Tuesday, July 29, 2014

శ్రీ మంగళ గౌరీ వ్రతకథ















శ్రీ మంగళ గౌరీ వ్రతకథ :-
*********************
పూర్వం ధర్మపాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది. 
కానీ, వారికి పుత్ర సంతానం లేదు. వారు ఎన్నో వ్రతాలు చేశారు. దానాలు చేశారు. కానీ సంతానం కలగలేదు.

ఒకనాడు భర్త అనుమతితో భార్య తన ఇంటి ముందునుంచి వెళ్లే భిక్షకుని జోలెలో బంగారం వేయగా, అతను కోపించి సంతానం కలుగకుండుగాక అని శపించాడు. దాంతో ఆ దంపతులు అతణ్ని ప్రార్థిస్తే అల్పాయుష్కుడైన ఒక కుమారుడు కలుగుతాడని, అయితే అతనిని పెళ్లాడే అమ్మాయి తల్లి ‘మంగళ గౌరీ వ్రతం’ చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావంవల్ల ఈ కుమారుడు మరణించడని అంటే ఆమెకు వైధవ్యం ప్రాప్తించదని భిక్షువు సూచించాడు.

అనంతరం, వారు సంతానవంతులై కుమారునికి పదహారేళ్ల వయసురాగానే కాశీకి వెళ్లే వీరికి మార్గ మధ్యంలో దైవలీల ఫలితంగా మంగళగౌరీ వ్రతాన్ని చేసిన తల్లి గల ‘సుశీల’ అనే కన్యతారస పడుతుంది. సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారుని వివాహం జరిపిస్తారు. 

ఆమె సాహచర్యంతో భర్తకు పదహారేండ్ల అకాల మరణం ఉన్నా ‘మంగళగౌరీ’ వ్రతవాయినం తీసుకున్న కారణంగా భర్త పూర్ణాష్కుడవు తాడు. 
కాబట్టి, శ్రావణ మంగళ గౌరీ వ్రతా చరణ వలన స్త్రీలకు వైధవ్యం రాదని, పుణ్య స్త్రీలుగానే ఉంటారని పురాణ ప్రతీతి. 

* మంగళ గౌరీని ఉత్తరేణి దళాలతోనూ, గరికతోనూ అర్చించడం తప్పనిసరి. 
* మహానివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బియ్యంతో చేసిన పరమానాన్ని నివేదించాలి. 
* వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువలను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి.

ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొన దగింది తోరపూజ. 
పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకుని, దానికి తొమ్మిది ముళ్లు వేస్తారు. 
ఆ దారానికి మధ్యమధ్యలో దవనాన్ని కడ్తారు. 
ఈ తోరాలను 
* గౌరీ దేవి ముందు పెట్టి పూజచేసి ఒక తోరాన్ని పూజచేసిన వారు కట్టుకుంటారు. 
* రెండవ తోరాన్ని ముత్తైదువకు ఇస్తారు. 
* మూడో తోరాన్ని గౌరీదేవికే సమర్పిస్తారు. 

ఈ విధంగా చేసే వ్రతాల ద్వారా సర్వ వాంచాఫలసిద్ధి కలుగుతుంది. ఈ వ్రతంలో ఆకులు, వక్కలు ఐదేసిచొప్పున ఉంచి ఐదు జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు. 

తరువాత, వాటిని సెనగలతో కలిపి తల్లికిగాని, బ్రాహ్మణ ముత్తైదువకు గాని వాయనంగా ఇస్తారు. ఇది చాలా మంచి శుభకరమైన వ్రతం.మంగళగౌరీ కటాక్షం వల్లే కుజుడు మంగళ వారానికి అధిపతి అయ్యారు . 

ఆడవారి ఐదోతనాన్ని రక్షించే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని అయిదేళ్లు చేసి ఉద్యాపన చేస్తారు. 
మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి వ్రతాన్ని కొన సాగించాలి. 
చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి.