పాముని చూడగా బెదిరి పాకిన చోటన మంత్ర అక్షతల్
భూమిని చల్లగా విషము పోవును లొంగును భక్తికిన్ మరిం
పాములు దుష్ట జంతువని భావము మాత్రమే కాని తప్పదే
కామిత సంతతిచ్చరయగా అవిదేముడే ! కొల్వుడీప్రజల్.
దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చవితిని "నాగులచవితి " పండుగ అంటారు. ఇంతకీ, ఈ విషనాగులను మనం పూజించటమేమిటి ? అన్నప్రశ్న వెంటనే తలెత్తుతుంది చాలామందిలో. ఈ పండుగలోని ఆంతర్యమేమిటో ఒక్కసారి పరిశీలిద్దాము.
ప్రకృతికి-జీవికి మధ్య మనకు ఎంతో అవినావ భావ సంబంధము కనిపిస్తూ ఉంటుంది. మనం నిశితంగా పరిశీలించ గలిగితే ప్రకృతినుండి మానవుడు తనకు కావలసింది పొందుతూ తిరిగి ఆ ప్రకృతిని సంరక్షించుకునే బాధ్యతను కూడా నాటి ఆటవిక స్ధాయినుండి, నేటి నాగరిక సమాజం వరకూ ఆ ప్రకృతిని దైవ స్వరూపంగా మానవులు భావించి సంరక్షించుకుంటూ ఉన్నంతకాలం సమస్త మానవకోటికి మరియు జీవకోటి మనుగడకు ముప్పుమాత్రం వాటిల్లదు. ఆ ప్రకృతిని మానవుడు చేజేతులారా కనుక నాశనం చేసుకుంటే ఇటు మానవకోటికి అటు జీవకోటికి తప్పక వినాశానికి దారితీస్తుందను భావముతో నేడు "ప్రకృతి పర్యావరణ రక్షణ" అంటూ పలుకార్యక్రమాలు చేబడుతోంది నేటి సమాజం.
అలా 'ప్రకృతి' మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి ఆనాటి నుండి నేటివరకూ చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ! పూజిస్తూ వస్తున్నారు. అదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా మనం పరిశీలిస్తే... అందులో భాగంగానే 'పాము'ను కూడా నాగరాజుగా, నాగదేవతగా, పూజిస్తూ వస్తున్నారు.
ఈ పాములు భూమి అంతర్భాభాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త జీవకోటికి "నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా 'రైతులకు' పంటనష్టం కలుగకుండా చేస్తాయిట! అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
పైన చెప్పిన విధంగా సర్పం పేరు చెపితేనే బెదిరిపోతూ ఉంటాము. కాని అంతకంటే భయంకరమైన మానవులు మనలోనే ఉన్నారు.
తలనుండు విషము ఫణికిని, వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తలతోకయనక యుండు ఖలునకు నిలువెల్ల విషము గదరాసుమతీ! అని చెప్పినట్లు...!
అలా! మనచుట్టూ మానవరూపంలో ఉండే మానవులు; సర్పజాతి మనసుకంటే; నికృష్టమైన (అంటే! అవి మనంవాటి జోలికి వెళితేనే ప్రమాదకరమవుతాయి.), వాటికంటే భయంకరమైన మానవ సర్పాలు మనచుట్టూ తిరుగుతున్నా గమనించలేక పోతున్నాం! అని గ్రహించుకోవలసి ఉంది.
అలా మనకంటికి కనబడే విషనాగుపాముకంటే మానవ శరీరమనేపుట్టలో నిదురిస్తున్న నాగుపాము మరింత ప్రమాదకరమని చెప్తారు. ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే (నవరంధ్రాలు) అంటూ ఉంటారు. మానవశరీరంలో నాడులతో నిండివున్న "వెన్నుబాము" అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో 'పాము' ఆకారమువలెనే వుంటుందని 'యోగశాస్త్రం' చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది. అలా 'నాగులచవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న "విషసర్పం" కూడా శ్వేతత్వం పొంది, మన అందరి హృదయాలలో నివశించే "శ్రీమహావిష్ణువు"నకు తెల్లని ఆదిశేషువుగా మారి "శేషపాన్పుగా" మారాలనే కోరిక తో చేసేదే ! ఈ నాగుపాముపుట్టలో పాలుపోయుటలోగల ఆంతర్యమని చెప్తారు.
దీనినే జ్యోతిష్య పరంగా చూస్తే! కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు, ఈ కార్తీకమాసంలో వచ్చే షష్టీ, చతుర్దశిలలో మంగళవారము నాడుగాని, చతుర్దశి బుధవారం కలసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసము ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ!
పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ!
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా !
అలా! ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు మున్నగునవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్టవద్ద 'దీపావళి నాటి మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు టపాసులు చిన్నారులు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు. ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖసంతానము; అదే కన్నె పిల్లలు ఆరాధిస్తే! మంచి భర్త లభించునని పలువురి విశ్వాసము.
ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిదికాదు. యుగాలనాటిది. సౌభాగ్యానికి, సంతానప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల శరత్తులనాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాధలు కానవస్తున్నాయి. దేశమంతట పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ "నాగులచవితి" నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం.
నాగేంద్రా! మేము మా వంశములోవారము నిన్ను ఆరాధిస్తున్నాము. పొరపాటున"తోకతొక్కితే తొలగిపో. నడుంతొక్కితే నా వాడనుకో! పడగ త్రొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రీ! అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కరాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు.
ఈ నాగులచవితిరోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
"కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |
ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్ ||
ఈ సర్పారాధనకు తామరపూలు, కర్పూరంపూలు, లడ్డు మున్నగునవి ప్రీతికరమని చెప్తారు. సర్పారాధనచేసే వారి వంశం 'తామరతంపరంగా' వర్ధిల్లు తుందని భవిష్య పురాణం చెప్తోంది. మన భారతీయుల ఇళ్లల్లో ఇలవేల్పు సుబ్రహ్మణేశ్వరుడే! ఆయన అందరికీ ఆరాధ్య దైవంకాబట్టి వారి పేరును చాలామంది నాగరాజు, ఫణి, సుబ్బారావు వగైరా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు.
నాగర్కోయిల అనే ఊరిలో నాగుపాము విగ్రహం ఉందిట! దాని సమీపంలో 6నెలలు తెల్లని ఇసుక, 6నెలలు నల్లని ఇసుక భూమిలో నుండి ఉబికి ప్తెకివస్తుందని భక్తులు చెప్తూ ఉంటారు. నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేద మందులలో తగుమోతాదులలో ఉపయోగిస్తారని ఆయుర్వేదశాస్త్రం చెబుతుంది. ఇలా ప్రకృతిలో "నాగు పాములకు, మానవ మనుగడలకు అవినాభావ సంబంధం కలదని విదితమవుతుంది.
ఇట్టి ఈ "నాగులచవితి" పండుగను విశేషంగా జరుపుకుని పునీతులమవుదాము.
No comments:
Post a Comment