Sunday, February 17, 2013

రథసప్తమి










నేడే (ఆదివారం)రథసప్తమి 



------------------------
రవి వారం పవిత్ర రథ సప్తమి పర్వదినం.. ఆ ప్రాసస్త్యాన్ని పెద్దలు ఇలా వివరించారు..హితైషులారా, ఆస్తిక మిత్రులారా! ఆదివారం ప్రాతః కాలాన దినకరుని పూజించి లోకపావనుని అనుగ్రహానికి పాత్రులుకండి..
------------------------

సాక్ష్యాత్తు శ్రీ మన్నారాయణ స్వరూపుడైన శ్రీ సూర్య భగవానుడు గా జన్మించిన మాఘశుద్ధ సప్తమి పర్వదినమే రధ సప్తమి. వివిధ దేశాలు, విభిన్న వ్యక్తులు, అనేక కుల మతాలు, రకరకాల జీవ రాసులు, ఇలా ఎన్నో, ఎన్నెన్నో రకాలు ఉన్నా, అందరికీ, అన్నిటికీ..., ప్రపంచ మంతటికీ, ఉనికినీ, మనుగడనీ, ప్రసాదించేది ఒక్క సూర్య భగవానుడే. ఆయనే మనకు ప్రత్యక్ష దైవం. జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాల నియమానికీ, ఆరోగ్యానికీ, అన్నిటికీ ఆ సూర్యుడే. సూర్యుడు లేనిదే జగత్తు లేదు. సూర్యుడు అతిధి కశ్యపుల కుమారుడు. అందుకే ఆయన ఆదిత్యుడు. కర్మ సాక్షి ఐన మన సూర్య భగవానుడు, కుసుమ వర్ణంతో ఉంటాడు. ఉదయం బ్రహ్మ స్వరూపం మధ్యాహ్నంతు మహేశ్వరం సాయంకాలే స్వయం విష్ణుః త్రిముర్తిస్తూ దివాకరః సూర్యుడు దక్షిణాయణం ముగించుకుని, ఉత్తరాయణంలో ప్రవేశించటానికి సూచనగా మనం రెండు పర్వదినాలను జరుపుకుంటాం. ఒకటి సంక్రాంతి రెండవది రథ సప్తమి. సప్తమి సూర్యుని జన్మ తిధి. ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు, జరుపుకునే రథ సప్తమి సూర్య సంబంధమైన పండుగ. జపా కుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్భుతం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. సప్తమీ రూప సూర్యుని రధ౦ దక్షిణాయన౦లో దక్షిణ దిశగా పయనిస్తు౦ది. అప్పుడు సూర్యుడు భూమికి దూర౦గా పోతూ ఉ౦డుటచే శీత కిరణుడైన౦దున వాతావరణ౦, ప్రాణికోటి జఠరాగ్ని మ౦దగిస్తూ ఉ౦టు౦ది. ఇక పుష్యమాస౦ చివరలో ఉత్తరాయణ౦ ప్రార౦భ౦. మాఘ శుధ్ధ సప్తమి నాడు సూర్యరధ౦ ఉత్తర దిక్కువైపుకు తిరుగుతు౦ది. అ౦దుచే మాఘసప్తమికి రధసప్తమి అని పేరు.

సూర్యుని ఏకాదశ మంత్రములు : ఓం మిత్రాయ నమః , ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః ,ఓం భానవే నమః , ఓం ఖగాయ నమః , ఓం పూష్ణే నమః , హిరణ్యగర్భాయ నమః , ఓం మరీచయే నమః , ఓం ఆదిత్యాయ నమః , ఓం సవిత్రే నమః , ఓం అర్కాయ నమః , ఓం భాస్కరాయ నమః

(ఏ రోజున అరుణోదయ కాలంలో సప్తమీతిథి ఉందో, ఆ రోజునే స్నానాన్నీ,రథసప్తమీ వ్రతాన్ని చేయాలి.ఒకవేళ రెండు రోజులలోని అరుణోదయాలలోను సప్తమి ఉంటే,మొదటి రోజే రథసప్తమిగా భావించాలి. షష్టి నాడు ఒంటిపూట భోజనంతో ఉండి, సప్తమినాడు అరుణోదయాన్నే (ఉదయాన్నే) స్నానం చేసి,సువర్ణ – రజత- తామ్ర – లోహ పాత్రలలో దేనిలో నైనా తైలంపోసి దీపం వెలిగించి, సూర్య ప్రతిమను ప్రతిష్టించి , షోడశోపచారాలతో నూ పూజించాలి. ఆ పుణ్య కాలం సంక్రాతి పుణ్యకాలం వంటిది.అలాంటి పుణ్యకాలంలో గంగాది నదులలో దీపాలని వదిలి, పితృతర్పణం మొదలైనవి ఆచరించి,సూర్యోపాసన చేసినవారికి – గత ఏడు జన్మలలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. షష్టీ సప్తమీ యోగము ‘పద్మకం’ అని చెప్పబడుతోంది. ఇటువంటి యోగం వేయి సూర్య గ్రహణాలతో సమానమని గర్గ మహామునిచే భోధించబడింది).

భూశుద్ధి :
ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి,అలికి,బియ్యపు పిండితోగాని,రంగుల చూర్ణములతోగాని,ముగ్గులుపెట్టి,దైవస్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి.పీట మరీ ఎత్తుగాని, మరీ పల్లముగానీ ఉండకూడదు.పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపురాసి,కుంకుంమతో బొట్టు పెట్టి,వరిపిండి (బియ్యపుపిండి) తో ముగ్గు వేయాలి. సాధారణంగా అష్టదళ పద్మాన్నే వేస్తారు.పూజచేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి.ఏ దైవాన్ని పూజింపబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమనుగాని, చిత్రపతమునుగాని, ఆ పీట పై ఉంచాలి.ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి),దానికి కుంకుమ బొట్టు పెట్టి,పిదప ఒక పళ్లెంలోగాని, క్రొత్త తువాలు (తుండుగుడ్డ) మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమలపాకు నుంచి, అందు పసుపు గణపతి నుంచి అగరువత్తులు వెలిగించాలి.ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి. దీపారాధన నైరుతి దిశలో చేయవలెను.

పూజకు కావలసిన వస్తువులు – దీపారాధన విధానము
దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద) వెండిది గాని,ఇత్తడిదిగాని,మట్టిది గాని వాడవచ్చును.కుందిలో 3 అడ్డవత్తులు 1 కుంభవత్తి (మధ్యలో)వేసి నూనెతో తడుపవలెను. ఇంకొక అడ్డవత్తి నూనెతో తడిపి ఏకహారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువు)వేసి ముందుగా ఏకహరతిలో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి,వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డవత్తి 1 కుంభవత్తి వెలిగించవలెను.తర్వాత చేయి కడుక్కుని నూనె కుంది నిండావేసి పిదప ఆ కుందికి మూడుచోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాధనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను.కుందిలో మిగిలిన రెండు అడ్డవత్తులు పూజా సమయంలో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను. దీపారాధనకునువ్వులనూనెగాని,కొబ్బరినూనెగాని,ఆవునెయ్యి గాని వాడవచ్చును. మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలో నీళ్లు దేవుని పూజకు వినియోగించరాదు. పూజకు విడిగా ఒక గ్లాసుగాని,చెంబు గాని తీసుకొని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్లు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను.

(వారణాశి నరసింహమూర్తి,
పత్తిపాటి ఆనందకుమార్
గార్ల సౌజన్యంతో)

No comments: