Thursday, March 8, 2012

హోళీ...వసంతకేళీ
















హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకాశించే రంగుల పండుగ. ఈ పండుగ రోజున, తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా ప్రకాసిస్తాయి, అక్కడ వివిధ రకాల రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది మరియు వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదే ఈ పండుగ విశేషము.

పురాణ కథలతో పాటుగా హోళి పండుగ వెనుక మరో పరమార్థం ఉంది. హోళి పండుగను వసంత ఋతువు ఆగమనంగా పౌర్ణమి రోజున జరుపుకుంటారు.ఇది చలి కాలం తొలగి పోయి ఎండాకాలం ఆరంభానికి నాంది ప్రస్థావన వంటిది. హోళి పండుగను సాధారణంగా ' ఫాల్గుణి పూర్ణిమ' నాడు జరుపుకుంటారు. ఇలా ఓక ఋతువు వెళ్ళి మరో ఋతువు వచ్చే సమయంలో ముఖ్యముగా శీతాకాలం 'చలి' పోయి ఎండాకాలం 'వేడి' వచ్చే సమయంలో ఉష్ణోగ్రతల తేడావల్ల చర్మం చిట్లుతుంది. రంగులు ఆ చిట్లటం వల్ల కలిగే చికాకును తగ్గిస్తాయి.

ప్రపంచంలోని రంగులన్నీ ఒకచోట కుప్ప పోశారా అన్నంత అందంగా, ఆహ్లాదంగా జరిగే హోళీ అంటే చిన్నా పెద్దా అందరికీ ప్రియమే! వయోభేదం, ఆడా, మగా అన్న తేడా లేకుండా అందరూ కలిసి ఓ పండుగలా జరుపుకునే హోళీ వివరాలు...

హోళీ ఎప్పుడు ప్రారంభమయిందంటే.... హోళీ పండుగ ఈనాటిది కాదు. ద్వాపర యుగంలోనే ఈ పండుగ జరుపుకున్నట్లు చారిత్రిక ఆధారాలున్నాయి. తన నెచ్చెలి రాధ తనకంటే తెల్లగా ఉంటుందని, తనది నలుపని కృష్ణుడు తల్లి యశోద దగ్గర వాపోతాడు. అప్పుడు యశోద కృష్ణుడికి ఓ సలహా ఇస్తుంది. రాధ శరీరం నిండా రంగులు పూయమని కన్నయ్యకు తరుణోపాయం చెబుతుంది. తల్లి సలహా మేరకు ఆ వెన్నదొంగ రాధను పట్టుకుని ఆమెమీద రంగులు కలిపిన నీటిని కుమ్మరిస్తాడు. దానికి ప్రతిగా రాధ కూడా కృష్ణుడిమీద వసంతం కుమ్మరిస్తుంది. అప్పటినుంచి స్నేహితులు, బంధువులు, ప్రేమికులు ఒకరిమీద మరొకరు రంగులు చల్లుకోవడం ప్రారంభమయింది.

కాముని దహనం

హోళీ పండుగ ముందురోజు కాముని దహనం చేస్తారు. ఈ విధానం హోళీ ముందురోజు చలిమంటలు వేయడానికి కూడా పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. హిరణ్యాకశపుని సోదరి, ప్రహ్లాదుని మేనత్త హోళిక. ప్రహ్లాదుడు తన అన్నను చంపించాడన్న కోపంతో ఇంట్లోనే మంటలు రగిల్చి అందులోకి ప్రహ్లాదుడిని తోసే ప్రయత్నం చేస్తుంది. ఆ మంటలు ప్రహ్లాదుని ఏమీ చేయకుండా, హోళికను మాత్రం దహించి వేస్తాయి. అలా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోళీకి ముందురోజు కాముని దహనం పేరుతో చలిమంటలు వేయడం ఆనవాయితీగా వస్తోన్న ఆచారం.

కాముని దహనానికి ఆ పేరు ఎలా వచ్చింది ?

ఓ సమయంలో ధ్యాన నిష్టలో ఉన్న శివునిపై మన్మథుడు పూలబాణాలు వేసి తపోభంగం కలిగిస్తాడు. తన తపస్సు భగ్నం చేసినందుకు శివుడు మన్మథుడిపై ఆగ్రహించి, తన త్రినేత్రంతో కాముడిని అంటే మన్మథుడిని భస్మం చేస్తాడు. తర్వాత రతీదేవి మొర ఆలకించిన శివుడు శాంతించి మన్మథుడిని తిరిగి బ్రతికిస్తాడు. దానికి గుర్తుగానే హోళీ పున్నమికి ముందు కాముని దహనం చేస్తారు. ఇక్కడ కామం అంటే కోర్కె, బాధ అనే అర్థాలు కూడా చెప్పుకుంటారు.
రంగు రంగుల హోళీ మన జీవితాల రసకేళీ అంటూ అందరూ ఆనందంగా జరుపుకొనే వసంతకేళి ఈ హోళీ
అందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు అందరూ ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని ఆశిస్తు.....


No comments: