Thursday, August 2, 2012

శ్రావణ పూర్ణిమ విశిష్టత















శ్రీ మహావరలక్ష్మీ వ్రతాలు, పౌర్ణమి పూజలు, స్త్రీల పేరంటాల సందడి, మధ్య మధ్య వానజల్లులు యిలా ఎంతో కోలాహలంగా వుంటుంది శ్రావణమాసం.ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాముఖ్యం వుంది. దీన్నే కజరి పూర్ణిమ, నారియల్పౌర్ణమి, శ్రావణపౌర్ణమి, రుషి తర్పణం,రాఖీ పున్నమి అంట
శ్రావణమాస వైశిష్ట్యం ఎంతో గొప్పది. ఎందరికో ఆనందాన్నిచ్చేది. మంగళగౌరి, శ్రీ మహావరలక్ష్మీ వ్రతాలు, పౌర్ణమి పూజలు, స్త్రీల పేరంటాల సందడి, మధ్య మధ్య వానజల్లులు యిలా ఎంతో కోలాహలంగా వుంటుంది శ్రావణమాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాముఖ్యం వుంది. ఈ పున్నమిని భారతదేశ వివిధ ప్రాంతాల ప్రజలు రకరకాలుగా జరుపుకుంటారు.

శ్రావణంలో అధికంగా వానలు కురుస్తూ, ప్రకృతి కొత్త అందాలతో, పచ్చని పైరు పంటలతో ఆహ్లాదకరంగా వుంటుంది. రైతన్నలపాలిట వరం ఈ శ్రావణ వున్నమి. పంటలు బాగా పండాలని, సిరులు నిండాలని పుడమి తల్లికి పూజచేసి నార్లు నాటే సమయం ఇది. దీన్నే కజరి పూర్ణిమ అంటారు.




చేపలు పట్టేవారికి, వ్యాపారం చేసుకునేవారికి అనువైన కాలం. సముద్ర తీరప్రజలు ఇంద్రుణ్ణి, వరుణుడిని పూజిస్తారు. ఈ సమయంలో సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లేరోజులు. తమని కాపాడమని, అధికంగా జలపుష్పాలు లభించాలనికోరుతూ ఆ దేవతలని పూజిస్తారు. ఈ పౌర్ణమినే కొన్ని ప్రాంతాల్లో "నారియల్పౌర్ణమి" అంటారు.

నారియల్ అంటే కొబ్బరికాయ. కొబ్బరికాయలని సముద్రంలో విసిరివేయడం ద్వారా తమ భక్తిని చాటుకుంటారు. ఇలా చేయడానికి రామాయణంలోని కథ ప్రచారంలో వుంది. శ్రీరాముడు లంకలో వున్న సీతని రావణాసురుని చెర నుంచి విడిపించడానికి వానరసేన సహాయం కోరినపుడు, వానరులు బండరాళ్లని సముద్రంలోకి విసిరి "సేతుబంధనం" నిర్మిస్తారు. రాముడు ఆ వారథిమీదుగా లంకని చేరుకుని సీతను రక్షించాడు అని రామాయణ కథ చెప్తూ కొబ్బరికాయని సముద్రంలోకి విసిరివేస్తూ వుంటారు. అంతేకాదు కొబ్బరికాయని మూడు కన్నులుగల శివునిగా భావిస్తారు. ఇది దక్షిణ భారతదేశంలో తీరవాసులు పాటిస్తారు.

"శ్రావణపౌర్ణమి"నే జంథ్యాల పౌర్ణమిగా బ్రాహ్మణులు పండుగ చేసుకుంటారు. కొన్ని చోట్ల రుషి తర్పణం అని కూడా పిలుస్తారు. ఆ రోజున గాయత్రీ మంత్రం జపిస్తూ, వేదమంత్రాల మధ్య పాత యజ్ఞోపవీతం తీసివేసి కొత్తది ధరిస్తారు. ఈ జంథ్యాల పౌర్ణమి భారతీయ సంస్కృతికి చిహ్నం. యజ్ఞోపవీతధారణ అనంతరం కొబ్బరితో చేసిన స్వీట్లు అందరికీ పంచుతారు. "జంథ్యం" వేసుకునే ప్రతి వ్యక్తి దీన్ని పాటిస్తాడు.

రాఖీ పున్నమిగా పేరొందిన ఈ పౌర్ణమినాడు భారతీయులంతా ఆనందోత్సాహాలతో పండగ జరుపుకుంటారు. ఇంటి ఆడపడుచులు తన సోదరుల నుంచి ఆత్మీయానురాగాలను, అనుబంధాలను, రక్షను కోరుతూ రాఖీ కడతారు.

రాకీలతోపాటు పూజాథాలీ( పూజ పళ్ళాలు) అలంకరణ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.

ఏదో బద్దో బలీరాజా దానవేంద్రో మహాబలా:తేనత్వం అనుబంధామి రక్షమాంచమాంచలం:

అంటూ బలిచక్రవర్తి రక్షకోరిన సోదరిని రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా తడబడక ధైర్యంతో ఎదురొడ్డి నిలిచినవాడు. అటువంటి మహావీరునితో తన అన్నని పోలుస్తూ తనకి రక్షణ నివ్వమని కోరుతుంది. ఈ రాఖీ కట్టిన సోదరికి తగిన బహుమానం ఇస్తూ ఆశీర్వధిస్తాడు అన్న. రాఖీ పౌర్ణమి, శ్రావణ పున్నమిరోజును యిలా ఎన్నోరకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దేవతారాధనలు, ప్రకృతి దేవతారాధనలు, ఆత్మీయతానురాగబంధాలు... సకల పూజారాధనలు అందుకునే రోజు ఈ శ్రావణ పౌర్ణమి.

No comments: