Tuesday, February 17, 2015

మహాశివరాత్రి వ్రత కథ


మహాశివరాత్రి వ్రత కథ:-
********************
ఒకనాడు కైలాసపర్వత శిఖరముపై పార్వతీపరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోను ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. 
అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమనుదాని విశేషాలను తెలియజేస్తాడు. 
దీనిని మాఘబహుళచతుర్దశి నాడు ఆచరించవలెనని, తెలిసికాని, తెలియకగాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పుంచుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించెను.
ఒకప్పుడు ఒక పర్వతప్రాంతమున హింసావృత్తిగల వ్యాధుడొకడు వుండెను. 
అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు.
కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరి అడవియంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు.
చీకటిపడుతున్నా ఉత్తచేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. 
దారిలో అతనికొక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను, కాయలను విరిచి క్రింద పడవేయసాగెను. 
చలికి "శివ శివ" యని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను. 

మొదటిజామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. 
వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక 
"వ్యాధుడా! నన్ను చంపకుము" అని మనుష్యవాక్కులతో ప్రార్ధించెను. 
వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యులవలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను. 
దానికి జింక "నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను. 
హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని. 
దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవు, నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాపవిముక్తులౌదురని సెలవిచ్చెను.
నేను గర్భిణిని, అవధ్యను కనుక నన్ను వదలుము. 
మరొక పెంటిజింక ఇచటికి వచ్చును. అది బాగుగా బలిసినది, కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువుల కప్పగించి తిరిగివస్తాను" అని అతన్ని వొప్పించి వెళ్ళెను.
రెండవజాము గడిచెను. 
మరొక పెంటిజింక కనిపించెను. 
వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడువబోగా అదిచూచిన జింక భయపడి మానవవాక్కులతో 
"ఓ వ్యాధుడా! 
నేను విరహముతో కృశించియున్నాను. నాలో మేదోమాంసములు లేవు. 
నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక యొకటి రాగలదు. దానిని చంపుము, కానిచో నేనే తిరిగివత్తును" అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను.
మూడవజాము వచ్చెను. 
వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను. 
అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటిజింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞచేసి వెళ్ళినవి, నిన్ను నాకు ఆహరముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు.

ఆ మాట విని "నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను నా భార్య ఋతుమతి. 
ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞపొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను.
ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను. 
కొంతసేపటికి ఆ నాలుగు జింకలును వచ్చి నన్ను మొదట చంపుము, 
నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను.
అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. 
వానిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు. 
తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను.  
"ఓ మృగములారా ! 
మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. 
మృగములను బెదరించుట, బంధించుట, చంపుట పాపము. 
కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను. 
ధర్మములకు దయ మూలము. దమయు సత్యఫలము. 
నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. 
నేనిక సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను వదలిపెట్టుదును." అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ మాచరించి నమస్కరించెను.
అంతలో ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను.
దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి యిట్లనిరి :
ఓ మహానుభావా!
శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. 
ఉపవాసము, జాగరమును జరిపితివి, తెలియకయే యామ, యామమునను పూజించితివి, నీవెక్కినది బిల్వవృక్షము. దానిక్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగుపడి యున్నది. 
నీవు తెలియకయే బిల్వపత్రముల త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. 
సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. 
మృగరాజా! నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము."
ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను: 
దేవీ! 
ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. 
మూడు నక్షత్రములలో ముందున్న రెండూ జింకపిల్లలు, వెనుకనున్న మూడవది మృగి. ఈ మూడింటిని మృగశీర్ష మందురు. వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్జ్వలమైనది లుబ్ధక నక్షత్రము. అని చెప్పెను. ఓం నమః శివాయ 
rachana::Madhu Honey
జాజిశర్మ గారు చెప్పిన 

శివమహిమలు 

శివ మహిమలు
పూర్వం తండి అనే పేరుగల బ్రహ్మణుడుండేవాడు. అతడు బ్రహ్మచర్యం తీస్కుని అన్ని వేదాలు శాస్త్రాలు చదివి యోగి,ఙ్ఞాని,మహర్షి అయ్యడు. సమాధిలో ఉండి పదివేల సంవత్సరాలు తపస్సు చేసాడు.పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. తండి పరమేశ్వరుడ్ని చూసి ఆనందంతో ఓ పరమేశ్వరా! యోగీశ్వరులు ఎప్పుడూ ఎవరినైతే గొప్పవాడని స్తోత్రం చేసి ప్రధానమైనవాడని భావించి,పురుషుడని పూజ చేసి, అధిష్ఠాన దేవతని అర్చన చేసి, ఈశ్వరుడని ఎంచి ఉహిస్తారో అతడే నువ్వు,నువ్వు అజుడవి,అనాదినిధనుడివి,విభువుడివి, ఈశానుడివి, అత్యంతసుఖివి, అనఘుడివి, నిన్ను నేను భక్తితో శరణు కోరుతున్నాను అన్నాడు.
"పరమేశ్వరుణ్ణి చూసిన తండికి ఇంకా ఆనందం తగ్గక పరమేశ్వరా! కామక్రోధాలు నువ్వే,ఊర్ధ్వ అధోభొగాలు నువ్వే,బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు నువ్వే,నిత్యానదుడవు,పరమపదమవ్,దేహకర్తవు,దేహ భర్తవు,దేహివి,ప్రాణగతివి అన్నీ నువ్వే,జనన మరణాలు కలిగించేది నువ్వే. దిక్కులు,యుగాలు,ఆయనాలు నువ్వే ,రాత్రి పగలు చెవులు,కళ్ళుగా,పక్షాలు శిరస్సుగా మాసాలు భుజాలుగా, ఋతువులే వీర్యముగా,మాఘమాసం ధైర్యంగా,సంవత్సరాలు పాదాలుగా అంతట నువ్వే నిండిఉన్నావు".
ఈ విధముగా స్తోత్రం చేసిన తండి మహర్షి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు వత్సా! నువ్వు తేజశ్శాలివి,కీర్తిమంతుడివి ,ఙ్ఞానివి,ఋషుల్లో గొప్పవాడివి అవుతావు.నీకు ఏమి కావాలో అడగమన్నాడు. "ఈశ్వరా! నీ దయకంటే నాకు కావలసింది ఏమిలేదు. ఎప్పుడూ నాకు నీ పాదాల దగ్గరే భక్తితో ఉండేటట్లు అనుగ్రహించమన్నాడు తండి మహర్షి". తర్వాత తండికి ఒక ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుంటూ ఉండిపొయాడు. ఉపమన్యు మహర్షి తండి దగ్గరకు వచ్చి పరమేశ్వరుడి సహస్రనామాలు చెప్పమన్నాడు. ఇంతక ముందు దేవతలకి పదివేల నామాలు బ్రహ్మ చెప్పాడు. వాటి నుండి వెయ్యి నామాలు స్వర్గలోకంలో ఉన్నవాళ్ళకోసం బ్రహ్మ ఇచ్చాడు. భూలోక వాసులకోసం తండి వెయ్యి నామాలు భూలోకానికి తెచ్చాడు. దీన్నే "తండికృత శివసహర్సనామ స్తోత్రం' అన్నారు. ఆ వెయ్యి నామాలు గురించి తండి మహర్షి ఉపమన్యునికి చెప్పాడు. అందులో కొన్ని నామాలు మనం కూడా పలుకుదాము. అన్నీ ఎలాగో ఇప్పుడు చెప్పుకోలేము కనుక ..కొన్నిటిని స్మరించుకుందాము....

స్థిరుడు , స్థాణువు,ప్రభువు,భీముడు ,ప్రవరుడు,వరదుడు,వరుడు,సర్వాత్మ, జటి చర్మా శిఖండి,ఖచరుడు ,గోచరుడు మొదలు అయినవి.. ఇలా వెయ్యి నామాలు జపిస్తే అనుకున్న పనులు జరిగి ముక్తి పొందుతారు.మనకి కష్టం లేకుందా ముక్తి వచ్చే ఉపాయం తండి మహర్షి మనకి చెప్పారు. వాళ్ళు అందరు అంతంత తపస్సులు చేసి మనకోసం శివసహస్రనామ స్తొత్రం ఇచ్చి మనం సులభంగా ముక్తి పొందేలా చేశాడు, తండి మహర్షి ! ఋషులు ఎప్పుడు మానవళి కోసమే..లోకకల్యాణం కోసమే ఎదోకటి చెస్తారు..వాళ్ళకి మాత్రం ఏమి కోరుకోరు..ముక్తి తప్ప..అలాంటి మన ఋషులు అందరిని ఒక్కసారి స్మరించుకుని నమస్కరిద్దాము
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పేజి నుంచి... జ్ఞానసంబంధార్ కధ
మురుగ నాయనారు
మహాగ్రంథాలు - నాయనార్ల (శివభక్తులు) చరిత్రలు
-------------------------------------------------------
కావేరీనదీ జల సమృద్ధముచే సస్యసంపదలతో నభిరామమై యున్న చోళ రాజ్యము నందు హిమగిరి తనయతో వినోదించు గంగాధరునకు ప్రీతిపాత్రమై నందన వన సరోవర సమ్యుతమై అలరారు 'తిరుప్పహలూరు' (పూంపుహలూరు) అను నగరము గలదు. ఆ పురాతన దివ్యక్షేత్రము పవిత్రమైన తెల్లని విభూతి తేజముచే రాత్రింబవళ్లు ప్రకాశించుచు, సజ్జనుల మనస్సుల వలె జనులకు ఉపకరించుచుండెను. పావనమగు విభూతి పాపాముల నెల్ల బాపదా? తుమ్మెదలు వాలిన పూల నుండియే గాక సంకీర్తనమునకై గృహస్థులు పెంచు గోరువంకల నోళ్ల నుండి కూడ మధువొలుకు చుండెను. కొలనిలో పద్మములు వికసించుచు నీటి బిందువులు గార్చ, శ్రావ్యమైన సంకీర్తనము విని శివభక్తుల ముఖపద్మములు ఆనందబాష్పములు గార్చెను.
ఆ నగరములో భుజగభూషణుడగు శివుని గొల్చు ప్రాచీన బ్రాహ్మణ కుటుంబమున 'మురుగనారు' జన్మించెను. అతడు సర్వకాల సర్వావస్థల యందును నిష్కల్మమైన భక్తిచే అర్థమనస్కుడై యుండెను. మురుగనారు ప్రతిదినము ఉదయముననే లేచి, చల్లని నదీ జలములలో స్నానము చేసి, చెట్ల, పొలముల, కొలను, తీగల నుండి శివుని కర్పించు వివిధ హారములకు వలసిన పూలు గోసి, ఆ యా పుటికలలో (చిన్న బుట్టలు) నింపెడి వాడు. పూర్వము త్రిపురాసురులను హతమార్చుటకు శివుడు బంగారు (మేరు) పర్వతమును విల్లుగాను, సర్పమును నారిగను నుపయోగించెను; కాని శివుని పెదవుల వెలువడు మందహాసము ఈ పనికి చాలదా! మురుగనారు, ఈశ్వరునికి చేయు వివిధ అలంకారముల కనువుగా, పూలను ఏర్చి, కూర్చి, మాలలను కట్టి అర్పించువాడు. ఈ ప్రియమైన నిత్యకృత్యమును అతడు నిష్ఠగా జేయుచుండెను.
ఆ యా వేళల జరుగు స్వామి సేవలకు తగినట్లు మురుగనారు, పూలమాలికలను నలుగకుండ నెమ్మదిగ ఆలయమునకు గొనిపోయి తానే స్వయముగ స్వామికి ధరింపజేసి, పంచాక్షరిని పఠించుచు పూజించువాడు.
దీనికి తోడు మురుగనారునకు, ఉమాదేవిచే బంగారు గిన్నెలో జ్ఞానామృతమును గ్రోల్చిన పుణ్యమూర్తి, జ్ఞాన సంబంధర్‌ గానము జేసిన ఊరిలోని వర్ధమానేశ్వరునకు మురుగనారు పూజలు చేసెను.
ఒకరోజు తిరుజ్ఞానసంబంధార్‌ ఆ వూరికి వచ్చాడు. మురుగనాయనారు ఆ శివభక్తుని తన ఇంటికి ఆహ్వానించి మనసారా పూజించాడు. జ్ఞాన సంబంధార్ నాయనారు మురుగనాయనారుని చూసి ముచ్చట పడ్డాడు. గాఢ స్నేహితుడిగా స్వీకరించాడు. సంబధారు వివాహ మహోత్సవానికి హాజరయ్యే భాగ్యం నాయనారునకు సంభవించినది. ఆ వివాహ మహోత్సవానికి కారణము - సంబంధారు తొలత వివాహము నిరాకరించినాడు. కాని అచ్చట నున్న బ్రాహ్మ్ణణులు - అందరును - సంబంధారునకు నమస్కరించి "దేవరవారు వేదగమము స్థాపనకు అవతరించారు. వేదాగమము ప్రకారము వివాహము చేసికొనుట ధర్మమన్నారు". దానికి అడ్డుచెప్పలేక జ్ఞాన సంబధనాయనారు వివాహమునకు అంగీకరించారు. తిరునల్లూరు నంబండారునంబి కుమార్తెతో వివాహమయ్యెను. కళ్యాణమయ్యాక సంబందారు దేవుని నుతింపగ పరమశివుడు "నీవును, నీ భార్యయు, ఈ పెండ్లికి వచ్చిన భక్తులును నీ యెదుటనున్న జ్యోతిలో ప్రవేశింపుడు" అని ఆనతిచ్చాడు. చూడగ ఎదుట శివసన్నిది మొదలు ఆకాశము వరకు జ్యోతి కనిపించినది. అప్పుడు భార్యతో సహా జ్ఞానసంబధారు ప్రథముడుగా అచ్చట గల భక్తులు మురుగనాయనారుతో సహా ఆ జ్యోతిలో ప్రవేశించి శివసాయుజ్యమును పొందారు. మురుగనాయనారు దివ్యజ్యోతిని ప్రవేశించి, మహేశ్వర దివ్యపాదారవిందములను జేరి ధన్యుడయ్యెను.

భక్తితో చేసిన నిరాడంబర సేవ ఎట్లు నాగాభరణుడైన శివుని అనుగ్రహార్హత పొందునో ఇందు నిరూపితమైనది.

ఓం నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ, మహదేవాయ,
త్ర్యంబకాయ,త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ,
కాలాగ్నిరుద్రాయ, నీలాకంఠాయ, మృత్యుంజయాయ,
సర్వేశ్వరాయ, సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః

No comments: