అట్లతద్ది ఎలా జరుపుకోవాలి?
..................................
ఈరోజు అట్లతద్ది. ఇది ఆధ్యాత్మికతనే కాదు వినోదాన్నీ అందించే పండుగ. ఆశ్వయుజ పౌర్ణమి వెళ్ళిన మూడవ
రోజు అట్లతద్ది. సాధారణంగా సెప్టెంబరు ఆఖరులో లేదా అక్టోబరు మొదటి వారంలో వస్తుందీ పండుగ.
ఆంధ్రదేశంలో పెళ్ళయిన స్త్రీలు అట్లతద్ది జరుపుకోవడం ఆనవాయితీ. ఈ పండుగ ఉద్దేశం ఏమిటో, ఎలా
జరుపుకుంటారో ఒకసారి గుర్తుచేసుకుందాం.
అట్లతద్ది జరుపుకునే ఆడవాళ్ళు తెల్లవారుజామున స్నానం చేసి, అన్నం తిని ఇక రోజంతా అభోజనంగా ఉంటారు. సాయంత్రం గౌరీదేవికి పూజ చేసుకుని, చంద్రుని దర్శించుకుంటారు. ఆ తర్వాత అట్లు తిని, ఉపవాసం విరమిస్తారు. అప్పుడు 11 రకాల కూరలతో పసందైన భోజనం చేస్తారు.
అట్లతద్దికి ముందురోజు కాళ్ళు, చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు.
గుమ్మాలకు తోరణాలు కడతారు. తెల్లవారుజామున నిద్ర లేచి, స్నానపానాదులు ముగించి పాలు పోసి వండిన పొట్లకాయ కూర, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, పెరుగులతో అన్నం తింటారు. ఆ తర్వాత సాయంత్రం వరకూ ఏమీ తినరు. ఆఖరికి మంచినీళ్ళు కూడా తాగరు.
అట్లతద్దినాడు పిల్లలు, స్త్రీలు ఉయ్యాల ఊగుతారు. పరవశంగా ఊయల ఊగుతూ
''అట్లతద్దోయ్.. ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్.. మూడట్లోయ్...''
లాంటి సరదా పాటలు పాడుకుంటారు.
గౌరీదేవికి కుడుములు, పాలతాలికలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు.
అట్లతద్ది నోము నోచుకునే ఆడవాళ్ళు 11 మంది ముత్తయిదువలను ఆహ్వానిస్తారు.
అట్లతద్ది నోము నోచుకునే స్త్రీలతోబాటు వాయనం అందుకునే స్త్రీలు కూడా పగలు ఉపవాసం ఉంటారు.
పూజలో చేతులకు చేమంతి, తులసిదళం, తమలపాకు మొదలైన పుష్పాలు, పత్రాలతో 11 ముడులు వేసి కట్టిన తోరాలు కట్టుకుంటారు.
పూజలో కలశం పెడతారు. పసుపుతో గౌరీదేవిని, గణపతిని చేసి ఉంచుతారు.
ఒక పళ్ళెంలో బియ్యం పోసి, మధ్యమధ్యలో డిప్పలు మాదిరిగా చేసిన కుడుములు ఉంచి, అందులో పసుపు కుంకుమలు వేస్తారు. మధ్యలో పుష్పాలతో అలంకరిస్తారు. దాన్ని కైలాసంగా భావిస్తారు.
పూజలో లలితా సహస్రనామం, గౌరీ అష్టోత్తరం పూర్తయిన తర్వాత అట్లతద్ది కథ చదువుతారు.
ఒక్కొక్కరికీ 11 అట్లు చొప్పున పెట్టి, పైన గౌరీదేవివద్ద పెట్టిన కుడుముల్లోంచి ఒక్కొక్కరికి ఒక్కొకటి పెట్టి, తాంబూలంతో వాయనం ఇస్తారు.
అట్లతద్ది నోములో వాయనం అందుకున్న స్త్రీలు, ఆ అట్లను వాళ్ళు లేదా వారి కుటుంబీకులు మాత్రమే తినాలి. వాయనంలో జాకెటు బట్ట ఇస్తారు. శక్తి ఉన్నవారు చీరలు పెడతారు.
వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి, అందులో వాయనం ఉంచి ఇస్తారు.
అందుకునే స్త్రీలు కూడా అంతే.
వాయనం ఇచ్చేటప్పుడు ఇలా సంభాషిస్తారు.
''ఇస్తినమ్మ వాయనం''
''పుచ్చుకుంటినమ్మ వాయనం''
''అందించానమ్మా వాయనం''
''అందుకున్నానమ్మా వాయనం''
''ముమ్మాటికీ ఇస్తినమ్మ వాయనం''
''ముమ్మాటికీ అందుకుంటినమ్మ వాయనం''
ఆంధ్ర దేశ విశిష్ట సాంప్రదాయాల్లో ''అట్లతద్ది'' జరుపుకోవడం ఒకటి. మనం జరుపుకునే అట్లతద్ది పండుగ ఉత్తర భారత దేశ స్త్రీలు చేసుకునే ''కార్వా చౌత్'' వేడుకతో సమానం. చిత్రమేమిటంటే రోమ్ లో కూడా ఇలాంటి ఆచారం ఉంది. జనవరి 21వ తేదీన వచ్చే ''సెయింట్ ఆగ్నెస్ ఈవ్'' మన అట్లతద్ది పండుగలాగే ఉంటుంది.
ఆడవాళ్ళు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్లతద్ది జరుపుకుంటారు. పశ్చిమ దేశాల ప్రభావంతో ''అట్లతద్ది'' లాంటి సంప్రదాయ పండుగలు జరుపుకునే ఆచారం సన్నగిల్లుతున్నప్పటికీ ఇంకా ఈ సంప్రదాయం మరుగున పడలేదు. ఇప్పటికీ చాలామంది పెళ్ళయిన స్త్రీలు ''అట్లతద్ది'' జరుపుకుంటున్నారు.
No comments:
Post a Comment