సహస్ర శీర్ష శోభితాయ సత్యమూర్తయే నమః
సహస్ర దివ్యలోచనాయ జ్ఞానమూర్తయే నమః
సహస్ర పాదపంకజాయ సౌఖ్యదాయతే నమః
సహస్ర దివ్యనామరూప సంధృతాయతే నమః.
(శ్రీమదధ్యాత్మ రామాయణము, బాలకాండ - పండిత నేమాని రామజోగి సన్యాసిరావు)
భావము: వేయి శిరస్సులతో శోభిల్లుతున్న సత్యమూర్తీ! నీకు నమస్కారం. దివ్యమైన వేయి కన్నులను కలిగివున్న జ్ఞానమూర్తీ! నీకు నమస్కారం. వేయి పాదపద్మములతో విలసిల్లే సౌఖ్యప్రదాతా! నీకు నమస్కారం. దివ్యమగు వేయి నామరూపములతో విరాజిల్లువాడా! నీకు నమస్కారం.
క్షీరసాగరసుతా చిత్తాబ్జ మకరంద
పాన విలోలాయ తే నమోస్తు!
వేద సంస్తుత్యాయ! వేదాంతవేద్యాయ!
త్రిభువననాథాయ తే నమోస్తు!
భోగీంద్ర శయనాయ! యోగీంద్ర వరదాయ!
నానావతారాయ తే నమోస్తు!
సురబృంద పూజిత చరణసరోజాయ!
జ్ఞాననిధానాయ తే నమోస్తు!
ధర్మసంరక్షణ విధాన తత్పరాయ!
దినకరసహస్ర దీప్తాయ తే నమోస్తు!
చక్రరాజాయుధ ధరాయ! శాశ్వతాయ!
దీనలోక శరణ్యాయ తే నమోస్తు!
భావము: పాలసముద్రుని పట్టియైన మహాలక్ష్మి మనోపద్మములోని మకరందపానమందు ఆసక్తి కలిగినవాదా! నీకు నమస్సులు. వేదములచే స్తుతింపబడినవాడా! వేదాంతములచే తెలియబడువాడా! మూడులోకములకూ ప్రభువైనవాడా! నీకు నమస్సులు. ఆదిశేషునిపై పవళించినవాడా! యోగీంద్రులకు వరములు ఒసగువాడా! వివిధ అవతారములు ధరించినవాడా! నీకు నమస్సులు. దేవతల సమూహముచే పూజింపబడిన పాదపద్మములు కలవాడా! జ్ఞానమునకు నిధియైనవాడా! నీకు నమస్సులు. సదా ధర్మసంరక్షణయందే చిత్తమును నిలుపుకొన్నవాడా! వేయిసూర్యులతో సమానమైన తేజస్సు కలిగినవాడా! నీకు నమస్సులు. ఆయుధరాజమైన సుదర్శనచక్రమును ధరించినవాడా! శాశ్వతుడా! దీనులైన లోకులకు శరణము నొసంగువాడా! నీకు నమస్సులు.
Satyanaraayana piska garu rachinchina