ అని బాధపడింది.

తల్లి బాధను చూసిన ధృవుడు..ఎంత కష్టమైనా తపస్సు చేసి, తన తల్లికి ఉన్నత స్థానం దక్కేలా చేయాలని నిశ్చయించుకున్నాడు. 
తనకు, తన తల్లికి జరిగిన అవమానానికి తగిన ప్రతీకారం తీర్చుకోనిదే రాజభవనంలో తిరిగి అడుగుపెట్టనని శపథం చేశాడు.

తల్లి కోసం ఏదైనా చెయ్యాలన్న లక్ష్యంతో బయలుదేరిన ధృవుడి వద్దకు నారదముని వచ్చాడు. 

జరిగింది మర్చి పొమ్మని, కొంతకాలానికి పరిస్థితులు చక్క బడతాయని ఊరడించాడు. 
కానీ ధృవుడు తన పట్టుదలను వదల్లేదు. 

ధృవుని మనోధైర్యాన్ని మెచ్చుకున్న నారదుడు నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు.

అడవిలోకి వెళ్లిన ధృవుడు తన లక్ష్యం నెరవేరడానికి పటిష్టమైన ప్రణాళిక వేసుకున్నాడు. 
తన శరీరాన్ని, మనస్సును మెల్లమెల్లగా తపస్సుకు సిద్ధం చేసుకున్నాడు. 

మొదటి నెలలో మూడురోజులకొకసారి పళ్లు మాత్రం తింటూ ధ్యానం మొదలుపెట్టాడు. 
రెండోనెలలో ఆరు రోజులకొకసారి ఆకులు మాత్రం తిన్నాడు. 

మూడోనెలలో తొమ్మిది రోజులకొకసారి మంచినీరు తాగుతూ తపస్సు కొనసాగించాడు. 

నాల్గవ నెలలో 12 రోజుల కొకసారి మాత్రం గాలి పీల్చుతూ ధ్యాన యోగంలో గడిపాడు. 

ఐదవ నెలలో శ్వాసను బంధించి, ఒంటి కాలిపై నిలబడి తదేక ధ్యానంలో మునిగిపోయాడు. 

ఆరో నెలలో కాలి బొటనవేలిపై నిలబడి, తన మనస్సులో శ్రీహరిని ధ్యానించాడు.

దేవతలకు, యోగులకు కూడా సాధ్యం కాని ఆ కఠినమైన తపస్సుకు శ్రీ మహా విష్ణువు మురిసిపోయి, ధృవుని వద్దకు వచ్చి, వరం కోరుకోమన్నాడు. తనకు, తన తల్లికి ఉన్నత స్థానం కావాలన్నాడు ధృవుడు. 

అతని మాతృభక్తికి సంతోషించి, ‘‘చాలా కాలం భూమిని పాలించి, 
తరువాత విష్ణు లోకం చుట్టూ తిరిగే నక్షత్ర మండలంలో శాశ్వత స్థానం పొందుతా’’వని వరమిచ్చి, అదృశ్యమయ్యాడు.

జనరంజకంగా చిరకాలం పాలించిన ధృవుడిని నక్షత్ర మండలానికి తీసుకు వెళ్లడానికి విమానం తీసుకువచ్చిన 
విష్ణు కింకరులతో తల్లిని విడిచి రాలేనన్నాడు. 

వారు సంతోషించి, అంతకన్నా ముందే విమానంలో ఉన్న అతని తల్లిని చూపారు. 
అది చూసిన తరువాతనే ధృవుడు విమానం ఎక్కాడు. 

నక్షత్ర మండలాన్ని చేరుకుని, ధృవతారగా శాశ్వతంగా వెలుగుతూ, 
ప్రతి రోజూ సూర్యుని కంటే ముందుగా తన కాంతిని లోకానికి ప్రసాదిస్తూ, 
తల్లిని పూజించిన వారికి లభించే ఉన్నత పదవికి సాక్షిగా ప్రకాశిస్తున్నాడు.

ప్రత్యూష కిరణాలు::రచన వెంకట మధు 

No comments: