Wednesday, July 15, 2009

తిలక/విభూతి ధారణతిలక/విభూతి ధారణ

హిందూమత అనుయాయులందరూ ఫాలభాగంపై విభూతి గాని, చందనం కాని, కుంకుమ కానీ ఏదో ఒక చిహ్నం ధరించాలనే నియమం మతంయొక్క ప్రత్యేక అంశాలలో ఒకటి.

గోపీ చందన ధారణ మహావిష్ణువును, మధ్వలు ధరించే నల్లని రేఖలు విష్ణుమూర్తిని స్మరింప చేస్తాయి. ఆ విధంగా ప్రతి చిహ్నానికి ఒక ప్రత్యేకత ఉంటుంది.

విభూతి ధారణ పరమేశ్వరుని స్ఫురింపచేస్తుంది. "విభూతిర్భూతిరైశ్వర్యం". విభూతి అంటేనే ఐశ్వర్యం. లక్ష్మీ నిలయమైన గోవు పృష్ఠభాగము నుండి వెలువడిన ఆవుపేడతో విభూతి తయారు చేసుకోవాలి. మార్కెట్లో లభించేది స్వచ్ఛమైనది కాదు. లక్ష్మి గోవు పృష్ఠ భాగంలో ఉన్నట్లే ఇతర దేవతలు కూడా గోవుయొక్క వివిధ శారీరక భాగాల్లో ఉంటారు. కనుక గోమలానికి విశిష్ఠ ప్రాముఖ్యత ఉన్నది. దాని నుండి తయారు చేయబడే విభూతి సంపాదకు చిహ్నం కావడంలో విశేషం లేదు.

లక్ష్మి ప్రధానంగా ఐదు ప్రదేశాలలో నివశిస్తుంది. గోవు యొక్క పృష్ఠ భాగం, వివాహిత స్త్రీ యొక్క పాపిట భాగం, గజం యొక్క కుంభ స్థలం, పద్మం, బిల్వ దళాలు. అందుకే ఉత్తర భారత స్త్రీలు పాపిట సింధూరం ధరిస్తారు.

పూజ కొరకు వాడే పుష్పాలు, ఆకులు కోసిన రోజే వాడవలసి ఉంటుంది. కానీ బిల్వ దళాలు, పద్మాలు పది రోజుల వరకు నిల్వ ఉంచి ఉపయోగించుకోవచ్చు. అవి లక్ష్మీ నిలయాలు కానుక నిర్మాల్య దోషం వాటికి అంటదని నమ్మిక.

ధైర్య సాహసములు ఉండే చోట, సచ్చీలత నెలకొన్న స్తానలలో, సత్యసంధత విలసిల్లిన ప్రాంతాలలో కూడా లక్ష్మి నివసిస్తుంది. విభూతి ఐశ్వర్య చిహ్నం కనుక దానిని ధరించినందున దారిద్ర్యం ఉండదు, మనం ఋణగ్రస్తులం కాము.

మన ప్రజలు విభూతి ధారణను విసర్జించినారు. విభూతి ధారణను ప్రజలు పాటిస్తూ ఉన్నట్లైతే మనదేశం ఈ స్థాయిలో ఋణాలు సేకరించవలసిన అవసరం ఉండేది కాదు. ప్రజలు విభూతి ధారణ ప్రారంభించిన తరువాత దేశ ప్రగతి, శోభాయమానమైన సంఘటనలు దేశచరిత్రలో మనకు విరివిగా దర్శనమిస్తాయి. మదురైలో మహాత్మ తిరుజ్ఞాన సంబందార్ ప్రజలను విభూతి ధారణకై ప్రబోధించి ఆచరింపచేయగా దేశంలో దారిద్ర్యం నిర్మూలిమ్పబడి సర్వ సౌభాగ్యాలు నెలకొల్పాయి. కొంతమంది మాత్రము అనుష్ఠాన సమయాల్లో విభూతి ధరించి కార్యాలయాలకు వెళ్ళేటప్పుడు చెరిపి వేస్తారు. తత్ఫలితంగా ప్రజలకు లభించే ఫలితాలు, సంపదలూ, సంతోషాలు కూడా చాలా పరిమిత స్థాయిలో నిలిచిపోతున్నాయి.

ఈశ్వరుడు కూడా విభూతిని మూడు అడ్డు రేఖలుగా ఫాలభాగంపై ధరిస్తాడు. కనుక మనం కూడా విభూతి యొక్క ఆవశ్యకతను గుర్తించి, దాన్ని ఐశ్వర్యానికి, సుఖ సౌభాగ్యాలకి చిహ్నంగా భావించి నడుచుకోవాలి. విభూతి ధారణ అంతిమంగా ఈశ్వరుణ్ణి గురించి తలపింపచేస్తుందని మరచిపోకూడదు.

అంతేకాక ప్రపంచంలోని ప్రతి విషయం యొక్క అంతిమ స్థితిని విభూతి సూచిస్తుంది. దేనినైనా పూర్తిగా కాలిస్తే కడపటికి లభించేది బూడిదే. వస్తువుల యొక్క చరమ స్థాయి పరమేశ్వర తత్వమే. విభూతి స్వచ్ఛతను కూడా గోచరింప చేస్తుంది. ప్రాపంచిక విషయాలన్నితికి పరమావధి. అంతిమ స్థితి స్వచ్చమైన శ్వేతరూపుడైన పరబ్రహ్మ మాత్రమే. ఆ విధంగా విభూతి ధారణ గొప్ప వేదాంత సత్యాన్ని మనముందుంచుతుంది.

సర్వసృష్టికి హేతుభూతమైన నిత్యచైతన్య శక్తికి చిహ్నంగా మనం విభూతిదారణ చేస్తాం. ప్రపంచంలో ప్రతి విషయం శివమయమని, అదే మనకు అంతిమ లక్ష్యమని విభూతి విశదీకరిస్తుంది. ఒక వస్తువును కాలిస్తే, అది ముందు నల్లగా మారుతుంది. దానినింకా కాలిస్తే అది తెల్లటి బూడిదగా పరిణమిస్తుంది. దానిని ఇంకా కాల్చిన దానిలో మార్పు ఏమీ సంభవించదు. కనుక అన్నిరకాలైన దేహాల యొక్క చరమస్థితి బూడిద మాత్రమే. కానుక భౌతికరంగంలోని విభూతి ఆధ్యాత్మిక రంగంలో శివునితో సామ్యస్థితి కలిగియున్నది. విజ్ఞానమనే అగ్నిగుండంలో మనం ప్రతి వస్తువును కాలిస్తే చివరకు మిగిలేది శివుడు లేక పరబ్రహ్మము మాత్రమే.

అలాగే రక్తవర్ణం కల్గిన కుంకుమ లక్ష్మీదేవిని స్మృతిపథంలో నిల్పుతుంది. నిమ్మరసం, ఘ్రుతం, ఇంకా ఇతర పదార్ధాలు కలిపినా చింతపండుతో దీనిని తయారు చేస్తారు. ఈ కుంకుమనే మనం ధరించాలి. అది సాక్షాత్తు పార్వతీ స్వరూపాన్ని లేక లక్ష్మీ స్వరూపాన్ని స్మరణకు తెస్తుంది. సంపాదకు చిహ్నమైన కుంకుమ లక్ష్మీదేవిని తలపింపచేస్తుంది

శ్రీకృష్ణుని పాదఘట్టములచే పవిత్రీకరింపబడిన గోబి-మృణ్మయం మనం ధరించే గోపీచందనం ద్వారా మన స్ఫురణకు వస్తుంది. దీనివల్లనే భగవానుడు శ్రీకృష్ణుడు, గోపవనితలు కూడ మన హృదయసీమలో సాక్షాత్కారిస్తారు.

మధ్వలు వారి దేహంపైన, ఫాలభాగంపైన కూడా బొగ్గుతో మిళితమైన కాలవర్ణ రేఖల్ని ధరిస్తారు. ప్రపంచంలోని సమస్త వస్తుజాలం నశింపుకు గురి కావాల్సిందే. నశించిన ప్రతిది కాలిన బొగ్గుయొక్క మసిరూపాన్ని పొందవలసిందే. కానుక ప్రతివ్యక్తి ప్రాపంచిక విషయాలపై అనుబంధాన్ని త్యజించి, వైరాగ్య ప్రవృత్తిని అలవరచుకోవాలి. మధ్వలు దీనితో బాటు గోపీచందనాన్ని కూడా ధరిస్తారు. ఆ విధంగా వారు మహావిష్ణువుని హృదయంలో స్మరిస్తూ వైరాగ్య ప్రవృత్తిని పెంపొందించుకుంటారు.

పైన సూచించిన ఏ రూపంలోనైనా సరే తిలకం ధరించటం హిందూమతం యొక్క విశేష లక్షణం. ఈ తిలక ధారణ చేసే వారందరూ పునర్జన్మ సిద్ధాంతంలో విశ్వాసం ఉన్నవారనే విషయాన్ని కూడా ఇది సూచిస్తుంది. బౌద్ధులు, జైనులు కూడా ఈ సిద్ధాంతాన్ని ఆమోదిస్తారు కనుకనే వారుకూడా ఫాలభాగం మీద ఈ చిహ్నాలని ధరిస్తారు.

తిలకం గాని, విభూతిగాని, ధరించే విషయంలో మరొక విశిష్టత కూడా ఉంది "లలాట లిఖితా రేఖా"

శ్లో:యద్ధాత్రా నిజభాలపట్ట లిఖితం స్తోకం మహద్వాధనం!
తత్ ప్రాప్నోతి మరుస్థలేపి నితరాం మేరౌ తతోనాధికం!!
తద్దీరో భవ విత్తవతు కృపనాం వృత్తిం వృధా మా కృథా:!
కూపే పశ్య వయోనిధావాపి ఖఘటో గృహ్ణాతి తుల్యం జలం!!
వ్యక్తి యొక్క లలాట లిఖితాన్ని ఎవరూ మార్చలేరు. ఆ విషయంలో ఈశ్వరుడు కూడా అశక్తుడే. ఒక వ్యక్తి బాధలకు గురియై వాటిని గురించి వివరించినప్పుడు "అలాగని నీ లలాటం మీద వ్రాసియున్నది గనుక నీవు అనుభవించి తీరాల్సిందే"నని అంటాం. అదే విధంగా వ్యక్తికి సుఖప్రాప్తి కలిగితే 'అది నీకు రాసిపెట్టుంది గనుక నీవు సుఖంగా వున్నావు; ఆనందాన్ని అనుభవిస్తున్నావు' అని ఎవరూ చెప్పారు. వ్యక్తికి చెడు సంభవించినప్పుడు మాత్రమే లలాట లిఖితాన్ని ప్రస్తావిస్తారు. యదార్థంగా వ్యక్తికి మంచిగాని, చేదు గాని అతని లలాట లిఖితాన్ని బట్టే జరుగుతుందని, దానిని ఎవ్వరూ తప్పించలేరని, అది అనుభవించి తీరవలసిందేనని మనం గ్రహించాలి.

మనకు సూర్య, చంద్ర గ్రహణాలు సంభవిస్తూ ఉంటాయి. అవి ఎవరి జన్మనక్షత్రాల్లో సంభవిస్తాయో వారికవి కీడును కలుగచేస్తాయనే విశ్వాసం ప్రచారంలో ఉంది. ఆ కీడు నుండి రక్షించుకునే ప్రయత్నంలో వారు లిఖింపబడ్డ కాగితపు ముడత కల్గిన తాళ పత్రాన్ని ధరిస్తారు. ఉదాహరణకు చంద్రగ్రహణ కాలంలో వాడే కాగితపు మడతలో

శ్లో:ఇంద్రో నలో యమో నిర్రుతిర్వరునో వాయురేవచ!
కుబేర ఈశోఘ్నం త్విరదూపరాగోత్తవ్యధాం మమ!!

సూర్యగ్రహణ కాలంలో శబ్దాలు వస్తాయి. ఈ విధంగా చేస్తే గ్రహణ దోషాలు పోతాయి. కానీ దౌర్భాగ్యం ఏమంటే పై ఆచారం క్రమంగా మాసిపోతోంది.

మండుటెండలో బయటకు వెళ్ళవలసి వస్తే పాదరక్షలు ధరిస్తాం. అలాగే వర్షం కురిసే సమయంలో వర్షపు కోటు ధరించి బయటకు వెళ్తాం. అదేవిధంగా మంత్ర సంయుతమైన తాళ పత్రం గ్రహణం వల్ల ప్రాప్తించే చెడు ఫలితాలనుండి మనలను రక్షిస్తుంది. అలాగే విభూతి మనల్ని సర్వదా కాపాడుతూ, కర్మ సిద్ధాంతాన్ని, పరమేశ్వర తత్వాన్ని మనకు స్ఫురింప చేస్తుంది. మనం అందరం జీవితంలో సంభవించే సుఖదు:ఖాలని రెండింటినీ ఎదుర్కొనవలసినదే. కొంతవరకు వాటి తీవ్రతను తగ్గించుకొన గలమే కాని వాటిని పూర్తిగా నిర్మూలించలేము. బాధల తీవ్రతను తగ్గించుట కొరకే ప్రాయశ్చిత్తాలు, నవగ్రహ జపాలు, ఇత్యాది కర్మ కండలు ఏర్పడ్డాయి. మనం చేసిన కర్మ ఫలితాల్ని మనం ఆవశ్యం అనుభవించవలసినదే. దానినెవరూ ఆపలేరు. ఒక తమిళ సామెతలో చెప్పబడ్డట్లు
'తలను తీసివేయవలసి వస్తే తలపాగాను మాత్రమే తప్పించగలం, అంటే బాధల తీవ్రతను తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చునన్నమాట.

ఉత్తర భారతదేశంలో తలపై తలపాగ ధరించటం సర్వసామాన్యం గనుక పై సామెత అక్కడ ఆవిర్భవించినది అనుకోవచ్చు. కొన్ని సమయాలలో కొంతమంది ప్రజలు తమ బాధల్ని తట్టుకోలేక దు:ఖిస్తారు. కొద్దికాలం మాత్రమే దు:ఖా క్రాంతులై తర్వాత దానిని మరచి సహనశీలురై ప్రవర్తిస్తారు. విభూతిని ధరించినప్పుడు మనకు ఈశ్వరుడు స్మరణకు వస్తాడు. బ్రహ్మ మనలలాటం పై లిఖించిన కీరు ఈశ్వరుని కరుణ వలన తొలగి మన బాధలు నశిస్తాయి. కానుక ప్రతి వారు ప్రాతఃకాలంలో లేచి స్నానాది కాలకృత్యాలు నెరవేర్చుకొని, ఫాలభాగంపై విభూతినిగాని, తిలకాన్ని గాని, ధరించి సంధ్యావందనం, దేవతారాధన చేసి ఈశ్వర కృపకు పాత్రుడై దినచర్యలకు సమాయత్తం కావాలి.

No comments: