Sunday, March 10, 2013

అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు...


అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు... 

హిందూమతము సంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారము, పురాణాలలో చెప్పిన ప్రకారము త్రిమూర్తులు, అనగా ముగ్గురు దేవుళ్ళు ప్రధాన ఆరాధ్యదైవాలు. వారు

* బ్రహ్మ - సృష్టికర్త
* విష్ణువు - సృష్టి పాలకుదు
* మహేశ్వరుడు - సృష్టి లయ కారకుడు

ఇది స్థూలంగా చెప్పబడే విషయం. ఇక వివరాలకొస్తే వివిధ సంప్రదాయాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కధలు, నమ్మకాలు, ఆరాధనామార్గాలు మారుతుంటాయి.

శివుని పుట్టుక గురించి అనేక కథలు ఉన్నాయి. విష్ణు పురాణంలో శివుడు బ్రహ్మ కుమారుడని ఉన్నది. మధు, కైటభులు అను రాక్షసులు బ్రహ్మను చంపటానికి రాగా, విష్ణువు వారిని తీక్షణంగా చూస్తాడు. ఆ సందర్భములో విష్ణువు నుదుటి నుండి శివుడు త్రిశూలాన్ని ధరించి జన్మించాడని మరొక ఇతిహాసములో ఉన్నది.

మరొక ఇతిహాసములో.. "బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులగు త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆది పరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరీ దేవి. అప్పుడు రాజరాజేశ్వరీ దేవికి మూడవ నేత్రం ఉండేది. అనంతరం, తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగా కోరింది. మొదట ముగ్గురూ నిరాకరించారు. ఆమె నచ్చచెప్పిన పిమ్మట, శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి, ఒక షరతు పెట్టాడు. అది, తనను (ఆది పరాశక్తిని) వివాహమాడిన అనంతరం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి, వివాహానంతరం శివునికి మూడవ నేత్రమును ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రముతో ఆ దేవతను భస్మం చేసి, ఆ భస్మరాశిని మూడు భాగాలుగా విభజించి, లక్ష్మి, సరస్వతి, పార్వతిలను సృష్టించాడు." అని ఉన్నది.

శివసిద్ధి :

ఆధ్యాత్మిక జీవితానికి అంకితమైన అనేకమంది ద్వంద్వ భావాలతో సందేహాలతో సతమతమవుతుంటారు. ముఖ్యంగా 'నేను' అనే భావననుంచి, దానికి సంబంధించిన 'అహంకారం'నుంచి బయటపడేందుకు బహువిధాలుగా ప్రయాస పడుతుంటారు. మాయ ఎంత బలీయమైనదంటే- ఒక్క క్షణంలోనే చంచలత్వాన్ని మనసులోకి ప్రవేశపెట్టేస్తుంది. అయోమయం ఆవహింపజేస్తుంది. మహాత్ములు సైతం తమ సాధనా కాలంలో ఈ దురవస్థలతో బాధపడినవారే.

సాక్షాత్తు శివాంశ సంభూతునిగా చెప్పుకొనే ఆదిశంకరులకూ ఇలాంటి అవస్థ ఒకసారి కలిగింది. మార్గంలో ఒక చండాలుడు ఎదురైనప్పుడు ఆదిశంకరులు ఏవగింపుతో 'తప్పుకో... తప్పుకో...' అని మందలించగా, అతడు నవ్వుతూ 'స్వామీ! తమరు దేన్ని తప్పుకోమంటున్నారు? అశాశ్వతమైన ఈ శరీరాన్నా, అనంతస్వరూపమైన ఆత్మనా?' అని ప్రశ్నించాడు. తక్షణం ఆదిశంకరుల్లో అజ్ఞానపు తెర మటుమాయమైంది. తదనంతర కాలంలో ఆయనలోంచి శివతత్వం గంగా తరంగాలుగా ప్రవహించింది. శివానందలహరి, సౌందర్యలహరి, భజగోవిందం వంటి అనితర సాధ్యమైన రచనలను భక్త లోకానికి అందించారు.

'శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు' అనటంలోని ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే. సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే. శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం. శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం. శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం. శివమే సర్వజగత్తులకు మూలాధారం. అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవజన్మ, ముక్తి సోపానానికి ముందుమెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు.

శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం ఏమిటంటే- శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు, శివుని పూజించే చేతులే చేతులు. శివుని సదా స్మరించేవాడే ధన్యుడు.

పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్న ఆదిశంకరులను 'నీవెవరు?' అని అడిగినప్పుడు- 'చిదానంద రూపం శివోహం శివోహం'- నేను చిదానంద స్వరూపుడనైన శివుణ్ని. మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు. అదే 'శివసిద్ధి'. అంటే, సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి, తనను తాను చూసుకున్నప్పుడు, తాను ఆత్మననీ, అనగా సాక్షాత్తు శివస్వరూపమని గ్రహిస్తాడు. పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురుశుశ్రూషలు- ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే.

శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచటానికే- బిల్వార్చన, రుద్రాక్షధారణం, విభూతి లేపనం, అభిషేకంవంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసం ఏర్పరచాడంటారు.

జీవితకాలంలో మన ప్రతి చర్యనూ శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతుండాలి. అప్పుడు మనం సదా శివసాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అదే పరమపదం.పౌరాణిక వాఞ్మయంలో ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యంగల పవిత్రదినం. ప్రతి నెలా బహుళ చతుర్దశి నాడొచ్చేది మాస శివరాత్రి. ఉపవాసం, శివార్చన, జాగరణ... శివరాత్రినాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. శివరాత్రి నాటి అర్ధరాత్రి సమయంలో శివలింగ ప్రాదుర్భావం జరుగుతుందంటారు. లింగం నిర్గుణోపాసనకు, శివస్వరూపం సగుణోపాసనకు సంకేతాలు.

స్కాంద పురాణంలోని ఈశాన సంహితలో ఓ కథ ఉంది. బ్రహ్మ, విష్ణువులోసారి ఒకరి కంటే ఒకరు అధికులమన్న అహంతో పరస్పరం కలహించుకుని తీర్పు కోసం పరమ శివుణ్ని అర్థించారట. శివుడు వారి మధ్య మహాగ్నిస్తంభాన్ని ఆవిర్భవింపజేశాడు. దాని ఆద్యంతాలు తెలుసుకురమ్మని వారిరువురినీ పంపాడు. బ్రహ్మ హంస రూపంలో వెళ్ళి అగ్రభాగాన్ని కనుగొనలేక వెనుదిరిగి వచ్చాడు. విష్ణువు శ్వేతవరాహ రూపంలో ఆ మహాలింగం మూలం తెలుసుకునే యత్నంచేసి, తానూ భంగపడ్డాడు. ఇదే లింగోద్భవ కథనం.

గుణనిధి అనే ఓ దుర్వ్యసనపరుడు నేరం చేసిన భయంతో కాకతాళీయంగా శివరాత్రినాడు శివాలయంలో శివలింగం వెనుక దాగివుండి, కొండెక్కుతున్న దీపం వత్తిని ఎగదోసి, తన ఉత్తరీయపు పోగుల్ని తెంచి దానికి జతచేసి ఆవునెయ్యి పోసి దీపప్రజ్వలనం కావించాడు. తెల్లవార్లూ భయంతో మేలుకొని ఉండి తెల్లారాక తలారి బాణపు దెబ్బకు మరణించాడు. బతుకంతా దుశ్శీలుడై నడిచినా ఆ శివరాత్రి నాడు దైవసన్నిధిలో ఉపవాసం, జాగరణ తనకు తెలియకుండానే చేసిన మహా పుణ్యకృత్య ఫలితంగా మరుజన్మలో కళింగ రాజు అరిందముడికి పుత్రుడై జన్మించి, దముడనే పేరుతో మహారాజై తన రాజ్యంలోని శివాలయాలన్నింటిలో అఖండ దీపారాధనలు చేయించి, ఆపై కుబేరుడిగా జన్మించి, ఉత్తర దిక్పాలకుడై శివుడికి ప్రాణసఖుడయ్యాడన్న కథ శ్రీనాధుడి కాశీఖండంలో ఉంది.

శ్రీరాముడు లంకపైకి దండెత్తే ముందు సాగర తీరాన ఇసుకతో శివలింగం చేసి పూజించాడు. ఆ సైకతలింగ క్షేత్రమే నేటి రామేశ్వరం. లంకాధీశుడు తన పది తలలు కోసి శివుణ్ని ప్రసన్నం చేసుకున్నదీపర్వదినానే అని చెబుతారు. జాంబవతికి సత్సంతానాన్ని ప్రసాదించమని ఇదే రోజున శివుణ్ని శ్రీకృష్ణుడు ప్రార్థించాడనీ కథనం వ్యాప్తిలో ఉంది.

'శివ' అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. 'శ' అంటే శివుడనీ, 'వ' అంటే 'శక్తి' అనీ శివ పదమణిమాల చెబుతోంది. శివరాత్రి వేళ అభిషేకప్రియుడైన శివుడి పార్థివ లింగాన్ని మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో, నమక చమకాలతో, పురుష సూక్తంతో పూజిస్తారు. మొదటిజాములో పాలతో, రెండో జాములో పెరుగుతో, మూడో జాములో నెయ్యితో, నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి, రుద్రాక్షమాలతో 'ఓం నమశ్శివాయ' అనే పంచాక్షరీ మంత్రం జపిస్తూ శివపురాణ పారాయణ చేస్తారు.

క్షీరసాగర మధన సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ పెల్లుబికి వచ్చిన ఘోర కాకోల విషాగ్నుల నుంచి లోకాన్ని రక్షించవలసిందిగా దేవగణం వేడుకోగా, శివుడా గరళాన్ని గళాన నిలిపి ముల్లోకాలను కల్లోలం నుంచి కాపాడాడు. ఆ కాళరాత్రే శివరాత్రి. 'నిర్ణయ సింధు'లోని నారద సంహితలో శివరాత్రి వ్రత విధానం పేర్కొని ఉంది.

మార్కండేయుడు, నత్కీరుడు, సిరియాళుడు, చిరుతొండనంబి, తిన్నడు, శక్కనైనారు, అక్కమహాదేవి, బెజ్జమహాదేవి వంటి ఎందరో శివభక్తుల అమేయ భక్తిగాథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి.

రాముడికి 'పంచాక్షరి'ని ప్రబోధించి రామనామం జపించాడు సాంబశివుడు. రాముడు శివనామం జపించాడు. అందుకే 'శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే' అన్నారు. భగవంతుడు, భాగవతుడు తానేనన్న సనాతన ధర్మసూత్ర ప్రసూనం వెదజల్లే ఈ అద్వైత సుమగంధం సర్వులకు ఆఘ్రాణయోగ్యం. ఇది భక్తగణ భాగ్యం. శివభక్తులే నాకిష్టులని రాముడంటే, రామభక్తులే నాకిష్టులన్నాడు హరుడు. మంత్ర బీజాక్షరాలలో ప్రధమాక్షర బీజం 'ఓం'కారమే సదాశివుడు.

ఏటా అయిదు రకాలైన శివరాత్రులొస్తాయి. 1. నిత్య శివరాత్రి: ప్రతిరోజూ శివారాధాన చేస్తారు. 2. పక్ష శివరాత్రి: ప్రతినెలా శుద్ధ, బహుళ చతుర్దశులలో శివార్చన చేస్తారు. 3. మాస శివరాత్రి: ప్రతినెలా బహుళ చతుర్దశినాడు మాసశివరాత్రి. 4. మహాశివరాత్రి: మాఘ బహుళ చతుర్దశినాటి సర్వశ్రేష్ఠమైన శివరాత్రి. 5. యోగశివరాత్రి: యోగులు యోగసమాధిలో ఉండి చేసే శివచింతన.

దేవుడికి అతి సమీపంలో వసించడమే ఉపవాసం. మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే. వాటన్నింటికీ దూరంగా ఉండటమే నిజమైన నియంత్రణం. అదే నిజమైన ఉపవాసం. భౌతికాభిరుచులన్నింటినీ పక్కకు పెట్టి పూర్తిగా శివ సంబంధమైన కార్యక్రమాల్లోనే త్రికరణ శుద్ధిగా తాదాత్మ్యం చెందాలి. భోగానందాన్ని విస్మరించి, యోగానందావస్థలోకి ప్రవేశిస్తూ కోటి వెలుగుల ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో ఆవిష్కరించుకుని సచ్చిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయడమే మహాశివరాత్రి ఆంతర్యం!


రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తుతూ మహాదేవుని ఆశువుగా చేసిన స్తోత్రం.

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకారచండతాండవంతనోతునశ్శివశ్శివం

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ
విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధని
ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే
కిశోరచంద్రశేఖరేరతి:ప్రతిక్షణంమమ


ధరాధరేంద్రనందినీ విలాసబంధుబంధుర
స్పురద్ధిగంతసంతతి ప్రమోదమానమానసే
కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తునీ

జటాభుజంగపింగళ స్ఫురత్ఫనామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిహ్వధూముఖే
మదాంధసింధురస్ఫుర త్వగుర్తరీయమేదురే
మనో వినోదమద్భుతంభిభర్తుభూతభర్తరి


సహస్రలోచన ప్రభుత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీవిధూసరాంఘ్రిపీఠభూ:
భుజంగరాజమాలయానిబద్ధజాటజూటక:
శ్రియైచిరాయ జాయతాం చకోరబంధుశేఖర:

లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా
నిపీతపంచసాయకంనమన్నిలింపనాయకం
సుధామయూఖలేఖాయావిరాజమానశేఖరం
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తున:


కరాళ ఫాలపట్టికా దగద్ధగద్ధగజ్జ్వల
ద్ధనంజయాహుతీకృతప్రచండపంచసాయకే
ధరాధరేంద్రనందినీ కుచాగ్రచిత్రపత్రక
ప్రకల్ప నైకశిల్పిని త్రిలోచనే రతిర్మమ

నవీన మేఘమండలీ నిరుద్ధధుర్ధరస్ఫురత్
కుహూ నిశీధినీ తమః ప్రబంధ బద్ధకంధరః
నిలింపనిర్ఝరీ ధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః


ప్రపుల్లనీలపంకజ ప్రపంచకాలిమప్రభా
వలంబి కంఠకందలీ రుచుప్రబద్ధకంధరం
స్మరచ్ఛిధం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే

అఖర్వసర్వమంగళా కళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతం
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే


జయత్వదభ్రవిభ్రమ భ్రమద్భుజంగ మశ్వస
ద్వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళఫాలహవ్యవాట్
ధిమిద్ధిమిద్ధిమిద్ధ్వనన్మృదంగతుంగతుంగమంగళ
ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవశ్శివః

దృషద్విచిత్రతల్పయో ర్భుజంగమౌక్తికస్రజో
ర్గరిష్ఠరత్న లోష్టయోః సహృద్విపక్ష పక్షయో:
తృణారవింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః
సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహమ్


కదానిలింపనిర్ఝరీ నికుంజకోటరేవసన్
విముక్తదుర్మతిః సదాశిరఃస్థమాంజలింవహన్
విలోలలోలలోచనో లలామఫాలలగ్నకః
శివేతిమంత్రముచ్ఛరణ్ సదాసుఖీ భవావ్యహం

నిమగ్ని నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్ స్మరన్ బృవన్ నరో విశుద్ధమేతిసంతతం
హరేగురౌ సుభక్తిమాశుయాతినాం యధాగతిం
విమోహనం హి దేహినాంసు శంకరస్య చింత
నం

ఫలస్తుతి

పూజావసానసమయే దశవక్తంగీతం
యః శంభుపూజనపరం పఠతిః ప్రదోషే
తస్యస్థిరాం రదగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీంసదైవసుముఖీం ప్రదదాతి శంభుః.telugupandagalu.blogspot,....wikipedia...సౌజన్యంతో
 — withనరసింహ శర్మ గారు

No comments: