Friday, May 9, 2014

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి





ఈ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. ఆమెకు శతకోటి నమస్కారములు !
కన్యక లేదా వాసవి కన్యకా పరమేశ్వరీదేవి పేరుతో కుసుమశ్రేష్టికి పుత్రికగా జన్మించి విష్ణువర్ధనుడు అనే అహంకార రాజ్యాధిపతితో వివాహానికి అంగీకరించక ఆత్మత్యాగం చేసుకొనుట ద్వారా వైశ్యులకు కన్యకా పరమేశ్వరి ఆరాద్య దైవంగా నిలిచిన యువతి. ఈమె దైవాంశ సంభూతురాలని ఆమె మరణానికి ముందు ఆమె దైవాంశను అందరూ దర్శించారని వాసవిదేవి గాధలలో వ్రాయబడి ఉన్నది.
విష్ణు వర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుగొండకి విచ్చేయగా కుశుమ శ్రేష్టి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదిక పై సన్మానాన్ని జరిపాడు. ఇంతలో విష్ణువర్ధునుడి దృష్టి జన సమూహంలో ఉన్న వాసవిపై పడింది. ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపాడు. విష్ణువర్ధుని కోరిక కుశమ శ్రేష్టికి శరాఘాతం అయింది. ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు, అలా అని కాదనలేడు. దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు, వయసులో తన కూతురి కంటే చాల పెద్దవాడు, వారి కులాలలో అంతరం ఉంది. ఇవి తల్చుకుని ఆయన చాల ఒత్తిడి కి లోనయ్యాడు. తన కుటుంబ సభ్యులతోను, స్నేహితులతోను చర్చించగా, అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు. వాసవి తను జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది.
కుశుమ శ్రేష్టి ఈ విషయాన్ని విష్ణువర్ధునుడికి వర్తమానాన్ని పంపాడు. దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాదు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ, దాన, భేద, దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు.
ఇలాంటి విపత్కర పరిస్థితులలో కుశుమ శ్రేష్టి భాస్కరాచుర్యుల సమక్షంలో 18 నగరాలకి చెందిన 714 గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచాయి. 102 గోత్రాలకు చెందిన ముఖ్యులు పిరికివారు ప్రతి రోజు మరణిస్తారు, పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుంది, కాబట్టి పోరాటమే సరైనది అని అభిప్రాయ పడగా, మిగిలిన 612 గోత్రాల వారు మాత్రం రాజుతో పెళ్ళి చేస్తేనే అందరికి మంచిది అని అభిప్రాయ పడ్డారు.
భాస్కరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ మాటలు కుశుమ శ్రేష్టికి మార్గదర్శక ప్రోత్సాహకాలుగా పని చేసాయి. తన పక్షంలో కేవలం కొంత మంది మాత్రమే ఉన్నప్పటికి, తన కూతురిని రాజుకి ఇచ్చి ఎట్టి పరిస్థితులలోను పెళ్ళి చేయ రాదని నిశ్చయానికి వచ్చాడు. రాజు మాత్రం దెబ్బతిన్న పాములా పగపట్టి, తన శత్రువులను తుదముట్టించడానికి, తన సమస్త సేనలను కూడదీసుకుని సంసిద్ధం అయ్యాడు. ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుగొండలో ఉన్న 102 గోత్రాలకు సంబంధించిన వారు ఆయత్తమవుతున్నారు.
వాసవి సూచనలను అనుసరించి, గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజబటులు 103 అగ్ని గుండాలను ఏర్పాటు చేసారు. నగరం అంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది. అప్పుడు వాసవి ఆ 102 గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలలో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్పూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేసారు. వారు వాసవిని దేవుని అంశగా అనుమానించి, తమకి నిజ రూపాన్ని చూపమని కోరారు.
ఆమె నవ్వి తన నిజ స్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి నేను ఆది పరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతరాన్ని అని చెప్పింది. ధర్మాన్ని నిల్పేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధునుడిని అంతం చేసేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలి యుగంలో జన్మించానని చెప్పింది. సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా చితి మంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలో కి దూకి పుణ్య లోకాలని చేరుకుంటాను అని చెప్పింది. కుశుమ శ్రేష్టి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని. ఆయన తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు. అందుకే మీ అందరిని కూడా ఆత్మ బలి దానానికి పురి కొల్పాను అని అంది. ఆమె అక్కడ చేరిన వారికి దేశ భక్తి, నిజాయితి, సమాజ సేవ, సహనం మొదలగు వాటి గురించి వివరించింది.
ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షం అయింది. అప్పుడు వాళ్ళంతా తమ ఇష్ట దైవాలను తల్చుకుని అగ్ని గుండంలో దూకారు. విష్ణు వర్ధునుడికి దుశ్శకునాలు ఎదురైనప్పటికి తన సేనతో పెనుగొండ పొలిమేరాల్లో ప్రవేశించాడు. అప్పుడు చారులు అప్పటి వరకు జరిగిందంతా రాజుకి చెప్పారు. ఆ నిజాన్ని విని హృదయం ముక్కలైపోయింది. రక్తం కక్కుని అక్కడికక్కడే మరణించాడు. వాసవి చేసిన ఆత్మ త్యాగం, విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం అంతా మార్మోగిపోయింది. విష్ణు వర్ధునుడి చర్యలను ఖండించి, ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి మరియు ఆమె అనుచరులను కొనియాడారు.

No comments: