శిష్టజన రక్షణి దుర్గామాత
సుమారు అన్ని వతారాలు దానవ సంహారము కొరకే అన్నట్లు కథలు ఉన్నాయి . తపస్సు చేసిన వారికి ... బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు వరాలివ్వడము ముందు వెనక ఆలోచించక -- వాటి ప్రభావమువలన దేవదానవ సోదర యుద్ధము ... తత్ఫలితము సురులు అతీత శక్తులుగా అవతారాలు ఎత్తడమే మన పురాణాల కథలు అన్నీ. ఆకోవకు చెందినదే దుర్గామాత అవతారము :
చిద్రూపి అయిన జగన్మాత శిష్టజన రక్షణార్థం దుష్ట శిక్షణకై భూమిపై అవతారాలు ఎత్తవలసి వచ్చింది. దుర్గగా పిలవబడటానికి ముందు ‘శతాక్షి’ పేరుతో స్తుతింపబడింది. హిరణ్యాక్షుని వంశంలో ‘రురుడు’ అనే రాక్షసునికి దుర్గముడు అనే కొడుకు పుట్టాడు. దుష్టుల హృదయాలు దురాలోచనలతోనే నిండి ఉంటాయి కదా! వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత, గర్తింపు, ఏదో సాధించాలనే తపన ఉంటుంది. వాళ్ళు అనుకున్నది సాధించటానికి ఎంత వక్రమార్గమైనా, ఎంత దుర్మార్గంతో నిండినదైనా మానరు. రాక్షసాంశతో పుట్టిన ఈ దుర్గముడికి వేదాలు దొంగిలించాలనే దుర్బుద్ధి పుట్టింది. వాటిని అపహరిస్తే దేవతల బలం తగ్గుతుందని అతని ఆలోచన. వేదాలను పొందాలంటే ఏం చెయ్యాలి? అని ఆలోచించాడు. బ్రహ్మ ద్వారా పొందటం తేలిక అని నిర్ణయించుకున్నాడు.
బ్రహ్మను గూర్చి హిమాలయాల్లో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు. గాలిని మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు. అతని ఘోర తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. దుర్గముడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ‘‘దుర్గమా! ఏం వరం కావాలో కోరుకో’’ అన్నాడు బ్రహ్మ, ‘‘వేదాలు, వేదమంత్రాలు నా ఆధీనంలో ఉండాలి’’ అన్నాడు దుర్గముడు. బ్రహ్మ ‘‘తథాస్తు’’ అన్నాడు. ఇక ఏముంది! వేదాలు, వేద మంత్రాలు అపాత్రుని ఆధీనంలోకి వచ్చాయి. భూమిపైన రుషులు స్నాన, సంధ్య, జపాదులు మరిచిపోయారు. యజ్ఞయాగాదులను మానేశారు. దేవతలకు హవిర్భాగాలు చెందక వాళ్ళు శక్తి హీనులయ్యారు. ఆదను చూసుకొని దుర్గముడు అమరావతిపై దండెత్తాడు. మంత్రశక్తి పొందిన దుర్గముడు దేవతలపైనా దండెత్తాడు. దేవతలు వాడి ధాటికి తట్టుకోలేక పారిపోయి కొండ గుహల్లో తలదాచుకున్నారు.జగజ్జననిని ప్రార్థిస్తూ జీవించారు.
అదిశక్తిని, ఆ శ్రీలత కల్పవల్లిని ఆదరించమని అనేక విధాల ప్రార్థించారు, ప్రాధేయపడ్డారు. జగదంబ కరుణించి వారి ముందు ప్రత్యక్షమయ్యింది.
చైత్రమాసం, నవమి, భృగువాసరాన దేవతల ఎదుట ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది. దానికి నాలుగు వైపులా నాలుగు వేదాలూ స్తుతించాయి. కోటి సూర్య ప్రకాశంగా ఉండి, కోటి చంద్ర ప్రకాశంగా చల్లదనం విరజిమ్ముతోంది. కోటి మెరుపులు ఒక్కసారి మెరిసినట్టుగా అరుణకాంతులను వెదజల్లుతోంది. పైన గానీ ప్రక్కన గానీ మధ్య లో గానీ పల్చబారలేదు. ఆద్యంతాలు లేవు. కరచరణాద్యవయవాలు లేవు. స్ర్తీ రూపం కాదు. పురుషరూపం కాదు. ఉభయమూ కాదు. ఆ దీప్తికి దేవతల కన్నులు మసకబడ్డాయి. కళ్ళు నులుముకుని, ధైర్యం తెచ్చుకుని తేరిపార చూశారు.
అప్పటికి ఆ దివ్య తేజస్సు స్ర్తీ మూర్తిగా రూపు ధరించింది. రాశీభూత సౌందర్యం. తామర మొగ్గలను పరిహసిస్తున్న పీనకుచ ద్వంద్వం. చిరుమువ్వల సవ్వడి చేస్తున్న మొలనులు (మేఖల), మంజీరాలు, బంగారు కేయూరాలు, అంగదాలు, కంఠాభరణాలు, రత్నరాశులు పొదిగిన కంఠపట్టిక. చిన్న మొగలిరేకును ముడుచుకున్న కొప్పు. విశా లమైన కటిప్రదేశం. పొట్టమీద సన్నని నూగారు. కర్పూర తాంబూలంతో ఎరుపెక్కి, సువాస నలు విరజిమ్ముతున్న నోరు.
మెరిసిపోతున్న బంగారు లోలాకులతో తళకులీనుతున్న నున్నని చెక్కిళ్ళు. అష్టమినాటి చంద్రరేఖలాంటి నుదురు. దట్టమైన కనుబొమ్మలు. ఎర్ర కలువల్లాంట నేత్రాలు. కొనదేరిన ఎత్తయిన ముక్కు, మధురాధరం. మల్లె మొగ్గల్లాంటి పలువరుస, మెడలో ముత్యాల దండలు. రత్నకిరీటం, చెవికి అలంకరించుకున్న ఇంద్రరేఖ. జడలో మల్లికామాలతీ పుష్పాల దండ. నుదుట మూడవ కన్నులా ఎర్రని కుంకుమ బొట్టు. పాశాంకుశ వరదాభయహ స్తాలు. ఎర్రని చీరకట్టుకుని దానిమ్మపువ్వు రంగులో ధగధగలాడుతున్న జగన్మాత... సర్వ శృంగారవేషాఢ్య, సర్వదేవనమస్క్టృత, సర్వాశాపూరిక సర్వమత సర్వమోహినీ ప్రసన్నురాలై చిరునవ్వులు చిందిస్తోంది.
దేవతాకృత దేవీస్తుతి...
జగన్మాత రూపం దర్శించిన దేవతలందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ సాష్టాంగపడ్డారు. ఆనందబాష్పాలు అడ్డుపడి చూడలేకపోతు న్నారు. కొంతసేపటికి తేరుకుని మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని జగదంబికను స్తుతించారు.
నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్
తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషూ జుష్టాం
ఓం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే! ఓం సుతరసి తరసే నమః
దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి
సానో మంత్రేషమూర్జం దుహానాం ధేనుర్వాగస్మానుపసుష్టూతైతు
కాళరాత్రీ! బ్రహ్మసుతా! వైష్ణవీ! స్కందజననీ! సరస్వతీ! అదితీ! దక్షదుహితా! పావనా! శివా! నమోనమః, మహాలక్ష్మీ! సర్వశక్తి! నిన్ను తెలు సుకుంటున్నాం, మమ్మల్ని నడిపించు. విరాట్‌స్వరూపిణీ! సూత్రాత్మమూర్తి! అవ్యాకృతరూపిణీ! శ్రీబ్రహ్మమూర్తి! నమోనమః
మహాలక్షై్మచ విద్మహే సర్వశక్యై చ ధీమహి
తన్నో దేవీ ప్రచోదయాత్
దేవీ! నిన్ను తెలుసుకుంటే ఈ జగత్తు, ఈ సంసారం అదృశ్యమైపోతుంది. తెలుసుకోక పోతే రజ్జు సర్పభ్రాంతిలాగా ఏడిపిస్తూ ఉంటుంది. చిదేకస్వరూపిణీ! అఖండానంద రూపా! వేదతాత్పర్యభూమికా! పంచకోశా తిక్తా! అవస్తాత్రయసాక్షిణీ! త్వంపదలక్ష్యార్థా! ప్రత్యగాత్మ స్వరూపిణీ! ప్రణవరూపా!హ్రీంకారమూర్తీ! నానామంత్రాత్మికా! కృపాసింధూ! నమోనమః.దేవతలు గద్గద స్వరాలతో చేసిన స్తుతులకు మహాదేవి సంతృప్తి చెందింది. మత్తకోకిల కంఠాన్ని సవరించి... ‘‘నేను భక్తులపాలిటి కల్పవృక్షాన్ని కదా! అడగండి ఏమి కావాలో నేనుండగా మీకు, నా భక్తులకు, దిగులు ఏమిటి? దుఃఖ సంసార సాగరం నుంచి నా భక్తులను ఎప్పుడూ ఉద్ధరిస్తూనే ఉంటాను. ఇది నా ప్రతిజ్ఞ. దేవతలారా! తెలుసుకోండి, ఏమి కావాలో అడగండి’’ అని పలికింది.
వేదాలు తిరిగి మాకు వచ్చేలా అనుగ్రహించమన్నారు.వారందరికీి తన చేతుల్లో వున్న ఆహార పదార్థాలు శాకములు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. అనాటి నుండి ‘శతాక్షి’, ‘శాకంబరి’ పేర్లతో విరాజిల్లుతోంది. వేగుల ద్వారా దుర్గముడికి ఈ సమాచారం మొత్తం తెలిసింది. అప్పుడు అతడు సేనా సమేతుడై హిమాలయాలు చేరుకున్నాడు. అక్కడ వున్న రుషులు, దేవతలను బాధించసాగాడు. వారిపై శస్త్రాస్త్రాలను వేసి బాధించాడు. వారు ‘‘మాతా! జననీ! రక్షించు!రక్షించు’’ అని అంటూ ‘శతాక్షి’ని వేడుకున్నారు.
దుర్గముడు దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. జగజ్జనని ‘భయపడకండని’ వారికి అభయమిచ్చింది. ఒక చక్రమును పైన ప్రయోగించి, అందరికీ గొడుగు అయ్యేలా చేసింది. అప్పుడు దుర్గముడు విడిచిన ఏ బాణమూ వారిమీద పడలేదు, వారిని బాధించలేదు. దుర్గముడికి, దేవికి భీకర సంగ్రామం జరిగింది.సూర్యమండలం బాణాల పంజరంలో మూసినట్లయింది. బాణాల రాపిడివల్ల అగ్ని పుట్టింది. ఆ ప్రాంతం విద్యుల్లతలా మిణుగురు పురుగులు తిరుగుతున్నట్లుగా అయ్యింది. అలా పది రోజులు ఆ సంగ్రామం కొనసాగింది. అందరూ చనిపోయినా దుర్గముడు ఒక్కడే మిగిలాడు. పదకొండవ రోజున దుర్గముడు శతాక్షీిదేవి రథానికి ముందు నిలిచి అస్త్రాలను ప్రయోగించటం మొదలు పెట్టాడు. రెండు జాముల యుద్ధం భయంకరంగా సాగింది.
శతాక్షి తీవ్రమైన పదిహేను అస్త్రాలను తీసింది. రెండు బాణాలతో దుర్గముడి కళ్ళను, నాలుగు శరాలతో గుర్రాలను, ఒక కోలతో జెండాను, వెండితో దుర్గముడి భుజాలను, ఒక శరంతో సారథిని పడగొట్టింది.నిప్పులు కురుస్తున్నట్లు వున్న వాడియైన చూపులతో ఐదు బాణాలను దుర్గమునిపై వేసింది.ఆ ధాటికి తట్టుకోలేక దుర్గముడు తూలి, కూలి రక్తం కక్కుతూ శతాక్షి ముందు పడిపోయాడు. ఆ రాక్షసుని ముందు నిలుచున్న శతాక్షీ దేవి శరీరంలోకి ఆ రాక్షసుని శరీరం నుండి పుట్టిన తేజస్సు కలిసిపోయింది.ఆ రాక్షసుని తేజస్సు అమ్మలో లీనమయ్యింది. పగ, ద్వేషంతో... ఆ పరమేశ్వరి, జగన్మాతను ఎదిరించిన దుర్గముడు ముక్తి పొందాడు.
--------------------------------------
‘‘జగన్మాతా! ముల్లోకాల్లో నీకు తెలియని దంటూ ఏమైనా ఉన్నదా? నువ్వు సర్వజ్ఞవు, సర్వసాక్షివి. తారకాసురుడు మమ్మల్ని రేయిం బవళ్ళు హింసిస్తున్నాడు. శివుడికి వారసుడుగా పుట్టిన పుత్రుడొక్కడే తారకుడిని చంప గలడని బ్రహ్మ దేవుడు చెప్పాడు. మరి ఇప్పుడు ఆ శివుడికి అసలు ఇల్లాలే లేదు. నీకు తెలుసుగదా! ఇంతకన్నా మేము చెప్పగలిగింది ఏమీ లేదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించి మా కు దారి చూపించు. నీ పాదపద్మాలను నిరంతరం ధ్యానించే భక్తులం మేము. ప్రాణ రక్షణ కోసం నిన్ను ప్రార్ధిస్తున్నాం. ఇంతకన్నా మాకు కోరదగినది ఇంకొకటి లేదు’’ అని వేడుకున్నారు.
పార్వతిగా అవతరణ...
‘‘దేవతలారా! భయపడకండి. నా శక్తి త్వరలోనే గౌరిగా హిమ వంతుడి ఇంట జన్మించబోతోంది. ఆ గౌరిని శివుడికి ఇచ్చి వివాహం జరిపిం చండి. హిమగిరీంద్రుడు ఎప్పుడూ మనస్సులో నన్నే ధ్యానిస్తుంటాడు. మీలాగానే నా భక్తుడు. అతడి ఇంట్లో కూతు రుగా జన్మించడం నాకు చాలా ఆనందదా యకం’’ అని పలికింది. జగదీశ్వరి మాటలను హిమవంతుడు విన్నా డు. అనుగ్రహానికి మురిసిపోయాడు. కళ్ళల్లో ఆనందబాష్పాలు. గొంతు జీరవోయింది. ‘‘హే సచ్చిత్ స్వరూపిణి! ధన్యోస్మి. అనుగ్రహ విశే షం ఎంతటి మహత్తునైనా కలిగిస్తుంది.
లేక పోతే స్థాణువునూ, జడము నూ అయిన నేనే మిటి, నీకు తండ్రిని కావడ మేమిటి! మరో నూరు జన్మలు ఎత్తితే మాత్రం ఈ భాగ్యం నా కు లభిస్తుందా? నూరు అశ్వ మేధాలు చేసి నా, వేల సంవత్సరాలు తపస్సు చేసినా, ఇంత టి మహావైభవం నాకు దక్కేనా? ఆహా! జగన్మా త నాకు కన్నకూతురు అయ్యిం దంటే ఈ రోజు నుంచి ఈ ప్రపంచంలో నా కీర్తికి తిరు గులేదు.అహో!హిమాలయుడా! ఎంతటి ధన్యుడవు అంటూ అందరూ ప్రశంసలు కురి పిస్తారు. ఏ తల్లి చల్లని కడుపులో బ్రహ్మాండ కోటలున్నాయో ఆ తల్లి నీకు చిట్టి తల్లిగా జన్మి ంచిందని కీర్తిస్తారు. నా తల్లిదండ్రులెవరో ఈ పర్వతరూపంగా నన్ను ఎందుకు నిర్మించారో తెలియదుగానీ ఇటువంటి దేవతలూ మహా తపస్వులూ నివసించడానికి నేను కారణమవు తున్నాను. ఇది చాలు ఈ జన్మకు అని మురిసి పోతున్న నాకు ఎంతటి గొప్పవరం ఇచ్చావు తల్లీ! ధన్యుణ్ణి, ధన్యుణ్ణి, ఇది నా అర్హత కాదు. కేవలం నీ కృప’’ అని మురిసిపోయాడు.
vEndaanta sangrahamunundi::
raasinavaaru::Suneel Kumar KotaVedanta
No comments:
Post a Comment