Thursday, May 15, 2014

లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం
























చందనోత్సవం

‘‘కుందాభనుందరతనుః పరిపూర్ణచంద్ర,
బింబానుకారి వదనో ద్విభుజస్ర్తినేత్రః
శాన్తస్ర్తిభంగి లలితః క్షితిగుప్తపాదః, సింహాచలే
జయంతి దేవవరో నృసింహః’’

శ్రీ సింహాచల క్షేత్రంలో వెలసిన శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం. సంవత్సరానికి ఒక్కరోజున అంటే ఈ వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే ఆ స్వామి నిజరూప దర్శనం లభిస్తుంది. సంవత్సరమంతా చందన లేపనంతో ఉండే స్వామి ఈ ఒక్కరోజు మాత్రం నిజరూపంతో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ నిజరూప దర్శనం కోసం దేశం నలుమూల నుంచి ఎందరో భక్తులు వస్తారు. ఆ సింహాచలేశుని చందన యాత్రకి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

ఈ చందన యాత్ర వెనుక, విష్ణుమూర్తి నారసింహావతారం ధరించటం వెనుక ఓ కథ చెబుతారు. రాక్షణ రాజైన హిరణ్యకశిపుడు భ్రహ్మకోసం తపస్సు చేసి ఏ విధంగానూ తనకి మృత్యువు రాకుండా వరం పొందుతాడు. ఆ వరగర్వంతో లోకాలన్నింటినీ హింసించడం మొదలుపెడతాడు. అతని ఆగడాలను భరించటం కష్టమైన సమయంలో ముల్లోకవాసులు విష్ణువుకు మొరపెట్టుకుంటారు. అప్పుడు వారిని హిరణ్యకశిపుడు పెట్టే బాధలనుంచి రక్షించటానికి, బ్రహ్మ ఇచ్చిన వరాలకు భంగం కలగకుండా నరుడి దేహం, సింహపు తలతో నరసింహావతార మెత్తుతాడు విష్ణుమూర్తి. ఆ రూపంతో హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఆ సంహారం మహోగ్రంగా సాగుతుంది.

ఆ తరువాత ఆ ఉగ్రం వెంటనే శాతించదు. అప్పుడు బ్రహ్మాది దేవతలు భక్తుడైన ప్రహ్లాదునికి ఓ సలహా ఇస్తారు. బ్రహ్మదేవునికి ఓ విషయం గుర్తుకు వస్తుంది. శ్రీచందన వృక్షానికి ఉగ్రత, ఉష్ణం, తాపం తగ్గించే శక్తి వుంది. కాబట్టి ఆ స్వామి ఉగ్రాన్ని శ్రీ చందన లేపనంతో శాంతింప చేయమని ప్రహ్లాదునికి సలహా ఇస్తాడు బ్రహ్మ. ఆ మాటను అనుసరించి ప్రహ్లాదుడు చందనం తెప్పించాడు. ఆ పరిమళంలోని చలువ పరిసరాలలో ప్రసరించగానే ఆ ఉగ్రమూర్తి శాంతించ సాగాడు. ఇక అప్పుడు ప్రహ్లాదుడు ఆ స్వామిని ప్రార్థిస్తూ చందనం పూయటంతో పూర్తిగా శాంతించాడట ఆ ఉగ్రనరసింహుడు. ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని నరసింహ రూపంలోనే ప్రస్తుతం సింహాచలంగా పిలుస్తున్న సింహగిరిపై ప్రతిష్టించాడని భక్తుల నమ్మకం.

ప్రతీ ఏటా వైశాఖ శుద్ధ విదియనాడు రాత్రి ఆ విగ్రహానికి ఉన్న పాతచందనం అంతా పూర్తిగా ఒలిచివేస్తారు. తదియనాడు స్వామికి సహస్ర ఘటాభిషేకం, ఆ పైన విశేషపూజలు జరుపుతారు. ఈ ఒక్కరోజు భక్తులు వరాహ, నారసింహ రూపంలో ఉన్న స్వామిని దర్శించుకోగలుగుతారు. తిరిగి స్వామివారి చందన లేపనంతో చందనోత్సవం పూర్తవుతుంది. వచ్చే సంవత్సరం చందనోత్సవం లోపు నాలుగుసార్లు స్వామికి చందన లేపనం చేస్తారు. దానిని కరాళ చందన ఉత్సవం అంటారు. సింహాచలం చూసి తీరవలసిన క్షేత్రం. సంపెంగి పూల పరిమళాలతో, ప్రశాంతమైన వాతావరణంలో, ఎత్తైన కొండపై ఉన్న ఈ ఆలయం పడమటి ముఖంగా ఉంటుంది. ఇలా ఉన్న ఆలయాన్ని దర్శించటం వల్ల విజయం సిద్ధిస్తుందని చెబుతారు పెద్దలు. ఆ ప్రాంతవాసులు ఆపదలు తీర్చి ఆదుకునే 'అప్పన్న'గా పిలుస్తారు. ఈ రోజంతా అక్కడ అప్పన్న నామం ప్రతిధ్వనిస్తూ వుంటుంది. ఆ స్వామి నిజరూప దర్శనం సకల పాప హరణమని భక్తుల నమ్మకం. 


రేపు అప్పన్న చందనోత్సవం

తెల్లవారుజాము 4 నుంచే సాధారణ భక్తులకు దర్శనాలు
రాత్రి 7 గంటల వరకే క్యూల్లోకి ప్రవేశం
విస్తృత ఏర్పాట్లు చేపట్టిన ఆలయ వర్గాలు
సింహాచలం, న్యూస్‌లైన్ : సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం శుక్రవారం అంగరం వైభవంగా జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. వరాహ, నృసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని 12 మణుగులు (500 కిలోలు) చందనంతో ఏడాదంతా నిత్య రూపంతో దర్శనమిచ్చే స్వామి, ఏటా వైశాఖ శుద్ధ తదితయనాడు మాత్రమే నిజరూప దర్శనమిస్తారు.

 నాలుగు విడతలు చందనం సమర్పణ
 ఏడాదిలో నాలుగు విడతలుగా మూడు మణుగుల (120 కిలోలు) చొప్పున చందనాన్ని స్వామికి సమర్పిస్తారు. చందనోత్సవం రోజు రాత్రి, వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మరో మూడు విడతలుగా మూడేసి మణుగుల చొప్పున చందనాన్ని సమర్పిస్తారు.
     
 అర్ధరాత్రి నుంచి వైదిక కార్యక్రమాలు ప్రారంభం

పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం గురువారం అర్ధరాత్రి 12.30 నుంచే వైదిక కార్యక్రమాలను అర్చకులు ప్రారంభిస్తారు. శుక్రవారం తెల్లవారుజాము 3.30 గంటలకు దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజు తొలి దర్శనం చేస్తారు. అనంతరం 4 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనాలు అందజే స్తారు. రాత్రి  8.30 గంటల నుంచి శ్రీ వైష్ణవస్వాములు సహస్రఘట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. సింహగిరిపై ఉన్న గంగధార వద్ద నుంచి వెయ్యి కలశాలతో నీటిని తీసుకొచ్చి స్వామి నిజరూపాన్ని అభిషేకిస్తారు. 108 వెండి కలశాలతో పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు. అనంతరం స్వామికి తొలివిడత చందనాన్ని (125 కిలోలు) సమర్పించి మరల నిత్య రూపభరితుడ్ని చేస్తారు.
http://www.sakshi.com nundi sekarana

No comments: